శయనైకాదశి

Reading Time: 3 minutes

 

179

‘నిద్రా శనైః కేశవ మభ్యుపైతి’ (నిద్ర నెమ్మదిగా మహావిష్ణువును చేరుతున్నది) అంటాడు వాల్మీకి వర్ష ఋతువుని వర్షిస్తూ. వర్షాకాలం రాగానే శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్ళిపోయి, నాలుగు నెలల తరువాత నిద్రలేస్తాడనే ఒక ఐతిహ్యం వెనక ఏ ప్రాచీన జ్ఞాపకం లేదా ఏ నిత్యనూతన మానవానుభవం ఉన్నాయి?

ఆషాడ పూర్ణిమ ముందు వచ్చే ఏకాదశి ని శయనైకాదశి అనీ, కార్తిక పూర్ణిమ ముందువచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అనీ ఇప్పుడు వైష్ణవులు మాత్రమే భావిస్తూండవచ్చు. కాని, ఈ నమ్మకం వెనక, కొన్ని వేల ఏళ్ళ ఇండో-యూరపియన్ జీవితానుభవం ఉందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఇప్పుడు మన సమాజంలో, పట్టణాల్లోనూ, పల్లెటూళ్ళల్లోనూ కూడా మూడు పున్నములు పండగలుగా మారిపోయాయి. మొదటిది, ఫాల్గుణపున్నమి. ప్రతి ఏటా మార్చిలో వచ్చే ఈ పున్నమి పట్టణాల్లో హోళీ పున్నమిగా రంగులపండగగా మారింది. పల్లెల్లో ఇంకా కాముని పున్నమిగానూ, కామదహనోత్సవ వేడుకగానూ సాగుతోంది. రెండవ పున్నమి, ఆషాడ పున్నమి. జూలైలో వచ్చే ఈ పున్నమి ఇప్పుడు గురుపౌర్ణమిగా మారింది. దేవాలయాలన్నిటిలోనూ, ముఖ్యంగా, సాయిబాబా దేవాలయాల్లో ఇప్పుడు గొప్ప సందడి. మూడవ పున్నమి, కార్తికపున్నమి. నవంబరులో వచ్చే ఈ పున్నమినాడు దేవాలయాల్లో, నదీతీరాల్లో దీపాలు వెలిగించడం, నదుల్లో దీపాలు వదిలిపెట్టడం, శివాలయాల్లో జ్వాలాతోరణం జరపడం ఈ రోజు చూస్తాం. ఎందుకు ఈ మూడుపున్నములకే ఈ ప్రత్యేకత?

ఇప్పుడిట్లా రూపం మార్చుకున్న ఈ పున్నములు వేదకాలంలో కాలాన్ని గుర్తుపట్టే మూడు ముఖ్యమైన రోజులు. శీతాకాలం నుంచి వసంతకాలానికీ, వేసవికాలంనుంచి వర్షాకాలానికీ, వర్షాకాలం నుంచి తిరిగి మళ్ళా శీతాకాలానికీ కాలం పరివర్తన చెందే మూడు ఘట్టాలకి ఈ పున్నముల్ని గుర్తుగా పెట్టుకుని వేదకాలంలో మూడు యజ్ఞాలు చేసేవారు.

నాలుగేసి నెలల చొప్పున సంవత్సరాన్ని మూడు భాగాలుగా విభజించి చేసే ఈ యాగాల్ని చాతుర్మాస్యాలన్నారు. ఇందులో, ఫాల్గుణపున్నమి నాడు చేసే యాగాన్ని వైశ్వదేవమనీ, ఆషాడపున్నమినాడు చేసేదాన్ని వరుణప్రఘాసమనీ, కార్తికపున్నమినాడు చేసేదాన్ని శాకమేధమనీ అన్నారు.

ఈ మూడు చాతుర్మాస యజ్ఞాలూ హవిర్యజ్ఞాలు. వీటిలో వైశ్వదేవం అగ్నినీ, వరుణప్రఘాసం వరుణున్నీ, శాకమేధం ఇంద్రుణ్ణీ అర్చించే యజ్ఞాలు. వైదిక దేవతలు భూమి, అంతరిక్షం, ద్యులోకం అనే మూడులోకాల్లో ఉండే దేవతలు. అందులో అగ్ని భూస్థానీయ దేవత, వరుణుడు ద్యులోకదేవత, ఇంద్రుడు అంతరిక్ష దేవత.

కాని ఈ వేదకాలంలో సంవత్సరానికి అయిదు ఋతువులని భావించినందువల్ల, కాలాన్ని ఇట్లా మూడు భాగాలుగా విభజించడం వేదకాలానికి ఇంకా పూర్వపు సంప్రదాయమనీ,కాబట్టి, ఈ మూడు యాగాలూ ఏ అతీతకాలం నుంచో వైదికక్రతువుల్లోకి ప్రవేశించాయనీ కొందరు అభిప్రాయపడ్డారు. సంవత్సరాన్ని మూడు భాగాలుగా విభజించడమనేది ఐరోపీయ సంప్రదాయం కాబట్టి, ఈ మూడు పండగలూ, ప్రాచీన స్కాండినేవియన్ క్రతువులని ఒక పరిశోధకుడు అభిప్రాయపడ్డాడు. మరొక పరిశోధకుడు, వీటిలో పితృదేవతారాధన ఉందనీ,కాబట్టి, ఇవి అత్యంత ప్రాచీన కాలంలో పితృదేవతల్ని స్మరించుకుంటూ చేసే క్రతువులనీ, తర్వాత రోజుల్లో అగ్ని, వరుణుడూ,ఇంద్రుడూ ప్రవేశించారనీ భావించాడు.

ఏమైనప్పటికీ, ఈ మూడు పున్నమిపండగలూ కొన్ని వేల ఏళ్ళుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ, రూపు మార్చుకుంటూ, కొత్త స్ఫురణలు కలిగిస్తూ వస్తున్నాయనేది గమనించవలసిన విషయం.

ఈ క్రతువులు విస్పష్టమైన వైదిక స్వభావాన్ని సంతరించుకున్నాక, ఆషాడపూర్ణిమ నాడు వరుణప్రఘాస యాగం చెయ్యడం మొదలయ్యింది. వైదిక దేవతల్లో వరుణుడు అందరికన్నా ప్రాచీనమైన దేవత. ఋగ్వేదానికి పూర్వపు రోజుల్లో ఆయనే మూడులోకాల్నీ, మూడుకాలాల్నీ నడిపించేవాడు. క్రమం తప్పకుండా, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఒక నియతి, దాన్నే ఋతం అన్నారు, ఆ ఋతానికి అధిపతి వరుణుడు. తర్వాతి రోజుల్లో వరుణుడి స్థానాన్ని ఇంద్రుడు, ఆ తర్వాత రోజుల్లో ఇంద్రుడి స్థానాన్ని విష్ణువూ ఆక్రమించేసారు.

వరుణప్రఘాసం మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక క్రతువు. మనం చేసిన అపరాధాలనుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక అవకాశం. వరుణప్రఘాస యాగం లో, మరుత్తుల్ని ఆహ్వానిస్తూ, యజమాని ఇట్లా ప్రార్థిస్తాడు:

‘యద్గ్రామే, యదరణ్యే, యత్సభాయామ్ యదింద్రియే
యదేనశ్చకృమా వయమిదమ్ తదవయజామహే స్వాహా’ (వా.సం.3-45)

(మేము గ్రామంలోగాని, అరణ్యంలోగాని, సభల్లోగాని, దేహంతోగాని చేసిన అపరాధాలన్నిటినుంచీ విముక్తుల్ని చెయ్యాలని కోరుకుంటున్నాం.)

గ్రామంలో చేసే అపరాధాలు ఇతరుల్ని అణచివెయ్యడానికీ, మోసం చెయ్యడానికీ సంబంధించినవి. అడవిలో చేసే అపరాధాలు క్రూరమైనవీ, రహస్యమైనవీ. సభలో చేసే అపరాధాలు ప్రవర్తనకీ, ప్రజాస్వామ్యానికీ సంబంధించినవి. ఇక దేహంతో చేసే అపరాధాలు అన్నిరకాల ఇంద్రియచాంచల్యాలకీ సంబంధించినవి.

ఈ మూడు యాగాల సమాపనవేళ, త్రయంబక రుద్రుణ్ణి కూడా స్తుతించి, ప్రసిద్ధి చెందిన ఈ ప్రార్థనా మంత్రం పఠిస్తారు:

‘త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్.’ (వా.స.3-60)

ఇప్పటి ఆషాడపూర్ణిమలో ఈ వరుణప్రఘాస యాగం లక్షణాలేమీ మిగల్లేదు, కాని, ఇది కూడా వరుణదేవతాకం గానే కొనసాగుతోందని చెప్పవచ్చు. ఎట్లా? గురుపూర్ణిమ రూపంలో.

తైత్తిరీయ ఉపనిషత్తులో పంచకోశవివరణ చేసిన భృగువల్లి వరుణుడు తన కుమారుడైన భృగువుకి చేసిన ఉపదేశం కాబట్టి. నిజమైన ఆనందం స్వభావమేమిటో, ఆ ఆనందాన్ని ఎట్లా అందుకోవచ్చో వివరించిన అధ్యాయం అది. ఆ విధంగా వరుణుడు భారతీయ గురుపరంపరలో మొదటిస్థానంలో నిలబడుతున్నాడు కాబట్టి.

ఇంతకీ, విష్ణువు నిద్రలోకి పోవడమేమిటి? వైదికసంవత్సరానికి రెండు భాగాలు. ఉత్తరాయణం,దక్షిణాయనం. ఉత్తరాయణమూ, దక్షిణాయనమూ రెండూ వెలుగుతో కూడుకున్నవేకాని, ఉత్తరాయణంలో వెలుగు ఆకాశానికి చెందింది. దక్షిణాయనం వెలుగు అంతరిక్షానికీ, భూమికీ చెందింది. విష్ణువంటే, వ్యాపించిఉన్న వెలుగు కాబట్టి, ఆ వెలుగు దక్షిణాయనంలో ఆరునెలలపాటు భూమిలోకి ప్రవేశిస్తుంది. రైతునేలలో గింజనాటినప్పుడు, ఆ వెలుగే, తనని తాను తిరిగి పునరుజ్జీవింపచేసుకునే అగ్నిగా రగిలి, నేలని చీల్చుకుని పైకివస్తుంది. నాలుగు నెలలు గడిచేటప్పటికి, ఆ వెలుగే, తిరిగి ధాన్యపు గింజగా వికసిస్తుంది. అది విష్ణువు నాలుగు నెలలనిద్రనుంచి లేచి తిరిగి ఆకాశంలోకి మేల్కొనే సమయమన్నమాట.

‘Verily, verily, I say unto you, Except a corn of wheat fall into the ground and die, it abideth alone: but if it die, it bringeth forth much fruit.’ (John, 12:24)

కాలపరిభ్రమణంలో, ఋతుసంక్రమణంలో వెలుగు చేసే ప్రయాణాన్ని క్రతువులుగా, పండగలుగా జరుపుకుంటూ రావడంలో మనిషి చేసుకుంటున్న జీవితోత్సవం రూపాలు మారుతున్నదికాని, స్ఫూర్తి ఒక్కలానే కొనసాగుతున్నది.

4-7-2017

Leave a Reply

%d bloggers like this: