ఎమోషనల్ బ్లాక్ మెయిల్-1

Reading Time: 4 minutes

317

ఒకప్పుడు మన సమాజాలూ, మన సంబంధాలూ చాలా సరళంగా ఉండేవి. మనం గ్రామీణసమాజాలుగానూ, సమష్టికుటుంబాలుగానూ ఉన్న రోజుల్లో మనకి కావలసిన ధైర్యం, మానసికమైన ఓదార్పూ, శాంతీ కుటుంబపరిథిలోనే లభించేవి. కాని గ్రామాలనుంచి నగరాలకీ, ఇప్పుడు నగరాలనుంచి ప్రపంచమంతటా పయనించకతప్పని పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎందరో కొత్తవ్యక్తులు, కొత్త సంబంధాలూ, అనుబంధాలూ ప్రవేశించక తప్పని పరిస్థితి. ప్రతి కొత్త పరిచయం స్నేహంగానూ, కొద్దికాలంలోనే ప్రేమగానూ మారడం కూడా చాలామందికి అనుభవంలోకి వచ్చిన విషయమే.ఆ ప్రేమలవల్లా, స్నేహాలవల్లా మనకి కొత్త రెక్కలొచ్చినట్టూ, మనమొక కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నట్టూ అనిపించడం కూడా మనలో చాలామందికి అనుభవమే. కాని చాలాసార్లు ఆ ప్రేమలు అందమైన అనుభవాలుగా మిగలకుండా భయానకమైన ద్వేషాలుగా మారడం, మన మానసిక ప్రశాంతిని దెబ్బదీయడం, మన వికాసానికి అడ్డుపడటం కూడా మనకి అనుభవంలోకి వస్తున్నదే. ప్రేమ ద్వేషంగా మారే రాక్షససందర్భాల్లో మనమేం చెయ్యాలో మనకి తెలియదు. అసలు నిన్నటిదాకా ఎంతో ప్రేమాస్పదంగా, ఆరాధనీయంగా, సమ్మోహకరంగా కనిపించిన వ్యక్తి ఉన్నట్టుండి వికృతంగా ఎందుకు కనిపిస్తున్నాడో లేదా కనిపిస్తున్నదో మనకి అర్థం కాదు. మనం ఆ అనుబంధాన్ని కొనసాగించలేకా, వదులుకోలేకా పడే నరకయాతననుంచి మనల్ని మనమెలా బయటపడేసుకోవాలో కూడా తెలియదు.

ఇట్లాంటి విషయాల్ని మనమెవరికీ చెప్పుకోలేం. చాలాసార్లు తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో అశక్తులుగా కనిపిస్తారు. మనకెటువంటి కష్టమొచ్చినా మనం మనసు విప్పిచెప్పుకోగల తోబుట్టువులో, స్నేహితులో, గురువులో ఇట్లాంటి సందర్భాల్లో మాత్రం మనల్నే తప్పు పడతారేమో అన్న భయం వల్ల చూస్తూ చూస్తూ ఈ విషయాల్ని మనం వాళ్ళతో పంచుకోడానికి సంకోచిస్తాం. కొన్నిసార్లు సైకియాట్రిస్టులో, ఫామిలీ కౌన్సిలర్లో ఈ సమస్యను వినగలరనుకుంటాంగానీ, వాళ్ళ దగ్గర మనకి తగినంత ఆర్ద్రతాస్పర్శ లభించదు.

కాని మనం గమనించవలసిందేమిటంటే, ఇట్లాంటి సందర్భాలనుంచి మనల్ని బయటపడవెయ్యగలిగేది మనకి మనమే. మనం చెయ్యవలసిందల్లా మనమెందుకు ఇట్లాంటి పరిస్థితిలో చిక్కుకున్నామో,మన మానసిక బలాలేమిటో, మన దౌర్బల్యాలేమిటో, మనలోంచి మనం శక్తినెట్లా తోడితెచ్చుకోవాలో చూసుకోవడమే.

మన స్నేహాలూ, ప్రేమలూ ద్వేషాలు గానూ, దుర్భరమైన మానసికహింసగానూ మారే ఒక పార్శ్వాన్ని చాలా ఆసక్తికరంగా పరిశీలించిన మనస్తత్వవేత్తల్లో సుసాన్ ఫార్వార్డ్ ఒకరు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో మనస్తత్వశాస్త్రంలో డాక్టరేట్ చేసారు. మానసికసమస్యలతో బాధపడేవారికి చికిత్స అందించడమే కాకుండా దక్షిణ కాలిఫోర్నియాలో ఎన్నో మానసిక, వైద్య సంస్థల్లో కూడా సేవలందించారు.

తాను చికిత్స చేసిన రోగుల్లో ఆమె ఎక్కువగా గమనించిన సమస్య వాళ్ళల్లో చాలామంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి గురికావడమే. మనుషులు ప్రేమనో, స్నేహాన్నో కోరుకుని ఒకరికొకరు సన్నిహితంగా మెలిగిన కొంతకాలానికి వాళ్ళ భాగస్వాములు, అదెవరైనా కావచ్చు-భర్త లేదా భార్య, ప్రియురాలు, స్నేహితుడు, స్నేహితురాలు, తన పై ఉద్యోగి లేదా కింద ఉద్యోగి- వాళ్ళల్లో ఒకరు మరొకరిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చెయ్యడానికి పూనుకోవడాన్ని ఆమె గమనించింది.తన పరిశీలన సారాంశాన్ని ఆమె Emotional Blackmail: When The People in Your Life Use Fear, Obligation and Guilt to Manipulate You (1997) అని పుస్తక రూపంలో వెలువరించింది. ఇందులో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో బ్లాక్ మెయిల్ ప్రక్రియని అర్థం చేసుకోవడమెట్లానో వివరించి, రెండవ భాగంలో మన అవగాహనని కార్యాచరణగా,అంటే చికిత్సగా మార్చుకోవడమెట్లానో వివరించింది. 50 Psychology Classics (2007) రచయిత టామ్ బట్లర్ బౌడన్ ఈ రచనని పరిచయం చేస్తూ ఒక్క మొదటిభాగానికే ఈ పుస్తకాన్ని నెత్తిమీద పెట్టుకోవచ్చనీ, ఇక రెండవభాగం మరింత విలువైందనీ అంటాడు. తన పుస్తకంలో ఫార్వార్డ్ చేసిన ప్రతిపాదనలేమిటో స్థూలంగా చూద్దాం:

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటే ఏమిటి?

మనకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు తాము కోరుకున్నట్టుగా మనం మసలకపోతే మనని ప్రత్యక్షంగానో పరోక్షంగానో శిక్షిస్తామని బెదిరించడం ఎమోషనల్ బ్లాక్ మెయిల్. వాళ్ళు మనతో ఏం చేసినా వాటన్నిటి సారాంశమూ ఒక్కటే: నేను కోరుకున్నట్టు నువ్వు చెయ్యకపోతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయనడమే.

ఎమోషనల్ బ్లాక్ మెయిల్లో ఇద్దరు భాగస్వాములుంటారు. ఒకరు బ్లాక్ మెయిల్ చేసేవారూ, రెండవది ఆ బ్లాక్ మెయిల్ కి టార్గెట్ గా, విక్టిమ్ గా ఉండేవాళ్ళూ. ఏ స్నేహితుడూ, స్నేహితురాలూ మొదటిసారే సరాసరి బ్లాక్ మెయిలర్ గా మారరు. వాళ్ళ విక్టిమ్ వాళ్ళ బెదిరింపులకి భయపడి వాళ్ళు కోరుకున్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టడంతో అవతలి వ్యక్తిలో బ్లాక్ మెయిలర్ బయటికొస్తాడు.

బ్లాక్ మెయిలర్లు ఏం చేస్తారు?

సాధారణంగా బ్లాక్ మెయిలర్లు తమ భాగస్వాముల పట్ల చూపే బెదిరింపులిలా ఉంటాయి:

  • నువ్వు నేను కోరుకున్నట్టు చెయ్యకపోతే నీకే కష్టం.
  • నేను కోరుకున్నట్టు ఉండకపోతే నాకూ నీకూ మధ్య ఎటువంటి సంబంధమూ ఉండదు.
  • నువ్వు నా అవసరాల్ని పట్టించుకోనప్పుడు నీ ఫీలింగ్సూ, నీ అవసరాలూ నాకు అనవసరం.
  • నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేను డిప్రెషన్ లో కూరుకుపోతాను, జీవితం నాకు శూన్యంగా ఉంటుంది, నేను బతకలేను.
  • నువ్వు నాకు నచ్చినట్టు చేసినప్పుడల్లా నువ్వెంతో అందంగా ఉంటావు, దేవుడిలానో, దేవతలానో ఉంటావు, నాకు ప్రాణం పోస్తావు.
  • నువ్విది చేస్తే నేన్నీకు అదిస్తాను

బ్లాక్ మెయిల్లో దశలు

ప్రేమానుబంధం బ్లాక్ మెయిల్ గా మారే క్రమంలో ఆరుదశలున్నయంటుంది ఫార్వర్డ్. అవి:

  1. కోరిక: అనుబంధంలో ఒకరు మరొకరినుంచి ఏదో ఆశించి బాహాటంగా ప్రకటిస్తారు.
  2. తిరస్కారం: ఆ రెండవవ్యక్తి ఆ కోరికని తిరస్కరిస్తారు.
  3. ఒత్తిడి: అప్పుడు ఆ మొదటివ్యక్తి ఆ రెండవ వ్యక్తి మీద ఒత్తిడి మొదలుపెడతాడు.
  4. బెదిరింపు: ఒత్తిడి బెదిరింపుగా మారుతుంది. తమ అనుబంధం తెగిపోకతప్పదనే హెచ్చరికగా మారుతుంది.
  5. తలవంచడం: అనుబంధాన్ని నిలుపుకోవడం కోసం రెండవవ్యక్తి ఆ కోరికకి తలవంచడం జరుగుతుంది.
  6. మళ్ళీ మొదలు: ఒకసారి రెండవ వ్యక్తి తన కోరికకి తలవంచడమంటూ జరిగాక మొదటివ్యక్తి మళ్ళా ఈ మొత్తం ప్రక్రియని మొదలుపెడతాడు, ఇలా పదే పదే జరిగి ఇదొక రాక్షస క్రీడగా మారిపోతుంది.

నాలుగు రకాల బ్లాక్ మెయిలర్లు

బ్లాక్ మెయిలర్లని ఫార్వార్డ్ నాలుగురకాలుగా గుర్తించింది.

  1. శిక్షించేవాళ్ళు: (నేను చెప్పినట్టు చెయ్యకపోయావో నిన్ను వదిలేస్తాను) ఈ తరహా బ్లాక్ మెయిలర్లు తమ భాగస్వాముల్ని మానసికంగానొఓ, భౌతికంగానో శిక్షించడానికి పూనుకుంటారు.
  2. తమని తాము శిక్షించుకునేవాళ్ళు: (దయచేసి నాతో వాదించకు, నేను కుంగిపోతాను) ఈ తరహా బ్లాక్ మెయిలర్లు తమని తాము శిక్షించుకుంటూ, తద్వారా వాళ్ళేమయిపోతారో అన్న భయం విక్టింఆ్‌శ్ లో కలగచేస్తారు.
  3. నలిగిపోయ్యేవాళ్ళు: ఈ తరహా బ్లాక్ మెయిలర్లు వాళ్ళు కోరుకున్నది మనం చెయ్యనప్పుడు తాము నలిగిపోతున్నట్టుగా, దుఃఖపడుతున్నట్టుగా మనకి కనిపిస్తారు. మనం చూడలేనంత కష్టపడుతున్నట్టుగా మనకి కనిపించి మన మీద ఒత్తిడి పెంచుతారు.
  4. ఊరించేవాళ్ళు: ఈ తరహా బ్లాక్ మెయిలర్లు మాయావులు. వీళ్ళు ముందుమనకొక సమ్మోహప్రపంచాన్ని ఆశగా చూపిస్తారు. అప్పుడు మననుంచి తామేమి కోరుకుంటున్నారో మనముందు పెడతారు. మనల్ని ఉవ్విళ్ళూరిస్తారు. ఒకసారి ఈ వలలో పడ్డాక మనం ఎప్పటికీ దాన్నుంచి బయటపడలేక గిలగిలా కొట్టుకుంటాం.

బ్లాక్ మెయిల్ కి లోబడినందువల్ల ఏం జరుగుతుంది?

బ్లాక్ మెయిల్లో చిక్కుకున్నవాళ్ళు అన్నిటికన్నా ముందు తమ మనోస్థైర్యాన్ని కోల్పోతారు.

  • తాము పనికిమాలినవాళ్ళమనీ, తమకెవరూ ఆసరా లేరనీ, సహజంగానే తాము చెడ్డవాళ్ళమనీ అనుకుంటారు.
  • తమ ఆలోచనల్నీ, అనుభూతుల్నీ సందేహించుకోవడం మొదలుపెడతారు.
  • ఒంటరివాళ్లయిపోతారు.
  • మానసిక అస్వస్థత వల్ల శారీరికంగా అస్వస్థులవుతారు.

Fear, Obligation and Guilt (FOG)

బ్లాక్ మెయిల్ కి లోబడినవాళ్ళ మనసుల్లో సంభవించే దాన్ని ఫార్వర్డ్ FOG అనే పదంతో సూచించింది. ఈ ఫాగ్ పొగమంచు మాత్రమే కాదు, ఫియర్, ఆబ్లిగేషన్, గిల్ట్ అనే మూడు మానసిక భావనల సమాహారం కూడా. బ్లాక్ మెయిల్ కి లోబడినప్పుడు మనలో అన్నిటికన్నా ముందు భయం పుడుతుంది. మనకెంతో ప్రియమైన అనుబంధాన్ని మనం కోల్పోనున్నామనీ, అందువల్ల ఈ ప్రపంచంలో మనం ఒంటరివాళ్ళం కాబోతున్నామనీ , మన జీవితానికి అర్థం లేకుండా పోతుందనీ భయం మొదలవుతుంది.

మామూలుగా మన స్నేహాల మనం చూపించే మర్యాద, కర్తవ్యం, విధేయత ఆరోగ్యప్రదంగానే ఉంటాయిగానీ, బ్లాక్ మెయిల్ కి లోబడిన తరువాత అవే మన పాలిట యమపాశాలుగా మారతాయి. మనం మన స్నేహంపట్లనో, అనుబంధం పట్లనో చూపవలసినంత శ్రద్ధ, విధేయతా చూపడం లేదని మన బ్లాక్ మెయిలర్ మనల్ని వేధించడం మొదలుపెడతాడు. చివరికి అది మన ఆత్మగౌరవాన్ని కూడా మనం పణం పెట్టి అతడి కోరికలకి తలఒగ్గడందాకా దారితీస్తుంది.

మనం మన స్నేహాలపట్లా, సామాజికసంబంధాల పట్లా బాధ్యతా ఉండటానికి అవసరమైన గిల్ట్ ని బ్లాక్ మెయిలర్ తనకి అనుకూలంగా వాడుకోవడానికి చూస్తాడు. మనం అతడిపట్ల చూపించవలసిన శ్రద్ధ చూపించలేకపోతున్నామనే భావన మనలో కలగచేసి తద్వారా మనల్ని అపరాధభావనకు లోనయ్యేలా చేస్తాడు. ఇలా మొదట భయం, తద్వారా, అనుబంధాన్ని కాపాడుకోవాలనే బాధ్యత, ఆ బాధ్యతని సరిగ్గా నిర్వహించుకోలేకపోతున్నామేమో ననే అపరాధభావం కలిసి మన మనసుల్లో ఒక ఫాగ్ ని సృష్టిస్తాయి.

మనం సమ్మతించకుండా బ్లాక్ మెయిల్ జరగదు

అయితే ఫార్వర్డ్ చెప్పే ముఖ్య విషయమేమిటంటే మనం సమ్మతించకుండా మనం బ్లాక్ మెయిల్ కి లోను కాలేమని. మన బాల్యంలోనో, ఎప్పుడో మనలో పేరుకున్న అభద్రతాభావనలవల్లనే మనకు తెలియకుండానే మనం బ్లాక్ మెయిల్ కి సహకరిస్తామంటుంది ఆమె. ముఖ్యంగా ఈ కారణాల వల్ల:

  • ఎదుటి మనిషి మనల్ని ఆమోదించాలనే తీవ్రమైన కోరిక.
  • ఎదుటివాళ్ళు కోపగించుకుంటారేమోనని చెప్పలేని భయం.
  • ఏం చేసైనా సరే మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకోవడం.
  • ఎదటివాళ్ళ జీవితాల పట్లా అవసరాన్ని మించి బాధ్యత తీసుకోవడం.
  • తన పట్ల తనకి నమ్మకం లేకపోవడం.

బ్లాక్ మెయిల్ వల్ల ఏం జరుగుతుంది?

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ప్రాణాంతకం కాదుకానీ, ఆత్మహింసాత్మకం. అది మనలోని అత్యంత విలువైన సత్యసంధతకి తూట్లు పొడుస్తుంది. మన విలువల్ని మనమే సందేహించుకునేలా చేస్తుంది. మనుషులమీదా, మానవత్వం మీద నమ్మకం పోగొడుతుంది. స్నేహాల పట్ల మనం మునుపటిలా నిష్కపటంగా ఉండలేనట్లుగా మనల్ని మార్చేస్తుంది.

ఈ మానసిక వైపరీత్యంనుంచి బయటపడటానికి ఫార్వర్డ్ సూచించిన మార్గాలు పుస్తకంలో రెండవ భాగం. అందులో ఆమె చెప్పిందో మళ్ళీ చూద్దాం.

22-4-2014

Leave a Reply

%d bloggers like this: