హృదయానందం రెణ్ణాళ్ళ వేడుక

Reading Time: 3 minutes

290

అమృత సంతానం ఆరాధకుల్లో మరొక రసజ్ఞుడు వచ్చి చేరాడు. కవిత్వ రసవాది నౌదూరి మూర్తి గారు అమృతసంతానం చదువుతున్నారనీ, ఆయన ఒక విశ్లేషణ రాయబోతున్నారనీ వాసు నన్ను కొన్నాళ్ళుగా ఊరిస్తో ఉన్నాడు. రాత్రి ఆ వ్యాసం చదువుతోంటే, ఈ వాక్యాలకు వచ్చేటప్పటికి నా హృదయం కొట్టుకోడం ఆగిపోయింది:

‘హృదయానందం రెణ్ణాళ్ళ వేడుక. ఇవాళ కట్టి రేపు కూలదోసే కట్టడం. మట్టిలోని అంజనాన్ని దేహానికి పులుముకుని పనిచేస్తున్నారు మనుషులు.’

అక్కడ పని శబ్దం వినిపిస్తోంది.’

ఈ ఏడాదే ఇప్పటిదాకా శ్రీయుతులు సూరపరాజు రాధాకృష్ణమూర్తి, న్యాపతి శ్రీనివాసరావు, నరుకుర్తి శ్రీధర్, శ్రుతకీర్తి, జయతి లోహితాక్షన్, సుశీలా నాగరాజ ఈ పుస్తకపఠనానందాన్ని తమతో పంచుకున్నారు. అనిల్ బత్తుల వల్ల ఆ పుస్తకం ఎలక్ట్రానిక్ ప్రతి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో మరింతమంది రసజ్ఞపాఠకులు ఆ పుస్తకం చదవాలని నా కోరిక. చదివినవాళ్ళు తమ అభిప్రాయాలు రాస్తే, వీటన్నిటినీ ఒక పుస్తకంగా తేవచ్చని నా ఆలోచన.

ఇంతకీ అమృత సంతానం ఎందుకు చదవాలి? గిరిజనుల జీవితాల గురించి తెలుసుకోడానికా? అదొక ముఖ్య ప్రయోజనమే కాని, అదొక్కటే ప్రయోజనం కాదు.

ముఖ్యంగా మానవజీవితోత్సవం గురించిన ఇతిహాసం అది.

నవల ఇతిహాసం తాలూకు ఆధునిక రూపం అంటారు విమర్శకులు. కాని తెలుగువాళ్ళకి నవల రాయడమే రాదంటాన్నేను. ఎందుకంటే, తెలుగు వాళ్ళకి నవలలని కథలుగా చదవడమే తప్ప ఇతిహాసాలుగా చదవడం రాదు.

అవును. నేనీ మాట కొంత దుందుడుకు గా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు. కాని ఆవేదనతో రాస్తున్నానని గమనించండి. నవలా నిర్మాణం వేరు, కథా నిర్మాణం వేరు. ఈ మధ్య కొన్ని నవలలు, ప్రసిద్ధులు రాసిన నవలలే చదవవలసి వచ్చింది. ఈ పదేళ్ళలో వచ్చిన నవలలు. వాటిలో వస్తువు, శైలి, పాత్రలు-వాటన్నింటినీ అట్లా ఉంచి, వాళ్ళందరిలోనూ కనిపించిన ఒక సామాన్యగుణమేమిటంటే, వాళ్ళు నవల అంటే పొడవైన కథ అనుకుంటున్నారు. Epic proportions లో నవలరాయడమంటే ఒకరి కథనే అయిదారువందల పేజీలు రాయడంగా భావిస్తున్నారు. కాని, అది నవల ముఖ్యప్రయోజనాన్ని భంగపరిచే అంశం.

నవలలో కనీసం రెండు నెరేటివ్ లు ఉండాలి. అందులో ప్రధానమైన నెరేటివ్ కి విభిన్నమైన, విరుద్ధమైన గతిలో రెండో నెరేటివ్ సాగాలి. అప్పుడు మటుకే ఆ మొదటి నెరేటివ్ ను మనం అంచనా వెయ్యగలుగుతాం. కథ అలాకాదు, అది కేవలం single narrative మాత్రమే కాదు, single episodic కూడా.

అమృత సంతానం నవల్లో దివుడు సావొతా నెరేటివ్ కి సమాంతరంగా అతడి పినతండ్రి లెంజుకోదు నెరేటివ్ నడుస్తుంది. ఇద్దరికీ శరీరాలు చల్లారని తృష్ణ ప్రధాన లక్షణం. కాని అధికారం, యవ్వనం ఉన్న శరీరం దివుడిదైతే, అధికారంలేని,వృద్ధాప్యపు గడపలో ఉన్న శరీరం లెంజుకోదిది. లెంజుకోదుని మనం అర్థం చేసుకోగలం, జాలిపడగలం, అతడితో కలిసి ప్రయాణించగలం. కానీ దివుడు ప్రయాణాన్ని మనం అతడి భార్య పుయులానే నిరసిస్తాం, ఆగ్రహిస్తాం, దుఃఖిస్తాం- అన్నిటికన్నా ముఖ్యం, మనం కూడా అలా ఉంటున్నామా అని అలోచించుకుంటాం. ఉండకూడదు కదా అని మనకు మనం (ఎవరికీ వినబడకుండా) చెప్పుకుంటాం. లెంజుకోదు ప్రయాణం మనలో pityని రేకెత్తిస్తుంది, దివుడి మోహోన్మాదం మనలో fear ని రేకెత్తిస్తుంది. వెరసి, ఒక జీవితనాటకాన్ని సంపూర్ణంగా చూసిన అనుభూతి కలుగుతుంది.

మహాభారతం లాంటి మహేతిహాసంలో ఈ నెరేటివ్ లు వందలాది ఉంటాయి. అవి ఊరికే చెప్పుకుంటూ పోయిన కథలు కాదు. అందులో ప్రతి నెరేటివ్ కి మహాభారత ప్రధానకథతో సంబంధం ఉంటుంది. కొన్ని mirror narratives. వనపర్వంలో వచ్చే జంతు అనే వాడి కథ మహాభారతకథ తాలూకు సూక్ష్మలిపి. వనపర్వంలోనే తనను చూడవచ్చిన మునులతో తనలాగా కష్టాలు పడ్డవాళ్ళెవరేనా ఉన్నారా అని యుధిష్ఠిరుడు అడిగినప్పుడు అతడికి చెప్పిన నలుడి కథలో ఎంత కావ్యవ్యంగ్యం ఉందో మా మాష్టారు గొప్ప వ్యాసమే రాసారు. క్లుప్తంగా చెప్పాలంటే, అజ్ఞాతవాసంలో యుధిష్టిరుడు విరాటరాజుకి జూదంలో సహచరుడిగా, భీముడు వంటవాడిగా, అర్జునుడు బృహన్నలగా, నకులసహదేవులు పశుపాలకులుగా జీవించవలసి వస్తుంది. అయిదుగురు అన్నదమ్ములూ అయిదురకాలుగా అనుభవించిన న్యూనతను నలుడొక్కడే అనుభవిస్తాడు, జూదసహచరుడిగా, వంటవాడిగా, వికృతరూపిగా, రథాలు తోలేవాడిగా. మహాభారతంలో వచ్చే ప్రతి ఒక్క కథనీ, ప్రధానకథతో పోల్చి చూడవచ్చు. అలా చూడటానికే ఆ కథలన్నీ. అప్పుడే దాన్ని ఇతిహాసమంటాం.

ఆధునిక నవలలో కూడా ఈ రహస్యం తెలిసినవాళ్ళు మహారచయితలు కాగలిగేరు. అనాకెరినినా నవల చూడండి. అది అన్నా కెరినినా కథలాగా ఉంటుంది. కాని కాదు. నవల మొదలుపెడుతూనే రచయిత ‘అబ్లాంస్కీల కాపురంలో అంతా గందరగోళమైపోయింది’ అంటాడు. అది ఒక్క కరేనిన్ కుటుంబంలోనో లేదా అబ్లాంస్కీల వంశంలోనో మటుకే సంభవించిన సమస్య కాదు. మొత్తం పందొమ్మిదో శతాబ్ది రష్యా సమస్య అది. అందుకనే ఒక విమర్శకురాలు ఆ నవలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ నవల్లో మొత్తం ఇరవై కుటుంబాల కథలున్నాయని లెక్కగట్టింది. అందులో పన్నెండు కుటుంబాల కథలు రచయిత సవివరంగా చిత్రించేడనీ, చివరికి రెండు కుటుంబాలు మాత్రమే శాంతిగా ఉన్నట్టు ప్రతిపాదించేడనీ చెప్పింది. ఆ రెండు కుటుంబాల్ని అర్థం చేసుకుంటే టాల్ స్టాయి మనకి అర్థమవుతాడు.

గొప్ప నవలల్లో ఇతివృత్తం దానికదే ఒక మెటఫర్ గా మారిపోతుంది. ‘కరమజోవ్ సోదరులు’ నవలలో లాగా. అమృతసంతానం దివుడు పల్లపు పిల్ల పియొటి వెనక పడ్డ కథలాగా ఉంటుంది. కాని, అది గిరిజనసమాజం మైదానసంస్కృతి వ్యామోహంలో పడటం తాలూకు ఐతిహాసిక చిత్రణ అని అర్థమయితే, ఆ నవల కలిగించగల అంతర్దృష్టి అనుభవైకవేద్యంగా ఉంటుంది.

చాలా సంతోషం మూర్తిగారూ, పొద్దున్నే నాలో మళ్ళా ఈ భావసంచలనం కలిగించినందుకు.

15-11-2017

Leave a Reply

%d bloggers like this: