భరించలేని ఎండవేడిలో పగలూ రాత్రీ తేడా తెలియకుండా పొగలు కక్కుతున్న నగరవీథుల్లో వసంతరాత్రులు తరలిపోవడం ఎంత విషాదం. కాని, కూలర్ పెట్టుకున్న గదిలోంచి ఒక్కడుగు కూడా బయటికి వెయ్యలేక, ఆ నాలుగ్గోడల మధ్యా, ఒకప్పటి అడవినీ, వెన్నెలనీ తలచుకోవడంలోనూ, గడిచిపోయిన ఆ రోజులు తిరిగిరావని దిగులుపడటంలోనూ కూడా గొప్పసౌఖ్యముంది కదూ.
అవుననే అంటాడు యొషిద కెంకొ తన ‘సురెజురె గుస’ లో.
ప్రాచీన జపాన్ సాహిత్యం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుకల్లో యొషిద కెంకొ (1283-1950) రాసిన ‘Essays in Idleness’ కూడా ఒకటి.
గతంలో పెంగ్విన్ సంస్థ ప్రచురించిన ఇంగ్లీషు అనువాదంలోంచి కొన్ని భాగాలు సంక్షిప్తంగా A Cup of Sake Beneath The Cherry Trees (2015) పేరిట ఇప్పుడు మళ్ళా కొత్తగా తీసుకొచ్చారు. పట్టుమని చదివితే గంటసేపట్లో పూర్తయిపోయే పుస్తకం. కాని జీవితాంతం మనల్ని వెన్నాడే ఆలోచనలు.
వాటిల్లోంచి మీ కోసం కొన్ని:
మానవహృదయమనే ఈ పువ్వు
1
ప్రాణులన్నిటిలోనూ దీర్ఘకాలం జీవించేది మనిషే. పగటిపూట ఎగిరే తూనీగ సాయంకాలానికల్లా మరణిస్తుంది. వేసవిలో రొదపెట్టే చిమ్మెట హేమంతందాకా జీవించి ఎరుగదు. అట్లాంటప్పుడు, కనీసం ఒక పూర్తి ఏడాది పాటైనా జీవించగలగడం ఎంత గొప్ప వైభవం, విలాసం! కాని కాలం గడిచిపోతోందే అని నువ్వు విలపిస్తున్నావనుకో, వెయ్యేళ్ళు కూడా నీకు స్వప్నసమానమే.
2
జీవితంలోని సుందర విషయాల గురించీ, కళ్ళముందు తరలిపోయే అనుభవాలగురించీ నీలాంటి హృదయుడే అయిన ఒక ఆత్మీయుడితో కూచుని మనసు విప్పి మాట్లాడుకోవడంలో ఎంత ఆనందముంది.. కాని అట్లాంటి మనిషి దొరకడం అరుదు. పైగా నీ మనసు విప్పి చెప్పుకోవడం అలా ఉంచి ఎదుటివాళ్ళు చెప్తున్నదానికి నువ్వు విధిలేక ఊకొడూ ఉండాల్సి వస్తుంది. అలా ఊకొడుతున్నంతసేపూ, మానసికంగా ఒక ఏకాకితనాన్ని అనుభవిస్తూంటావు కూడా.
3
ఒక దీపం చెంత కూచుని, నీ ముందొక పుస్తకం తెరిచిపెట్టుకుని, నువ్వెప్పుడూ చూసి ఉండని, సుదూరగతానికి చెందిన ఒక మనిషితో, నీలాంటి మనిషితో హృదయసంవాదం చెయ్యడం చాలా గొప్ప సాంత్వన కదా.
4
ఒకప్పుడొక సాధువు అన్నాడట: నేను ప్రాపంచిక బంధాలన్నీ తెంచేసుకున్నాను గానీ, ఆకాశసౌందర్యాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నానని. అతడట్లా ఎందుకన్నాడో అర్థమవుతున్నది.
5
మానవహృదయమనే ఈ పువ్వు ఎంత కోమలమైనది, లేతగాలి దాన్నింకా సోకకముందే ముడుచుకుపోతుంది. ఒకప్పటి మన ఆత్మీయుల మాటలు మనమింకా మర్చిపోలేక గుర్తుచేసుకుంటున్నప్పుడు అప్పుడు మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాటా ఇప్పుడు గుండెనెంతో కలచివేస్తుంది. కాని మన ఆత్మీయులు మనల్ని వదిలి వెళ్ళిపోవడం కూడా ఈ జీవితంలో భాగమే. అట్లా విడిపోవడం మృత్యువుకన్నా విషాదభరితం. అందుకనే, ఒక తెల్లదారపు పోగు రంగు అద్దగానే తన తెలుపును శాశ్వతంగా పోగొట్టుకుంటున్నదే అని మోజి విలపించాడు. దారిన కలిసిపోతున్నప్పుడు చీలుదారులు రాగానే యాంగ్ జూ దుఃఖం ఆపుకోలేకపోయాడు.
పూర్వపు చక్రవర్తి హొరికవా కవితాసంకలనంలో ఒక కవిత:
ఒకప్పుడు నేనామెను కలుసుకున్న
తోట ఇప్పుడు పాడైపోయింది.
ఇప్పుడక్కడ పూసిందంతా
బలురక్కసిపూలు, అల్లిబిల్లిగా
అల్లుకున్న రక్కెస పొదలు.
ఒకప్పుడు కవి నేత్రాల్ని సంతోషపరిచిన దృశ్యం ఇప్పుడు చూసినప్పుడు ఇట్లా సాక్షాత్కరించిందన్నమాట.
6
రాత్రంతా చాలా అందంగా మంచుకురిసిన మర్నాడు నేనొక మిత్రురాలికొక ఉత్తరం రాయవలసి వచ్చింది. అందులో ఆ మంచు గురించి నేనేమీ రాయలేదు. కాని ఆమె నాకు జవాబు రాస్తూ అన్నది కదా: సున్నితం లేని మనిషి! నాకు ఉత్తరం రాస్తున్నవాడికి నా చుట్టూ మంచు రాలుతున్న ప్రకృతి దృశ్యాన్ని నేనెట్లా ఆనందిస్తున్నానో తెలుసుకోవాలని కూడా లేదే. అట్లాంటి ఉత్తరానికి నేనేమి జవాబివ్వాలి? అంటో.
ఆమె ఇప్పుడు లేదు, కాని ఈ చిన్ని జ్ఞాపకాన్ని నేనిప్పటికీ పదిలంగా దాచుకున్నాను.
7
షోషా కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి సద్ధర్మ పుండరీక సూత్రాన్ని ఎంతగా పారాయణం చేసాడంటే అతడికి అతీంద్రియ జ్ఞానం కూడా సిద్ధించింది.
ఒక రోజతడు ఏదో ప్రయాణంలో ఒక సత్రంలో ఆగవలసి వచ్చింది. అక్కడ వంటగదిలో చిక్కుళ్ళు ఉడుకుతున్నాయి. కింద ఎందుచిక్కుడు తీగెల మంట. ఆ చిక్కుళ్ళు ఆ ఎండుపొట్టుతో అంటున్నాయి: మనం ఒకే కుటుంబానికి చెందినవాళ్ళం. కాని మీరేమిటి మమ్మల్నిట్లా క్రూరంగా మాడుస్తున్నారు! అని.
కింద చిటపటలాడుతున్న ఎండు చిక్కుడు తీగెలిట్లా జవాబిస్తున్నాయి: ‘మేమేమైనా మిమ్మల్ని కావాలని హింసిస్తున్నామా? మేమెందుకిట్లా మండిపోతున్నామో మాకు మాత్రం తెలుసా! మేమెంత నరకం అనుభవిస్తున్నామో ఆ దేవుడికే తెలియాలి!
8
మనం వసంతఋతువులో పూలు నిండుగా వికసించినప్పుడే చూడాలా? ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉన్నప్పుడే చంద్రుణ్ణి చూడాలా? వానకురుస్తున్నప్పుడు చంద్రుడికోసం ఎదురుచూడటం, నువ్వు నీ గదిలో పరదాలవెనక గడుపుతుండగానే నీకు తెలియకుండానే వసంతం తరలిపోవడం మరింత గంభీరంగానూ, మరింత హృదయోద్దీపంగానూ ఉండవూ. మరికొంతసేపట్లో వికసించనున్న పూలకొమ్మ, రాలిన పూలరేకులు పరుచుకున్న తోట కళ్ళకెంతో ఇంపు కలిగిస్తాయి.
‘విరబూసిన పూలని చూసినప్పుడు’, లాంటి ఇతివృత్తంతో రాసిన కవితలకన్నా ‘రాలిన పూలు చూడ్డానికి వెళ్ళినప్పుడు’, ‘ఏ కారణం చేతనో పూలతోటకి వెళ్ళలేకపోయినప్పుడు’ లాంటి ఇతివృత్తాలమీద రాసిన కవితలు ఏ మాత్రం తీసిపోతాయి!
రాలిన పూల గురించీ, అస్తంగమిత చంద్రుడి గురించీ దిగులు పడటం మానవస్వభావంలో ఉన్నదే కదా, కాని, సున్నితత్వం లోపించినవాళ్ళు కొందరు పూలు రాలిపోయాక ఇక ఆ కొమ్మలో చూడటానికేముందంటారు.
ఏ విషయంలోనైనా ఆద్యంతాలే ఎంతో హృదయంగమం అనిపిస్తాయి. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంటే కేవలం వాళ్ళ కౌగిలింతలేనా? కాదు. కలుసుకోకముందే విడిపోవలసి వచ్చిన ప్రేమికుల దుఃఖం, ఉల్లంఘించిన వాగ్దానాలు కలిగించే గాయాలు, తెల్లవారేదాకా నిద్రపట్టకుండా గడిపే ఒంటరితనపు సుదీర్ఘ రాత్రులు, దూరంలో ఉన్న ఆత్మీయుల గురించి పదేపదే తలెత్తే తలపులు, కూలిపోయిన ప్రేమ సౌధంలో రాలిపోయిన ప్రేమను తలచుకుని నిట్టూర్పులు విడిచే వనిత విషాదం -వీటన్నిటినీ కలుపుకునే కదా మనం ప్రేమానుభవమనేది…
విరబూసిన పూలూ, వెండి జాబిలీ కళ్ళతో చూడవలసిన అందాలు మాత్రమేనా? కాదు. వసంత ఋతువేళ నీ ఇంట్లో శయ్యమీద వాలి బయట అమృతం కురుస్తున్న రాత్రిని మనసారా ఊహించుకుని ఆస్వాదించడంలోనే మరింత తృప్తీ, మరింత సంతోషమూ ఉన్నాయి.
9
రాత్రి పూట వస్తువులూ, దృశ్యాలూ అందంగా కనబడవనేది ఎంత సిగ్గుమాట. నిజానికి వాటి శోభ, జిలుగు, ప్రదీప్తి రాత్రిపూటనే మరింత స్వాభావికంగా కనిపిస్తాయి.
10
ఋతువులన్నిటిలోనూ హేమంతమే హృదయాన్నెక్కువ కలచివేస్తుందని చాలామంది అనుకుంటారు. కాని నిజంగా హృదయాన్ని కలచేది వసంతమే. వాసంతసంతోషాన్ని గుండెనిండా పొదువుకున్న పిట్ట పాట, నును వెచ్చని ప్రాతఃసూర్యరశ్మిలో కంచెకింద చిగుర్లు తొడిగే చిట్టిపొదలు, రోజులు గడిచేకొద్దీ దూదిపింజల్లాగా విడిపోయే పొగమంచూ, వీటి మధ్య, నెమ్మదిగా రేకలు విప్పే తొలి చిగుర్లమీద ఏ క్షణాన్నైనా విరుచుకుపడనుండే వసంత వాన, ఈదురుగాలి. కొమ్మమీద ఆకులన్నీ పూర్తిగా తెరుచుకునేదాకా హృదయం కొట్టుకుపోతూనే ఉంటుంది కదా.
26-4-2016