సాంధ్యభాష

Reading Time: 4 minutes

142

వజ్రయానాన్ని విమర్శిస్తూ కబీరు రాసిన కవిత ఏదన్నా ఉందా అంటూ భాస్కర్. కె అడిగిన తరువాత, నేను మరికొంత అధ్యయనం చేయవలసి వచ్చింది. చూడగా, చూడగా కబీరు వజ్రయానులకి చాలానే ఋణపడి ఉన్నాడని అర్థమయింది.

బుద్ధుడి బోధనల్ని అనుసరించినవాళ్ళు స్థవిరవాదులుగానూ (వాళ్ళనే థేరవాదులనీ, హీనయానులనీ, శ్రావకయానులనీ కూడా పిలుస్తారు), మహాయానులుగానూ చీలిపోయిన సంగతి మనకు తెలుసు. బుద్ధుడి బోధనల్ని పాటించి ఒక మనిషి తనను సరిదిద్దుకోవడం ఒక జీవితకాలంలో సాధ్యమయ్యే సంగతి కాదని థేరవాదులు భావించారు. వాళ్ళ దృష్టిలో మనిషి కోరుకోగలిగిందీ, సాధించగలిగిందీ ఆ దారిలో సాగగల అర్హత సంపాదించడమే. అందుకని అర్హతులు కావడమే వాళ్ళు తమ ధ్యేయంగా పెట్టుకున్నారు.

కాని చుట్టూ ప్రపంచం దు:ఖంలో కూరుకుపోయి ఉండగా, ఒక మనిషి తన ముక్తి తాను వెతుక్కోవడాన్ని కొందరు గొప్ప ఆదర్శంగా భావించలేదు. వాళ్ళ దృష్టిలో వ్యక్తి ముక్తి, సంఘ విముక్తితో కలిసి కొనసాగవలసిన ప్రక్రియ. వాళ్ళని మొదట్లో మహాసాంఘికులు అన్నారు. తర్వాతి రోజుల్లో వాళ్ళే మహాయానాన్ని ప్రతిపాదించారు. మహాయానం ప్రకారం మనిషికి ఆదర్శం అర్హతుడు కావడం కాదు, బోధిసత్త్వుడు కావడం. ఈ ప్రపంచంలో చివరి జీవి కూడా విమోచన పొందే వరకూ తన విముక్తిని పక్కనపెట్టే కరుణామయుడు బోధిసత్త్వుడు. ( నా దేశంలో ఒక కుక్క ఆకలితో ఉన్నా కూడా నేను మోక్షాన్ని కోరుకోనని వివేకానందుడు అంటున్నప్పుడు ఆయన బోధిసత్త్వ ఆదర్శాన్నే మాట్లాడుతున్నాడు). మనిషి బోధిసత్త్వుడు కావడానికి పది రకాల గుణాల్ని అలవర్చుకోవాలని మహాయానులు భావించారు. వాటిని ప్రజ్ఞాపారమితలు అన్నారు.

కాని క్రీ శ. 5-6 శతాబ్దాలనాటికే ఈ రెండు ఆదర్శాలూ అసాధ్యాలుగానూ, ఆచరణీయంగాని అసత్యాలుగానూ చాలామంది బౌద్ధులు భావించడం మొదలుపెట్టారు. ఒక మనిషి అర్హతుడు కావడం కన్నా, బోధిసత్త్వుడు కావడం కన్నా ఒక గురువును నమ్ముకోవడం, తమను ఈ దు:ఖసాగరం నుంచి కడతేర్చే ఒక ‘తార’ ను నమ్ముకోవడం మేలనే భావన వజ్రయానానికి దారితీసింది. దీనికి బౌద్ధంలోని యోగాచారులు కొంత దారివేసారు. కాని తాత్త్విక నేపథ్యం విజ్ఞానవాద బౌద్ధులూ, మాధ్యమిక బౌద్ధులు సమకూర్చారు. ఈ ప్రపంచం అనిత్యం అని తెలిసిన తర్వాత, దృగ్గోచర ప్రపంచానికి శాశ్వతత్త్వం లేదని తెలిసాక, ఈ ప్రపంచాన్ని పక్కనపెట్టవలసిన అవసరం లేదనీ, తమ విముక్తికి దీన్నొక ‘ఉపాయం’ (సాధనం) గా వాడుకోవచ్చనీ వాళ్ళు భావించారు. ఈ ‘ఉపాయం’ (పుంలింగపదం), ‘ప్రజ్ఞ’ (స్త్రీలింగపదం) రెండింటి కలయికలోంచే తమ ముక్తి సాధ్యమవుతుందని భావించడంతో వజ్రయానం శాక్తేయంగా మారిపోయింది.

అయితే, క్రీ.శ ఎనిమిది-పది శతాబ్దాల మధ్య తూర్పు భారతదేశాన్ని పరిపాలించిన పాలవంశస్థుల కాలంలో బౌద్ధానికి మళ్ళా ఒక ఉచ్చ స్థితి లభించింది. బీహార్ నుంచి ఒరిస్సాదాకా విస్తరించిన పాలరాజుల పరిపాలనలో ఒరిస్సాలోని ఆదిమ మాతృదేవతారాధన వజ్రయానంతో కలిసి నూతన శాక్తేయ ధోరణులని సంతరించుకుంది. ఈ కాలంలో జరిగిన ప్రధాన పరిణామం సామాజికనిశ్రేణిలో మరింత దిగువనా, మరింత అంచుల్లోనూ ఉన్న దళితులకీ, ఆదిమజాతులకీ బౌద్ధం మరింత దగ్గరగా జరగడం. వాళ్ళ జీవితాలు కూడా మరింత దు:ఖపూరితంగా ఉన్నప్పటికీ, వాళ్ళనొక జీవితేచ్ఛ బతికిస్తూ ఉన్నదని బౌద్ధులు గుర్తించారు.

అది కేవలం స్త్రీ పురుష సమాగమం కేంద్రంగా సంభవించే జీవితలాలస కాదు. అంతకన్నా విశేషమైందో సాధారణ మానవుల జీవితాన్ని పరిపాలిస్తున్నదని బౌద్ధసన్న్యాసులు గుర్తించారు. దాన్ని వాళ్ళు ‘సహజం ‘అని పిలిచారు. సహజమంటే, ప్రకృతిసిద్ధంగా సంభవించేదని మాత్రమే కాదు, మనిషి ఉన్నదున్నట్లుగా జీవితాన్ని స్వీకరించేటప్పుడు, ఆ జీవితం, అదెంత దు:ఖపూరితంగా ఉండనివ్వు, నికృష్టంగా నైనా ఉండనివ్వు, ఆ సహజ స్థితిలో మరొక ఔన్నత్యం దానికదే సిద్ధిస్తున్నదని వాళ్ళు గుర్తించారు. సహజం, సహ+ జం కూడా. అంటే co-emergent అన్నమాట. రెండూ కలిసే ఉన్నాయి, కలిసే తలెత్తుతాయి, కలిసే అంతరిస్తాయి. అక్కడ సంసారంతో పాటే నిర్వాణం కూడా, నిర్వాణంతో పాటే సంసారం కూడా. రెండూ సహ+జాలే.

ఈ మెలకువ ఒక్కసారిగా వచ్చింది కాదు. సుమారు అయిదువందల ఏళ్ళపాటు వజ్రయానులు మానవదేహ మథనం చెయ్యగా, చెయ్యగా ప్రభవించిన మానాసామృతం. కొందరు బౌద్ధ సన్న్యాసులు ఆ మెలకువను అపభ్రంశ భాషలో కవితలుగా ప్రకటించారు. వాళ్ళని సిద్ధాచార్యులంటారు. (వాళ్ళమీద దక్షిణాది శైవ సిద్ధాచార్యుల ప్రభావం ఏదైనా ఉందేమో తెలియదు). కాని వాళ్ళు వాడిన అపభ్రంశ భాషనే ఇప్పటి బెంగాలీ, ఒరియా, అస్సామీ, విష్ణుప్రియ మణిపురీలకు మూలభాష.

వాళ్ళు చెప్పిన కవితలు ‘చర్యాపదాలు’ పేరిట నేడు లభ్యమవుతున్నాయి. 51 చర్యాపదాల్లో 47 పదాల్ని హరప్రసాద శాస్త్రి అనే పరిశోధకుడు 1907 లో నేపాల్లో మొదటిసారి కనుక్కోవడంతో, మధ్యయుగాల తొలి కాలానికి చెందిన తాత్త్వికచరిత్రలో కొత్త అధ్యాయం మొదలయిందని చెప్పవచ్చు.

ఆ చర్యాగీతాల్లో రెండు ధోరణులు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, కొందరు సిద్ధాచార్యులు, వజ్రయాన పద్ధతిలోనే, స్త్రీపురుష యోగోద్భవమైన జీవనరహస్యాన్ని వెతుక్కుంటూ ఉండగా, మరికొందరు సహజయాన పద్ధతిలో, సంసారనిర్వాణాలని దాటిన సహజస్థితిని అన్వేషించడం కనిపిస్తుంది.

మొదటి ధోరణికి ఉదాహరణగా గుండారిపాదుడనే యోగి చెప్పిన కవిత చూడండి (చర్యాపదం:4)

మూడు చక్రాల్నీ ఒత్తి, యోగినీ,
నన్ను కావిలించుకో,
పద్మాన్ని నలిపెయ్యి.
వజ్రా, సాయంకాల భోజనం సిద్ధం చెయ్యి.
యోగినీ, నువ్వు లేక నేనొక్క క్షణం కూడా బతకలేను,
నీ పెదాలు ముద్దుపెట్టుకుని,పద్మమకరందాన్ని జుర్రుకుంటాను,
రాపిడిమరక నిన్నంటుకోదు.
మణికులం ఎక్కి ఆమె ఆకాశంలో ప్రవేశిస్తుంది.
అత్తగారిగదిలో తాళం, తాళం చెవి పెట్టు,
సూర్యుడివీ, చంద్రుడివీ రెక్కలు తుంచెయ్యి.
గుండారిపాదుడు చెప్తున్నాడు: నేను శృంగారవీరుణ్ణి,
స్త్రీపురుషులమధ్య నా లింగోద్భవం.

కాని శరహాపాదుడి దృష్టి వేరేలా ఉంది. అతడు రెండవధోరణికి చెందినవాడు. అతడి కవిత చూడండి (చర్యాపదం: 22)

తన సంసార నిర్వాణాల్ని తానే సృష్టించుకుంటూ
మనిషి తనను తాను కట్టిపడేసుకుంటున్నాడు.
ఓ అజ్ఞాత యోగీ, నాకు నిజంగా తెలియదు,
జనమనమరణాలెట్లా సంభవిస్తాయో.
మరణం కూడా జననంలాంటిదే,
జీవించడానికీ, మరణించడానికీ మధ్య తేడా లేదు.
పుట్టుకకీ, చావుకీ భయపడేవాడు
కషాయమో, రసాయనమో వెతుక్కోవాలి.
కర్మచక్రంవల్ల మూడులోకాల్లోనూ
పరిభ్రమించేవాళ్ళెప్పటికీ అమరులు కాలేరు.

శరహాపాదుడు అద్భుతమైన కవి. ఒక రకంగా, ఆయనే మొదటి ఆధునిక భారతీయ కవి అని చెప్పవచ్చు.(అప్పటికింకా మధ్యయుగాలే పూర్తిగా మొదలవకపోయినా).

ఆయన జన్మత: బ్రాహ్మణుడు. ఒకరోజు సంతలో బాణాలు అమ్ముకుంటున్న ‘నిమ్నకుల’ స్త్రీని ఒకామెను చూశాడు. ఆమె ఒక ఇనప బాణానికి పదును పెడుతున్నది. ఏం చేస్తున్నావు నువ్వని అడిగాడతడు ఆమెని. ఆమె తలెత్తలేదు. ఆమె దృష్టంతా బాణానికి పదును పెట్టడం మీదనే ఉంది. అయినా అతడక్కడే నిలబడ్డాడు. ఆమె తలెత్తకుండానే ‘బుద్ధుడు చెప్పిందేమిటో సంకేతాల్తోనూ, చర్యలతోనూ అర్థం కావాలే తప్ప పుస్తకాలతోనూ, మాటల్తోనూ కాదు’ అంది. ఆ మాటలు అతడి హృదయాన్ని శరంలాగా తాకేయి. అతడికి జ్ఞానోదయమయ్యింది.

ఆమె మాటల్లో ఒక గోప్యత, ఒక సంకేతం ఉన్నాయి. అది మామూలు భాష కాదు. దాన్ని ‘సాంధ్యభాష’ (twilight language) అన్నారు. అది గుప్తభాష కూడా కాబట్టి ‘సంధాభాష’ (intentional language) అని కూడా అన్నారు. అదే కబీరు చేతుల్లో ‘ఉలట్ భాంసి ‘ (up-down language) గా మారింది. (ఆశ్చర్యంగా, మన కాలంలో కవిత్వ సింటాక్స్ ని ప్రతిఘటించిన కవి మోహనప్రసాద్ తన ఒక కవితాసంపుటికి ‘సాంధ్యభాష’ అని పేరుపెట్టుకున్నాడు).

శరహాపాదుడి దోహాలు ‘దోహాకోస’ పేరిట లభ్యమవుతున్నాయి. కొన్ని ఉదాహరణలు చూడండి (Buddhist Texts through Ages, edited by Edward Conze,1995, పే.224-239) :

దిసమొలతో ఉంటేనే ముక్తి దొరుకుందంటే
కుక్కలకీ, నక్కలకీ ముక్తి దొరకాలి.
జుత్తు బోడిచేసుకుంటే జ్ఞానం సిద్ధిస్తుందంటే
సుందరీమణుల పిరుదులే గొప్ప జ్ఞానులు.

ఆ జ్ఞానమేదో పైకితెలిస్తే ధ్యానంతో పనేమిటి?
అదిలోన దాగిఉంటే, చీకటికొలువుకాక మరేమిటి?
శరహా మొత్తుకుంటున్నాడు, సహజంగా
ఉన్నదానికి ఉనికీలేదు, లేకునికీ లేదు.

ఎవరికీవారు అనుభవించి తెలుసుకోవలసిందే,
కాబట్టి పొరపడకు దాని విషయంలో.
అది ఉందన్నా, లేదన్నా,
ఆనందమన్నా, ఒక గిరిగియ్యడమే.

మనసు విశ్రాంతి పొందినప్పుడు,
కాయబంధాలు తెగిపోయినప్పుడు,
సహజసంతోషం వెల్లివిరిసినప్పుడు,
చండాలుడులేడు, బ్రాహ్మణుడు లేడు.

దానికి నామరూపాల్లేవు, గుణగణాల్లేవు
అది చర్చిస్తే బోధపడేదీ కాదు.
మరి ఆ పరమేశ్వరుణ్ణి వర్ణించేదెట్లాగు?
రతిసుఖం గురించి కన్య చెప్పినట్టు.

ఈ పండితులంతా సిద్ధాంతాలు వల్లెవేస్తుంటారు,
తమ కాయంలోపలి బుద్ధుణ్ణి గుర్తుపట్టలేరు.
రాకపోకల్నిట్లా నిర్మూలించలేం, అయినా వాళ్ళు
సిగ్గులేకుండా ‘మేం పండితులం’ అంటూనే ఉంటారు.

అతడింట్లోనే ఉన్నాడు, అయినా ఆమె బయట వెతుకుతుంది,
అతడు కనిపిస్తూనే ఉంటాడు, పక్కింటాళ్ళను అడుగుతుంది.
శరహా మందలిస్తున్నాడు, మూర్ఖురాలా, నిన్ను నువ్వు
తెలుసుకో, మంత్రతంత్రాలు, మననధ్యానాలుపనిచెయ్యవు.

ఇది చదివాక మనకేమనిపిస్తుంది? ఎ.ఎల్. బాషమ్ రాసినట్టు,(The Buddhist Tradition in India, China and Japan, వింటేజి, 1972, పే.120) శరహా కవిత్వం వెనక్కి చూసేది కాదు, ముందుకే చూసింది. సుమారు నాలుగు శతాబ్దాల తదుపరి, అచ్చం ఆ మాటలే కబీరు మళ్ళా చెప్పాడు, ఈసారి హిందువుల్నీ, బౌద్ధుల్నీ; హీనయానుల్నీ, మహాయానుల్నీ ఉద్దేశించి కాదు, హిందువుల్నీ, మహ్మదీయుల్నీ ఉద్దేశించి.

కాయంలోనే సన్న్యాసం, గృహంలోనే విముక్తి, సంసారంలోనే నిర్వాణమంటూ బౌద్ధ చర్యాగీతాలు ప్రతిపాదించిన సహజయానం జయదేవుడు,చండీదాస్, విద్యాపతి వంటి వైష్ణవ సహజీయ భక్తికవుల మీదుగా మరొక పాయగా ప్రవహించింది.

కబీరుగానూ, వైష్ణవభక్తికవుల రూపంలోనూ ప్రవహించిన ఈ రెండు పాయలూ తిరిగి ఇరవయ్యవశతాబ్దంలో టాగోర్ లో ఒక్కటయ్యేదాకా.

18-12-2016

Leave a Reply

%d bloggers like this: