సప్తగోదావర జలము తేనె

137

రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తి టివి వారు రెండు కవిసమ్మేళనాలు షూటింగు చేసారు. పోయిన ఆదివారం చేసిన రికార్డింగులో నాకూడా చోటు దొరికింది. మేడసాని మోహన్ గారి నిర్వహణలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు, అద్దేపల్లి రామమోహనరావుగారు, యెండ్లూరి సుధాకర్ గారు, నందిని సిద్ధారెడ్డిగారు వంటి కవులతో పాటు నేను కూడా రెండుమూడు కవితలు చదివాను.

కవితలతో పాటు గోదావరిగురించీ, ఆంధ్ర, తెలంగాణా సాహిత్యాల గురించీ, ముఖ్యంగా రాజమండ్రి గురించి చాలానే ముచ్చట్లు నడిచాయి. గుణాఢ్యుడి బృహత్కథ, గాథాసప్తశతి మొదలుకుని, నన్నయ నుండి వీరేశలింగం, చిలకమర్తి, గరిమెళ్ళ దాకా ఎందరో కవులగురించి, కావ్యాల గురించి ఎన్నో ముచ్చట్లు.

కాని పదేపదే ప్రస్తావనకు వచ్చిన కవి శ్రీనాథుడు, దాదాపుగా అందరూ ప్రస్తావించకుండా ఉండలేకపోయినకావ్యం భీమఖండం. ఆరుద్ర ‘వేదంలా ఘోషించే గోదావరి ‘అన్న పాటలో ‘శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట’ అని ఊరికినే అనలేదనిపించింది. గోదావరి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా శ్రీనాథుడు పెద్దముచ్చటే. మరీ ముఖ్యంగా ఈ పద్యాన్ని కనీసం ముగ్గురేనా ఆ రోజు ప్రస్తావించేరు.

భీమఖండంలో ( 3:50) దక్షారామ క్షేత్రాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం:

ఆంధ్ర భూ భువనమధ్యంబు పుండరీకంబు
సప్తగోదావర జలము తేనె
బ్రహ్మసంవేద్యాది బహుతీర్థములు రేకు
లకరులు చారు దివ్యస్థలములు
నాళంబు లవణాబ్ధి వేలావిభాగంబు
కల్యాణ భోగమోక్షములు తావి
దక్షవాటీమహాస్థానంబు కర్ణిక
హంసంబు భీమనాయకుడు శివుడు

గౌతమీ సింధు కౌంతేయ కణ్వనదులు
దుల్యభాగయు నేలేరు దుమ్మికొనలు
భూవనసంభావ్యమైన ఈ పుణ్యభూమి
యనఘ! సంసార తాప శాంత్యౌషధంబు.

ఈ కవిత లో సాంప్రదాయిక లాక్షణికులు కోరుకునే సమగ్రత ఉంది, అధునిక కవిత్వాన్ని ప్రేమించేవాళ్ళు కోరుకునే visualization కూడా ఉంది. సాధారణంగా మనమొక ఉపమానాన్నో, రూపకాన్నో తీసుకుని కవిత మొదలుపెట్టినప్పుడు, దాన్ని సగంలోనే వదిలిపెట్టేసి మరో ఉపమానానికో, ఉత్ప్రేక్షకో వెళ్ళిపోతూంటాం. కాని ఒక మహాకవి తాను వర్ణించాలనుకున్న వస్తువుకి ఒక పోలిక తెచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా పోల్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ వర్ణనీయ వస్తువు మన హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది.

ఇక్కడ భీమఖండంలో ఉన్న భీమేశ్వరుణ్ణి వర్ణించడానికి ఒక తామరపువ్వునీ, హంసనీ పోలికతీసుకున్న్నాడు కవి. పద్మం సాధారణ కవిసమయమే అయినా దాన్ని వర్ణించిన తీరు వల్ల దానికొక కొత్తదనం సమకూరింది.

ఆ కొత్తదనం ఇప్పటికీ కొత్తగానే అనిపించింది. అది నిజంగా కొత్తదనం అవునో కాదో చూడాలని ఆ పద్యాన్ని ఇట్లా ఇంగ్లీషు చేసాను, చూడండి:

The midland of the Andhras spread like a white lotus
Where flows Godavari as honey.
Places of pilgrimage formed into petals,
various ritual spots, filaments.
The stem extends to the salty shore, and
Its fragrance felt in our being and beyond.

The place where once held
a terrible rite of an ancient lore
Now forms the style and the stigma,
While the Lord plays with the stalks as a swan.

With the rivers as the corners, the sacred space,
O friend, cools the heat of the worldly dust.

24-5-2015

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s