ఎర్రక్రీస్తు-2

315

గతవారం బైరాగి ‘ఎర్రక్రీస్తు’ కవితమీద నా ఆలోచనలకు ప్రతిస్పందించిన మిత్రులందరికీ నా అభినందనలు. అయితే ఆ కవితమీద, నా వ్యాఖ్యానం మీద కొందరు మిత్రులు ప్రకటించిన సందేహాలకు కొన్ని వివరణలు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను.

మొదట, కట్టా శ్రీనివాస్. కవితలో దేళం అనే పదం టైపొ. అది దేవళం అని ఉండాలి. ప్రతి అయిదు లైన్లకీ నంబరు నేను ఇచ్చాను. కవిత గురించి వ్యాఖ్యానించడానికి పంక్తులన్నీ మళ్ళీ పేర్కోనవసరం లేకుండా నంబర్లు ఇవ్వడమనేది పాఠ్యపుస్తకాల్లో పాటించే పద్ధతి. అయితే శ్రీనివాస్ లేవనెత్తిన ముఖ్యమైన సందేహం: ‘సందర్భంపై అవగాహన లేకుండా నిజంగా కేవలం కవి అక్షరాల్లో చూపించినంతవరకే చదువుకుని కవిమనసుపట్టుకోవడం కుదురుతుందా?’. మరోమాట: ‘నావరకు నేను ఇదే కవితను ఎక్కడన్నా సరాసరి చదివితే ఆస్వాదించ లేకపోయేవాడిని’ అని. ఒక కవిత చదవగానే సరాసరి మనకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పలేం. భాషాపరమైన, అన్వయపరమైన క్లిష్ట తలే కాక, భావపరమైన క్లిష్టతకూడా ఉంటుండి. కాని ఒక కవిత చూడగానే, మొదటిపఠనంలోనే మనల్ని ఆకట్టుకోవడానికి క్లిష్టత అడ్డురాదు. అలా ఆకట్టుకోడానికి కారణాలు ఇతమిత్థంగా చెప్పలేం. కనీసం నా వరకూ ఈ కవిత శీర్షిక నన్నట్లా ఆకట్టుకుంది.

అలా కవితలో ఒక అంశం మనల్ని ఆకట్టుకున్నతరువాత తిరిగి తిరిగి ఆ కవితను సమీపిస్తున్నప్పుడు ఆ కవితలోని తక్కిన అంశాల్ని బోధపర్చుకునే ప్రయత్నం చేస్తాం. అందుకనే ఒక కవిత చదవగానే నీ తోటిమిత్రుడు, సహృదయుడు ఎట్లా స్పందించాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగేది. కొన్నిసార్లు వ్యాఖ్యాతల్లేకుండా కవితను నేరుగా పాఠకుడు అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ అంతటివాడే ఆముక్తమాల్యదను అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యాతలు తప్పనిసరి అని పదే పదే అన్నాడు. కాబట్టి ఒక కవిత చదివిన వెంటనే సందర్భం,సారాంశం బోధపడాలనేమీ లేదు.

ఇక భాస్కర్ కొండ్రెడ్డిగారు. ఈ కవిత క్రీస్తు స్వగతమని ఎట్లా నిర్ణయిస్తారు, ఇది ఒక శ్రామికుడు స్వగతం లాగా కనిపిస్తున్నదన్నారు. ‘కరుకుకేల, మొరకు బ్రతుకు నెత్తుటి చెమటల తీర్థం, మూడుఢను-, నా కండలు తిండికాగ, నా రుధిరం మధువుకాగ, నా అశక్తదాహం ఇలాంటివన్ని శ్రామికుని అంతరంగాన్నే పట్టిస్తున్నట్లున్నాయి’ అని రాసారు. నిజమే ఈ మాటలు శ్రామికుడికి కూడా వర్తించేవే. కాని ఇందులో కొన్ని పదాలు, ప్రస్తావనలు క్రీస్తు జీవిత సంఘటనలకు మాత్రమే పొసగే ప్రయోగాలు.

‘మూడుమారులు కోడికూసి
ద్రోహపు నల్లని పొద్దు భళ్ళున పొడిచిన వేళ ‘

‘నేనిచ్చే ప్రాణం తప్ప నీవిచ్చే దానం గుర్తించని నేను
‘దేవా! నీవెక్కడ?’ అని అరచానేగాని..’

‘కంటక మకుట శూలాగ్రాల, రోజాలు రాజసంగా మొగ్గలిడగా
కాళుల, కేళుల కమ్మని కెందమ్ములు భగ్గుమనగా..’

ఇవి కేవలం ఒక శ్రామికుడికి మాత్రమే వర్తించే పదాలు కావు.

అయితే భాస్కర్ గారి అనుమానం: ‘క్రీస్తు గురించైతే,.. మూడుఢను, పిరికి లాంటి పదాలను వాడివుండేవారు కాదేమో అనిపించింది.’

