స్వర్ణ యుగద్వారం

Reading Time: 3 minutes

284

వల్లరి మా వాసు కూతురు. పన్నెండో తరగతి చదువుతోంది. మామూలుగా ఆ వయసు పిల్లలు అర్జున రెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉండే కాలంలో, ఆ బాలిక కవిత్వం రాస్తోంది. అది కూడా ఎట్లాంటి కవిత్వం!

నాకొక నాలుగు కవితలు పంపించింది చూడమని. ఆ నాలుగు కవితలూ ఆ చిన్నారి బాలిక విస్తృత మానసిక ప్రపంచపు పారిజాతపరిమళంతో గుప్పున వీచాయి. ఆ కవితలు నాలుగూ చదవగానే నాకు చప్పున తోరూదత్ గుర్తొచ్చింది. (కాని ఈ బాలిక పూర్ణాయుష్కురాలు, శతాయుష్కురాలు కావాలి!)

కవిత్వం ఎవరి తలుపు తట్టినా వాళ్ళ కౌమారంలో ఆ పిలుపు విన్నవాళ్ళు ధన్యులు. వాళ్ళ నవయవ్వనపు వెన్నెల రాత్రుల్లో ఆ అందెల చప్పుడు వినడంలో అపురూపమైన జన్మ సాఫల్యం ఉంటుంది. అప్పుడు మటుకే కవి ‘ఏను నిదుర వెన్నెలల దారి నొకరేయి వెడలిపోతి ఒక విపంచీ విరహ కంఠమెగసి ఎగసి ‘ అనగలుగుతాడు.

అదేమి దురదృష్టమో గాని, తెలుగు నేల మీద ఆ విపంచిని హృదయంతో వినగలిగేవాళ్ళే కరువైపోయారు. ప్రపంచమంతటిలోనూ, ఒక్క తెలుగులో మాత్రమే అభిప్రాయాలు చెప్పడమే కవిత్వంగా చలామణీ అవుతూంటుంది. తెలుగు కవులు కవులకన్నా ముందు సోషియాలజిస్టులుగా ఎక్కువ గుర్తింపు కోసం తపిస్తున్నట్టు కనిపిస్తారు.

ఒకప్పుడు పందొమ్మిదో శతాబ్దిలో యూరోప్ ఈ అవస్థ అంతా పడింది. కవులు హృదయాన్నీ, అనుభూతినీ కాకుండా అభిప్రాయాల్ని వ్యక్తీకరించడం ఎక్కువైపోయిందని గ్రహించాకనే సింబలిజం ఒక ఉద్యమంలాగా తలెత్తింది. ఆ తర్వాత సింబలిజంలో కూడా ఎంతో కొంత కృత్రిమత్వం ఉందని, దాన్ని భరించలేకనే, సర్రియలిజమూ, డాడాయిజమూ, మాడర్నిజమూ దావానలంలాగా ప్రపంచాన్ని ముంచెత్తాయి. ప్రపంచమంతా గొప్ప సోషలిస్టు కవులుగా ప్రసిద్ధిచెందినవాళ్ళు కూడా పాల్ ఎలార్డ్, పాబ్లో నెరూడా లాంటివాళ్ళు ముందు సర్రియలిస్టులు కాబట్టే వాళ్ళ సోషలిస్టు కవిత్వం అంత శక్తిమంతంగా వినిపించింది.

సామాజిక జీవితం గురించీ, పరిస్థితుల గురించీ, సమాజాన్నీ మార్చడం గురించీ తెలుసుకోవాలనుకుంటే, నేనొక సోషియాలజిస్టుదగ్గరికి పోవచ్చు. కానీ, నేను కవిని సమీపించేది, అన్నిటికన్నా ముందు నా గురించి తెలుసుకోవడానికి. కవి అద్దం లాంటి వాడు. నా నుంచి నేను దాచుకుంటున్న నా అంతరంగాన్ని ఎంతో సాహసంతోనూ, సున్నితంగానూ నా ముందు పెడతాడతడు. నా గురించి నేనెంత బాగా తెలుసుకుంటే, ప్రపంచం గురించి నాకంత బాగా అర్థమవుతుందని.

కవిత్వం సత్యమే చెప్తుంది గాని, ఎమిలీ డికిన్ సన్ అన్నట్టుగా, Tell all the Truth but tell it slant – అని నమ్మేవాడే కవి.

అందుకనే హోవార్డ్ నెమరోవ్ కవిత్వాన్ని ఒక Protean encounter అన్నాడు. ట్రాయినగరం నుంచి ఇథాకా వెళ్ళిపోవడానికి సముద్రం ఒడ్డున చేరిన ఒడెస్యూస్ అన్నీ సమకూర్చుకున్నాడు, ఓడలు, నావికులు, తెడ్లు, తెరచాపలు, కాని సానుకూలంగా వీచే ఒక్క గాలి తప్ప. అతడికి అనుమానమొస్తుంది, తాను సముద్రాధిదేవతకి నైవేద్యాలు సరిగా సమర్పించలేదేమో అందుకనే గాలులు వీయడం లేదని. అతడు సముద్రతీరంలో ఉండే వృద్ధుడు ప్రోటియస్ ని పోయి అడుగుతాడు. ప్రోటియస్ వెంటనే జవాబు చెప్పడు, అనేక రూపాలు మారుస్తాడు. కాని ఒడెస్యూస్ పట్టు వదలడు. చివరికి ప్రోటియస్ ప్రసన్నుడై పోసీడాన్ కి నైవేద్యాలు సమర్పిస్తే గాలులు వీస్తాయని చెప్తాడు. ప్రోటియస్ కొత్తగా చెప్పిందేముంది, అందుకన్ని రూపాలు మార్చవలసిందేముంది? నెమరోవ్ ఈ కథని గుర్తు చేస్తూ మనకి చెప్పేదేమంటే, అది అచ్చంగా కవిత్వ స్వభావమని. కవిత్వ ప్రయోజనం కేవలం సత్యం చెప్పడం కాదు, నిన్ను అనేక అవస్థల్లో, అనేక దశల్లో తిప్పి తిప్పి అప్పుడు నీకు తెలిసిన ఆ సత్యాన్నే మళ్ళా నీకు కొత్తగా గుర్తు చెయ్యడం అని!

పదిహేడేళ్ళ బాలిక రాసిన ఆ నాలుగు కవితలూ చదవగానే నాకొక సారి మళ్ళా ఏ గ్రీకు సముద్రతీరంలోనో, ఏ పార్థెనాన్ మంటపం దగ్గరో, ఏ ఒలింపియా ప్రాంగణంలోనో తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ ఇంగ్లీషు మామూలు ఇంగ్లీషు కాదు, ఆ భాషని అంటిపెట్టుకున్న క్లాసికత నన్నాశ్చర్యపరిచింది.

With eyes bluer than Zeus’s realm,
She put the loveliest Sapphires to shame.
With a charisma like Poseidon,
She flew with the grace of the ocean

ఈ వాక్యాలు రాసినామె మన మధ్యనే పెరుగుతున్నదంటే నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఈమె ఏ పందొమ్మిదో శతాబ్ది ఫ్రాన్సులోనో, లేదా కలొనియల్ బెంగాల్లో ఏ విద్యాధిక కుటుంబంలోనో పెరుగుతున్న బాలిక కాదా! నాకూ తోరూదత్ గుర్తొచ్చిందంటే అందుకే. (ఇరవయ్యేళ్ళు తిరక్కుండానే తోరూదత్ A Sheaf Gleaned in French Fields (ఫ్రెంచి సస్యక్షేత్రాల్లో ఏరుకున్న గోధుమ కంకులు, 1876) వెలువరించింది. ఆ తర్వాత Ancient Ballads and Legends of Hindustan (1882)వెలువడింది. రెండు మహాఖండాల, ప్రాచీన యుగాల గాథల బంగారుకాంతితో వెలువడ్డ కవిత్వం అది. అట్లాంటి కవయిత్రి మళ్ళా కనిపించలేదు, ఇప్పటికీ- ఇక్కడా, ఇంగ్లాండులోనూ కూడా.)

వల్లరి కవిత్వం చదివాక నాకొక ఆగామి స్వర్ణ యుగం ద్వారం దూరంగా కనిపిస్తున్నది. ఆమెనడిగాను,నువ్వేమి చదివావు? హోమర్ నా, షేక్ స్పియర్ నా , కీట్స్ నా? ఆ వయసు పిల్లలు చదివే పాటి ఇంగ్లీషు సాహిత్యమే చదివిందామె. జె కె రౌలింగూ , జెఫ్రీ ఆర్చరూ. కానీ ఎక్కడినుంచి వచ్చింది ఈ భాష, ఈ భావనాబలం? మాటల మధ్యలో చెప్పింది, టోల్కిన్ ని పూర్తిగా చదివానని. అద్భుతం. కాని, టోల్కిన్ వల్ల ఆమె అద్భుతలోకాల్ని సందర్శించి వుండవచ్చు, స్వయంగా బహుభాషా వేత్త కాబట్టి, టోల్కిన్ ఆమెకి ప్రాచీన భాషల సుగంధాన్ని అంటించి ఉండవచ్చు. (ఒకప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులుగారు ఛందస్సు అంటే ఏమిటో తెలియని వయసులో ఒక కావ్యం రాసారు, తిక్కనని చదవడం వల్ల తానా కావ్యం రాయగలిగానని ఆయన చెప్పుకున్నారు. తర్వాతి రోజుల్లో ఆయనకి అది పాఠ్యగ్రంథం కూడా అయ్యింది, అదంతా గొప్ప రోమాంచ గాథ).

కాని టోల్కిన్ వల్ల మాత్రమే ఆమె అంత అత్యున్నతస్థాయి కవిత్వం రాయగలదని నేననుకోను. బహుశా రెండు కారణాలుండవచ్చు. ఒకటి ఆమె మానసిక ప్రపంచం సముద్రంలాగా ఘూర్ణిల్లుతూ ఉండటం. రెండోది, తాను చూస్తున్న లోకాల్ని చూసింది చూసినట్టుగా నిజాయితీగా చెప్పగలగడం.

ఈ కవిత చూడండి, మీకే అర్థమవుతుంది:

CASTLE IN THE SKY

On dark, gloomy days
When the sky is lonely;
The sun gone
The moon is gone
The stars are gone
The clouds are gone
And the grieving sky is but
A reflection of my inner self
I look up,
To see my refuge.

A Castle in the Sky
That illuminated my void.
A world of utopian fantasies
Where the magic spell is Law.

It calls to me
But, the Castle
Is beautiful
And shines with brilliance
That rivals Helios himself.

Am I deserving of the Castle?
Because I am but a plain Liatris
Amidst hearty Hydrangea and
Soothing Statice.
Because I am but, a girl with a dagger
Amidst Princesses with scepters.

My conviction drowns
And qualms become buoyant
The Queen of the Castle
Is now visible to me.
She is everything the Castle is and more.
With grace, she frowns and then smiles.

The Realisation hit me like a magic spell,
The sun dawned in my sky
The Gateway to the Castle glittered
And it was crystal clear.

20-9-2017

Leave a Reply

%d bloggers like this: