కార్తికం. పొద్దున్నే టివిలో నమకం వినిపిస్తున్నది. కాలం శివమయంగా మారుతున్నది. ‘శివం’. ఎంత అందమైన పదం! ఆ మాటకి అర్థం ‘మంచిది’, ‘చల్లనిది’, ‘ శుభప్రదమైంది’,’ అభ్యుదయకరమైంది’, ‘అనుగ్రహించేది ‘.
జీవితమంతా శివమయం కావడం కన్నా కోరుకునేదేముంటుంది? కాని, అన్నిటికన్నాముందు నువ్వు నిజంగా ఏది శివమయం కావాలని కోరుకుంటావంటే, వైదికఋషి, తన సంకల్పం శివమయం కావాలని కోరుకున్నాడు.
శివసంకల్పం!
మనకి సంస్కృతంతో ఉన్న అనుబంధంవల్ల, మన భాషలో ఉన్న అపారమైన తత్సమ పదజాలం వల్ల మనకి కలిగిన నష్టమేమిటంటే, చాలా పదాల పట్ల మనం మొద్దుబారిపోయాం. అవి మనలో రేకెత్తించగల wonder కి మనం దూరమైపోయాం.
అట్లాంటి పదాల్లో శివసంకల్పం కూడా ఒకటి.
శివసంకల్పమంటే మన తలపులు, మన కోర్కెలు, మన తీర్మానాలు శుభప్రదం కావడమని అర్థం.
అన్నిటికన్నా ముందు మనుషులు కోరుకోవలసింది తమ తలపులు పరిశుద్ధంగా ఉండాలనీ, తమ కోరికలు పరిశుభ్రంగా ఉండాలనీ. అవే మన తదనంతర జీవితాన్ని మనచేతికందిస్తాయి కాబట్టి.
చాలా ఏళ్ళ కిందట నేనొక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను. Management of Change ఆ శిక్షణ ఉద్దేశ్యం. ఆ శిక్షణలో పదే పదే వాళ్ళు మాట్లాడిన మాట intentionality. అంటే నువ్వేది చేసినా, మాట్లాడినా నీ intention ఏమిటో నీకై నువ్వు స్పష్ట పరుచుకుని మరీ చెయ్యమంటాడు. అంటే, మన పూర్వులు ఏ పనిచేసినా సంకల్పం చెప్పుకుని మరీ చేసేవారే అట్లా అన్న మాట. ‘నేనిది చెయ్యాలనుకుంటున్నాను’, ‘నేనిది కావాలనుకుంటున్నాను’ ఇట్లా చెప్పుకుని మరీ చెయ్యడమన్నమాట.
సంకల్పం పరిశుద్ధమైతే, జీవితం పరిశుద్ధమవుతుందని అందరికన్నా ముందు గ్రహించినవాడు వైదిక ఋషి. ఆయన తన తలపులు శివమయం కావాలని కోరుకున్న ఒక సూక్తం ‘శివసంకల్ప సూక్తం’. శుక్ల యజుర్వేదంలో 34 వ అధ్యాయంలో 1 నుంచి 6 దాకా ఉన్న మంత్రాలు. వాటిని సాహసించి తెలుగు చేస్తున్నాను.
శివసంకల్పం
1
యజ్జాగ్రతో దూరముదైతి దైవమ్ తదు సుప్తస్య తధైవైతి
దూరంగమం జ్యోతిషా జ్యోతిరేకమ్ తన్మే మనః శివసంకల్పమస్తు.
(మెలకువగా ఉన్నప్పుడు దూరంగా ప్రయాణించి, నిద్రలో తిరిగి చేరుకునే ప్రకాశవంతమైన ఆ దూరంగమ కాంతి, ఆకాశాన్ని వెలిగించే ఒకేఒక్క జ్యోతి, ఆ నా మనసుకి, చక్కటి సంకల్పం తోచుగాక!)
2
యేన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః
యదపూర్వమ్ యక్షమంతమ్ ప్రజానామ్ తన్మే మనః శివసంకల్పమస్తు.
(దేనివల్ల మనుషులు కర్మచేయగలుగుతున్నారో, సమష్టికర్మచేయగలుగుతున్నారో, సభల్లో ధీరులుగా నిలబడగలుగుతున్నారో, ఏది ప్రజల్లో అపూర్వంగా, క్షమంతంగా నిలిచిఉన్నదో ఆ నా మనసుకి, చక్కటి సంకల్పం తోచుగాక!)
3
యత్ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్జోతిరంతరమృతమ్ ప్రజాసు
యస్మాన్న ఋతే కిమ్ చన కర్మ క్రియతే తన్మే మనః శివసంకల్పమస్తు.
(ఏది ప్రజ్ఞానమో, ఆలోచనాత్మకమో, ఏది ధైర్యమో, ఏది ప్రజల్లో అంతరామృత జ్యోతినో, ఏది లేకపోతే మనుషులు కించిత్ కూడా పనిచేయలేరో, ఆ నా మనసుకి, చక్కటి సంకల్పం తోచుగాక!)
4
యేనేదమ్ భూతమ్ భువనమ్ భవిష్యత్ పరిగృహీతమమృతేన సర్వమ్
యేన యజ్ఞస్తాయతే సప్తహోతా తన్మే మనః శివసంకల్పమస్తు.
(దేనివల్ల ఇంతదాకా గడిచినది, గడుస్తున్నది, రానున్నది కూడా సర్వం అమృతమయంగా చేతికందుతున్నదో, దేనివల్ల సప్తహోతలతో కూడుకున్న సమ్యక్ కర్మ విస్తరిస్తున్నదో, ఆ నా మనసుకి, చక్కటి సంకల్పం తోచుగాక!)
5
యస్మినృచ: సామ యజూంషి యస్మిన్ ప్రతిష్టితా రధనాభావివారాః
యస్మిశ్చితర్థమ్ సర్వమోతమ్ ప్రజానామ్ తన్మే మనః శివసంకల్పమస్తు.
(రధచక్రంలో ఆకుల్లాగా దేనిలో ఋక్కులు, సామగీతాలు, యజుర్మంత్రాలు కుదురుకుని ఉన్నవో, దేనిలో ప్రజలందరి తలపులు అల్లుకుని ఉన్నవో, ఆ నా మనసుకి, చక్కటి సంకల్పం తోచుగాక!)
6
సుషారధిరశ్వానివ యన్మనుష్యాన్నేనీయతభీశుభిర్వాజినివ
హృత్ప్రతిష్టమ్ యదజిరమ్ జవిష్టమ్ తన్మే మనః శివసంకల్పమస్తు.
(చక్కటి సారధి కళ్ళెం చేతబట్టి తన అశ్వాల్ని నడిపించినట్టు వేగవంతమూ, హృదయంలో ప్రతిష్టితమూ, చలనశీలమైన, ఆ నా మనసుకి, చక్కటి సంకల్పం తోచుగాక!)
30-10-2016