ఒకడు రంగాచార్య

Reading Time: 3 minutes

357

దాశరథి రంగాచార్య వెళ్ళిపోయారు. ఒక ప్రాకృత కవి అన్నట్టు అటువంటి మనిషి వెళ్ళిపోతే ఊరిమధ్యలో పెద్దమర్రిచెట్టు వేళ్ళతో పెకలించుకుపోయినట్టు ఉంటుంది. పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. ఆ చెట్టు ఉన్నప్పుడు తన నీడతో ఎట్లా ఆకట్టుకునేదో, ఇప్పుడింక చాలాకాలంపాటు తానులేని లోటుతో కూడా మనల్ని కట్టిపడేస్తూనే ఉంటుంది.

నా అదృష్టం కొద్దీ దాశరథి సోదరులు ఇద్దరి ప్రేమకూ, వాత్సల్యానికీ నేను నోచుకున్నాను.

1999 చివర్లో ఒకరోజు ఎమెస్కో విజయకుమార్ నాకు ఫోన్ చేసాడు. తాను దాశరథిరంగాచార్యగారిని కలిసానని చెప్తూ చాలా ముచ్చట్లే చెప్పాడు. ఆ మాటల్లో కొత్త ద్వీపాన్ని కనుగొన్న ఎక్సైట్ మెంట్. ప్రతి ఒక్కటీ నమ్మశక్యంగాని నిజాలే. ప్రతి ఏటా జరిగే విజయవాడ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి రమ్మని దాశరథి రంగాచార్యగారిని అడిగామనీ (ఆ గౌరవం కోసం తెలుగునేల మీద చాలామంది ప్రముఖులే ఎదురుచూస్తుంటారు), కాని తాను రాలేనన్నారనీ, కారణమేమిటో తెలుసా, ‘ఆ రోజు మా కాలనీ వాకర్స్ మీటింగ్ ఉంది, దాన్ని వదులుకుని ఎక్కడకీ పోలేను’ అన్నారాయన’ అన్నాడు విజయకుమార్.

ఆ ఒక్క సంఘటన దాశరథి వ్యక్తిత్వం మొత్తానికి అద్దం పడుతుంది. రంగాచార్య గొప్ప రచయిత, పండితుడు, అన్నీ నిజమే కాని, అన్నిటికన్నా ముందు మనిషి, తోటిమనుషుల కోసం పడిచచ్చేమనిషి. తాను ఇష్టపడ్డవాళ్ళు తననికూడా అంతలా ఇష్టపడాలని కోరుకునే మనిషి, వాళ్ళట్లా ఇష్టం చూపించకపోతే వాళ్ళెందుకు ఇష్టపడరేమని నిర్ఘాంతపోయేమనిషి, ఇష్టపడితీరాలని శాసించే మనిషి.

రంగాచార్య వేదాల్ని ప్రేమించారంటే అందుకే ప్రేమించారు. ‘వేదాల్లోనే అన్నీ ఉనాయనేవాళ్ళూ, వేదాల్లో ఏదీ లేదనే వారూ-ఇద్దరూ వేదాల్ని చదవలేదు’ అన్నాడాయన ఒక్కమాటలో.

ఆ రోజు విజయకుమార్ చెప్పిన మాటల్లో అన్నిటికన్నా గొప్ప ఆశ్చర్యం: ‘ఆయన ఇంటినుంచి వచ్చేసేముందు అక్కడ అలమారులో పెద్దపెద్ద బైండు పుస్తకాలు కనిపించారు. అవేమిటి సార్ అనడిగాను. ‘అవా వేదాలు. నేను అనువాదం చేసినవి అన్నారాయన తాపీగా.’ నేను ఆశ్చర్యపోయాను. ‘చూడొచ్చా సార్ ‘అనడిగాను. తీసి చూస్తే కుదురైన దస్తూరీలో నాలుగువేదాలూ తెలుగులో కనిపించాయి. వీటిని ఎవరికోసం అనువదించారు అనడిగాను, బహుశా ఎవరైనా ప్రచురణకర్త అడిగితే చేసిఉంటారనే ఉద్దేశ్యంతో. ‘ఎవరికోసమెమిటి? నాకోసంఏ నేను తెలుగులో రాసుకున్నాను’ అన్నారాయన. అంతే. మరుక్షణంలో ‘సార్, ఈ గ్రంథాల్ని ఎమెస్కో ప్రచురిస్తోందీ అన్నాను ఆయనతో’ అని చెప్పాడు విజయకుమార్.

2000 జనవరి పుస్తకప్రదర్శనలో శుక్ల యజుర్వేద సంహిత తెలుగు అనువాదం విడుదల. ఆ రోజు విజయవాడలో ఆ వేదికమీద ఆ అనువాదాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు లభించింది. ఆ రోజే రంగాచార్యగారిని మొదటిసారి చూడటం, మాట్లాడటం. అదొక ఉజ్జ్వలసమయం. ఆ తరువాత జరిగినదంతా చరిత్ర.

ఆ ఉగాదికే వేదాల సంపుటాల్ని హైదరాబాదులో ఆవిష్కరించారు. అప్పుడు కూడా ఆ వేదికమీద ఎందరో వేదపండితులున్నా ఆ సంపుటాల్ని పరిచయం చేసే అవకాశం నాకే లభించింది. పూర్వజన్మ సుకృతం అంటారు దాన్ని.

ఆ ఏడాదే జూలై లో అనుకుంటాను, ఆయనతో పాటు గుంతకల్ వెళ్ళాం.అక్కడ ఆయన ప్రసంగం. ఆ ప్రసంగమైన తరువాత ఒక రెడ్డిగారి ఇంట్లో విందు. అక్కడ అన్నం వడ్డిస్తూ ఆ కుటుంబసభ్యులు, స్త్రీలు ‘జీవనయానం’ లోంచి వాక్యాలకు వాక్యాలు అప్పగిస్తున్నారు. పద్యాలు అప్పగించడం చూసాను, పాటలు వల్లెవేయడం చూసాను, ఒక వచనరచనని కూడా అట్లా వల్లెవేయడం నేను చూడటం అదే మొదటిసారి, ఈ పదిహేనేళ్ళలో మళ్ళా అట్లాంటి దృశ్యమెక్కడా చూడలేదు, చూడగలనని కూడా అనుకోలేను.

ఆ తరువాత కొన్నేళ్ళపాటు రంగాచార్యగారితో తరచూ మాట్లాడుతుండేవాణ్ణి, అప్పుడప్పుడూ చూడగలిగే అవకాశం కూడా దొరికేది. ఆయన వల్లనే నాకు వాసిరెడ్డి సీతాదేవిగారి పరిచయం దొరికింది. ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఆండాళ్ ని చదువుతున్నానని చెప్పాను. అండాళ్ అనే మాట వింటూనే ‘మార్గశిరత్తిల్ మనుమనదరగళ్ ..’ అంటూ ‘మనసుకలిగిన మార్గశిరదినాలు’ అందయ్యా ఆమె, ఆ సెందమిళం అందమే అందం అంటూ ఒక వాక్ప్రవాహంలో నన్నుముంచెత్తారు.     ఆ తన్మయత్వం అక్కడితో ఆగక, తిరుప్పావై ని తెలుగు చేసేదాకా ఆగలేదు. ఆ అనువాదం వెనక ఆనాటి మా సంభాషణ ఏదో ఒక మేరకు కారణమయిందని నాకు కించిత్ గర్వం.

రంగాచార్య వ్యక్తిత్వం లో ఒక విశేషముంది. ప్రాచీన గ్రీకు నాయకపాత్రల్లాగా, డొస్టవస్కీ, కాఫ్కా పాత్రల్లోలాగా, చలంలాగా ఆయనలో కూడా తీవ్రమైన పితృద్వేషి ఉన్నాడు. Authority మీద ఆయన చేసిన తిరుగుబాట్లన్నిటికీ అదే ప్రాతిపదిక. కాని సనాతన భారతీయవిలువలు ఎటువంటి filial piety ని కోరుకున్నాయో దానికి తాను అర్హుడు కావాలని కూడా ఆయన తపించాడు. ఈ వైరుధ్యం ఆయన జీవిత ప్రస్థానం అడుగడుగునా కనిపిస్తుంది. ఆ filial piety లేకపోయుంటే ఆయన జీవితం కూడా బ్రదర్స్ కరమజోవ్ నవలగా మారిపోయుండేది. అటువంటి ప్రమాదం నుంచి ఆయన్ను తప్పించిన మహనీయులు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు వారి తల్లిగారు, రెండవవారు ఆయన శ్రీమతి కమలగారు, ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించాలి.

తనలోని పితృధిక్కారధోరణి వల్ల ఆయనెప్పుడూ ఒక శత్రువుకోసం అన్వేషిస్తూనే ఉండేవారు. అది నిజాం నవాబుమీద తిరగబడటంలోనే కాదు. తరువాతి రోజుల్లో మునిసిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇంటికే నిక్కచ్చిగా పన్ను మందింపు చేసి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవడంలో కూడా కనిపిస్తుంది. రాజకీయనాయకులుండే ఏ వేదికనీ తాను ఎక్కకూడదని చివరిదాకా కూడా భీష్మించుకోవడంలోనూ అదే ఆగ్రహం,అదే మొండితనం. ఎక్కడుంది అటువంటి వెన్నెముక ఇప్పుడు?

కాని ఆయన ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక తండ్రి కూడా. అదికూడా రామాయణం, ఒక మనిషి ఎటువంటి కొడుకుగా, తమ్ముడిగా, తండ్రిగా ఉండాలని కోరుకుందో అచ్చం అలానే. అదంతా ‘జీవనయానం’ లో మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక దృశ్యం, దాశరథి కృష్ణమాచార్య జైలు నుంచి ఇంటికొచ్చినప్పుడు వాళ్ళమ్మగారు ఆ వంటింట్లోంచి అట్లానే పరుగుపరుగున వచ్చిన దృశ్యం. ఆ అన్నదమ్ములిద్దరినీ కన్న ఆ తల్లిని తలుచుకుంటే నా కళ్ళు ఇప్పుడు కూడా సజలాలైపోతున్నాయి.

రంగాచార్య అద్వితీయుడు. ఒకడు రంగాచార్య. ఆధునిక సంప్రదాయ జీవన విలువల, విశ్వాసాల, వైరుధ్యాల జమిలినేత. బహుశా తెలుగునేలమీద అటువంటి literary protagonist ని ఇప్పట్లో చూడగలమనుకోను.

9-6-2015

Leave a Reply

%d bloggers like this: