చాలాకాలం కిందటి మాట. అప్పుడు నాకు ఇరవయ్యేళ్ళుంటాయి. రాజమండ్రిలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు భమిడిపాటి జగన్నాథరావుగారిని చూడటానికి విజయవాడ వెళ్ళాను. అప్పుడాయన స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అధికారి. తెలుగు సాహిత్యంలో ఎందరో కవులూ, రచయితలూ ఆయనవల్లనే పరిచయమయ్యారు. ఆయనకి చాలా సన్నిహితులైన కవుల్లో అజంతా కూడా ఒకరు.
అజంతా కవితలు మొదటిసారి నేను ‘మహాసంకల్పం’ సంకలనంలో చదివాను. నండూరి రామమోహనరావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సంకలనం చేసిన ఆ కవితాసంపుటిని నేనెప్పటికీ మర్చిపోలేను. బైరాగిని నాకు పరిచయం చేసిన పుస్తకం అదే. అందులో అజంతా కవితలు ‘సుషుప్తి ‘, ‘పరిత్యాగి పరివేదన’ లతో పాటు మరొక కవిత కూడా ఉండేదన్నట్టు గుర్తు. ‘చెట్లు కూలుతున్న దృశ్యం’ కాదు, ఆ కవితని పరిచయం చేసింది మరొక సంకలనం, కుందుర్తి సంపాదకత్వంలో, బహుశా యువభారతి వెలువరించిన ప్రచురణ, పేరు గుర్తుకు రావడం లేదు.
ఆ మూడు నాలుగు కవితలతోటే అజంతా మాకొక ఆరాధనీయుడైన కవిగా మారిపోయేడు. ఇక ఆయన గురించి జగన్నాథరావుగారు చెప్పే ముచ్చట్లు నా దాహాన్ని మరింత ప్రజ్వరిల్లచేసేవిగా ఉండేవి. అదీకాక, అజంతాకి సంబంధించి మరొక సంఘటన కూడా జరిగింది. 1980లో అజంతా కవిత ‘కంప్యూటర్ చిత్రాలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురిస్తూ, పురాణం, ఆ పత్రిక అట్టమీద అజంతా ఫొటో ఒక ప్రొమో లాగా ప్రచురించాడు. ఆ కవిత చదివి తనకేమీ అర్థం కాలేదని, నా కాకినాడ మిత్రుడు, ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి చెందిన ‘భరణి’ గోలచేసాడు. అక్కడితో ఆగకుండా ఆ కవిత ఏ అర్థంతో రాసారో చెప్పమంటూ అజంతా కి పెద్ద ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరానికి అజంతా జవాబు ఇవ్వలేదుగానీ, ఆయన మిత్రుడు ఆకాశవాణిలో పనిచేసే ప్రసాద్ అనే ఆయన జవాబిస్తూ, రాజమండ్రి పేపర్ మిల్లులో పనిచేసే మహేశ్ అనే ఆయన దాని అర్థం వివరించగలడంటూ ఉత్తరం రాసాడు.
ఆ తర్వాత నాకు రాజమండ్రిలో ఉద్యోగం రావడం, అక్కడ ఆ మహేశ్ అనే సాహిత్యపిపాసి నాకు మిత్రుడు కావడం సంభవించాయి. మహేశ్ అజంతాని చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తి. అతడి ద్వారా అజంతా గురించి వింటూన్న కొద్దీ అజంతాని చూడాలన్న కోరిక మరింత బలపడుతూ వచ్చింది.
అట్లాంటి రోజుల్లో విజయవాడ వెళ్ళినప్పుడు, జగన్నాథ రావుగారు నన్నొక హాస్పటల్ కి తీసుకువెళ్ళారు. అక్కడొక బెడ్ మీద పడుకుని ఉన్న బక్కచిక్కిన మనిషిని చూపిస్తూ ‘ఈయనే అజంతా గారు’ అన్నారు. ఆ బెడ్ మీద ఆయన పక్కనే ఒకటిరెండు కవిత్వపుస్తకాలు ఇంగ్లీషులో. ఆ గదిలోకి ఎవరో వస్తున్నారు, వెళ్తున్నారు, స్త్రీలూ, పురుషులూ కూడా. ‘బహుశా మైకెలాంజిలో గురించి మాట్లాడుకుంటో’.
కాని, నన్ను పరిచయం చెయ్యగానే అజంతా దృష్టి మొత్తం నా మీదనే కేంద్రీకృతమైంది. ‘మీరు రాసిన కవిత ఒకటి వినిపిస్తారా?’ అనడిగారు ఆయన. కొద్దిగా మొహమాటపడుతూనే జేబులోంచి ఒక కవిత బయటికి తీసి ఆయన చేతుల్లో పెట్టాను. (ఎవరిని కలవడానికి వెళ్ళినా జేబులో ఒక కవిత పెట్టుకు వెళ్ళాలనిపించే వయసు అది. ఆ వయసు దాటాక, ఆ చాపల్యం దాటాక, నువ్వు ఏదన్నా రాయొచ్చుగాని, నవనవలాడే కవిత్వం మాత్రం రాయలేవు).
అప్పుడాయన ఆ కవిత అక్షరాక్షరం చదివారు. అప్పట్లో నాకు ‘స్కానింగ్’ అనే పదం తెలీదు. లేకపోతే నా కవితను స్కాన్ చేసారని నాకు నేను చెప్పుకుని ఉండేవాణ్ణి. ఒక కవితని అలా చదివిన మనిషిని అంతకు ముందూ చూడలేదు, ఆ తర్వాతా చూడలేదు. అక్షరాన్ని అంత భక్తితో సమీపించిన కావ్యారాధకుణ్ణి మరొకర్ని నేనింతదాకా కలుసుకోలేదు.
ఆ క్షణం నాలో విద్యుత్ ప్రవహించినట్టనిపించింది. ఆ సాయంకాలమే (2-8-1983) ఇట్లా ఒక కవిత రాసుకోకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత పదిహేనేళ్ళకి ఆయనకి సాహిత్య అకాదెమీ పురస్కారం లభించినప్పుడు వాసుదేవరావుగారు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఒక సభలో (1998) ఆయన కవిత్వం మీద ప్రధాన ప్రసంగం నాదే కావడం ఆ కవిత్వం మీద నా ఆరాధనకి లభించిన ఫలం అనుకుంటాను.
అజంతాగారు నా కవిత చదివినప్పుడు
ఒక నిర్ధూమ సజీవాగ్ని శైల హస్తాల్లో
నా కవిత్వాన్నుంచి బెరుగ్గా ఎదుట నిల్చున్నాను.
చిన్ని గడ్డిపోచ
వసంత స్పర్శ తననెట్లా తలమున్కలు చేసిందీ
వచ్చీరాని భాషలో చెప్తే ఎవరికర్థమవుతుంది
ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప.
కవిత్వాన్ని
ఇవ్వగలిగితే అమృత హృదయులకియ్యి
లేదా అగ్నికెరచెయ్యి.
అనార్ద్ర ప్రపంచం పరిహసించేవేళ
అజంతభాషా సాదృశమయిన వైశ్వానరకీలల ఔత్సుక్యమే
నీ కవిత్వపు అసలైన గమ్యం.
నిజానికి ఒకింత అందమైన మాట పలకాలన్నా
విశిష్ఠానుభవ నికషం పైన గణన తేరిన
మహా జీవితం నీ ఎదట ఉండాలి.
ఆయన నా కవిత్వాన్ని ప్రశంసించాడు.
నేనాయన
జీవితం ఎదుట కైమోడ్చాను.
26-4-2018