సాహిత్య జగత్తు

Reading Time: 2 minutes

176

వైశాఖ ప్రభాతం. ఈ రోజు టాగోర్ పుట్టినరోజని అందరికన్నా ఎక్కువగా కోకిలకే గుర్తున్నట్టుంది, ఆకాశవీథిలో హడావిడిగా తిరుగుతూ అందర్నీ నిద్రలేపేస్తోంది.

నేను నా జీవితం పొడుగునా టాగోర్ వ్యామోహ పీడితుడిగా ఉన్నాను, అట్లా ఉండటాన్నే ఇష్టపడతాను. ఆయన సాహిత్యం ఇంగ్లీషులో, తెలుగులో వచ్చిందంతా చదివాను. కొన్ని పుస్తకాలు, గీతాంజలి లాంటివి నా జీవనపాథేయంలో ఎప్పుడో చేరిపోయాయి. ఆయన కవి, నవలాకారుడు, కథకుడు, నాటకకర్త, వ్యాసకర్త, చిత్రకారుడు, సంగీతవిద్వాంసుడు. కాని, అన్నిటికన్నా ముందు ఆయనొక గొప్ప పాఠకుడు. సాహిత్యప్రేమి. సహృదయుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞలోని తక్కిన ఏ పార్శ్వాలూ నాకు తెలియకపోయినా, గీతాంజలి లభ్యంకాకపోయినా, ఆయన రాసిన సాహిత్యవ్యాసాలు మటుకే నాకు దొరికిఉన్నా కూడా నన్ను టాగోర్ లాలస ఇంతగానూ పట్టిపీడించిఉండేదని చెప్పగలను.

ముఖ్యంగా ఈ రెండు పుస్తకాలూను.’కావ్య జగత్తు’, ‘సాహిత్య జగత్తు’.

వీటిని ఎవరో అజ్ఞాత సాహిత్యకారుడు ఇప్పటికి అరవై డభ్భై ఏళ్ళ కిందట బెంగాలీనుంచి తెలుగులోకి అనువదించాడు. వాటిని విశ్వసాహిత్యమాల సిరీస్ లో భాగంగా మహీధర జగన్మోహన రావుగారు ప్రచురించారు. మహీధర చేసిన మరొక మహోపకారం, ఆ పుస్తకాలకు ఇద్దరు రసజ్ఞులతో ముందుమాట రాయించడం. కావ్యజగత్తుకి మల్లంపల్లి శరభయ్యగారితో, సాహిత్యజగత్తుకి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారితో ఆయన రాయించిన ముందుమాటలు, తెలుగులో రవీంద్రసాహిత్యవిశ్లేషణకు కలికితురాయిల్లాంటివి.

ఆ రెండు పుస్తకాలూ ఎందుకు అపురూపమైనవంటే, ఆ వ్యాసాలన్నీ మనకి ఇంగ్లీషు అనువాదాల్లో లభ్యంకావడంలేదు. ఆ అజ్ఞాత సాహిత్యప్రేమికుడు వాటిని బెంగాలీనుంచి అనువదించడం వల్ల మనకి కలిగిన ఉపకారాలు రెండు: ఒకటి, ఆ వ్యాసాలు మనకి అందుబాటులోకి రావడం, రెండవది, టాగోర్ బెంగాలీ వాక్యవిన్యాసం, రమణీయ పదజాల సుగంధం నేరుగా తెలుగునేల మీదకూడా ప్రసరించడం.

ఈ రెండు చిన్నపుస్తకాలూ కూడా నేనెంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నా, కావ్యజగత్తు ఎప్పుడో నాకు తెలీకుండా ఎక్కడో తప్పిపోయింది. ఇన్నాళ్ళకు మళ్ళా ఆదిత్య ఈ లింకులు రెండూ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా నుంచి సంపాదించగలిగేడు. అయినా కూడా ఆ లోటు పూడనే లేదని చెప్పవచ్చు. కావ్యజగత్తుని స్కాన్ చేసేటప్పుడు ఆ ప్రభుత్వోద్యోగి ఎవరోగాని అతడు కనపరిచిన సోమరితనం వల్ల చాలా సరిసంఖ్యపేజీలు రెండు రెండు సార్లు స్కాన్ అయ్యి, అక్కడ ఉండవలసిన బేసి సంఖ్య పేజీలు స్కాన్ కాకుండా పోయాయి. అయినప్పటికీ, ఆ పుస్తకం, ఆ రూపంలో కూడా ఎంతో విలువైనదే. మా మాష్టారి ముందుమాట భద్రంగా ఉన్నందువల్లా, కనీసం మూడు నాలుగు వ్యాసాల వరకూ పూర్తిగా స్కాన్ అయినందువల్లా.

ఇక సాహిత్యజగత్తు చాలా విలువైన పుస్తకం. నా సాహిత్య ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ ఆ పుస్తకం నాకు మార్గదర్శనం చేయిస్తూనే ఉన్నది. ఎప్పుడేనా ఆ పుస్తకం తెరిచి ఒక పేజీ చదవగానే పొద్దుటి పూట వీచే పరిశుభ్రమైన గాలి నా హృదయాన్ని తాకినట్టుంటుంది.

ఈ ప్రభాతాన ఈ రెండు పుస్తకాలూ మీకందిస్తున్నాను. చదవండి. బహుశా, ఆ వాక్యనిర్మాణం, ఆ భాష మొదట్లో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాని రెండు మూడు పేజీలు చదివేటప్పటికి మీరు ఆగలేరు.

ఆ వ్యాసాల్లో రవీంద్రుడు భారతీయ సహృదయ పరంపరకు ఇరవయ్యవ శతాబ్ది వారసుడిగా కనిపిస్తాడు. ఉప్పెనలాగా విరుచుకుపడ్డ పాశ్చాత్య సభ్యతను అవగాహనకు తెచ్చుకుంటూ ఆ వెలుగులో మన సాహిత్యాన్నీ, మన సాహిత్యం వెలుగులో ఆధునిక జీవితాన్నీ, ఆధునిక సందర్భంలో సాహిత్యకారుల కర్తవ్యాన్నీ తెలుసుకుంటూ చేసిన రచనలవి.

ఒక్కమాటలో చెప్పాలంటే, తెలుగులో ఇటువంటి సమగ్ర సాహిత్యానుశీలన మనకి రానేలేదు. ఈ రెండు అనువాదాలతో ఆ లోటు తీరిందనిపిస్తుంది నాకు.

http://www.dli.ernet.in/handle/2015/373649

http://www.dli.ernet.in/handle/2015/329691

7-5-2017

Leave a Reply

%d bloggers like this: