ఎమోషనల్ బ్లాక్ మెయిల్-2

Reading Time: 3 minutes

318

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒక మానసిక వైపరీత్యం. మామూలుగా మనం మన స్నేహితులమీద అలగడానికీ, దెప్పిపొడవడానికీ, మామూలుగా దాంపత్యజీవితాల్లో సంభవించే పోట్లాటలకీ బ్లాక్ మెయిల్ కీ తేడా ఏమిటంటే, రెండోది ఒక ధోరణిగా, pattern గా మారిపోవడం. చిన్న చిన్న అలకలు పూనినప్పుడల్లా అవి వెంటనే ఆశించిన ఫలితాలు ఇవ్వడం చూసి పదే పదే అలకపూనుతుంటే అదొక ధోరణిగా మారిపోవడం బ్లాక్ మెయిల్ అవుతుంది. ఒకసారంటూ ఈ ధోరణిని మనం గురించాక దాన్ని పరిష్కరించుకోవడం మన చేతుల్లోనే ఉంటుందంటుంది సుసాన్.

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి ఎట్లా ప్రతిస్పందించాలి?

మన మానసిక ఆరోగ్యాన్నీ, మన ఇంటెగ్రిటీని కాపాడుకొవడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని నిలవరించడం అవసరం. అందుకు కొన్ని పద్ధతులు సూచించింది ఫార్వార్డ్. మీ సన్నిహితులు మిమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసేటప్పుడు సాధారణంగా ఇట్లా అంటూంటారు:

  • నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను బతకలేను.
  • నువ్వు మళ్ళా నన్ను పూర్వంలాగా చూడలేవు.
  • నువ్వు మారకపోతే ఈ కుటుంబం నాశనమైపోతుంది.
  • మళ్ళా మీ ముఖం చూడను, మీ పిల్లలు మీకు దక్కరు.
  • నువ్వికెంత మాత్రం నా కొడుకువి కావు/నా స్నేహితుడిగా ఉండలేవు/నా ప్రేమ నీకు దొరకడం అసాధ్యం.
  • నేను డిప్రెషన్ లో కూరుకుపోతాను
  • నేన్నిన్ను వదిలిపెట్టను.
  • పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి
  • నువ్వు చేసిందానికి తప్పకుండా అనుభవిస్తావు.

ఇట్లాంటి వాక్యాలు మనని సహజంగానే చాలా గాభరా పెడతాయి. కాని అట్లాంటి వాక్యాలు విన్నప్పుడు మనమిట్లా ప్రతిస్పందించాలంటుంది ఫార్వర్డ్:

  • నువ్వు ఏం చేస్తావనేది నీ ఇష్టం.
  • నువ్వట్లా చెయ్యవనే ఆశిస్తాను, కాని నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదు.
  • నువ్విప్పుడు చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించు, బహుశా నువ్వప్పుడు మరోలా ఆలోచిస్తావేమో.
  • నువ్వు బాధపడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కాని కొద్దిగా స్తిమితంగా ఉన్నప్పుడు మరోసారి ఆలోచించు.
  • నన్ను మరోసారి ఆలోచించుకోనివ్వు,
  • నువ్విలాగే మాట్లాదుతుంటే మనం ముందుకు పోలేమనుకుంటాను.
  • బహుశా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు.
  • బహుశా నువ్వు చూసే పద్ధతి అది కావచ్చు.

అలాగే మనల్ని ఎమోషనల్ గా బాధపెట్టేటప్పుడు మన సన్నిహితులు మన మీద ప్రయోగించే ఆయుధం నింద. నింద (బ్లమె) కనబడని నిప్పులాంటిది. అది మనల్ని తెలీకుండానే దహిస్తుంది. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒకచోట ఏమనిరాసాడంటే మననెవరయినా నిందించినప్పుడు మనకెందుకు బాధకలుగుతుంటే, ఆ నిందను విన్నప్పుడు మనలో అటువంటి లక్షణాలేవో ఉన్నాయనే భావం మనల్ని కొన్ని క్షణాలేనా ఆవహిస్తుందని. నింద మన లోపలి వ్యక్తిత్వాన్ని పట్టి గుంజుతుంది. మనల్ని బాధపెట్టే మాటలిట్లా ఉంటాయి:

  • నువ్వు నన్నిట్లా ఎలా బాధపెట్టగలిగావు?
  • నువ్వు నా జీవితాన్నెందుకు నాశనం చేస్తున్నావు?
  • నువ్వెందుకింత స్వార్థంగా/మొండిగా/మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు?
  • నీకేమయింది?
  • నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు?
  • నన్నెందుకు బాధపెట్ట్లానుకుంటున్నావు?
  • ఈ గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నావెందుకు?

ఇట్లాంటి నిందల్ని చాలా స్తిమితంగా ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు మనం, చెప్పవలసిన సమాధానాలు ఇలా ఉంటే మంచిది:

  • నేనిట్లా చెప్పడం నీకు సంతోషంగా ఉండదని నాకు తెలుసు, కాని మరో మార్గం లేదు.
  • ఇక్కడెవరూ శత్రువుల్లేరు. విషయమల్లా నువ్వూ నేనూ వేరువేరుగా చూస్తున్నామంతే.
  • ఇందులో నా బాధ్యత కేవలం 50 శాతం మాత్రమే.
  • మన దృక్పథాలు వేరు వేరు గా ఉన్నాయి.
  • నువ్వు బాధపడుతున్నందుకు నాకు బాధగా ఉంది. కాని ఒక్కసారి నా స్థానంలో ఉండి చూడు.

మన సన్నిహితులు మనల్ని ఎమోషనల్ గా బాధపెట్టేటప్పుడు మనల్ని నిందించడం, మనతో తగాదా పడటం, పోట్లాడటం ఒక తరహా అయితే, వాళ్ళు మనతో మౌనంగా సాగించే బ్లాక్ మెయిల్ మరో తరహాది. ఎదుర్కోవడానికి మరింత కష్టమైనదీను. సుసాన్ చెప్పేదాన్నిబట్టి మౌనంగా చేసే బ్లాక్ మెయిల్ ని చాలాసార్లు మనం ఎదుర్కోలేం కూడా. అందుకని అట్లాంటి సన్నిహితులతో మనం చెయ్యకూడనవీ, చెయ్యవలసినవీ అంటూ రెండు జాబితాలు ఇచ్చిందామె.

మనల్ని మౌనంగా వేధించేవారి పట్ల మనం చెయ్యకూడనివి:

  • వాళ్ళే ముందడుగు వేసి సమస్యని పరిష్కరించుకుంటారని అనుకోవద్దు.
  • వాళ్ళు పొరపాటుపడుతున్నారని వాళ్ళకి మరీ మరీ చెప్పాలనుకోవద్దు.
  • వాళ్ళు మీవైపు తమంతతాముగా చూస్తారనీ, మీకు ప్రతిస్పందిస్తారనీ అనుకోవద్దు.
  • వాళ్ళ నడవడికనీ, ఉద్దేశ్యాల్నీ, వారు మీతో సూటిగా ఉండలేకపోతున్నారన్నదాన్నీ విశ్లేషించకండి, వివరించకండి.
  • వాళ్ళకీ, మీకూ మధ్య వాతావరణం బిగుసుకుపోయిందని భయపడకండి.
  • మీరు అయోమయానికో, గందరగోళానికో లోనయ్యి మీ మనసులో లేని మాటలు మాట్లాడకండి (ఉదాహరణకి: నిజంగా నీ మనసులో ఏముందో చెప్పకపోతే నేన్నితో ఎప్పటికీ మాట్లాడను)
  • అన్నిటికన్నా ముఖ్యం, వాళ్ళొకవేళ తమ తప్పు తెలుసుకుని మీకు సారీ చెప్పారనే అనుకోండి, ఆ మరుక్షణం నుంచీ వాళ్ళు మారిపోతారనుకోకండి.
  • మనుషుల ప్రవర్తనలో మార్పు రావచ్చు గానీ, వ్యక్తిత్వాలు అంత తేలిగ్గా మారవు.

మనల్ని మౌనంగా వేధించేవాళ్ళ మనం అనుసరించవలసిన వైఖరిలో మనం చెయ్యదగ్గ పనులు:

  • మీరు అవసరమైతే తమని వదిలిపెట్టెయ్యగలరనీ, లేదా బాధపెట్టగలరనీ తెలిసిన వాళ్ళతో మీరు మెలుగుతున్నారని గుర్తుపెట్టుకోండి.
  • వాళ్ళు తమ భావావేశాల తీవ్రత నుంచి బయటపడి మీరు చెప్పేది వినగలరనుకున్నప్పుడే మీరు వాళ్ళకు చెప్పేది చెప్పడానికి ప్రయత్నించండి.
  • మీగురించి వాళ్ళేమనుకుంటున్నారో నిస్సంకోచంగా చెప్పవచ్చనీ చెప్పండి.
  • కొంత యుక్తిగా ప్రవర్తించండి.
  • వాళ్ళ ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తున్నదని చెప్పడానికి మొహమాట పడకండి, కాని ముందు కొంత మంచిమాటలతో, వాళ్ళల్లో సుగుణాలు ఎత్తి చూపుతూ చెప్పడానికి ప్రయత్నించండి.
  • కాని వాళ్ళ ప్రవర్తనలో మిమ్మల్నేది బాధపెడుతున్నదో దాన్ని మాత్రం మర్చిపోకండి.
  • మీరు బాధపడుతున్నాని చెప్పడం మొదలుపెట్టగానే వాళ్ళు మీమీద విరుచుకుపడతారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ బాధని వాళ్ళు వాళ్ళ మీద నిందగా భావించడానికి అలవాటు పడిపోయారు.
  • మీ మధ్య గడ్డకట్టుకున్న మౌనాన్ని చాలాసార్లు మీరే ఛేధించవలసి ఉంటుంది.
  • కొంత పరిష్కారం కాలానికి కూడా వదిలిపెట్టండి.

అయితే ఇవన్ని చిట్కాలు మాత్రమే. కొన్ని సంబంధాల నుంచి మనం వెంటనే తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు, అవి వేధించే సంబంధాలుగా మారినప్పుడు, అవి మన మనసులో ఫాగ్ సృష్టిస్తున్నప్పుడు, తీరుబడిగా ఇటువంటి చిట్కాలగురించి ఆలోచించడం కష్టం. కాని ఇటువంటి సూచనలు వాస్తవ పరిశీలనలమీద ఆధారపడ్డవని మనం గుర్తుపెట్టుకుంటే మనకొక దారి దొరకకపోదు.

మనం కూడా బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నప్పుడు

సుసాన్ ఫార్వర్డ్ పుస్తకం చాలావరకు పాఠకదృక్పథం నుంచి రాసింది. అంటే ఆ పుస్తకం చదువుతున్నవాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి లోనవుతున్నట్టుగా భావించుకుని చదువుకునే పుస్తకం.కాని వాస్తవానికి మననెవరో వేధిస్తునారన్న నిజంకన్నా మనమే చాలా సార్లు మన సన్నిహితుల్ని ఎమోషనల్ గా వేధిస్తుంటామన్నది మరింత నిజం. మనకు తెలియకుండానే మనం కూడా చాలాసార్లు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్నామని ఈ పుస్తకం చదువుతుంటే మనకే అడుగడుగునా తెలుస్తూంటుంది. మనలో మనకు తెలీకుండానే తలెత్తుతున్న ఆ ధోరణి ఎంతో అమానుషమయిందనీ, మనం దాన్నుంచి బయటపడాలనీ ఈ పుస్తకం మనకి పరోక్షంగా హెచ్చరిక చేస్తూంటుంది.

మానవసంబంధాల్లో అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమయింది పొస్సెస్సివెనెస్స్. జీవితమంతా చలంగారు తన రచనలద్వారా దీనే ఎత్తిచూపి ఎండగట్టడానికి ప్రయత్నించారు. ఒక వైపు అభ్యుదయవాదులు ప్రొపెర్త్య్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే చలంగారు అసలు possessiveness నే వ్యతిరేకిస్తూ పోరాటం చేసారు. పొసెసివెనెస్ కి మరో రూపమే పెత్తనం చెయ్యాలన్న భావన.మన పెత్తనానికి లోబడని వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి మనం చేపట్టే అనేక సాధనాల్లో వాళ్ళని ఎమోషనల్ గా వేధించడం కూడా ఒకటన్నదే ఈ పుస్తకం మనకి కలిగించే గొప్ప మెలకువ.

25-4-2014

Leave a Reply

%d bloggers like this: