ప్రజాకవి బై-జుయి

165

నన్ను నిరాశపర్చని కొన్ని తావుల్లో సెకండ్ హాండ్ పుస్తకాలు షాపులు కూడా ఒకటి. ఈసారి అక్కడ దొరికిన మాణిక్యం Bai Juyi: 200 Selected Poems (న్యూ వరల్డ్ ప్రెస్,చైనా, 1983).

కవితల్ని అనువదించిన రువి అలే 1930 ల్లో చైనా విముక్తిపోరాటంలోనూ, ఆ తర్వాత జపాన్ తో ప్రతిఘటనపోరాటాల్లోనూ, కమ్యునిస్టు చైనా అవిర్భావంలోనూ మమేకమై పనిచేసిన కార్యకర్త కూడా నట. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రసిద్ధ చీనా కథకుడు మావో డున్ ఆ సంగతి ప్రస్తావించడమే కాకుండా, ఈ కవితలు అనువాదాలుగా సఫలమయ్యాయని కూడా చెప్పాడు.

బైరన్ ‘చైల్డ్ హెరాల్డ్’ ని చీనా ఛందస్సులోకి అనువదించడానికి ఇద్దరు చీనా కవులు చేసిన ప్రయత్నాలు సంతృప్తినివ్వకపోవడానికి కారణం వారు బైరన్ ని సాంప్రదాయిక చీనా ఛందస్సులోకి తీసుకురావాలనుకున్నారనీ, రువి అలే అలాకాక, బైజుయి ని అనుసృజించడం ద్వారా సఫలీకృతుడయ్యాడనీ రాసాడు.

బైజుయి ( పో-చూ-యి అని కూడా పలుకుతారు) (772-846) తంగ్ వంశపు పాలనాకాలంలో ప్రభవించిన చీనామహాకవులు వాంగ్-వి, లి-బయి, దు-ఫు లతో సమానంగా యశస్సు పొందిన కవి. ఇంకా చెప్పాలంటే, ఇరవయ్యవశతాబ్దపు చీనా పాఠకుల దృష్టిలో పూర్వమహాకవులందరిలోనూ బహుశా దు-ఫు తర్వాతి స్థానం బై-జుయి దే.

అందుకు కారణాలు కూడా సుస్పష్టం. అతడు తన కాలం నాటి సమాజాన్నీ, దాని అసమానతలనీ, సాధారణ ప్రజల్నీ, వారిసుఖదుఃఖాల్నీ ఎంతో కరుణతోనూ, సహానుభూతితోనూ చిత్రించాడు. కొన్ని కొన్ని కవితలు ఇరవయ్యవశతాబ్ది సోషలిస్టు కవులు రాసినంత కొత్తగానూ, కదిలించేవిగానూ కూడా కనిపిస్తాయి.

తన అనువాద సంపుటిలో బైజుయి ని పరిచయం చేస్తూ రువి అలే ఇలా రాసాడు:

‘కవిత్వం ప్రధానంగా ఉపదేశం కోసమనే బైజుయి విశ్వసించాడు. తాము పాలిస్తున్న ప్రజల జీవితస్థిగతులగురించి పాలకవర్గాలకు తెలియచెయ్యడమే కవిగా తన కర్తవ్యమని భావించాడు. కాని అతడి కాలంలో పాలకవర్గాలు తమ కవులనుంచి ఆశించింది వేరే ఉంది. కవులు సంగీతమయంగా ఉండే గీతాలు రాయాలనీ, పానశాలల్లో వాద్యగోష్టులకు అనువుగా ఉండే పాటలు, సామ్రాజ్యం నాలుగు చెరగులా వేలాడదీసుకోగల కవితలు రాయాలని వారు కోరుకున్నారు. బైజుయి వారి ఆకాంక్షల్ని నిర్లక్ష్యం చెయ్యలేదుగానీ,ఆ రకమైన కవితలకన్నా ప్రజలజీవితాల్ని కల్లోలపరిచే పాలకదౌష్ట్యాల్ని ఎత్తిచూపడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడని అతడి మనకు తెలుస్తున్నది. ఒక కవితకు తుదిరూపం ఇచ్చేముందు అతడొక రైతుమహిళను కలుసుకుని ఆ కవిత వినిపించి, ఆమె దాని అర్థం చేసుకోగలదో లేదో స్వయంగా పరీక్షించుకున్నాడని కూడా ఒక ఐతిహ్యం ఉంది. అందుకనే అతడు తన యుగానికి చెందిన ‘ప్రజాకవి’ గా పేరుపొందాడు.’

ఇందులోని రెండువందల కవితలు మొత్తం బైజుయి కావ్యసర్వస్వంలో పదవవంతు కవితలు. కాని అనువాదకుడు మంచి సంకలనకర్త కూడా. అతడు బైజుయి జీవితంలోని వివిధ దశలకు, వివిధ ఇతివృత్తాలకు, వివిధ ఛందస్సులకు ప్రాతినిధ్యం వహించేలాగ కవితల్ని ఎంచుకున్నాడు.

‘ప్రజలు జీవిస్తున్న జీవితం ‘, ‘సామాజిక-రాజకీయ ఇతివృత్తాలు’, ‘బంధుమిత్రులు’, ప్రకృతి సౌందర్యం’, ‘స్త్రీల దుఃస్థితి’ అనే అధ్యాయాలతో పాటు పాటు ‘తన గురించి ‘ ‘రకరాల ఆలోచనలు’ అనే మరొక రెండు అధ్యాయాలుగా కూడా కవితల్ని ఏరికూర్చాడు. బై-జుయి ని నేను ఇంతకుముందు చదివినప్పటికీ, ఈ వర్గీకరణ వల్ల, ఎన్నో కవితలు కొత్తగా చదవడమే కాక, ఇంతకు ముందు చదివినవి కూడా కొత్త స్ఫూర్తితో ప్రత్యక్షమయ్యాయి.

అతడి కవితల్లో చాలా ప్రసిద్ధి చెందిన కవిత ఒకటి బొగ్గులు కాల్చే మనిషి మీద రాసిన కవిత. ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు నా చిన్నతనంలో నేను చూసిన బొగ్గులు కాల్చే మహిళ గుర్తొచ్చింది.

ఆమెది మా ఊరిపక్కనుండే వణకరాయి. ఆమె దళిత స్త్రీ. బీద స్త్రీ. భర్త లేడు. వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదు. ఆమెకి చాతనయిన ఒకే ఒక్క పని బొగ్గులు కాల్చడం. అది చాలా కఠినమైన పని. బొగ్గులు కాల్చడానికి ముందు పెద్ద గొయ్యి తవ్వాలి. అందులో పచ్చి కొమ్మలు నరికి పోగుపొయ్యాలి. లోపల నిప్పుముట్టించాలి. అప్పుడు దాన్ని మట్టితో కప్పాలి. కుమ్మర్లు ఆవంలో కుండలు కాల్చినట్టే. రెండుమూడు రోజులకి ఆ పచ్చికొమ్మలు బొగ్గులుగా మారతాయి. అప్పుడా నిప్పు ఆర్పి ఆ బొగ్గుల్ని మూటగట్టాలి. ఆ మూట తన భుజాన మోసుకుని సంతకి తెచ్చి అమ్ముకోవాలి. ఆ మధ్యలో ఫారెస్టువాళ్ళకి చిక్కితే అంతేసంగతి. వాళ్ళ కంటపడకుండా ఆ బొగ్గులబస్తా అమ్ముకుంటే దక్కేది అయిదు రూపాయలు. ఒకరోజు కాకరపాడు సంతలో ఆమెనుంచి బొగ్గులబస్తా కొని ఆమె చేతుల్లో అయిదు రూపాయల నోటు పెడుతూ మా నాన్నగారు నాకేసి తిరిగి ‘ఈమె ఈ డబ్బుతో ఏం చేస్తుందో తెలుసా?’ అనడిగారు. ఆ నాలుగుడబ్బుల్తోనూ ఆమె తన పిల్లవాణ్ణి బడికి పంపిస్తుందని చెప్పారు. అప్పుడే ఆమెను నేను మొదటిసారి చూసాను. ఆమె మోచేతులకీ, చెంపలకీ అంటుకున్న బొగ్గుమసి, ఎండిపోయి గాలికి ఎగుర్తున్న ఆమె జుత్తూ ఇప్పటికీ నా కళ్ళముందు కనిపిస్తున్నాయి.

కాని అట్లాంటివాళ్ళను నాకన్నా 1200 ఏళ్ళముందు బైజుయి చూసాడని ఈ కవిత చెప్తున్నది:

బొగ్గులమ్మే ముసిలాడు

బొగ్గులమ్మే ముసిలాడు, దక్షిణపర్వతగ్రామంలో
చెట్లు నరికి తగలబెట్టి బొగ్గులు కాల్చేవాడు
నిప్పుకీ పొగకీ నల్లబడ్డ ముఖం
తెల్లబడ్డ చెంపలు, అరిగిపోయిన వేళ్ళు
చిరిగిపోయిన చొక్కా, ఎంత కూడదీసుకున్నా
పోగుపడని కూడూ, గుడ్డా.

ఒంటిమీద గుడ్డలేకున్నా అతడు శీతాకాలం కోసం
ఎదురుచూస్తుంటాడు, బొగ్గు ధర
పెరుగుతుందనుకుంటాడు, నగరం బయట
మంచుదారిన కీచుమంటూ చప్పుడు చేసే
బండి, అలిసిపోయిన ఎడ్లు, రోజంతా నకనకలాడే
ఆకలి, దక్షిణద్వారం గుండా
అతడా బురదలో అడుగుపెట్టాడో లేదో
సైనికదుస్తుల్లో ఇద్దరు కొజ్జాలు
అతడిమీద గుర్రాలు దూకించారు
బండిని ఉత్తరానికి మళ్ళించారు,
ఎడ్లమీద కొరడా ఝుళిపించారు.
అప్పటికే అక్కడ వాళ్ళట్లా చేజిక్కించుకున్న
బొగ్గులు వెయ్యి బళ్ళు.

అప్పుడు వాళ్ళో పదడుగుల పట్టుగుడ్డ అ
ఎడ్లమీద బిచ్చం పడేసారు, అది ఆ బొగ్గులధర.

12-2-2016

Leave a Reply

%d bloggers like this: