విరూపికలు

Reading Time: 4 minutes

158

ఋతుపవన మేఘాలు ఆకాశమంతా ఆవరించాయి, జల్లులు రాలడం మొదలయ్యింది. కాని నా మనసింకా బైరాగి కవితా వాక్యం దగ్గరే ఆగిపోయింది. రామారావు కన్నెగంటి గుర్తు చేసిన వాక్యం, విందాకరందీకర్ కవితకు బైరాగి చేసిన అనువాదం.

విందా కరందీకర్, (గోవింద వినాయక్ కరందీకర్ (1918-2010) ఆధునిక మరాఠీ సాహిత్యంలో అగ్రగామి కవి, జ్ఞానపీఠ సత్కారం పొందినవాడు, ఆయన తన ముందు తరం కవి,తన మార్గదర్శకుడు బాలసీతారాం మర్దేకర్ (1909-1956)కి నివాళి ఘటిస్తూ రాసిన వాక్యం:

‘బాధల పొక్కులు గిల్లి జీవితాన్ని దర్శించిన వారి కనుల హారతులొస్తాయి నేడు నీ పూజకు.. ‘

ఆదిత్యకి ఫోన్ చేసాను, ఆ సంభాషణ చూసావా అనడిగాను.

రామారావు ఆ వాక్యం ప్రస్తావించి నన్నూ, ఆదిత్యనీ కూడా అపారమైన అశాంతికీ, అంతర్మథనానికీ గురిచేసాడని అర్థమయింది.

అదిత్య అన్నాడు కదా: ‘ఆ సంభాషణలో మీ సమాధానం కూడా నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది, అన్నిటికన్నా ముఖ్యం, మీ sensiblity లో వచ్చిన మార్పు. గోదావరినుంచి కృష్ణ దిగువకు చేసిన ప్రయాణం ‘

అప్పుడప్పుడనిపిస్తుంది,తెలుగు కవిత్వంలో గోదావరీ తీర కవులకొక సౌకుమార్యం ఉందనీ, కృష్ణాతీర కవులూ, ఆ నదికి దిగువనున్న ఆంధ్రప్రాంతకవుల పలుకుబడి వేరేననీ. ఆ సున్నితమైన అంతరం నన్నయ, తిక్కనలతొనే మొదలయ్యింది. గోదావరీ తీర కవులకి అక్షరరమ్యత, లాలిత్యం, శ్రవణ సుభగత్వం చాలా ముఖ్యం. కృష్ణశాస్త్రి, నండూరి, తిలక్, ఇస్మాయిల్ దాకా కూడా. కృష్ణానదికి దిగువనున్న కవులకి సత్యం చెప్పడం ముఖ్యం, జీవితానుభవాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడం ముఖ్యం,ఆ క్రమంలో వాళ్ళ కావ్యభాష కబీర్ భాషలాగ rough rhetoric గా మారినా సరే, తిక్కన, వేమన లనుంచి రామిరెడ్డి, పఠాభి, శిష్ట్లా, బైరాగి ల దాకా.

కృష్ణా, గోదావరీ తీరాల్ని సమంగా అల్లుకోడానికి ప్రయత్నించిన కవులు ఎర్రన, శ్రీనాథుడు, విశ్వనాథ-వాళ్ళ కవితాభివ్యక్తి కూడా ఏకకాలంలో tender గానూ, grotesque గానూ కనిపిస్తుంది.

గోదావరీ తీర కవి ఎప్పటికీ కూడా ‘బాధల పొక్కులు గిల్లి’ అనే మాట వాడలేడు. ‘పొక్కులూ’, వాటిని ‘గిల్లడమూ’ అతడికి చాలా వికృతప్రయోగాలనిపిస్తాయి.

