ఎర్రక్రీస్తు-1

314

కవిత్వం ఎలా రాయాలో తెలుసుకోవడానికి ముందు కవిత్వాన్ని ఎలా చదువుకోవాలో తెలుసుకోవడం అవసరం. నా గురువులు నాకిదే నేర్పించారు. కవిత్వనిర్మాణ వ్యూహాల గురించి నా ఆలోచనలు మీతో పంచుకునే క్రమంలో ముందు కవిత్వాన్ని లోతుగా, గాఢంగా చదవడమెలానో ఒక ఉదాహరణతో మీతో పంచుకుందాము అనుకుంటున్నాను.

ఈ కవిత చదవండి. ఇది బైరాగి రాసిన ‘ఎర్రక్రీస్తు’ కవిత. కవితని ఒకటి రెండుసార్లు ఆమూలాగ్రం చదవండి.

ఎర్రక్రీస్తు

ఆ ప్రాచీనాచారాల ప్రాచీరాలు
బంగారపు దేవళాల నింగినేలే గోపురాలు
పాతకాపులు పూజారులు, అస్మితముఖులు
అమలినాద్భుత చీనిచీనాంబరధరులు
స్వర్ణదండమండితకరులు, ధర్మధ్వజరక్షకల 5
దేళంలో ధూపదీపనైవేద్యాల దుర్భేద్యసౌగంధ్యాల
చిక్కని పొగమంచులోన ఉక్కిరిబిక్కిరియై
గాలికి కూడ ఊపిరాడని శాశ్వతసంధ్యాజగాల
యత్నరచిత రత్నఖచిత విచిత్ర విగ్రహాలమ్రోల
నర్తించే పసిడివన్నియకన్నియలు-                                                                                   10
నీవక్కడలేవని నాకు తెలియక కాదు.
(అది ఒక ఖయ్యాళి అను, అసమర్థుని జాలి అను)
పుత్తడిపుట్టలోనిది చావని నాకు తెలియక కాదు.
తలతాకున ధీరమేరుగౌరవాన్ని
కాంచన కుంభికుంభాన్ని డీకొనాలని అనుకున్నాను,                                                          15
(వ్యర్థప్రయత్నం; ఒక నిరర్థ సంకేతం)
కరుకుకేల, మొరకు బ్రతుకు నెత్తుటి చెమటల తీర్థం తెచ్చిన నేను
అగణిత క్షత విక్షత చరణధూళి ధూసరదేహుడనై వచ్చిన నేను
(కూలీల మెలిదిరిగిన, బలిసిన కండలు; రైతుల్లాంటి అరచేతులు; మొరటుమొగం)

ప్రేమోద్రిక్త క్రోధంతో; అక్కడ కూడా                                                                                      20
ఆ బంగరు పంజరంలో కూడా
నీవు విధిగా ఉండి తీరాలని శాసించాను.
లోలోన పిరికిగానే అశించాను.
ధర్మశాస్త్రరహస్యాలు
తర్కమహామాయాజాలచ్ఛిద్రాన్వేషణల సూక్ష్మసూత్రాలు                                                      25
వాటి వెనుక దాగిన నీ లీలా గూఢపరమార్థం నాకెలా తెలుస్తుంది.
మూడుఢను-నీ ఉనికీ, లేకునికీ ఒకేలా చలిస్తుంది.
మూడుమారులు కోడికూసి
ద్రోహపు నల్లని పొద్దు భళ్ళున పొడిచిన వేళ
నా నీడచూచి తుళ్ళి నేనే హడలిన వేళ                                                                                30
నా కండలు తిండికాగ
నా రుధిరం మధువుకాగ
పుత్తడిమిత్తవముద్దు నా పెదవుల భగ్గున మండినవేళ
నేనిచ్చే ప్రాణం తప్ప నీవిచ్చే దానం గుర్తించని నేను
‘దేవా! నీవెక్కడ?’ అని అరచానేగాని                                                                                    35
నా అశక్తదాహంలో, జనుల రక్తదాహంలో
అవహేళనల ఉమ్ములోన, అవమానపు దుమ్ములోన
నీవు నాకు మునుపటికన్న సన్నిహితుడివైనావనుకొనలేదు.
నా వెనుకనే ఉన్న నిన్ను కనుగొన లేదు.                                                                            40
బాధాశైలాగ్రాన.
కంటక మకుట శూలాగ్రాల, రోజాలు రాజసంగా మొగ్గలిడగా
కాళుల, కేళుల కమ్మని కెందమ్ములు భగ్గుమనగా
(అజ్ఞుడను) అప్పుడు నిన్ను గుర్తించాను.
కడపటి కృతజ్ఞతతో నిట్టూర్చాను.                                                                                        45

పాశ్చాత్యదేశాల్లోనూ, ఇతరభాషల్లోనూ కూడా బైబిలూ, క్రీస్తూ ప్రస్తావనకి రావడం ఆధునిక కవిత్వం తాలూకు ఒక లక్షణం. యూరోప్ లో మధ్యయుగాల్లో సాహిత్యం, కళ మతం చుట్టూతానే తిరిగాయి. కాని ఆధునిక కాలంలో బైబిల్ ప్రతీకల్నీ, క్రీస్తునీ మానవీయంగా చూసే, చూపే ఒక ధోరణి మొదలయ్యింది. ముఖ్యంగా పాశ్చాత్య అస్తిత్వవాదులు కిర్క్ గార్డ్, డాస్టవస్కీ, కాఫ్కాలు ప్రకటించిన జీవుని వేదన భారతీయ రచయితల్నీ, కవుల్నీ కూడా చాలా ప్రభావితం చేసింది. అందుకు బైరాగి మినహాయింపు కాదు.

ముఖ్యంగా ‘నడిరేతిరిమేలుకున్నవాడెవ్వడు?’, ‘రెండు క్రిస్మస్ గీతాలు’ పూర్తికవితలే కాక, బైబిల్, క్రీస్తు స్ఫురణలతో చేసిన ఎన్నో ప్రయోగాలు:

లాజరస్ మృతతంద్ర విడివస్తాడు శాశ్వత కాంతిసీమకు
పిలుపు నీ గళమంగళ ధ్వని, మృత్యు యజనపు జీవమంత్రం ( నూతిలో గొంతుకలు: రాస్కల్నికావ్)

కుష్టురోగి కౌగిలి నాదనగలవారెవ్వరు..చుంబించిన హస్తానికి ద్రోహులు కానివారెవ్వరు? (ఆగమగీతి)

మానవసూతి కోరుకున్నది శిలువ కాదా..
కనుపించని శిలువనేడు, అదే ప్రశ్న, శబ్దాల్లో మార్పున్నది
‘దేవా వదిలేసావా నీవు కూడా’ బరబ్బాసు విలపిస్తాడు. ( కామ్రేడ్ రాయ్ స్మృత్యర్థం)

శిలువ మోయలేని వాడు నవ్యజీవనార్హుడు కాడు ( శాంతిపథం)
బుద్ధుడు క్రీస్తు వారు వేరు, గాలిలాగు, వెలుగు లాగు, జాలిలాగు వారి ప్రేమ (ప్రేమకవితలు-3)

క్రీస్తు కాళుల కేళుల వ్రణాలు కెందామరలు (కెందామర)

విశ్వమహాకావ్యాలన్నీ వేదనతో విలపించే
పసివాని అశ్రుబిందువు సాటిచేయవు
ఏసుక్రీస్తు పదరేణువు పాటిచేయవు (వినతి)

అయితే ఈ ప్రస్తావనల్లో క్రీస్తు త్యాగాన్నీ, మనిషిపట్ల మమతనీ ప్రశంసించడమే ముఖ్యం. సాధారణంగా క్రీస్తు చూపించిన ప్రేమ, క్షమ, విశ్వాసం లోకోత్తరమైనవీ, మానవాతీతమైనవీ అనే భావాన్ని ప్రకటించడమే అక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది.కాని ‘ఎర్రక్రీస్తు’ కవిత అక్కడితో ఆగక క్రీస్తును కేవలం మానవోత్తముడిగా కాకా, ఒక మనిషిగా, మామూలుగా మనిషిగా , అశక్తమానవుడిగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి అశక్తతాస్ఫురణలో ఆయన దేవుడికి మరింత సన్నిహితుడైనాడన్న ధ్వని ఈ కవితకు ప్రాణం. అదేమిటో చూద్దాం.

ఈ కవిత క్రీస్తు స్వగతం. దీన్ని అర్థం చేసుకునేముందు క్రీస్తు జీవితంలోని కొన్ని సంఘటనలు గుర్తుచేసుకోవాలి. అవి క్రీస్తు కోపానికీ, అశక్తతకీ, నిస్పృహకీ లోనైన క్షణాలు. సువార్తల్లో చెప్పినదాన్ని బట్టి క్రీస్తు రెండుసార్లు కోపోద్రిక్తుడైనట్టు కనిపిస్తుంది. మొదటిసారి ఆయన్ను సైతాను ప్రలోభపరచడానికి ప్రయత్నించినపుడు (మత్తయి.4-10). రెండవది ఆయన యెరుషలేం దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆ దేవాలయాన్ని ఒక బజారుగా మార్చిన వడ్డీవ్యాపారస్థులమీద, అమ్మకందారులమీద ఆగ్రహం చూపించిన క్షణాలు.ఆయన పట్టలేని కోపంతో వాళ్ళ అంగడి బల్లలు కిందకు తోసేసాడనీ, పావురాళ్ళని పంజరాలనుంచి విడుదల చేసేసాడనీ సువార్త చెప్తున్నది.(21:12-13). ప్రార్థనాగృహాన్ని దొంగల స్థావరంగా మార్చేసారని వాళ్ళమీద అరిచాడాయన. క్రీస్తు దృష్టిలో యెరుషలేం దేవాలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఈ ప్రపంచమంతా ఆయన దృష్టిలో ఒక ప్రార్థనాగృహమే. నిజమైన విశ్వాసి దేహం, ప్రాణం కూడా ఆయన దృష్టిలో యెరుషలేం దేవాలయంతో సమానమే. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో తిరిగిలేపుతాను అని ఆయన అన్నప్పుడు ఉద్దేశించింది తన ప్రాణం గురించే.

ఇక శిలువ వెయ్యడానికి ముందురోజు గెస్తమని తోటలో ఆయన అనుభవించిన వేదన నిజమైన మానవీయ వేదన. అక్కడ ఆయన ఏకాంతంలో ‘తండ్రీ నీకు చాతనైతే ఈ పానపాత్రని నా నుంచి తప్పించు’ అని అడిగాడు. (26:39). ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ భూమ్మీద దైవసందేశ వార్తాహరుడిగా మరికొన్నాళ్ళు జీవించాలన్న కోరిక అందులో ఉందనుకోవచ్చు. లేదా ప్రవక్తలందరిలానే, ఈ నిష్టురమైన బాధ్యత తనే ఎందుకు మోయాలన్న తలపు కూడా ఉండవచ్చు. తన శిష్యులు ఆ ఒక్కరాత్రి తనకోసం నిద్రని ఆపుకోలేకపోవడం, తాను నిర్మించబోతున్న దైవసంఘానికి పునాదిరాయిగా ఉండవలసిన పేతురు తెల్లవారే లోపు ఒక్కసార్రి, మూడు సార్లు తనెవరో తెలియదని చెప్పడం (26:69-75) ఒక మానవుడిగా క్రీస్తుకి భరించడం కష్టమైన విషయాలే. ఇక అన్నిటికన్నా అత్యంత వేదనాభరిత క్షణం ఆయన శిలువమీద ‘దేవా, దేవా, నా చేతిని ఎందుకు విడిచావు’ అని విలపించడం. (27:46).

సరిగ్గా ఈ అశక్త క్షణాలమీదనుంచే బైరాగి తన కవితని నిర్మించాడు. కవితలో మొదటి 19 పంక్తులు ఆయన యెరుషలేం లో వర్తకుల మీద ఆగ్రహం ప్రకటించిన విషయాన్నే గుర్తుచేసుకుం టున్నాయి. ఆయన దాన్ని కేవలం ఒక దేవాలయానికే పరిమితమైన విషయంగా చూడటం లేదు. ‘పుత్తడి పుట్ట’, ‘కాంచన కుంభి కుంభం’ అనే మాటలు వాడుతున్నప్పుడు, ఒక ఒంటె సూదిబెజ్జంలోంచి ప్రయాణించడం కన్నా ఒక ధనికుడికి దైవానుగ్రహం లభించడం మరింత కష్టమన్న క్రీస్తునే స్ఫురింపచేస్తున్నాడు. అటువంటి ఆడంబర, విలాస, వైభవోపేత ప్రపంచానికి ఎదురుగా ఆయన క్రీస్తును ఒక రైతులాగా, కార్మికుడిలాగా చూపించడానికి ప్రయత్నించడం విశేషం.

‘కరుకు కేల మొరకు బ్రతుకు నెత్తుటి చెమటల తీర్థం’

‘కూలీల మెలిదిరిగిన, బలిసిన కండలు రైతుల్లాంటి అరచేతులు, మొరటుమొగం’

ఇవి చాలా విశిష్ట పదప్రయోగాలు. కవి క్రీస్తుని ఒక శుష్కదేహుడిగా, అర్భకుడిగా కాకుండా శారీరకంగా బలాఢ్యుడిగా, కాయకష్టం చేసేవాడిగా చూపిస్తున్నాడు. ప్రసిద్ధ యూరోపీయ చిత్రకారుడు కారవగ్గియో చిత్రించిన క్రీస్తు ఇలా ఉంటాడు. ఈ మాటలు రాస్తున్నప్పుడు బైరాగి మనసులో గురజాడ వాక్యం ‘కండ కలవాడేను మనిషోయ్’  లేదని అనుకోలేం.

అయితే కేవలం తన మనోబలంతో ధనికప్రపంచాన్ని ధిక్కరించడం ఒక ‘వ్యర్థ ప్రయత్నం’ అని క్రీస్తుకు తెలుసు, దాన్నొక సంకేతంగా భావించాలనుకున్నా అది నిరర్థకమని కూడా అతడికి తెలుసు. ఈ భావాల వరకూ ఇందులో కొత్తదనమేమీ లేదు. కాని

ప్రేమోద్రిక్త క్రోధంతో: అక్కడ కూడా
ఆ బంగరు పజరంలో కూడా
నీవు విధిగా ఉండి తీరాలని శాసించాను

అనే వాక్యాలతో కవి మనని విభ్రాంత పరుస్తున్నాడు తన తండ్రి అందరికీ తండ్రి అయినప్పుడు ఆ వాణిజ్యసమూహానికి మాత్రం తండ్రి కాకుండా ఎలా పోతాడు? నిజమైన అద్వైతికికలిగే ప్రశ్న ఇది. అక్కడితో ఆగకుండా-

‘లోలోన పిరికిగానే ఆశించాను’

అనడంతో మనల్ని పూర్తిగా నిశ్చేష్టితుల్ని చేస్తున్నాడు.

ఇక్కడ పిరికిగా అనే మాట గమనించాలి. పిరికితనం ఎందుకు? అది ధనికప్రపంచబలాన్ని చూస్తే కలిగిన పిరికితనం కాదు. దైవాజ్ఞల్ని ఉల్లంఘిస్తున్న తోటిమనుషుల్ని క్షమించమని తన తండ్రిని అడగకుండా ఉండలేనితనం వల్ల వచ్చిన పిరికితనం. కాని అంతకు ముందు ‘ప్రేమోద్రిక్త క్రోధం’ అనే మాట వాడాడు. ఆ క్రోధం ఎవరిపైన? వ్యాపారస్థులమీద కాదు.అది కూడా తన తండ్రి మీదనే. అందుకనే ప్రేమోద్రిక్త క్రోధం. తన తండ్రి ఇల్లు దోంగల నివాసంగా మారిందన్న బాధ వల్ల , ఏం, అయితే మాత్రం, ఆయన అక్కడ ఉండకూడదా అన్న వేదనగా మారి అక్కడ విధిగా ఉండాలన్న శాసనంగా వ్యక్తమై, మరుక్షణమే తాను నిర్బంధిస్తున్నది తన తండ్రిని అన్న ఎరుకవల్ల పిరికితనంగా మారిపోయింది. నాలుగు వాక్యాల్లో ఇంత మానవీయ అనుభవాన్ని ప్రకటించడం బైరాగికే సాధ్యమైంది అనాలి.

‘ఎర్రక్రీస్తు’ అన్న శీర్షికలోని మొదటి స్ఫూర్తి ఇక్కడ. ఎర్రదనం కోపానికి గుర్తు. కోపోద్రిక్తుడైన క్రీస్తు ఎర్రక్రీస్తు. అయితే సిగ్గువల్ల కూడా ముఖం ఎర్రబారుతుంది. సిగ్గువల్ల కలిగిన పిరికితనం వల్ల కూడా ఎర్రక్రీస్తు.

ఇక ఇంతకన్నా మరింత సమున్నతశిఖరాలవైపు కవి చేసినప్రయాణం 34-40 పంక్తుల్లో చూడవలసిఉంటుంది.

‘దేవా, దేవా నా చేతిని ఎందుకు విడిచావు’ అని తాను శిలువ మీద ప్రశ్నించిన దాన్ని తలుచుకుని క్రీస్తు పునరాలోచనలో పడటం ఈ వాక్యాల సారాంశం. ఆ స్ఫురణకి ప్రధాన వాక్యం.

‘నేనిచ్చే ప్రాణం తప్ప, నీవిచ్చే దానం గురుతించని నేను ‘

క్రీస్తు తన తండ్రి పట్ల చూపిస్తున్న విశ్వాసం లాగా కనబడుతున్న ఈ వాక్యం నిజానికి సోదరమానవసమాజం పట్ల ఆయన చూపుతున్న అపారమైన దయాన్వితవాక్యంగా కనిపించి మన హృదయాన్ని చెమ్మగిలచేస్తున్నది.

‘దేవా, నీవెక్కడ అని అరచానే గాని
నా అశక్తదాహంలో, జనుల రక్తదాహంలో
అవహేళనల ఉమ్ములోన, అవమానపు దుమ్ములోన
నీవు నాకు మునుపటికన్న సన్నిహితుడవైనావనుకొనలేదు ‘

ఈ వాక్యాలు కేవలం తెలుగు కవిత్వంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే అత్యున్నతవాక్యాలు. ఒక్క సువార్తల్లో వాక్యాలు మాత్రమే ఈ వాక్యాలకు సాటిరాగల వాక్యాలు. బ్లేక్ నుంచి ఇలియట్ దాకా ఏ ఇంగ్లీషు కవి కూడా ఇంత అత్యున్నత మనోభూమికను చేరలేకపోయాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.

‘దేవా నువ్వు నా చేతిని ఎందుకు విడిచావు’ అన్న వాక్యం పైకి అశక్తతా ప్రకటనగా కనిపించినా అది నిజానికి ఒక సాక్షాత్కారం పొందిన క్షణంలో పలికిన వాక్యంలాంటిదేనని కవి భావిస్తున్నాడు.. పునరాలోచనవల్ల కలిగిన సిగ్గుతో ఎర్రబారిన ముఖంవల్ల కూడా ఆయన ఎర్రక్రీస్తు.

ఇక 40-45 పంక్తుల్లో శిలువమీద రక్తసిక్త దేహంతో ఉన్న క్రీస్తు నిజంగానే ఎర్రక్రీస్తు గాని అక్కడ కవి రక్తమనే మాట వాడకుండా ‘రాజసంగా మొగ్గలిడిన రోజాలు’, ‘కమ్మని కెందమ్ములు’ అనే మాటలు వాడాడు. తనకి తన తండ్రి మునుపటికన్నా సన్నిహితుడైనాడన్న మెలకువ కలిగించిన పులకింతవల్ల దేహమంతా ఎర్రటి గులాబులు, తామరలు పూచినందువల్ల కూడా ఆయన ఎర్రక్రీస్తు.

ఒక కవికి ముందొక స్ఫురణ కలుగుతుంది. దాన్ని అనేకస్థాయిల్లో దర్శించిన తరువాత దాన్ని కవితగా నిర్మించినప్పుడు ఆ కవితకొక గాఢత చేకూరుతుంది. దాన్ని పాఠకుడు చదివినప్పుడు దాని స్వారస్యం ఒక్కసారి బోధపడదు. ఆ కవిత అతడిని పదే పడే తనవైపు రప్పించుకుంటుంది. ఆ కవితను చదివే క్రమంలో పాఠకుడు మరెంతో అధ్యయనం చేయవలసిఉంటుంది.

ఈ కవితనే చూడండి, ఈ కవితలోతుల్లోకి ప్రయాణించాలంటే సువార్తలు చదివిఉండాలి, క్రీస్తు పడ్డ వేదనని మనమెంతో కొంత ఊహించగలిగిఉండాలి. క్రీస్తు గురించి పాశ్చాత్యకవులు, చిత్రకారులు ఎటువంటి తమకై తాము ఏ విధంగా వ్యాఖ్యానించుకున్నారో ఎంతో కొంత అవగాహన వుండాలి. ముఖ్యంగా కవి తన తక్కిన కవిత్వంలో క్రీస్తు గురించి ఏం చెప్పాడు, ఈ కవితలో ప్రత్యేకంగా ఏం చెప్పాడో వివేచించి వింగడించగలగాలి. ప్రతికవీ తన యుగధర్మాన్ని, దృక్పథాన్నీ ఎంతో కొంత ప్రకటిస్తాడనుకుంటే, ఈకవితలో కవి చూపించిన ఆధునికత ఏమిటో గుర్తుపట్టగలగాలి. గొప్పకవులు తాము జీవిస్తున్న కాలాన్ని దాటి కవిత్వం చెప్తారనుకుంటే, ఈ కవితలో కవి ఆధునికతను దాటి ముందుకు పోయి ఏమి చెప్పగలిగాడో చూడగలగాలి.

యూరోప్ లో రొమాంటిసిజం భారతదేశంలో ఆధునిక యుగానికి కారణమైనప్పుడు మొదటితరం కవులు ప్రబోధకవిత్వం రాసారు. బంకింబాబు, టాగోరు, రాయప్రోలు, గురజాడ, భారతి, శ్రీశ్రీ ఆ యుగధర్మాన్ని ప్రతిబింబించిన కవులు. భారతీయ కవిత్వంలో 1950 తర్వాత పరిస్థితి మారింది.మానవుణ్ణి సర్వశక్తిమంతుడిగా కీర్తించడం కేవలం డంబం మాత్రమేనని కవి గుర్తించాడు. మానవుడి శక్తతని ప్రకటించడంలోకన్నా అతడి అశక్తతని ప్రకటించడంలో ఎక్కువ నిజాయితీ ఉందని ముందు గుర్తుపట్టినవాడు ముక్తిబోధ్. తెలుగులో ఆ పనిచేసినవాడు బైరాగి.

ఆధునిక తెలుగు కవిత్వం క్రీస్తునొక మానవాతీత ప్రతీకగా చిత్రించడంలో ఆసక్తి చూపించింది. కాని బైరాగి క్రీస్తు జీవితంలోని అశక్తక్షణాల్ని పట్టుకున్నాడు. ఆ అశక్తక్షణాల్లో, క్రీస్తు కూడా మనలానే మామూలు మనిషిగా భావించిన క్షణాల్లో అతడి మనోవేదన ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు. ఆ విధంగా ఆయన ఆధునికయుగలక్షణం నుంచి చాలా అడుగులు ముందుకు వేసి ఇప్పటికి కూడా మనకి ఎంతో కొత్తగా, సమకాలీనంగా కనిపించే కవితను నిర్మించాడు.

ఒక కవితనెలా నిర్మించాలో తెలుసుకుందామనుకునే జిజ్ఞాసులకి ఈ కవిత ఎప్పటికీ నివ్వెరపరిచే ఒక నమూనా.

7-12-2013

arrow

Painting: The Artist with Yellow Christ, 1938, Marc Chagall

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s