గొప్ప నేత

167

సంక్రాంతి శుభాకాంక్షల్తో. సంక్రాంతి వెలుతురు పండగ. కాంతిని కీర్తించే ఒక వేదసూక్తం నుంచి కొన్ని శ్లోకాలు (ఋగ్వేదం:1:113:1-7), హిమాలయ చిత్రం ప్రసిద్ధ చిత్రకారుడు నికొలాయి రోరిక్ చిత్రించింది:

ద్యులోక పుత్రి

ఇదమ్ శ్రేష్టమ్ జ్యోతిషామ్ జ్యోతిః ఆగాత్
చిత్రః ప్రకేతో అజనిష్ట విభ్వా
యథా ప్రసూతా సవితుః సువాయన్,
యేవా రాత్రీ ఉషసే యోనిమ్ ఆరైక్

(జ్యోతులన్నిటిలోనూ శ్రేష్ట జ్యోతి ఇప్పుడే వచ్చింది
చిత్రకాంతిశోభతో ఆ కిరణాలు వ్యాపిస్తున్నాయి
ఉషోదయమవుతూనే రాత్రి సూర్యుణ్ణి కన్నది
వేకువని కన్నది)

రుశత్ వత్సా రుశతీ శ్వేత్యా ఆగాత్
ఆరైక్ ఉ కృష్ణా సదనాని అస్యాః
సమానబంధూ అమృతే అనూచీ
ద్యావా వర్ణం చరత ఆమినానే

(సూర్యుణ్ణి కన్నతల్లి ఉష ఇప్పుడే ప్రవేశించింది
కృష్ణరాత్రి తన సదనాన్నితొలగిపోయింది
బంధుత్వంతో, అమృతత్వంతో ఒకదాన్నొకటి అనుసరిస్తున్నవి,
ఒకరిశోభ మరొకరు హరిస్తూ ఆకాశమంతా సంచరిస్తున్నవి)

సమానో అధ్వా స్వస్రోః అనంతః
తమ్ అన్యాన్యా చరతో దేవశిష్టే.
న మేధేతే న తస్థతుః
సుమేకే నక్తోషసా సమనసా విరూపే.

(వాటి దారి సమానం, అనంతం.
సూర్యసూచితాలై ఒకదాని వెనక ఒకటి నడుస్తున్నవి
ఒకదానికొకటి అడ్డుపడవు, ఆలసించవు
రాత్రి, ఉష రూపు వేరు, మనసు ఒక్కటే)

భాస్వతీ నేత్రీ సూనృతానామ్ అచేతి
చిత్రా వి దురో న ఆవః
ప్రాప్ర్యా జగత్ వి ఉ నో రాయో అఖ్యత్
ఉషా అజీగః భువనాని విశ్వా.

(సూనృతాలవైపు నడిపించే గొప్ప నేత.
చిత్రకాంతుల్తో ఆమె మనకోసం తలుపు తెరిచింది
జగత్తుని వెలిగిస్తున్నది, ఐశ్వర్యవరదాయిని
ఆమె వల్లనే భువనాలన్నీ ప్రకాశిస్తున్నవి)

జిహ్నశ్యే చరితవే మఘోని
ఆభోగయ ఇష్టయే రాయ ఉ త్వమ్
దభ్రమ్ పశ్యద్భ్య ఉర్వియా విచక్ష
ఉషా అజీగః భువనాని విశ్వా.

(సోమరుల్ని కూడా చక్కటిదారిన నడిపిస్తుంది
ఒకరికి భోగాలు, మరొకరికి యాగాలు
ఒకరికి సంపదలు, మేలుకోనివారిని కూడా మేల్కొల్పుతుంది
ఆమె వల్లనే భువనాలన్నీ ప్రకాశిస్తున్నవి)

క్షత్రాయ త్వమ్ శ్రవసే త్వమ్ మహీయా ఇష్టయే
త్వమర్థమ్ ఇవ త్వమ్ ఇత్యై
విసదృశా జీవితాభిః ప్రచక్ష
ఉషా అజీగః భువానాని విశ్వా.

(కొందరికి వీరోచితకార్యాలకి, కొందరికి గొప్ప జ్ఞానానికి
కొందరి కోర్కెలు తీరడానికి, కొందరికి యాగాలకి
ఎవరి జీవితమార్గాన్ని వారనుసరించడానికి
ఆమె వల్లనే భువనాలన్నీ ప్రకాశిస్తున్నవి)

యేషా దివో దుహితా ప్రత్యదర్శి
వ్యుచ్ఛంతీ యువతిః శుక్రవాసాః
విశ్వస్య ఈశానా పార్థివస్య వస్వ
ఉషో అద్యేహ సుభగే వ్యుచ్ఛ.

(ద్యులోక పుత్రి, సమస్తాన్ని వెలిగిస్తున్నది
కాంతివస్త్రం ధరించింది, యువతి
ఈ భూమ్మీద సంపదలన్నిటికీ సామ్రాజ్ఞి
ఓ ఉషోదేవీ, ఈ రోజు పూర్తిగా విరాజిల్లు)

15-1-2016

arrow

Painting: The Himalayas by Nicolai Roerich

Leave a Reply

%d bloggers like this: