ఒక సాహిత్య కృతి ని పరీక్షించి అది సరిగా ఉందో లేదో చెప్పగలగడం ఒక జీవితకాలం పాటు తపసు చేస్తే గాని సాధ్యం కాదని లాంగినస్ అన్నాడని ఐ.ఏ.రిచర్డ్స్ రాసాడు. హంసలాగా బతకడానికి చేసే సాధనలోంచి మాత్రమే ఆ సదసద్వివేకం సాధ్యపడుతుంది. గొప్ప కవులూ, రచయితలూ గొప్ప మనుషులు కావాలని లేదుగాని, సద్విమర్శకులు సాధారణంగా సజ్జనులే అయి ఉండటం నేను నా అనుభవంలో తెలుసుకున్న సంగతి. నేను మాట్లాడుతున్నది సద్విమర్శకుల సంగతి. కవుల గురించి కాక, కావ్యాలగురించి మాత్రమే పట్టించుకున్నవాళ్ళ సంగతి. పల్లకీలవెంటపడకుండా, పదవుల వెంటపడకుండా, తన ఇంటిపట్టున, తనదే అయిన ఒక అలౌకిక కావ్యామృతాస్వాదనంలోనే తమను తాము మైమరిచినవారి సంగతి.
నా జీవితంలో అట్లాంటి మహనీయుల్ని కొందర్ని చూసాను. మల్లంపల్లి శరభయ్యగారు, ఆర్.ఎస్.సుదర్శనంగారు, వడలి మందేశ్వరరావుగారు, సామల సదాశివగారు, హీరాలాల్ కామ్లేకర్ గారు,-అట్లాంటి వారి సరసన చేరిన మరొక మహనీయుడు ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారు.
1986 లో మిత్రుడు రామసూరి విజయనగరంలో యువస్పందన తరఫున గురజాడ మీద ఏర్పాటు చేసిన ఒక గోష్ఠిలో కాళీపట్నం రామారావుగారూ, నేనూ మాట్లాడేం. ఆ రోజు చూసాను మొదటిసారి నరసింహమూర్తిగారిని. ఆ తర్వాత 87 లో నేను ఉద్యోగనిమిత్తం విజయనగరం జిల్లాకు వెళ్ళడం, నా ట్రయినింగులో భాగంగా విజయనగరంలో కొన్ని నెలలు గడపడం నాకు రామసూరితో పాటు నరసింహమూర్తిని కూడా ఎంతో సన్నిహితుల్ని చేసింది. విజయనగరం వీథుల్లో గురజాడ, ఫకీర్ మోహన్ సేనాపతిలగురించి; శ్రీ శ్రీ, నారాయణబాబు లగురించి; క్షేమేంద్రుడు, సూరన ల గురించి ఆయనతో మాట్లాడుకుంటూ తిరగడం నాకు లభించిన గొప్ప భాగ్యం. ఆ స్నేహసంపద, నేనా జిల్లానుంచి వచ్చేసిన తర్వాత కూడా పెరుగుతూనే వచ్చింది. ఆయన్ని నన్నూ, నన్ను ఆయనా ఒకర్నొకరం అభిమానించుకుంటూ వచ్చాం, ఆరాధించుకుంటూ వచ్చాం.
పోయిన ఏడాది ఏప్రిల్ లో ఆయన హటాత్తుగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే అనిపించింది. ఆయన జీవించి ఉండగా, నేనేమీ చెయ్యలేకపోయాను. ఆయన ‘గిరాంమూర్తి ‘కి విపులమైన పీఠిక రాయమని అడిగితే కవర్ పేజీ మాత్రమే డిజైన్ చెయ్యగలిగాను. ఏదో చెయ్యలేకపోయానన్న వేదన నన్నట్లానే అంటిపెట్టుకుని ఉండిపోయింది. అందుకని, ఈ ఏడాది నా సాహిత్యవ్యాసాల్ని ‘సాహిత్య సంస్కారం’ గా వెలువరించినప్పుడు ఆ పుస్తకాన్ని ఆయన స్మృతికి అంకితమిచ్చాను. ఆయన ఆ ప్రేమపూర్వక చర్యను అంగీకరించినట్టే ఉంది. అందుకని, అనుకోకుండా, మొన్న ఒకటో తారీకున విజయనగరంలో జరిగిన ఆయన 73 వ జయంతి వేడుకలో పాల్గొని ఆ పుస్తకాన్ని వారి శ్రీమతి ఉపాధ్యాయుల వెంకట రమణమ్మగారి చేతుల్లో పెట్టే భాగ్యం కలిగింది.
ఆ రోజు విజయనగరంలో కోటలో అరవిందాశ్రమంలో జరిగిన సాహిత్యసభకు అధ్యక్షత వహించడంతో పాటు డా.నరసింహమూర్తిగారి చివరి రచన ‘షానామా-మహాభారతం: తులనాత్మక పరిశీలన’ ను ఆవిష్కరించే అవకాశం కూడా నాకు లభించింది. ఆ మహనీయుడు స్వర్గంలోంచి కూడా నాతో సాహిత్యసంభాషణ చేస్తున్నాడనడానికి అదే నిరూపణ.
ఆ సభ సంతాపసభగాకాక,సాహిత్యసంతోష సభగా నడిచింది. ‘నలుగురు కూచుని నవ్వేవేళల’ తన పేరు తలవడం కన్నా ఏ కవీ, ఏ సహృదయుడూ కోరుకునేది మరేమీ ఉండదు కదా. ఆ సభలో కీలకోపన్యాసం చేసిన డా.సంగనభట్ల నరసయ్య డా.నరసింహమూర్తిగారి సాహిత్య కృషిని వివరించడంతో పాటు ఆయన సంస్కృతనాటక సమీక్షను వివరంగా సమీక్షించారు. దాంతో, భాసకాళిదాసాది మహారూపకకర్తలంతా కూడా ఆ సభకు వచ్చినట్లనిపించింది. సభలో పాల్గొన్న మరొక రసజ్ఞుడు మోదుల రవిక్రిష్ణ షానామా-మహాభారత పరిశీలన పుస్తకాన్ని సభకు పరిచయం చేసారు.
ఒక సాహిత్యకృతిని వివేచించడం ఒక జీవితకాల తపఃఫలితమని లాంగినస్ అంటే, రెండు సాహిత్య కృతుల్ని పోల్చడం రెండు జీవితకాలాల తపస్సు అనాలా? నరసింహమూర్తి అరుదైన రత్నపరీక్షకుడు. క్షేమేంద్రుని ఔచిత్యం మీద డాక్టొరల్ పరిశోధన చేసినవాడు. ఆయన షానామాను వ్యాసమహాభారతంతో కాక, కవిత్రయ మహాభారతంతో పోల్చడంలో ఎంతో ఔచిత్యం ఉందనిపించింది. ఆ రెండు రచనలూ కొద్దిగా అటూ ఇటూగా ఒకే కాలానికి చెందిన రచనలు కావడమే ఆ విశేషం. పోల్చింది కవిత్రయ కృషితో అయినప్పటికీ, కవులుగా పోల్చవలసివచ్చినప్పుడు, ఆయన ఫిరదౌసిని తిక్కనతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉందనిపించింది. కవిత్వంలో పోలికలు చూస్తున్నప్పుడు, ఆయన కవిత్రయ భారతం, డా.తిప్పాభొట్ల రామకృష్ణమూర్తిగారి వచనభారతం, పిలకా గణపతిశాస్త్రిగారి హరివంశం నుంచి ఉదాహరణలు ఇచ్చారు, కాని షానామానుంచి మాత్రమే నేరుగా తనే అనువదించి ఉదాహరించారు. ఆ రకంగా, షానామాలోంచి అన్ని పంక్తులు తెలుగులోకి అనువదించిన మొదటి అనువాదకుడు కూడా ఆయనే అయ్యారు.
ఆ పుస్తకం రుచిచూపించడానికి కొన్ని వాక్యాలు:
”ఈ అంశాలను ఇంకా లోతుగా పరిశీలిస్తే షానామా, మహాభారత ఇతిహాసాలు నిర్మాణసూత్రంలోను, కథాగమనంలోను, తాత్త్వికసందేశంలోను, సాంస్కృతిక జీవధారలోను ఏదో ఒక అనిర్దిష్టము, అతిప్రాచీనము, ఏకీకృతము అయిన సమానలక్షణం ఉందని భావించే అవకాశం ఉంది.’
‘ఫిరదౌసి కృతిపతి అయిన గజనీమహమ్మద్ కు, మహాభారత కృతిపతి అయిన పరమాత్మకు ఎంత భేదముందో షానామాకు మహాభారతానికి అంత భేదముంది. ఫిరదౌసిని జీవితాంతం ఒక కవిననే అహంకారం వెంటాడింది. తిక్కన మహాభారత ప్రారంభ సమయానికే తన అహంకారసర్వస్వాన్నీ వదులుకున్నాడు.’
‘మహాభారతం యుద్ధాభిముఖంగా సాగిన మహాకావ్యం. షానామా నిరంతర యుద్ధఘర్షణలో మునిగితేలిన రాజుల చరిత్ర. యుద్ధపర్యవసానాన్ని సూచించే తాత్త్వికదర్శనం చెయ్యగల మహాకవులకు ఇటువంటి ఆలోచనలు రావడం సహజమైన సంగతి, అందుకే అటు భారతకవులు, ఇటు ఫిరదౌసీ ఒకే విధమైన తాత్త్విక దర్శనం చేయగలిగారు. ఈ తత్త్వమే మహాకావ్య రచనకు ప్రాథమిక సూత్రం.’
‘కథాగమనం, ఉపాఖ్యానాలు, పాత్రలు, సన్నివేశాలు, సంస్కృతి, సమాజస్థితులు వంటి అంశాల్లో షానామా-మహాభారతాల మధ్య ఇలా ఎన్నో సామ్యాలు కనిపిస్తున్నాయి. దీనిని మరింతగా అధ్యయనం చేయవలసి ఉంది.’
నరసింహమూర్తిగారు, ఇట్లా మరొక ఆరు మహేతిహాసాల్ని మహాభారతంతో పోల్చాలనుకున్నారు. అందులో గిల్గమేష్, మహాభారతాల్ని పోల్చి వివరించే పని తాను చేస్తానని డా.నరసయ్య సభాముఖంగా ప్రకటించారు. ఇక మిగిలిన పని ఏ యువతీయువకులు నెరవేర్చనున్నారో చూడాలని ఉంది.
5-12-2017