స్టీలూ, పూలూ 

127

ఈ రోజు కాకినాడలో ఇస్మాయిల్ మిత్రులంతా కలుసుకుంటారు. ఆయన్ని తలుచుకుంటారు. ఆయన పేరు మీద ఈ ఏడాది యాకూబ్ రాసిన కవిత్వాన్ని గౌరవించుకుని దానిమీద కూడా మాట్లాడుకుంటారు. నేనూ అక్కడుండాలి, కానీ వెళ్ళలేకపోయాను. అయినా కూడా, వాళ్ళ మాటల్లో, నలుగురూ కూచుని నవ్వుకునే ఆ వేళల్లో నేను కూడా ఉన్నాను.

పొద్దున్నే నిద్రలేస్తూనే ఇస్మాయిల్ గారి గురించిన తలపుతో పాటు ధారాళమైన ఎండ, బాండుమేళంలాగా పూసిన బోగన్ విల్లై తీగా గుర్తొచ్చాయి.

నా చిన్నప్పుడు మా గ్రామాల్లో గ్రామీణుల్ని చూసేవాణ్ణి, ఏదైనా తాగడానికిస్తే, ఎంతో అపురూపంగా తాగేవారు. కంచెపక్కనో, గోడవారనో కూచునేవారు. ఒద్దిగ్గా తమని తాము సర్దుకునేవారు.ఆ ఇచ్చిందేదో, తేనీరో, మజ్జిగో, చివరికి మంచినీళ్ళైనా సరే, గొంతులో పోసుకునేవారు. అప్పుడే రెండు లేతాకులు తొడిగిన మొక్క కుదుళ్ళలో ఎట్లా నీళ్ళు పోస్తామో అట్లా. ప్రతి ఒక్క జలకణం సూటిగా జీవనమూలాల్ని తాకేటట్టుగా, అదే ఆ క్షణమే తాము పూర్తిగా జీవిస్తున్నట్టుగా, జీవిస్తున్నందుకు ధన్యత చెందుతున్నట్టుగా. ఒక్క గ్లాసు మజ్జిగ తాగడంలో వాళ్ళు స్ఫూర్తి చెందిన మహాజీవనానుభూతి ఇస్మాయిల్ గారు జీవితం పొడుగునా అనుక్షణం అనుభవంలోకి తెచ్చుకున్నట్టే గుర్తొస్తున్నారు.

ఆయనలో నగరానికి చెందనిదేదో బాగా కనబడేది. హాన్ షాన్ లాంటి ప్రాచీన చీనాకవితోనో, ర్యోకొన్ లాంటి జపనీయ సాధువుతోనో మాట్లాడుతూ ఆ మాటలమధ్యలోనే మనమధ్యకు వచ్చేసినట్టే కనిపించేవారు.

కాని ఆయనే లేకపోతే, ఈ నగరాలపట్లా, ఈ నాగరికాధునిక జీవితం పట్ల మనకీ స్పష్టత కలిగిఉండేదా? సౌందర్యమే సత్యమని ఎక్కువకాలం నమ్మలేక, ప్రకృతినుంచి వికృతి వైపు మళ్ళిన పాశ్చాత్య కవులు బోధపడిఉండేవారా?

ఒక జపనీయ కవయిత్రి హైకూనొకటి ఆయన మనకందించారు:

రేవులో సాయంకాలం-
స్టీలూ, పూలూ
కలిసిన వాసన.

బహుశా ఇస్మాయిల్ గారిని ఒక్క గుక్కలో స్వీకరించమంటే, ఈ వాక్యాలు ఆయన్ని పూర్తిగా ఆస్వాదయోగ్యం చేస్తాయనుకుంటాను.

ఒకప్పుడు టాగోర్ తనను తాను ప్రింటింగ్ ప్రెస్ యుగంలో జన్మించిన కాళిదాసుగా అభివర్ణించుకున్నాడు. ఈస్టిండియా కంపెనీవాళ్ళు నిర్మించుకున్న రేవు పట్టణమెక్కడ! కొంచెం పొగ, కొంచెం వెలుతురు, కొంచెం గాలి, కొంచెం నీళ్ళు కలగలిసిన మేఘప్రయాణమెక్కడ? గొప్ప సౌందర్యాన్ని ప్రకృతిలో చూసాడనుకున్న ప్రతి కవీ తన కాలంలో అసమానమైన వ్యథని అనుభవించే ఉంటాడు. వేదకాల ఋషికూడా అదృశ్యమవుతున్న అరణ్యాన్ని ఉద్దేశించి ఒక సూక్తం చెప్పకుండా ఉండలేకపోయాడు. ప్రతి యుగంలోనూ పూలకోసం చాచిన దోసిట్లో పూలతో పాటు రాగి,ఇనుము, స్టీలూ ఏదో ఒక లోహం కలగలుస్తూనే ఉంది. కొందరు కవులు ఆ పూలనట్లానే వదిలిపెట్టి ఆ లోహశకలాన్నొక ఆయుధంగా మార్చుకోవడం గురించి తాపత్రయపడ్డారు. కాని కొందరు, ఒక వాల్మీకి, ఒక కాళిదాసు, ఒక కీట్సు, ఒక టాగోర్, ఒక కృష్ణశాస్త్రి, ఒక ఇస్మాయిల్, ఆ పూలనట్లానే మనదాకా బహుజాగ్రత్తగా పట్టుకొస్తున్నారు.

మనముందు తమ దోసిలి చాచి ‘చూడండి, ఈ పూలతో, స్టీలు కూడా కలిసిందని మర్చిపోకండ’ ని చెప్తున్నారు. పూలతో ముళ్ళు కలిసి ఉండటం ప్రకృతి. పూలవాసనతో స్టీలు వాసన కలవడం వికృతి, కానీ దీన్నే మనం సంస్కృతి అని కూడా అంటామని గుర్తుచేస్తున్నారు

రాజమండ్రిలో సమాచారం మేడ మీద శరభయ్యగారు అద్దెకున్న రోజుల్లో, సాయంకాలాలు, ఆయన నన్నయ పద్యాలో, సంస్కృత శ్లోకాలో వినిపిస్తున్నప్పుడు, వినిపిస్తున్నంతసేపూ, కింద నాళం భీమరాజు వీథిలో బరువులు మోసేవాళ్ళ అరుపులు, బళ్ళ చప్పుళ్ళు, అదమాయింపులు, గొడవలు, కేకలు వినబడుతూనే ఉండేవి. ఆ భావుకుడు జీవితకాలం పాటు తన హృదయం మీద సానతీస్తో వచ్చిన కావ్యాస్వాదనాచందనసుగంధంతో పాటు జనపనార సంచుల వాసన కూడా అట్లా కలిసిపోయే నాకు గుర్తుండిపోయింది. కాని ఆ దుమ్ము, ఆ రొద, ఆ జనసమ్మర్దం, వాటినే ఆయనా ప్రేమించాడు, ఇస్మాయిల్ గారూ ప్రేమించేరు.

ఎందుకని?

మనం అడుగుతామని తెలుసుకాబట్టే మహమూద్ దర్వేష్ రాసిన ఈ కవితను జవాబుగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు:

మట్టితో నా పద్యాలు
మలచిన రోజున
పచ్చని చేలకి స్నేహితుణ్ణి

తేనెగా నా పద్యాలు
మారిన రోజున
మూతిపై ఈగలు మూగాయి.

28-11-2015

Leave a Reply

%d bloggers like this: