అనాసక్తి యోగం

377

సోమవారం మధ్యాహ్నం. పొద్దుణ్ణించీ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్న రాజఘాట్ కి వెళ్ళేటప్పటికి నడిమధ్యాహ్నమైపోయింది. ఎర్రటి ఎండ. చాలా ఏళ్ళ తరువాత మళ్ళా అడుగుపెట్టాను ఆ ప్రశాంత ప్రాంగణంలో. అక్కడ లానుల్లో గడ్డి చదును చేస్తున్న రొట్టవాసన. ఒకపక్క నిండుగా వికసించిన గన్నేరు పూల చెట్టు. సందర్శకులకోసం అక్కడ దారంతా నీళ్ళతో తడుపుతున్నారు. అడుగుపెడితే బొబ్బలెక్కిపోతుందన్నట్టున్న ఆ ఎండలో, ఎవరో ఇద్దరు ముగ్గురు విదేశీయులు, సాక్సు కూడా తీసేసి మరీ , అడుగులేస్తున్నారు. సమాధి దగ్గర ఎర్రగా జ్వలిస్తున్న దీపం. బీహారు నుంచి వచ్చిన కొన్ని గ్రామీణ కుటుంబాలు ఆ ఎండలోనే మహాత్ముడికి మనసారా నమస్కరిస్తున్నారు.

సమాధి ప్రాంగణం ఎదురుగా వాహనాలు పార్కింగు చేసే చోట ఇప్పుడొక బస్ స్టాండ్, కేంటీన్, ఖాదీ విక్రయశాలలతో పాటు పబ్లికేషన్స్ సెంటర్ కూడా ఉన్నాయి. ఇవేవీ నేనింతకుముందు వచ్చినప్పుడు లేవు. పిల్లలు కూడా నాతో పాటు ఆ దుకాణంలో అడుగుపెట్టారు. ప్రమోద్ కి ‘డిస్కవరి ఆఫ్ ఇండియా’, అమృత కి ‘దస్ స్పోక్ గాంధి’ పుస్తకాలు కానుక చేసాను. అప్పుడు కనిపించింది, Bhagavad Gita According to Gandhi. ఇది 2014లో భారత ప్రధాన మంత్రి అమెరికా అధ్యక్షుడికి బహూకరించిన ఎడిషన్ అట. ప్రధానమంత్రి ఒబామాకి భగవద్గీత ఇచ్చాడని విన్నానుగాని, అది గాంధీజీ అనువదించి, వ్యాఖ్యానించిన భగవద్గీత అని నాకు తెలీదు. తక్షణమే ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాను.

‘అనాసక్తి యోగం’ గా ప్రసిద్ధి చెందిన ఈ పుస్తకం నా చేతుల్లోకి, చాలా ఏళ్ళ కిందటనే, నా పదిహేడో ఏట అడుగుపెట్టింది. నేను పెద్దాపురంలో డిగ్రీలో చేరినప్పటి మాట. అదంతా ఒక అగమ్యకాలం. జీవితం నేనూహించుకున్నట్టూ, ఆశించినట్టూ కాకుండా, నడిసముద్రంలో నావ మాదిరి దారితప్పడం మొదలైన రోజులు. అక్కడ ఒకరింట్లో వీథిగదిలో ఉండేవాణ్ణి. ఆ ఎదురుగా పెద్దాపురం సంస్థానం వారు బీదసాదలకోసం నడిపే ధర్మసత్రంలో భోజనం. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం విస్తారంగా చదివేవాణ్ణి. కాని, ఆ కథలూ,నవలలూ,కవిత్వం మధ్య, గాంధీగారి రచనల తెలుగు అనువాదాలు, కొన్ని ఇంగ్లీషు వ్యాసాలూ కూడా నాతో పాటే ఉండేవి. ముఖ్యంగా, జార్జి కాట్లిన్ రాసిన ‘గాంధీజీ అడుగుజాడల్లో’ అనే పుస్తకం. (ఆ పుస్తకం నా జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పిందో అదంతా నా ‘సత్యాన్వేషణ’ (2003) కి ముందుమాటలో రాసాను.) దాంతో పాటు భగవంతుడి గురించి గాంధీగారు రాసిన వ్యాసం కూడా. ఈశ్వరీయ చింతనలో ఆ వ్యాసాన్ని మించిన రచన నాకు మరేదీ ఇప్పటిదాకా, కనిపించలేదు. అప్పుడు చదివాను, ఈ వ్యాఖ్యానం. పూర్తిగానా, కొంత భాగమా అన్నది నాకు గుర్తులేదు. కాని, ఒక పుస్తకంగా ఇది నా చేతుల్లోకి వచ్చింది మటుకు 1987 లో.

అది కూడా ఆసక్తికరమైన, నేను మరవలేని వైనం. రాజమండ్రిలో నా మిత్రుడు కవులూరి గోపీచంద్ హేతువాది, కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చినవాడు. భగవంతుడిమీద నమ్మకంలేని వాడు. గాంధీ అతణ్ణి ఎప్పుడూ ఆకర్షించలేదు. కాని, నా సాంగత్యంవల్ల మొదటిసారి గాంధీజీ ఆత్మకథ చదివాడు. ఆ పుస్తకం అతణ్ణి దగ్గరగా గుంజుకుంది. ఆ రోజుల్లో మిత్రులంతా ఒకసారి డిల్లీ వెళ్ళినప్పుడు అతడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి, రాజఘాట్ చూడాలని పట్టుబట్టి, అక్కణ్ణుంచి నాకోసం ఒక ఖద్దరు నూలుపోగునీ, ‘అనాసక్తి యోగా’ న్నీ తీసుకొచ్చాడు.

ఇప్పుడు మళ్ళా రాజఘాట్ మరోసారి ఈ పుస్తకాన్ని నా చేతులకందించింది. ఇందులో గాంధీ అనువాదమూ, వ్యాఖ్యానమూ, ఆయనే రాసుకున్న ముందుమాటలతో పాటు, 2010లో భారతపార్లమెంటు ను ఉద్దేశించి బరక్ ఒబామా చేసిన ప్రసంగం పూర్తిపాఠం కూడా ఉన్నాయి. గీతచుట్టూ, గీతకి గాంధీ వ్యాఖ్యానం రాయడం చుట్టూ చెలరేగిన వివాదం మీద ప్రచురణకర్తలు రాసిన పొందుపరిచిన చిన్న నోటు కూడా ఉంది.

గీత మీద వ్యాఖ్యానాల్లో నేను చదివినవాటిలో గాంధీజీ రాసిందే మొదటిది. ఆ తర్వాత, తిలక్, వినోబా, అరవిందులు, రాధాకృష్ణన్ లతో పాటు, శంకర, రామానుజ, జ్ఞానేశ్వర, మధుసూదన సరస్వతిల వ్యాఖ్యానాలు కూడా చూసాను. సంస్కృతమూలంతో పాటు గీతకి తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా చాలా అనువాదాలే చదివాను. గీతకీ, మహాభారతానికీ ఉన్న సంబంధం అర్థం చేసుకోవడానికి మహాభారతం కూడా సమగ్రంగా చదివాను.

కాని, ఇప్పటికీ భగవద్గీత మీద వ్యాఖ్యానాల్లో నాకు సన్నిహితంగా తోచింది గాంధీజీ రాసిన మాటలే. ఎన్నడో ఒకరోజు గీత మీద ప్రసంగించమని అడిగితే మా మాష్టారు ఒక మాటన్నారు: ‘భగవద్గీత అనుష్ఠించవలసిన విషయం తప్ప ప్రసంగించవలసింది కాదు’ అని. ఇక చర్చించవలసింది అస్సలు కాదు. నాకేమనిపిస్తుందంటే, గీత ఒక వ్యక్తికి బోధించిన మాట. అది సమాజానికి, en masse చెప్పింది కాదు. అది విస్తృతప్రజానీకానికి, బహిరంగ సభల్లో, ప్రచారానికి పెట్టవలసిన గ్రంథం కాదు. అది ఒక రాజుకో, రైతుకో బోధించింది కాదు. కురుక్షేత్రంలో సైన్యానికంతటికీ వినిపించిందికాదు. నిష్ఫలమైన, నిష్ఠురమైన కర్మ చేయకతప్పనప్పుడు, ఆ కర్మ ఎందుకు నెరవేర్చాలనే సందేహం కలిగిన ఒక ఆత్మీయుడికి అతడి మిత్రుడు, సారథి చెప్పినమాట. యుద్ధం చెయ్యమని పదిమందినీ ప్రేరేపిస్తూ చెప్పిన సామాజిక తత్త్వశాస్త్రం కాదు.

ప్రతి మనిషి జీవితంలోనూ ఒక సంక్షుభిత సమయం వస్తుంది. ఆ సమయంలో అతడికి గీత అతడికి అవసరమవుతుంది. కొందరికి దమ్మపదం, కొందరికి సువార్తలు, కొందరికి కొరాను అవసరమైనట్టే. కొందరికి, బహుశా ఈ పుస్తకాలేవీ కూడా అవసరం పడకపోవచ్చు. వారికి గీతతో అవసరం పడలేదు కాబట్టి, నాకు గీతతో పడ్డ అవసరం తక్కువైపోదు. గీత గురించి ఆలోచించినప్పుడల్లా నాకు కలిగే చింత ఒక్కటే. నేను గీతని గౌరవిస్తున్నానే గాని, ఒక కుదీరాం బోస్ లాగా ప్రాణప్రదంగా ప్రేమించడం లేదు. పద్ధెనిమిదేళ్ళ పసిప్రాయంలో అతడు భగవద్గీతను కావిలించుకుని ఉరికంబానికెక్కాడు. అతణ్ణి ఉరితీసినప్పుడు చిరునవ్వుతో కనిపించాడని బ్రిటిష్ పత్రికలు రాసుకున్నాయి.

బహుశా భగవద్గీతను నేనింకా ఒక అధ్యయన గ్రంథంగానే చూస్తున్నానిపిస్తోంది. నా చిన్నతనంలో, పదిపన్నెండేళ్ళ వయసులో, తాడికొండ గురుకుల పాఠశాలలో, సాయంకాల ప్రార్థనాసమావేశాల్లో మా మాష్టారు నరసింగరావుగారు, మాతో స్థితప్రజ్ఞ శ్లోకాలు వల్లెవేయించినప్పటినుంచీ, గీత నా జీవితంలో భాగంగానే ఉంటున్నది. కానీ, గాంధీజీలాగా నేనా పుస్తకాన్ని ఒక తల్లిలాగా కరుచుకుని ఉండలేకపోయాను.

కాని, ఆసక్తి వదిలిపెట్టి కర్మ నెరవేర్చవలసిన అవసరమేమిటో నా ఉద్యోగజీవితం నాకు ముప్పై ఏళ్ళుగా చెప్తూనే ఉంది. ఆసక్తి అంటే కేవలం ప్రతిఫలాపేక్షనే కానక్కర్లేదు. ఫలితంలో ఆసక్తి నిజానికి చాలా స్థూల రూపం. దాన్ని మనం సులభంగా గుర్తుపట్టగలం. కాని, ప్రతిఫలం ఆశించకుండా, సేవచేస్తున్నామని మనలో మనకు తెలియకుండానే కలిగే సంతోషలవలేశం కూడా మనల్ని బాధిస్తుందని నాకు ఏళ్ళ మీదట అర్థమయింది. కర్మ నిన్ను బంధిస్తుంది. నువ్వొక పని చేసిన తరువాత, ఆ పని ఎందుకు చేసావనిగాని, లేదా, ఒక పని చెయ్యనప్పుడు, ఆ పని ఎందుకు చెయ్యలేకపోయావని గాని, పశ్చాత్తాప పడవలసిన అవసరం రాకపోవడమే నిజమైన విముక్తి. నువ్వీ లోకాన్ని వదిలిపెట్టేవేళకి జమాఖర్చుపట్టీ సరిపోవాలి. నువ్వేదీ మోసుకుపోలేవు, నిజమే, కాని, నీ కర్మఫలితం నిన్ను వెన్నాడకూడదు, ఋణశేషమేదీ మిగిలిపోకూడదు.

‘కర్మ యొనర్చడమెలాగు? ఈ బాధ్యత కఠినతరం’ అంటాడు బైరాగి. అన్నం తినేముందు కాళ్ళూ చేతులూ కడుక్కుని కూచున్నట్టుగా, అంతరంగాన్ని శుభ్రపరుచుకుని మరీ కర్తవ్యానికి పూనుకోవలసి ఉంటుంది. అదొక సాధన. తీవ్ర క్రమశిక్షణ. మనుషులు ఈ లోకానికి (పరలోకానికి కాదు) సంబంధించిన తమ కర్తవ్యాల్ని ఎట్లా నెరవేర్చాలో చెప్పే ఒక మాన్యువల్ భగవద్గీత. నలభై ఏళ్ళ పాటు తన జీవితంలో ఆ మాన్యువల్ ని అనుసరించి తన జీవితాన్ని దిద్దుకున్న ఒక మనిషి రాసుకున్న నోట్సు ఈ ‘అనాసక్తి యోగం.’

7-6-2018

 

Leave a Reply

%d bloggers like this: