సీసపద్యం

151

కవిత్వం కోసం నెట్ బ్రౌజ్ చేస్తూ ఉంటే, Six Masters of Spanish Sonnet అనే పుస్తకం కనిపించింది. ఇట్లా తెలుగులో కూడా ఒక ఛందస్సులో గొప్ప కవిత్వం రాసిన వారి గురించి ప్రపంచంలో ఎవరేనా వెతుక్కుంటారా అనే ఆలోచన వచ్చింది.

అలా వెతుక్కోవడానికి ఏ ఛందస్సుగురించి మనం చెప్పుకోవచ్చు? ఐరోపీయ భాషలకి సానెట్ లాగా, పారశీకంలో గజల్ లాగా, తెలుగువాళ్ళు చెప్పుకోదగ్గ ఛందోరూపమేది?

కందం అంటారేమో చాలామంది.

కాని నా వరకు నేను సీసమనే అంటాను. అవును, పదహారణాల తెలుగు ఛందోవిశేషం సీసపద్యమే. తెలుగు పద్యరూపాలన్నిటిలోనూ పెద్దది కావడం వల్లనే కాదు, అంత versatility ఉన్న ఛందస్సు ప్రపంచభాషల్లోనే మరొకటి కనిపించదు.

హోమరిక్ హెక్సామీటర్, అయాంబిక్ పెంటామీటర్, ఫ్రెంచి అలెగ్జాండ్రిన్, అనుష్టుప్పు, పారశీక మస్నవీ ల కన్నా ఎక్కువ వైవిధ్యాన్నీ, సామర్థ్యాన్నీ చూపించగలిగిన ఛందోపాదంగా సీసాన్ని నేను అభిమానించకుండా, ఆరాధించకుండా ఉండలేను.

ఒక తొమ్మిదో శతాబ్ది శాసనంలో మొదటిసారి కనిపించిన సీసం వెయ్యేళ్ళ కాలంలో అద్భుతమైన ప్రయాణం చేసింది. మహాప్రతిభామూర్తులైన ప్రాచీన, ఆధునిక కవులు దాన్ని తెలుగువాడి నిలువుటద్దంగా తీర్చిదిద్దేరు. స్వతహాగా తెలుగువాడు ఏదైనా నోరారా చెప్పుకోవాలనుకుంటాడు, చెప్పుకోడమంటూ మొదలుపెడితే ఒకపట్టాన ఆగడు. చెప్పినమాటనే మళ్ళా మళ్ళా నాలుగు సార్లు నాలుగు రీతుల్లోనూ చెప్పాలనుకుంటాడు. ప్రేమ, ప్రశంస, స్తుతి, నింద, వర్ణన, ఉత్కంఠ- ఏ భావోద్వేగాన్నైనా సీసం చెప్పినంత కడుపారా, నోరారా మరే ఛందస్సూ చెప్పలేదంటే అతిశయోక్తి కాదు.

నన్నయ భారతంలో 250 దాకా సీసపద్యాలు చెప్పాడు. చిత్రంగా ఆయన, కథాకథనానికి జాత్యుపజాతుల్నీ, వర్ణనకి వృత్తపద్యాల్నీ వాడుకున్నాడు. బహుశా తన ముందు ప్రజలపాటల్లో నలిగిన సీసాన్ని దంపుడుపాట స్థాయినుంచి పైకి లేపడం కోసం ఆయన దాన్ని కథాకథనం కోసం విరివిగా వాడుకున్నాడు. కాని, భావోద్వేగ మాధ్యమంగా కూడా సీసాన్ని ఆయన ఎట్లా వాడుకున్నాడో, ఈ పద్యమొక ఉదాహరణ (అరణ్య, 2:94):

సహకార మత్ర్పియ సహకారు పున్నాగ
పున్నాగు తిలకు భూ భువన తిలకు
చందన బుధహరి చందన పుష్పితా
శోక సుహృజ్జన శోకదమను
వకుళ కులైక దీపకు విభీతక భయో
పేతార్తి హరు నలు ప్రీతి తోడ
కానరే కానలలోన లోకోత్తరునని
మ్రాని మ్రానికి అరిగి అరిగి

యడుగునడుగు లెండబొడవొడ పొక్కిన
నిర్ఝరాంతరముల నిలుచు పొలుచు
గిరులదరుల యెడల నురుగు గుహాగృహముల
తొంగి తొంగి చూచు తోయజాక్షి.

తిక్కన పద్యనిర్మాణంలో నాటకీయత కోసం చూడాలి తప్ప, నడకకోసం కాదని కొందరంటారు. కాని సీసపద్యానికి నిజమైన నడక నేర్పినవాడు తిక్కన. వెయ్యికి పైగా ఆయన అల్లిన సీసాల్లో ఈ పద్యం (విరాట,2:205) చూడండి. ఖాపియా రదీఫులు పాటిస్తున్న గజల్ లాగా లేదూ!

తొడరిన హరునైన దోర్బలంబున తన్ను
మిగులంగ నీడను మేటిమాట
అమరేంద్రు నర్థాసనమునకునైన న
ర్హుండెంతయునను రూఢిమాట
జమునిల్లు సొచ్చిన జంతువునైనను
కాచు నెమ్మెయి నను రాచమాట
తనుగోరి యూర్వశి తానవచ్చిన నైన
లోలుండు కాడను మేలిమాట

శౌర్యవైభవ ప్రాభవశౌచములకు
ఒరులకైన కైవారమై ఉల్లసిల్లు
ఒక్కరునికివి యెల్లను నిక్కమట్టె
యెందు కలుగునె అర్జును నీడువాడు.

ఈ పద్యంలో ‘మేటిమాట’, ‘రూఢిమాట’, ‘రాచమాట’, ‘మేలిమాట’ అనే పదాల్ని ఎందుకలా ప్రయోగిండు అన్నదాని మీద మా మాష్టారొక గంట ప్రసంగించడం నాకింకా గుర్తుంది.

తిక్కన ఒరవడిలో, సీసంలోని potential ని పూర్తిగా వెల్లడి చేసినవాడు నాచన సోమన. ఆయనదాన్ని ఒక వైపు పూలగుత్తిగా, మరొకవైపు స్వర్ణహారంగా, ఇంకొక వైపు వాడిబాణంలాగా తీర్చిదిద్దాడు. దేశిఛందస్సులకి కూడా classical stamina ఉందని నిరూపించడం కోసం, పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో ఉపనిషన్మంత్రాల్ని ద్విపదపంక్తులుగా మార్చేస్తే, నాచన సోమన సీసాన్నొక వేదసూక్తంగా మార్చేసాడు. ఈ పద్యం (ఉత్తర, 2:218) చూడండి:

ప్రణుతింతు నోం నమో భగవతే వాసు దే
వాయ, నమో భక్తవత్సలాయ
సూర్యాత్మనే నమ, స్సోమాత్మనే నమః
ప్రణవాత్మనే నమో, బ్రహ్మణే న
మో, రుద్రనామ్నే నమో, విష్ణవే నమో
మూల ప్రకృతయే నమో, వసుంధ
రాది భూతగణానుహారి భాసే నమో
మాయామయాయ నమ, స్సహస్ర

బాహునేత్ర శిరః పాదవస్తయే న
మో, వషట్ స్వధా, స్వాహాత్మ మూర్తయే న

మః స్వభావ శుద్ధాయ నమః ప్రహరణ
ధారినే నమో యనుచు నుదాహరింతు

ఇక ఆ తరవాత, పదిహేను, పదహారు శతాబ్ది మహాకవులకి సీసపద్యంలో unlimited possibilities తెరుచుకున్నాయి. సీసానికి శ్రీనాథుణ్ణి గుర్తు చేసుకుంటారు, కాని అతడికి సోమన్ననే దారి చూపించాడు. అటు సంస్కృతంలో,ఇటు అచ్చతెలుగులో, అటు గంభీర భావ ప్రకటనకీ, ఇటు సౌకుమార్యానికీ, దేనికైనా సీసం వెన్నలాగా ఒదిగిపోయింది. పురాణ,ప్రబంధ యుగాల మధ్య సాంధ్యభాషగా శ్రీనాథుడి సీసం (శృంగార, 1:5) కనిపిస్తుంది.

సింహాసనము చారు సితపుండరీకంబు
చెలికత్తె జిలువారు పలుకు చిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు
పసిడి కిన్నెర వీణ పలుకు తోడు
నలువ నెమ్మోము, తమ్ములు కేళీ గృహములు
తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణ స్థలములు
చక్కని రాయంచ యెక్కిరింత

యెపుడు నేదేవి కాదేవి ఇందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంత వీథి
నిండువేడుక విహరించుచుండు గాత.

సీసపద్యంలో ఎన్ని కావ్యవ్యూహాలకి అవకాశం ఉందో అన్నిటినీ ప్రయోగించి చూసినవాడు పోతన. ఈ పద్యనిర్మాణం (భాగ, 7:169) నాకెప్పుడూ ఆశ్చర్యాతి ఆశ్చర్యాన్ని కలిగిస్తూంటుంది:

కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషసాయికి మొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి, హరి చేరుమనియెడు తండ్రి తండ్రి.

పెద్దన చేతుల్లో సీసం ప్రపంచసాహిత్యంలోనే అత్యున్నతస్థాయి కవిత్వానికి వాహికగా మారిపోయింది. ఈ పద్యం (మను, 6:29) చూడండి.

చలిగాలి బొండుమల్లెల పరాగము రేచి
నిబిడంబు సేసె వెన్నెల రసంబు
వెన్నెల రసముబ్బి వెడలించె దీర్ఘికా
మందసౌగంధిక మధునదంబు
మధునదంబెగదోసె మాకందమాలికా
క్రీడానుషంగి భృంగీరవంబు
భృంగీరవం బహంకృతి తీగె సాగించె
ప్రోషితభర్తృకా రోదనముల

విపిన వీథుల వీతెంచె కుపితమదన
సమద భుజ నత సుమధనుష్టాంకృతములు
సరస మధుపాన నిధువనోత్సవ విలీన
యువతి యువకోటి కోరికల్ చివురులొత్త.

గొప్ప సంఘర్షణని, ముఖ్యంగా ఆత్మసంవాదాన్ని చిత్రించగలిగేదే గొప్ప కవిత్వమనుకుంటే, సంవాదానికీ, ఆత్మసంవాదానికీ మధ్య హద్దులు చెరిగిపోయిన గొప్ప పద్యం, ఈ పద్యాన్నిమించి, నాకిప్పటిదాకా తారసపడలేదు. శ్రీకృష్ణదేవరాయలు దాసరినోట పలికించిన మాటలు (ఆముక్త,6:61):

దిక్పాలతనువెత్తి తిరిపంపు తను తోన
ఎన్నిమార్లెత్తమీ యేను నీవు
ధరణీశ తనువెత్తి దాస్యంపు తను తోన
ఎన్నిమార్లెత్తమీ యేను నీవు
కేసరి తనువెత్తి కీటంపు తను తోన
ఎన్ని మార్లెత్తమీ యేను నీవు
మాతంగ తనువెత్తి మశకంపు తను తోన
ఎన్ని మార్లెత్తమీ యేను నీవు

సోమయాజులమెన్ని మార్ల్గాము, శ్వపచ
ఖగకులులమెన్ని మారులు గాము, పాము
గాములము నెన్ని మారులు గాము, వెండి
కంస రిపు భక్తులమొకండె కాముగాని.

కవిత్వమంటే ఒకప్పుడు వర్ణనాత్మకం,కథనాత్మకం. ఆధునిక యుగంలో అది భావనాత్మకం, అభిప్రాయప్రకటనాత్మకం. ముఖ్యంగా self expression కి సాధనం. అప్పుడు కూడా సీసమే ముందు వరసలో నిలబడుతుందనడానికి ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. జాషువా చెప్పుకున్న ఈ పద్యం చూడండి:

తెలుగు వాజ్మయ లక్ష్మి కలికి దేహమునందు
కలదు నా నిర్మాణ కలన కొంత
నూరు రేకుల నేటి భారతీ ప్రసవాన
తొరగు నా తేనెబిందువులు కొన్ని
సకలాంధ్ర కవికోటి జాబితాలోపల
నా నామమునకు స్థానంబు కలదు
పండితుల్ మెడజుట్టి పంపిన బిరుదంబు
లున్నవి నా కడ నొకటి రెండు

కవికి వలసిన కొన్ని లక్షణములెట్లొ
పెద్దలయనుగ్రహమున లభించెగాని
ధాత్రి నిశ్చింతముగ జీవయాత్ర గడుపు
లక్షణము లేదుగద, విక్రమక్షితీంద్ర!

Great Masters of Telugu Sisam అనే ఒక పుస్తకం ఇంగ్లీషులో చూసే రోజెప్పుడో కదా!

13-9-2016

Leave a Reply

%d bloggers like this: