ఏడు ధర్మాలు

371

అయిదారేళ్ళ కిందట, నా మిత్రుడు, ఒక విశ్వ విద్యాలయ ఆచార్యుడు, ప్రాచీనభారతదేశంలో రాజనీతి పైన ఒక సంకలనం చేయబోతున్నాననీ, నాకు తెలిసిన కొన్ని గ్రంథాలు కానీ లేదా ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావనలు కానీ చెప్పమన్నాడు. రామాయణం, మహాభారతం, రఘువంశం వంటి గ్రంథాల్లో రాజనీతి ప్రస్తావనల గురించి చెప్పి, ‘మహా పరినిబ్బాణ సుత్త ‘ కూడా చూడమని చెప్పాను.

ఆయన ఆ రచన గురించి తానప్పటిదాకా వినలేదన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. కాని, ఒక క్షణం తర్వాత, నా ఆశ్చర్యానికి అర్థం లేదనిపించింది. మనకి ప్లేటో సంభాషణలు పరిచయమయినంతగా, బుద్ధుడి దీర్ఘ సంభాషణలతో పరిచయం లేదుకదా అనిపించింది. మీరు ఏ పుస్తకాల దుకాణానికి వెళ్ళినా ఏథెన్సులో ఒకప్పటి సోక్రటీసు సంభాషణల కొత్త ప్రతి ఒకటి కనిపిస్తూంటుంది. కాని, అదే కాలంలో భారతదేశంలో శ్రావస్తిలో, వైశాలిలో బుద్ధుడు మాట్లాడిన మాటలు మనకి అందుబాటులో ఉండనే ఉండవు.

నేను ఆ సంభాషణలు రైస్ డేవిస్ దంపతులు చేసిన ఇంగ్లీషు అనువాదం (1910) లో చదివాను. అప్పటికి అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి చేసిన తెలుగు అనువాదం ‘బుద్ధుడి దీర్ఘసంభాషణలు’ (2003) అందుబాటులోకి రాలేదు. కాని, ఇప్పుడు, తెలుగువాళ్ళ అదృష్టం వల్ల బుద్ధుడి దీర్ఘసంభాషణలు భిక్కు ధమ్మరక్ఖిత అనువాదంతో మరొకమారు గత ఏడాది వెలువడ్డాయి. మహాబోధి బుద్ధ విహార వారు ఇప్పటిదాకా దీఘనికాయం రెండుభాగాలు, సుత్తపిటకం వెలువరించారు. ఈ అనువాదాలు సులభంగానూ, సరళంగానూ ఉండటమే కాకుండా, పాలీ మూలాన్ని కూడా పక్కపక్కనే పొందుపరుచుకున్నాయి.

బుద్ధుడి సంభాషణలుగా మనకి లభ్యమవుతున్న సుత్తనికాయంలోని అయిదు సంకలనాలు- దీఘనికాయం, మజ్జిమ నికాయం, సంయుత్తం, అంగుత్తరం, ఖుద్దక నికాయాల్లో- ‘దీర్ఘసంభాషణలు’ అత్యంత ప్రాచీనమైనవి, చాలా వరకు బుద్ధుడి మాటల్ని యథాతథంగా గుర్తుపెట్టుకుని మనకి అందిస్తున్నవీను. కాబట్టి, బుద్ధుడు ఏమి చెప్పాడు, ఆయన దృక్పథం ఏమిటి అనేది స్వయంగా తెలుసుకోదలచుకున్నవాళ్ళు, దీర్ఘసంభాషణలు ఒక్కటీ చదివినా సరిపోతుంది. అందులో ఉన్న 34 సంభాషణల్లోనూ, ‘మహాపరినిబ్బాన సుత్త’ (మహాపరినిర్వాణ సూక్తం) తక్కినవాటన్నిటికన్నా పెద్దదీ, అనేక కారణాల వల్ల ప్రత్యేకమైందీను. అందులో దాదాపు మూడవవంతు మాత్రమే మౌలికమైందీ, ప్రాచీనమైందనీ, రైస్ డేవిస్, ఓల్డెన్ బర్గ్ వంటి పండితులు వాదించినప్పటికీ, ఆ మూడవవంతు మౌలిక భాగాలు చూసినా కూడా మనకళ్ళముందొక మనముందొక మానవీయ బుద్ధుడు ప్రత్యక్షమవుతాడు. బుద్ధుడి చివరిరోజులు, ఆయన ఈ లోకంలో తన కర్తవ్యం ముగించుకుని, ప్రశాంతంగా, ఈ లోకాన్ని వదిలిపెట్టిన వివరణ అది. ఒక కథలాగా, ఆఖ్యానరూపంలో అత్యంత ఆసక్తిదాయకంగా నడిచే ఒక వృత్తాంతం కూడా.

తనని శిలువ వేసే ముందు రాత్రి గెస్తమని తోటలో క్రీస్తు అనుభవించిన ఆత్మవేదన వంటిది ఈ సుత్తంలో కూడా బుద్ధుడు అనుభవించడం కనిపిస్తుంది. ఆయన సంబోధి పొందినప్పుడు, ఈ లోకంలోకి తిరిగిరావాల వద్దా అన్న మీమాంసకి లోనయ్యాడు. అప్పుడు మారుడు ఆయన్ని ఈ లోకం వదిలిపెట్టెయ్యమని సలహా ఇచ్చాడు. కాని, తాను కనుగొన్న సత్యాన్ని తన తోటిమనుషులకి చెప్పి, వారు కూడా తనలాగే విముక్తి చెందేవరకు తాను ఈ లోకాన్ని విడవాలనుకోవడం లేదనీ, తన కర్తవ్యం పూర్తయ్యాక తనంతతనే ఈ లోకాన్ని వదిలిపెడతాననీ బుద్ధుడు మారుడికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఎనభై ఏళ్ళ వయసులో, తీవ్ర అనారోగ్యానికి పాలయ్యాక, బుద్ధుడు ఆనందుడితో అన్నాడు: ‘ఆనందా, భిక్షు సంఘం నానుంచి ఇంకా ఏమి ఆశిస్తుంది? నాలోపల ఉన్న ధర్మాన్నంతా, నేను వెల్లడి చేసాను. నా పిడికిలి ఎప్పటికీ మూసిపెట్టింది లేదు. నేనిప్పుడు జీర్ణుణ్ణయ్యాను, ముసలివాణ్ణయ్యాను, పెద్దవాణ్ణయ్యాను, వయసుపైబడింది, ఇప్పుడు నాకు ఎనభై ఏళ్ళు, ఏదో పాతబండికి అతుకులు వేసి నడిపిస్తున్నట్టు నడిపిస్తున్నాను..ఇప్పుడు మీకు మీరే దీపాలు కావాలి’ అని. ఆ మాటలు విని మారుడు ఆయన్ని మరొక మారు సమీపించి, ‘అయితే, పద, ఈ లోకాని వదిలిపెట్టు, సమయం ఆసన్నమైంది’ అని గుర్తు చేసాడు. కాని బుద్ధుడు తొందరపడవద్దనీ, తాను మూడునెలల్లో ఈ లోకాన్ని వదిలిపోగలననీ చెప్పాడు.

ఆ మూడు నెలల విరామం ఎందుకు కోరాడు? దానిమీద బౌద్ధ పండితుల మధ్య ఎంతో చర్చ జరిగింది. కాని, చాలామంది అంగీకరించిన ఒక కారణమేమిటంటే, బుద్ధుడు మగధ సామ్రాజ్య భూమిలో తన తనువు వదలాలని అనుకోలేదనీ, ఏదో ఒక గణతంత్ర పరిథిలోనే తనువు చాలించాలనుకున్నాడనీ. రాజగృహం నుంచి కుసీనార కు చేరడానికి, రెండువందల మైళ్ళ దూరం, కనీసం మూడు నెలలు పడుతుంది, అందుకని ఆయన మూడు నెలల గడువు అడిగాడనీ.

ఇక్కడ బుద్ధుడి రాజనైతికత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన సామ్రాజ్యవాదాన్ని అంగీకరించలేకపోయాడనీ, గణతంత్రాల పట్లనే ఆయన హృదయం కొట్టుకుపోయేదనీ మనకి అర్థమవుతుంది. బహుశా, ప్రపంచంలో మరే ప్రవక్త, కవి, రచయిత, రాజకీయనాయకుడు కూడా ఇలా ప్రజాస్వామ్యపరిథిలోనే తనువు చాలించాలని కోరుకున్నవాళ్ళు మరెవరూ కనిపించరు. బుద్ధుడి జీవితకాలపు దర్శనం, బోధలు, ఆయన చూపించిన కారుణ్యం మొదలైనవాటన్నింటినీ పక్కన పెట్టినా కూడా, ఈ ఒక్క సంఘటన చాలు, ఆయన మానవజాతిలో ప్రభవించిన అత్యున్నత మానవుడు అని చెప్పడానికి. ఇటువంటి గణతంత్ర సంస్కారాన్ని ఇంత స్పష్టంగా చూపించిన తర్వాత కూడా, ఎందుచాతనో, మన పాఠ్యపుస్తకాల్లోగాని, మన సాహిత్యంలో గాని, ఈ సంఘటన గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించదు.

‘మహాపరినిబ్బాన సుత్త’ మొదలవుతూనే ఒక ఆసక్తికరమైన సంఘటనతో మొదలవుతుంది. ఒకరోజు మగధ రాజు అజాతశత్రు ‘వజ్జి’ గణతంత్రాన్ని నాశనం చెయ్యాలనుకుని తన ప్రతినిధిని ఒకణ్ణి బుద్ధుడి దగ్గరికి పంపించాడు. వజ్జి గణతంత్రాన్ని తుదముట్టించాలనే తన సంకల్పం విని బుద్ధుడేమంటాడో తెలుసుకుని రమ్మన్నాడు. రాజప్రతినిధి బుద్ధుడిదగ్గరికి వచ్చి ఆ సంగతి నివేదించాడు. కాని ఆ మాటలు వినగానే బుద్ధుడు ఆ రాజప్రతినిధి వైపు కాకుండా ఆనందుడి వైపు తిరిగి ఏడు ప్రశ్నలు అడిగాడు.

• ఆనందా, వజ్జియులు క్రమం తప్పకుండా సమావేశమై తమ సమస్యలు చర్చించుకుంటూ ఉంటారా?
• వాళ్ళు కలిసి సమావేశమవుతూ, కలిసి చేయవలసిన పనులు చేస్తున్నారా?
• వాళ్ళ తాము పెట్టుకున్న నియమాల్ని పాటిస్తూ, సాంప్రదాయికంగా వస్తున్న గణతంత్రాన్ని అనుసరిస్తున్నారా?
• వాళ్ళు తమ పెద్దల్ని గౌరవిస్తున్నారా, పూజిస్తున్నారా, వాళ్ళ మాటలు వినాలనుకుంటున్నారా?
• వాళ్ళు స్త్రీలనీ, కన్యల్నీ, పిల్లల్నీ ఎత్తుకుపోయి బలాత్కరించడం లేదుకదా!
• వాళ్ళు దేశంలోనూ, బయటనూ ఉన్న ప్రార్థనాస్థలాల్ని గౌరవిస్తున్నారు కదా, దోచుకోవడం లేదు కదా!
• తమ గ్రామాలకు ఎవరేనా సజ్జనులు వస్తే వాళ్ళకి ఆశ్రయమిచ్చి వాళ్ళ నివాసానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కదా!

ఆ ప్రశ్నలన్నిటికీ ఆనందుడు అవునని జవాబిచ్చాడు, ‘ఎంతకాలమయితే వజ్జియులు ఈ ఏడు ధర్మాలూ పాటిస్తారో అంతకాలం వాళ్ళని ఎవరూ నాశనం చేయలేరని చెప్పు’ అన్నాడు బుద్ధుడు.

ఈ హితబోధ, 2500 ఏళ్ళ కిందట వజ్జి గణతంత్రానికి ఎంత వర్తిస్తుందో, ఇప్పటి భారతప్రజాస్వామ్యానికి కూడా అంతే వర్తిస్తుందనుకుంటున్నాను.

29-4-2018

Leave a Reply

%d bloggers like this: