మనుషులు సామాజికంగా విముక్తి చెందడానికి సాగించే పోరాటంలో మూడు దశలుంటాయి. మొదటి దశలో మేము కూడా మనుషులమే అని చెప్పుకోడానికీ, గుర్తింపు పొందడానికీ చేసే పోరాటం నడుస్తుంది. ఆ తర్వాతి దశలో తక్కిన మనుషులతో పాటు సామాజికంగా సమానావకాశాలకోసం పోరాటం నడుస్తుంది. మూడవదశలో వాళ్ళు తాము కూడా శ్రేష్ఠమానవులం కాగలమని పోరాడి నిరూపించే దశ ఉంటుంది. అంటే, ఒక ఆఫ్రికన్ నీగ్రో కూడా ఫిజిక్సులోనో, కెమిస్ట్రీలోనో నొబెల్ ప్రైజు పొందడానికి చేసే పోరాటం, లేదా పూర్ణ లాంటి ఒక గిరిజన బాలిక ఎవరెస్టు అధిరోహించడం లాంటి పోరాటం అన్నమాట. ఈ మూడు దశల్లోనూ మొదటి దశ,మూడవ దశ పోరాటాలు అత్యంత కఠినాతికఠినమైనవి, దాదాపుగా అసాధ్యాలనిపించేలాంటివి.
ఇప్పుడు అణగారిన వర్గాల గురించి మాట్లాడేవాళ్ళూ, వాళ్ళ విముక్తి కోసం పోరాటం చేసేవాళ్ళూ ప్రధానంగా రెండవ దశ పోరాటాల్లో ఉన్నారు. రాజ్యాంగ పరంగానూ,న్యాయపరంగానూ వాళ్ళకి అందవలసిన సదుపాయాల్ని అందించడానికీ, చట్టపరంగా వాళ్ళు పొందవలసిన హక్కులు పొందేలా చూడటానికీ చేసే పోరాటాలన్నమాట. ఈ పోరాటం ఎంతో విలువైనదే అయినప్పటికీ,మొదటి దశలో చేసిన పోరాటాలతోనూ, మూడవ దశలో చేపట్టవలసిన పోరాటాల్తోనూ పోలిస్తే ఏమంత గొప్ప పోరాటం కాదనే చెప్పవలసి ఉంటుంది. కానీ, ఈ ప్రయత్నాలకే మనమెంతో గర్విస్తూ ఉన్నాం, ఎంతగానో అలిసిపోతూ ఉన్నాం, తక్కిన సమాజాన్ని శాపనార్థాలు పెడుతూ ఉన్నాం.
ఇట్లాంటి కాలంలో పూర్వదశ పోరాటాలు చేసిన యోధుల్ని తలుచుకోవడంలో గొప్ప ప్రయోజనం ఉంది. వాళ్ళెట్లాంటి నిర్విరామ, నిస్వార్థ కృషి చేసి ఉంటే, ఈ రోజు ఈ సామాజిక సందర్భమిట్లా మనచేతులకు అందివచ్చిందో మనకి తెలుస్తుంది. మనమింకా చేయవలసిన ప్రయత్నాలెట్లా ఉండాలో మనకొక అవగాహన చిక్కుతుంది.
ఆంధ్రదేశంలో గిరిజన పోరాటాలకు సంబంధించి వెన్నెలకంటి రాఘవయ్య (1897-1981) అట్లాంటి యోధుడు. ఉన్నవలక్ష్మీనారాయణ, దరిశి చెంచయ్యలతో పోల్చదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడు. గిడుగురామ్మూర్తి, ధక్కర్ బాపా, కాకాసాహెబ్ కాలేల్కర్ లతో పోల్చదగ్గ గిరిజన విముక్తికారుడు.కాని ఆయన జీవితం, కృషి కేవలం నెల్లూరు జిల్లా స్థానిక స్మృతికి మాత్రమే పరిమితమైపోవడం మనందరం చేసిన ఒక క్షమించరాని తప్పిదం. ఈ అపరాధానికి పరిహారంగా వకుళాభరణం లలితగారు ఇప్పుడాయన జీవితచరిత్రని పుస్తకరూపంలో వెలువరించారు.
ఈ ఏడాది మార్చిలో ఆమె హాస్పిటల్ కు వెళ్ళబోయే ముందు ఆ రాతప్రతి సిద్ధం చేసి దాన్ని రామకృష్ణ గారి అప్పగించారట. ఆ విధంగా అది ఆమె చివరి రచన. 80 ఏళ్ళ వయసులో మనకోసం వదిలిపెట్టి వెళ్ళిన గొప్ప ఉపాదానం.
శనివారం సాయంకాలం గుంటూరులో శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారి ఆఫీసు మేడ మీద జరిగిన సమావేశంలో ఆ పుస్తకం ఆవిష్కరించే అవకాశం నాకు లభించడం నా జీవితంలో లభించిన అరుదైన ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆ సభకి డా.కడియాల రామ్మోహన రాయి అధ్యక్షత వహించారు. ఆ పుస్తకాన్ని లలితగారు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారి కి అంకితం ఇచ్చారు. ఆ సభలో నాతో పాటు శ్రీ కాళిదాసు పురుషోత్తంగారు, శ్రీ వకుళాభరణం రామకృష్ణ గారు కూడా మాట్లాడేరు. సాహిత్యంలోనూ, సామాజిక, రాజకీయ విమోచనోద్యమాల్లోనూ క్రియాశీలకంగా ఉన్న పెద్దలెందరో ఆ సభకి హాజరయ్యేరు. వారందరి ఎదటా, వెన్నెలకంటి రాఘవయ్యగారినీ, లలితగారినీ తలుచుకోవడం నాకెంతో సంతోషంగా ఉండింది. ఎప్పటికప్పుడు నివురు కమ్మిపోతుండే నా చైతన్యాన్ని ఇట్లాంటి సందర్భాలే కదా తిరిగి రగిలించేది!
వెన్నెలకంటి రాఘవయ్యది టెర్రరిస్టుగా మొదలై గాంధేయవాదిగా పరివర్తన చెందిన అపురూపమైన జీవితం. తన నవయవ్వనంలో ఆయన పొణకా కనకమ్మగారి ఆర్థికసహాయంతో ఓ.వి.చిదంబరం పిళ్ళై ద్వారా ఆయుధాలు కొనుగోలు చేసాడు. సుబ్రహ్మణ్య భారతి, అరవిందఘోష్ లను కలుసుకున్నాడు. తిలక్ ని కూడా కలుసుకున్నాడు, కాని తిలక్ ఆయన్ని అట్లాంటి టెర్రరిస్టు పంథానుంచి బయటపడమని మందలించాడు. ఆ తర్వాత ఆయన జిల్లా కాంగ్రెసు కార్యదర్శిగా నెల్లూరు జిల్లానుంచి మొదటిసారి జైలుకి వెళ్ళిన మొదటి సత్యాగ్రాహిగా చరిత్రకెక్కాడు. తొలిరోజుల్లో బహుముఖంగా సాగిస్తున్న ఆ పోరాటాలన్నిటినీ పక్కనపెట్టి, కేవలం గిరిజన విమోచన అనే ఏకైక లక్ష్యానికి అంకితమయ్యాడు.
దురదృష్టవశాత్తూ 1940 లదాకా కూడా ప్రధానస్రవంతి జాతీయోద్యమంలో గిరిజనులకు స్థానం లేదు. వాళ్ళ సమస్యల గురించి జాతీయోద్యమనాయకులకి తెలిసింది చాలా తక్కువ. వాళ్ళ గురించి మాట్లాడిన మొదటి జాతీయస్థాయి నాయకుడు గాంధీజీనే. 1941 లో తాను విడుదల చేసిన నిర్మాణాత్మక కార్యక్రమంలో ఆయన ఆదివాసీల గురించి 16 వ అంశంగా ప్రస్తావించారు. ఆయన్ని ఆ విషయంలో మేల్కొల్పినవాడు థక్కర్ బాపా. అయితే,ఇప్పుడు వెన్నెలకంటి జీవితం గురించి చదువుతుంటే,థక్కర్ బాపాకు దాదాపు సమకాలికంగా రాఘవయ్య గిరిజనుల కోసం కృషి చేసాడనేది. థక్కర బాపా ఆయనకు మిత్రుడనీ, ఆయన పేరు మీద నెల్లూరులో యానాదులకోసం రాఘవయ్య ఒక హాస్టల్ కూడా ప్రారంభించారని తెలియడంలో గొప్ప స్ఫూర్తి ఉంది.
గిరిజనులకు సంబంధించి రాఘవయ్య చేపట్టిన కృషిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన బ్రిటిష్ ప్రభుత్వం చేసిన క్రిమినల్ ట్రైబ్స్ యాక్టుని రద్దుచేయించడంలో చేసిన అసమానమైన కృషి. రెండవది, యానాదులపట్ల తక్కిన సమాజాన్ని మేల్కొల్పడానికి సాగిస్తూ వచ్చిన నిర్విరామపోరాటాలు. అవి ఏ స్థాయిలో నడిచేయంటే,ఆయన్ని ప్రజలు యానాది రాఘవయ్యగానే పిలవడానికి అలవాటు పడిపోయారు. ఇక మూడవది, గిరిజనుల గురించీ, గిరిజన సమస్యల గురించీ దాదాపు ఇరవైకి పైగా రాసిన విశిష్ఠగ్రంథాలు.
లలితగారు తన రచనలో ఈ పార్శ్వాలన్నిటినీ సంగ్రహంగానే అయినా, సమగ్రంగా ప్రస్తావించారు. ముఖ్యంగా రాఘవయ్యగారు గిరిజనుల మీద రాసిన పుస్తకాల్ని పరిచయం చేస్తూ ఆమె రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉన్న గిరిజనుల గురించి స్థూలంగా మరోమారు పరిచయం చెయ్యడంతో ఈ పుస్తకానికి మరింత ప్రాసంగికత చేకూరింది. తెలుగువాళ్ళంతా, ముఖ్యంగా గిరిజనశ్రేయోభిలాషులంతా చదవవలసిన రచన ఇది.
20-11-2017