నా వరకూ ఈ కవితలోని అత్యంత ఆకర్షణీయమైన విశేషమిదే అనిపించింది. ఈ పదాల ద్వారా కవి క్రీస్తును మానవీకరిస్తున్నాడు. ఈ అంశం మీద రామారావు కన్నెగంటి ఇలా అంటున్నారు:

As per the tender relationship with God, and the humanization of God — that is a poet’s prerogative that was exercised often in the east and not so often in the west. From sufism to Vaishnavite tradition, that is common enough that a whole genre of poetry evolved. In the west, in medieval ages, the concept of marrying Christ (brides of Christ — what nuns were called) existed, but that did not lead to humanization of Christ. That waited until the modern humanistic traditions evolved that appropriated Christianity by humanizing Christ.

ఇక్కడ ‘పిరికీ, ‘మూఢుడను’, ‘అజ్ఞుడను’ లాంటి పదాల్ని మనం వాచ్యంగా తీసుకోగూడదు. ఆ పదాల్లో అపారమైన ధ్వని ఉంది. ఉదాహరణకి ‘పిరికిగా’ అనే పదప్రయోగం వెనక ఉన్న భావావేశం గురించి నేను గతవారమే రాసాను. అయినా ఆ పదం గురించి రాయవలసింది ఇంకా చాలాఉంది.

ప్రేమోద్రిక్త క్రోధంతో; అక్కడ కూడా
ఆ బంగరు పంజరంలో కూడా
నీవు విధిగా ఉండి తీరాలని శాసించాను.
లోలోన పిరికిగానే అశించాను.

అంటున్నప్పుడు కవి ఉద్దేశ్యం ఆ బంగరుపంజరంలో కూడా దైవం ఉండవచ్చునేమో అనే బలహీనమైన ఒక ఆశ. అటువంటి ఆశ క్రీస్తు ఎక్కడా బాహాటంగా వ్యక్తం చెయ్యలేదు. పైగా ఆయన ధనపిశాచీ, దైవం వేరువేరనే (లూకా:16:13) భావించాడు. ధనం లేకుండా నిజజీవితవ్యవహారం సాగదంటే, సీజరువి సీజరుకీ, దేవుడివి దేవుడికీ అర్పించండి (లూకా, 20:25) అన్నాడు. ఒక పౌరుడిగా తను పన్ను కట్టవలసివచ్చినప్పుడు తనకోసం దేవుడు ఒక చేపనోట్లో నాణేం సిద్ధంగా వుంచుతాడని భావించాడు. (మత్తయి, 17:24-27). పన్నువసూలు చేసే సుంకరుల్ని ఆయన దగ్గరచేర్చుకోలేకపోయాడు. ఇద్దరు సోదరుల మధ్య అంగీకారం సాధించుకోవడం గురించి చెప్తూ, ఎంత ప్రయత్నించినా సమన్వయానికి లొంగని సోదరుణ్ణి ఒక సుంకరిగా భావించి విడిచిపెట్టెయ్యంటాడు. (మత్తయి: 18:15-17).

కాని కవి ఇక్కడ క్రీస్తు మనసులో ధనికవర్గం పట్ల కూడా సానుభూతి ఉందన్నట్టుగా ఒక ఊహ ప్రతిపాదిస్తున్నాడు. సహజంగా దోపిడీమీదా,దురాశమీదా ఆధారపడ్డ ధనికవర్గం కూడా దైవానుగ్రహానికి నోచుకోవచ్చేమో అన్న ఊహ అది. లూకా సువార్తలో క్రీస్తు చెప్పిన ఒక కథలో లౌకికంగా చాతుర్యం చూపించిన ఒక గుమాస్తా గురించి చెప్తూ (లూకా: 16:1-13) For the sons of this world are more shrewd in their generation than the sons of light అన్నాడు. ఈ వాక్యాలు బైబిల్ వ్యాఖ్యాతల్ని యుగాలుగా కలతపెడుతున్నాయి. ఏమిటి దీని అర్థం? క్రీస్తు ఒక మోసకారి గుమస్తాని ఒక ఆదర్శనమూనాగా చూపిస్తున్నాడా?

కాని సువార్తలు నిశితంగా చదివినప్పుడు క్రీస్తు భావాలు మనకి స్పష్టంగా బోధపడతాయి. క్రీస్తు యూదులకి ప్రేమ, శాంతి సందేశాలు తీసుకువచ్చాడు.

అది కూడా ముఖ్యంగా బీదవాళ్ళూ, నిస్సహాయులూ, సంఘం నుంచి బహిష్కరించబడ్డవాళ్ళూనూ. వాళ్ళతో పాటు ఆ యూదుసమాజంలో వాళ్ళని పాలిస్తున్న రోమన్లూ, వివిధజాతులకు చెందిన అన్యదేశీయులూ, యూదులు తక్కువగా చూసే సమరయులూ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటే క్రీస్తును జీవితమంతా ద్వేషించిన పరిసయ్యులూ, సద్దుకయ్యులూ, క్రీస్తుతో సంబంధంలేని యూదుధనికులూ కూడా ఉన్నారు.

క్రీస్తు చాలా సార్లు గమనించిందేమిటంటే, తాను ఏ యూదుల మంచికోసం బోధిస్తున్నాడో ఆ మాటల్ని యూదులకన్నా కూడా రోమన్లూ, అన్యజాతీయులూ, సమరయులూ ఎక్కువ విశ్వసించడం. తన బిడ్డను స్వస్థపరచమని అడిగిన రోమన్ సైనికుణ్ణి ఉద్దేశించి (మత్తయి: 8:5-13) క్రీస్తు ఇలా అన్నాడు:

Truly I tell you, I have not found anyone in Israel with such great faith. I say to you that many will come from the east and the west, and will take their places at the feast with Abraham, Isaac and Jacob in the kingdom of heaven. But the subjects of the kingdom will be thrown outside, into the darkness, where there will be weeping and gnashing of teeth. Go! Let it be done just as you believed it would.

మరొకచోట క్రీస్తుకూ, ఒక అన్యజాతీయురాలికీ మధ్య జరిగిన సంభాషణ ( మత్తయి: 15:21-28) మనల్ని నివ్వెరపరుస్తుంది.

తన బిడ్డని స్వస్థపరచమని అడిగిన ఒక సైరోఫొనీషియన్ స్త్రీని అక్కణ్ణుంచి పంపెయ్యమంటాడు క్రీస్తు. తాను కేవలం తప్పిపోయిన ఇజ్రాయేలీలకే తప్ప మరెవరికీ స్వస్థత చేకూర్చలేనంటాడు. చాలా కటువైనమాటల్లో It is not appropriate to take the children’s bread and throw it to the dogs అంటాడు. అంటే యూదులు మాత్రమే తన పిల్లలనీ తక్కినవాళ్ళు కారనీ ఆయన భావం. ఆ మాటలకి ఆ స్త్రీ ఇచ్చిన సమాధానం మనకి అచ్చెరువు కొల్పుతుంది. ఆమె అంది కదా Yes, Lord, but even the dogs eat the crumbs which fall from their masters’ table అని. ఆ మాటలకి, ఆ మాటల్లో కనబడుతున్న విశ్వాసానికి క్రీస్తు నివ్వెరపోయి Woman, great is your faith! Be it done to you even as you desire అని అనకుండా ఉండలేకపోతాడు. ఇటువంటి ఉదాహరణలే సమరయుల్లో కూడా ఆయన చూసాడు.

ప్రేమోద్రిక్త క్రోధంతో; అక్కడ కూడా
ఆ బంగరు పంజరంలో కూడా
నీవు విధిగా ఉండి తీరాలని శాసించాను.
లోలోన పిరికిగానే అశించాను.

అని అంటున్నప్పుడు కవి మనసులో ఇటువంటి ఊహలే ఉన్నాయి. ఒక మనిషి బీదవాడైనంతమాత్రాన దైవానుగ్రహానికి అర్హుడు కావచ్చేమోగాని దాన్ని నిలుపుకోవాలంటే విశ్వాసం తప్పనిసరి. అటువంటి విశ్వాసాన్ని కనపరిచినప్పుడు రోమన్లూ, సమరయులూ, అన్యజాతీయులూ దైవానుగ్రహపాత్రులైనట్టే, ధనికులు మాత్రం ఎందుకు కాకూడదు?

లోలోన పిరికిగానే అశించాను

అంటే ఇంత అర్థముంది.

భాస్కర్ కొండ్రెడ్డిగారు చెప్పినట్టు దీనివెనుక కమ్యూనిష్టు భావజాల నేపథ్యం కూడా ఉందనుకోవచ్చు. 50-60 ల మధ్యలో తెలుగు సాహిత్యంలో అభ్యుదయోద్యమం బలంగా వికసించిన కాలం. ఆ రోజులంతటా సాహిత్యంలో ధనికుల్ని ద్వేషించే ధోరణి ప్రబలంగా ఉండేది. బహుశా ఆ ధోరణిని సున్నితంగా మందలించడానికి కూడా బైరాగి ఈ కవితలో ప్రయత్నించి ఉండవచ్చు.

ఇలాగే ‘మూఢుడను’, ‘అజ్ఞుడను’ లాంటి పదాలను కూడా బైబిల్ నేపథ్యంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

మిత్రుల ప్రతిస్పందనలవల్ల ఈ కవిత మళ్ళా కొత్తగా, మరింత భావస్ఫోరకంగా కనిపిస్తోంది. అందుకు వారికి మరోమారు కృతజ్ఞతలు.

14-12-2013

Leave a Reply

%d bloggers like this: