అమృతసంతానం

174

సాహిత్య అకాడెమీ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తక విక్రయ కేంద్రంలో అడుగుపెట్టగానే చప్పున నా దృష్టిని ఆకర్షించింది ‘అమృతర్ సంతాన్’. గోపీనాథ మొహంతి ఒడియా నవలకి ఇంగ్లీషు అనువాదం.

ఇటువంటి అనువాదం ఒకటి వచ్చిందని ఆదిత్య కొన్నాళ్ళకింద నాతో అన్నాడని గుర్తొచ్చింది. కాని ఆ పుస్తకం అక్కడ చూడగానే చెప్పలేనంత సంతోషం కలిగింది. ప్రపంచ స్థాయి రచన. ప్రపంచమంతా చదివి తీరవలసిన రచన. 1947 లో రాసిన ఈ పుస్తకం ఏడు దశాబ్దాల తరవాతైనా ఇంగ్లీషులోకి రావడం నిజంగా ఒక సంబరమే అనిపించింది.

1982 లోనో, 83 లోనో మొదటిసారి నేను అమృతసంతానం తెలుగు అనువాదం చదివాను. పురిపండా అప్పలస్వామిగారి తెలుగుసేత. రాజమండ్రిలో సరస్వతీ పవర్ ప్రెస్ అని ఉండేది. అక్కడ ముద్రించారు. 1965 నాటి ముద్రణ అనుకుంటాను. ఆ పుస్తకం చదివినప్పణ్ణుంచీ ఆ ప్రభావం నుంచి ఇప్పటికీ బయటపడలేకపోయాను.

అది ఒరిస్సాలో కోరాపుట్ జిల్లా పర్వతాల్లో, అరణ్యాల్లో జీవిస్తున్న కోదులనే ఒక గిరిజన తెగ తాలూకు జీవితచిత్రణ.మహేతిహాసం. నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలోనే అట్లాంటి రచన లేదు. నేను పుట్టినవూరు కూడా గిరిజన గ్రామమే. ఆ గ్రామం కొండరెడ్ల గ్రామమైనప్పటికీ, ఒక గిరిజనతెగగా, వాళ్ళకీ, కోదులకీ మధ్య ఎన్నో సారూప్యాలు కనబడినందువల్లా, ఆ నవలలో చిత్రించిన లాండ్ స్కేప్, ఆ మనుషులు, ఆ అడవులు, ఆ నాట్యాలు, ఆ పండగలు నాకు చిన్నప్పణ్ణుంచీ తెలిసినవి అయినందువల్లా, నేను ఆ రచనతో తక్షణమే ఐడెంటిఫై కాగలిగాను. అంతేకాదు, నేను అప్పటిదాకా పెరిగిన ఆ గిరిజన జీవితం మూలస్వభావాన్ని, సారాంశాన్ని, ఆ ప్రాపంచిక జీవితాన్నిఆ నవలద్వారా ఎంతోకొంత అర్థం చేసుకోగలిగాను.

ఆ తర్వాత నేను గిరిజన సంక్షేమ శాఖలో చేరినప్పుడు, నా ట్రైనింగులో భాగంగా గుమ్మలక్ష్మిపురం మండలంలో ఒక మారుమూల గ్రామమైన గొయిపాక అనే ఊళ్ళో రెండువారాలు గడపవలసి వచ్చింది. ఆ ఊరు కొండల్లో, అడవుల మధ్య ఉండే ఒక కోదుపల్లె. ఆ ఊరిని ఆనుకుని ఒరిస్సా రాష్ట్రంలో, కోరాపుట్ జిల్లా గిరిజన గ్రామాలు. అదంతా దండకారణ్యం. ఆ కోదులు అమృతసంతానంలో చిత్రించిన కోదులే. నేనప్పటికి అయిదేళ్ళ కింద చదివిన ఆ నవల్లోని జీవితం మధ్యనే అట్లా గడపగలనని ఎన్నడూ ఊహించిఉండలేదు. కాని, ఆ రెండువారాల ఆ సామీప్యత, ఆ కోదుపల్లె, ఆ పక్కనే డొంబు పల్లె, ఆ కొండచరియలు, ఆ పిల్లంగోవి పాటలు, ఆ కుయి భాష, ఆ సాలవృక్షాలు, ఆ సీతాకోకచిలుకలు నన్ను పూర్తిగా లోబరుచుకున్నాయి. గిరిజనుల గురించి ఒక కథ లేదా నవల రాస్తే అమృతసంతానం లాగా రాయాలనే నమ్మకం స్థిరపడిపోయింది. (అందుకనే ఇప్పటిదాకా ఒక చిన్న కథ కూడా వాళ్ళ గురించి రాయలేకపోయాను.)

అమృతసంతానంలో కథ చాలా సరళం. మిణి అపాయు అనే ఒక కోదుపల్లె కి సరుబు సావొతా అనే పెద్ద ఉండేవాడు. పూర్తిగా పండి పూర్ణజీవితం జీవించాక అతడు మరణిస్తాడు. అతడి కొడుకు దివుడు సావొతా గ్రామపెద్ద అవుతాడు. కుయి భాషలో దివుడు అంటే సీతాకోక చిలుక. అతడి భార్య పుయి (పువ్వు). కొన్నాళ్ళకు కింద పల్లపు ప్రాంతాలకు చెందిన ఒక తెలుగమ్మాయి పియొటి (పిట్ట) ఆ ఊళ్ళో అడుగుపెడుతుంది. దివుడు ఆమె ఆకర్షణలో పడతాడు. అదంతా ఒక రూపకాలంకారం. సనాతన గిరిజన సంస్కృతి పల్లపు నాగరికత వ్యామోహంలో పడిన కథ, ఆ నలుగులాట అదంతా రచయిత గొప్ప కవితాత్మకంగా చెప్పుకొస్తాడు. ఈ మధ్యలో పుయు గర్భం దాలుస్తుంది. ప్రసవిస్తుంది. ఆ చిన్నబిడ్డడిద్వారా మళ్ళా కోదుసంతతి కొనసాగుతుంది. కాని ఆ తల్లీబిడ్డలముందు గొప్ప అనిశ్చితత పరుచుకుని ఉంటుంది. చివరికి పుయు తన భర్తని వదిలిపెట్టి తన చిన్నబిడ్డడితో విశాలమైన ఆ పర్వతభూమిలో తన కాళ్ళమీద తను నిలబడడానికి ముందడుగువేస్తుంది.

సుమారు వెయ్యి పేజీల ఆ నవలలో మహేతిహాసాల శిల్పముంది. ఇతిహాసాల్లో చిత్రించినట్టే అందులోనూ మరణం,పుట్టుక, పెళ్ళి, కలయిక,వియోగం, యుద్ధం, శాంతి అన్నీ ఉన్నాయి. రామాయణ, మహాభారతాల వారసుడు మాత్రమే రాయగల రచన అది. మరొకవైపు టాల్ స్టాయి తరహా మహాకుడ్య చిత్రణ. (మొహంతి టాల్ స్టాయి వార్ అండ్ పీస్ ని ఒడియాలోకి అనువదించాడు కూడా).

ఇప్పుడు ఈ నవల ఇంగ్లీషు లో ప్రపంచం ముందుకొస్తున్నది. ఆ అనువాదం ఎట్లా ఉందో చూదామని అక్కడే ఆతృతగా కొన్ని పేజీలు తిరగేసాను. నిజమే, ఆ అనువాదాన్ని అప్పలస్వామిగారి తెలుగు అనువాదం తో పోల్చలేం. ఆదిత్య అన్నట్టు, ఆ అనువాదానికే అప్పలస్వామిగారికి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వొచ్చు. కాని, ఆ తెలుగు అనువాదాన్ని మర్చిపోయి చూసినప్పుడు, ఈ ఇంగ్లీషు అనువాదకులు ప్రశస్తనీయమైన కృషి చేసారని ఒప్పుకోక తప్పదు.

అనువాదంలో ఎదురయ్యే సమస్య గురించి, ముందుమాటలో ప్రభాత నళినీ దాస్ చెప్పినట్టు, అది కావడానికి ఒడియానుంచి ఇంగ్లీషులోకి అనువాదమే అయినా, సాంస్కృతికంగా, ఒక గిరిజన సంస్కృతినుంచి ముందు ఒడియాలోకి అనువాదమై, ఇప్పుడు ఇంగ్లీషులోకి అనువాదమవుతున్న రచన. ఆ గిరిజన జీవితం, ఆ సారళ్యం, ఆ సంక్లిష్టతలు ఒడియా సమాజానికే కొత్త. ఆ ప్రాపంచిక దృక్పథాన్ని మైదాన ప్రాంత ఒడియా సమాజానికి అర్థమయ్యేలా చెప్పడానికే మొహంతి ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ జీవితం గురించి సూచనప్రాయంగా కూడా తెలియని విస్తృత ప్రపంచానికి దాన్ని పరిచయం చెయ్యడం మరింత సవాలుతో కూడుకున్న పని.

కాని గొప్ప సాహిత్యం చేసేది అదే. నీకెంత మాత్రం తెలియని ప్రపంచాన్ని నీకెంతో సన్నిహితంచెయ్యగలదు. మనకి నైజీరియాలో ఉండే ఇబొ తెగ గురించి ఏమి తెలుసు? కాని చినువా అచెబె Things Fall Apart చదువుతున్నంతసేపూ నాకు మా ఊళ్ళూ, మా కొండలూ, మా అడవులే కళ్ళముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంగ్లీషు అనువాదం చదివే ఆఫ్రికా జాతుల పాఠకులు, పసిఫిక్ సముద్ర దీవుల్లోని పాఠకులు, ఎస్కిమోలు, రెడ్ ఇండియన్లు కూడా తమలాంటి ఒక తెగ భారతదేశంలో జీవిస్తూ ఉన్నారని, తామంతా కూడా ఒకే మహా అమృత సంతానమనీ గుర్తుపడతారని తలుచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంది.

ఈ నవలకు ఫెలిక్స్ పడెల్ అనే ఒక యాంత్రొపాలజిస్టు ముందు మాట రాసాడు. రెండున్నరపేజీల ఆ ముందుమాట ఈ నవల సమకాలీన ప్రాసంగితకతను గొప్పగా పట్టుకుంది. ఇప్పుడు గిరిజనప్రాంతాల్ని బాక్సైటు గనులు గా మాత్రమే చూస్తున్న రాజకీయ-కార్పొరేట్ ప్రాపంచిక దృక్పథాన్నీ, కొండల్ని దేవతలుగా చూస్తున్న ఒక ప్రాచీన ప్రాపంచిక దృక్పథాన్నీ ఆ యాంత్రొపాలజిస్టు తన ముందుమాటలో ఎదురెదురుగా పెట్టి చూపించాడు. ముఖ్యంగా నియమగిరి కొండల్లో వేదాంత మైనింగ్ కంపెనికీ, దోంగ్రియా కోదులకీ మధ్య జరిగిన పోరాటంలో సుప్రీం కోర్టు కోదుదేవతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ‘అమృతసంతానం’ అత్యంత శక్తివంతమైన ఒక రాజకీయనవలగా కూడా కొత్త జన్మ ఎత్తగలదని నాకు స్ఫురించింది. ఆ స్ఫురణ గొప్ప ఆశ్చర్యానుభూతిని కలిగించింది.

ఆ తెలుగు అనువాదం లభ్యంగా లేదు కాబట్టి, ఇన్నాళ్ళూ నేను అమృత సంతానం గురించి మిమ్మల్ని ఎక్కువ ఊరించలేకపోయాను. కాని ఇప్పుడు ఇంగ్లీషులో ఆ పుస్తకం లభ్యంగా ఉంది. మీదే ఆలస్యం.

28-4-2017

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s