సాహిత్య విలాసం

154

చాలా ఏళ్ళ కిందట, అంటే, 1983 లో నా ఇరవయ్యవ పుట్టినరోజు నాడు, నా కాకినాడ మిత్రుడు, సున్నిత హృదయుడు సి.ఎస్. నాకొక పుస్తకం బహుమతిగా ఇచ్చాడు. అది టాగోర్ ఉత్తరాల ఇంగ్లీషు అనువాదం. Glimpses of Bengal: Selected Letters 1885-95 .

పట్టుమని నూట యాభై పేజీలు కూడా లేని ఆ చిన్న పుస్తకం, ఇన్నాళ్ళకు, అంటే, 33 సంవత్సరాల తర్వాత చదవగలిగాను. బహుశా నా మిత్రుడు ఆ కానుక ఇవ్వడం కూడా అతడు నాకొక ఉత్తరం రాయడంలాంటిదే అనుకుంటే, ఆ ఉత్తరం ఇన్నాళ్ళకు పూర్తిగా చదివానన్నమాట.

ఆ ఉత్తరాలు రవీంద్రనాథుడు ‘టాగోర్’ గా ప్రఖ్యాతి పొందక ముందు రాసినవి. ఆయనే ముందుమాటలో రాసుకున్నట్టుగా:

‘యవ్వనం తీరికతోనూ, అత్యుల్లాసంతోనూ పొంగిపొర్లే కాలం కాబట్టి, ఏదో దైనందిన వ్యవహారం కోసం కాకుండా ఉత్తరాలు రాయడం నాకు గొప్ప సంతోషంగా ఉండేది. ఆలోచనలూ, అనుభూతులూ అతిశయించినప్పుడే ఇటువంటి సాహిత్య విలాసం సాధ్యపడుతుందనుకుంటాను.’

ఈ ఉత్తరాలు ఆయన తన అన్న కూతురు ఇందిరాదేవి కి రాసాడు. వీటినుంచి ఏరికూర్చిన కొన్ని ఖండికల్ని ‘ఛిన్నపత్ర’ పేరిట వెలువరించాడు. Glimpses of Bengal ఆ ఉత్తరాల ఇంగ్లీషు అనువాదం. అయితే, ఉత్తరాల పూర్తి సంకలనం ‘ఛిన్నపత్రావళి’ (1960) పేరుతో మళ్ళా వెలువడింది. ఈ మధ్యనే ఆ ఉత్తరాల్ని పూర్తిగా Letters From A Young Poet 1887-1995 (పెంగ్విన్, 2014) పేరిట రోసింకా చౌధరి అనే ఆమె ఇంగ్లీషులోకి అనువదించారు.

ఒక జమీందారుగా టాగోర్ తూర్పు బెంగాల్ నుంచి ఒరిస్సాదాకా ఉన్న తమ భూములూ, ఎస్టేట్లూ చూసుకోవడానికి చేసిన ప్రయాణాల్లో రాసిన ఉత్తరాలవి. నదులూ, సరసులూ, మైదానాలూ, గ్రామాలూ, సూర్యాస్తమయాలూ, వెన్నెలా, మబ్బులూ, వర్షాల మధ్య రాసుకున్న ఉత్తరాలవి.

ఆ ఉత్తరాలు చదువుతూంటే, నా యవ్వనకాలంలో కూడా అనుభూతి అతిశయం వల్ల నేను కూడా ఇట్లా ఉత్తరాలు రాసుకున్నది గుర్తొచ్చింది.

నా బాల్యంలోనూ, యవ్వనంలోనూ నేను కొన్ని వందల ఉత్తరాలు రాసేను. వివిధ అవస్థల్లో, వివిధ స్థలాలనుంచి, వివిధ ఉద్వేగాల్లోంచి వందలాది ఉత్తరాలు రాసేను. నా ఉత్తరాలకి దాదాపుగా జవాబులుండేవి కావు, ఏ కొద్దిమంది మాత్రమో తిరిగి జవాబు రాసేవారు. కాని చాలా సార్లు అవి ఒకవైపే ప్రయాణించేవి. మరీ ముఖ్యం, యువతులకి రాసిన ఉత్తరాలు. ప్రతి ఉత్తరం ఒక కవితతో మొదలుపెట్టేవాణ్ణి, ఎన్నో రోజుల పాటు దానికి జవాబు వస్తుందని చూసేవాణ్ణి, జవాబు రాదని తెలిసేక, మరొక కవిత, మరొక ఉత్తరం. ఒకసారి, ఒకామె నేను రాసిన ఉత్తరాల్ని చింపివేసిందని తెలిసాక, చెప్పలేనంత వేదన అనుభవించాక (ఎందుకంటే, ఆ ఉత్తరాల్లో నా కవితలెన్నో ఉండిపోయేయి, వాటికెప్పుడూ కాపీలు రాసి పెట్టుకోలేదు) నేను చెయ్యగలిగిందల్లా మరొక దీర్ఘ కవిత రాయడమే.

అసలు ఎవరేనా ఎవరికన్నా ఉత్తరాలు ఎందుకు రాస్తారు? ఉభయకుశలోపరి కోసమే అయితే, ఉత్తరం మొదటివాక్యం తోటే ఆగిపోతుంది. అంతకన్నా కూడా ముఖ్యమైనదేదో, నేను చెప్పుకుందామనుకున్నా నా పక్కనెవరూ వినడానికి సంసిద్ధంగా లేరనుకున్నప్పుడే, ఎక్కడో సుదూరంలో ఉన్న హృదయానికి ఉత్తరాలు రాసుకోవడం మొదలుపెడతాం. కేవలం క్షేమవార్త కాదు. అంతకన్నా మించిన మరేదో ముఖ్యమైన వార్త అది.

బహుశా మనం రాసే రచనలన్నీ కూడా అట్లాంటి ఉత్తరాలే. ‘నా కవితలన్నీ ప్రపంచానికి రాసుకున్న ఉత్తరాలే’ నని ఎమిలీ డికిన్ సన్ అన్నదని ‘మో’ ఒకసారి నాతో అన్నాడు. (This is my letter to the world, that never wrote to me).

ఏళ్ళు గడిచేయి. జీవితంలోంచి ఉత్తరాలు అదృశ్యమైపోయ్యాయి కదా అనుకుంటూ ఉండగా, హఠాత్తుగా తట్టింది నాకు, ఇక్కడ నేను రాస్తున్నవి కూడా ఉత్తరాలే కదా అని. అయితే, ఈ ఉత్తరాలు ఏ ఒక్క మనిషికో రాసినవికావు, గోపీ చంద్ రాసిన ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’ లాగా ఇవి కూడా ప్రపంచానికంతటికీ ఉద్దేశించినవి. కాకపోతే ఇవి ఎప్పటికప్పుడు ‘పోస్టు’ చేస్తున్న ఉత్తరాలు, అదొక్కటే తేడా.

26-8-2016

Leave a Reply

%d bloggers like this: