వేమవరపు భీమేశ్వర రావు గారు ఫిజిక్సు లెక్చెరరుగా, ప్రిన్సిపాలుగా పనిచేసి రిటరైయ్యారు. ఇప్పుడాయనకు డెబ్బై ఏళ్ళు పై బడ్డ వయస్సు. గత కొంతకాలంగా హోమియా వైద్యం చేస్తూ ఉచిత చికిత్స అందిస్తూ ఉన్నారు. మిగిలిన కొద్దిపాటి తీరికలోనూ, ఈ మధ్యనే, అనువాద సాధన మొదలుపెట్టి, మొదట ఆర్.కె.నారాయణ్ నవల ‘మహాత్ముని కోసం నిరీక్షణ’ (2016) వెలువరించారు. ఆ అనువాదాన్ని పాఠకులు ఆదరించడంతో మళ్ళా మరొక రెండు పుస్తకాలు తీసుకొచ్చారు. రెండూ ఆర్.కె.నారాయణ్ వే. ఒకటి, ‘లాలీ రోడ్ మరికొన్ని కథల సంపుటి’, రెండవది, ఆర్.కె. ఆత్మకథ ‘నా రోజుల్లో’.
మొన్న ఆదివారం సాయంకాలం భారతీయవిద్యాభవన్ సమావేశమందిరంలో ఆ రెండు పుస్తకాల ఆవిష్కరణ పెద్ద ఎత్తున జరిగింది. డా.కల్లూరి భాస్కరం అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ వాసుదేవ దీక్షితులు, శ్రీ ఎ.ఎన్.ఎస్.జగన్నాథ శర్మ, శ్రీ పి.లక్ష్మీ నృసింహంలతో పాటు నేను కూడా పాల్గొన్నాను. జగన్నాథ శర్మ ఆర్.కె.నారాయణ్ కథల గురించి మాట్లాడితే, నేను ‘నా రోజుల్లో’ పుస్తకం గురించి మాట్లాడేను.
‘నా రోజుల్లో’ ఆర్.కె.నారాయణ్ రాసిన My Days (1974) కి అనువాదం. దాదాపు డెబ్బై ఏళ్ళ వయసులో నారాయణ్ తన గురించి చెప్పుకున్న కథ అది. ఆ తర్వాత కూడా ఆయన మరొక పాతికేళ్ళపాటు జీవించే ఉన్నాడు. ఆ పుస్తకంలో చిత్రించిన తన పసితనం, విద్యాభ్యాసం, తాను పూర్తిస్థాయి వృత్తి రచయితగా మారిన క్రమం,తన భార్య అకాలమరణం, తరువాత తనకి సంభవించిన అలౌకిక అనుభవాలు దాదాపుగా ఆయన ట్రయాలజీ అని చెప్పదగ్గ, Swami and Friends (1935), The Bachelor of Arts (1937), The English Teacher (1945) నవలల్లో చిత్రించినవే. కాని, ఆ కాల్పనిక రచనలతో ఆయనకు తృప్తి కలగలేదు. తన అనుభవాల్ని మరింత సూటిగా, ఆ కాల్పనిక ప్రచ్ఛాయనుంచి తప్పించి నేరుగా తన పాఠకులతో పంచుకోవడం కోసం ఈ పుస్తకం రాసాడనిపిస్తుంది.
నేను ఇంగ్లీషు మూలం చదవలేదు. కాబట్టి ఈ అనువాదం చదవడం చాలా తాజాగానూ, కొత్తగానూ, అంతకన్నా కూడా ఆశ్చర్యజనకంగానూ అనిపించింది. ఆర్.క్.నారాయణ్ అంటే ప్రతిభావంతుడైన ఒక రచయితగా మాత్రమే తెలిసి ఉన్న నాకు, ఈ రచన ఒక కనువిప్పు.
దాదాపు నలభయ్యేళ్ళ కిందటి ఈ రచనని ఇప్పుడు తెలుగులోకి తేవలసిన అవసరం ఉందా? ఉంది. మూడు కారణాల వల్ల. మొదటి రెండూ అంశాలూ, ఆర్.కె.నారాయణ్ అనే మనిషి రచయితగా మారడానికి దోహదం చేసిన కారణాలు. మూడవది, ఆర్.కె.నారాయణ్ అనే రచయిత ఒక మనిషిగా రూపొందిన అంశం.
మొదటిది,ఒక మనిషి పూర్తికాలపు రచయిత కావడం, నాతో సహా, చాలామందికి ఒక కల మాత్రమే. ఆర్.కె.నారాయణ్ కి అది సాధ్యమయింది. కానీ, సులభంగా మటుకు కాదు, దానికతడు చాలా విలువైన మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. పూర్తికాలపు రచయిత కావడమనేది ఒక వ్యాపకానికి సంభవించిన విషయం మాత్రమే కాదు, ఒక మనోవృత్తికీ, ఒక సంస్కారానికీ సంబంధించిన విషయమని కూడా ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. రేపటి గురించి భయం లేనివాడు, ఈరోజు ఒకడి ఎదట చేతులు కట్టుకుని నిలబడలేనివాడు మాత్రమే పూర్తికాలపు రచయిత కావడానికి అర్హుడు అని ఈ జీవితానుభవాలు విక్రమార్క సాలభంజికల్లాగా మనల్ని హెచ్చరిస్తుంటాయి.
రెండవది, ఒక రచయితకు రాగల గుర్తింపు, దానికి పట్టే కాలవ్యవధి, అందుకోసం అపారమైన సహనంతో ఓపిక పట్టవలసి రావడం గురించిన అనుభవాలు. ఆర్.కె.నారాయణ్ రాత్రికి రాత్రే లబ్ధప్రతిష్టుడు కాలేదు. ఎన్నో వైఫల్యాల, తిరస్కారాల, అవమానాల తరువాత మాత్రమే అతడి పుస్తకాలు ఒకటీ ఒకటీ వెలుగు చూస్తూ వచ్చాయి. అది కూడా ఒక పుస్తకానికి దొరికిన ప్రచురణకర్త మరొక పుస్తకానికి ముందుకు రావకపోవడం, రచయిత ఎంత మందహాసంతో చెప్తున్నప్పటికీ, చెప్పలేనంత బాధాకరమైన సంగతి అని మనకి తెలుస్తూనే ఉంటుంది.
కాని, ఆర్.కె.నారాయణ్ రచయితగా నిలబడ్డాడు. ముల్క్ రాజ్ ఆనంద్, రాజారావులతో పాటు ఇండో-ఆంగ్లియన్ రచయితలత్రయంలో ఒకడిగానూ, హెమింగ్వే, విలియం ఫాక్నర్ లతో పాటు ఇంగ్లీషు నవలాకారుల త్రయంలో ఒకడిగానూ నిలబడ్డాడు. ఆ విధంగా ఇది కూడా ఒక విజేత ఆత్మకథనే.
కాని, ఇంతకన్నా విశేషమైన మరొక పార్శ్వం ఈ రచనను మహోన్నత రచనగా మార్చేసింది. అది, తన 33 ఏళ్ళ వయసులో తన భార్య అకాల మరణం. ఆ తర్వాత నారాయణ్ మరొక అరవై ఏళ్ళ పాటు బతికాడు. మరొక పెళ్ళి చేసుకోకుండా మటుకే కాదు, మరొక స్త్రీ గురించిన తలపు కూడా లేకుండా. అసాధారణమైన ఈ నైతిక పార్శ్వంలో నారాయణ్ జీవితగాథ రామకృష్ణ పరమహంసనీ, గాంధీనీ తలపిస్తుంది. ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో భీమేశ్వరరావుగారు, ఈ రచనని ‘సత్యశోధన’ తోనూ, ‘ఒక యోగి ఆత్మకథ’ తోనూ పోల్చడం సముచితమనే అనిపిస్తుంది.
అసలొక మనిషి ఎందుకు రచయిత కావాలనుకుంటాడు? నారాయణ్ మాటల్లో చెప్పాలంటే:
‘ఏ వ్యక్తికైనా రచన చేయాలంటే ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ మనలో ఉండే ఉత్సాహం, చుట్టూ ఉన్న సమాజం పట్ల ఆసక్తి, అనువుగా ఉండే మంచి పరిసరాలు, ఏదన్నా సాధిద్దామనే పట్టుదల, భవిష్యత్తు మీద కోరికల నుంచి వస్తుంది.’ (పే.145)
కాని, తన భార్య అకాలమరణంతో తనకి అవన్నీ లోపించినట్టనిపించింది అని రాసుకున్నాడాయన. కాని ఆయన రచనల్లో ముఖ్యమైన రచనలన్నీ ఆ తర్వాతే రాసాడు.
ఒక మనిషికి సంభవించగల విషాదాలన్నిటిలోనూ సహచరిని లేదా సహచరుణ్ణి కోల్పోవడాన్ని మించింది మరొకటి ఉండదని పెద్దలంటారు. తను ప్రేమించి వెంటబడి పెళ్ళి చేసుకున్న మనిషి అకాలమరణం చెందినప్పుడు, ఆ ఆఘాతం నుంచి ఆయన తనను తాను ఎలా రక్షించుకున్నాడు? ఈ అనుభవాలు చదవడంకోసమేనా ఈ పుస్తకం చదవాలి.
రచనలు మూడు స్థాయిల్లో ఉంటాయి. మామూలుగా మనుషులు పడే సుఖదుఃఖాల గురించి రాసేవి మంచి రచనలు. ఉత్తమ రచనలు వాటికన్నా ఒక మెట్టు పైనుంటాయి. జీవితాన్ని ఉత్సవసదృశంగా భావించి ప్రతి రాత్రిని వసంత రాత్రిగా, ప్రతి గాలినీ పైరగాలిగా స్వీకరించి చేసే రచనలవి. ఆ రచయితల్ని మనం నెత్తినపెట్టుకుంటాం. కాని, మహా రచయితలు చేసే రచనలు వాటికన్నా మరొక పెట్టు పైనుంటాయి. ఆ రచయితలు నరకాన్ని చూసిఉంటారు. వాళ్ళ పాత్రలు మృత్యువు ఎదట ముఖాముఖి నిలబడతారు. తలపడతారు. ఆ నరకం నుంచి బయటకి వచ్చి, మళ్ళా మామూలు మనుషులుగా ఇరుగుపొరుగుతో సాధారణ జీవితం జీవించడం మొదలుపెడతారు. జీవితంలో సంభవించే యుద్ధాన్ని మాత్రమే కాక, యుద్ధానంతర శాంతిని కూడా చిత్రించే అటూవంటి రచనల్నే మనం epics గా పరిగణిస్తాం. ‘ఒడెస్సీ’, ‘ఏనియాడ్’, ‘డివైన్ కామెడీ’, ‘పెరిక్లీస్’, ‘వార్ అండ్ పీస్’ లు మహాకావ్యాలయ్యాయంటే అందుచాతనే. మరింత విస్తృతంగా, తరతరాల కథగా మహాభారతం చెప్పుకొచ్చేదిదే. తన నరకలోక ప్రవేశంతర్వాతనే యుధిష్ఠిరుడు స్వర్గారోహణ చెయ్యగలిగాడని.
ఆర్.కె. నారాయణ్ ఆత్మకథ కూడా ఏ లేశమాత్రమో ఆ స్ఫూర్తి పొందిన రచన.. ‘లోకం చూసాను నేను, శోకం చూసాను నేను, లోకంలోన, శోకంలోన నాకం కూడ చూడకపోలేను నేను’ అని కవీశ్వరుడు చెప్పిన మాటల్ని నిరూపించే రచన.
14-8-2018
ధన్యవాదాలు సార్.నారాయణ్ గారిలో కొత్త కోణాన్ని పరిచయం చేశారు