ఇంతకీ బైరాగి అనువదించిన కరందీకర్ మూలకవితలో పదాలేమిటో మనకి తెలియదు. కాని, ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు. బాలసీతారాం మర్దేకర్ మరాఠీ కవిత్వానికి బోదిలేర్ లాంటి వాడని. పందొమ్మిదో శతాబ్దిలో బోదిలేర్ యూరోప్ కి పరిచయం చేసిన decadent urban ethos ని మర్దేకర్ మరాఠీకీ, తద్వారా భారతదేశానికీ పరిచయం చేసాడు. ఆ ప్రభావమే కరందీకర్, శరశ్చంద్ర ముక్తిబోధ్, గజానన్ మాధవ్ ముక్తిబోధ్ వంటి కవుల ద్వారా బైరాగికీ, బైరాగినుండి తెలుగు కవిత్వానికీ అందింది.

‘దనుజ హస్తపు దీర్ఘరేఖల వలె పరచిన రాచబాటలు
సందుగొందుల మారుమ్రోగే తాగుబోతుల వెకిలిపాటలు
జీవితాహికి వేయి నాల్కలు, లక్షచీల్కలు, కోటికోరలు
దారి తప్పిన మనుజ హృదయం ఎక్కడున్నది?ఎక్కడున్నది?’

ఈ వాక్యాల వెనక కరందీకర్, మర్దేకర్, బోదిలేర్ రాసిన The Carcass పద్యం లేవనగలమా?

ప్రసిద్ధ పాశ్చాత్య సాహిత్య, కళావిమర్శకుడు Umberto Eco ఏమన్నాడంటే, ఆధునిక పాశ్చాత్య కళాన్వేషణ అంతా beauty నుంచి ugliness కి ప్రయాణమేనని.

మధ్యయుగాల భారతదేశం సగుణ నిర్గుణ మార్గాల మధ్య కొట్టుమిట్టాడింది. ఇరవయ్యవశతాబ్దం మొదలవుతూ టాగోర్ ‘రూపజలధిలో మునిగి అరూప రత్నాన్ని’ అన్వేషించాలని ప్రయత్నించేడు. కాని 50 ల తర్వాత భారతీయ చిత్రకారులూ, కవులూ కూడా రూపాన్ని వదిలి విరూపం వైపు ప్రయాణించేరు. కరందీకర్ తన కొన్ని కవితలకు ‘విరూపికలు’ అని పేరు పెట్టాడు కూడా. ఇప్పటి మనచిత్రకారులు చేస్తున్నదేమిటి? ఒక్కమాటలో చెపాలంటే, distortion. ఆకృతిని విరూపం చెయ్యడం. నేటి కళాకారుడి దృష్టిలో పరిపూర్ణ సౌందర్యం ఒక అసత్యం, ఒక భ్రమ.

1938 లో శాంతినికేతన సుందర స్వప్నం నుంచి బయటపడి, పఠాభి,

తగిలింపబడియున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన, పయిన;
అనవసరంగా,అఘోరంగా!

అని రాసినప్పుడు తెలుగు కవిత్వాన్ని రొమాంటిసిజంలోంచి మాడర్నిజంలోకి రాత్రికిరాత్రే తీసుకుపోగలిగాడు.

గోదావరీ తీర కవులు కాలంతాకిడికి చెక్కుచెదరని కావ్యభాషనొకదాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అందులో ‘విలసన్నవనందనములు’, ‘మృదుమృణాలాంకురములు’, ‘ఘనసారపాంసులు’, ‘తలిరుల శయ్యలు’, ‘సలిల ధారల చందన చారు చర్చలు’ ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆ కావ్యభాష దామెర్ల రామారావు చిత్రలేఖనంలాగా సుకోమలంగానూ, లాలిత్యభారంతోనూ వాలిపోతూ, సోలిపోతూ ఉంటుంది.

గోదావరీ తీరం నుంచి వచ్చిన నా బోటి పిపాసికి, ‘బాధల పొక్కులు గిల్లడం’ nauseating గా ఉంటుంది. కాని, ఆ nausea ఆధునిక సందర్భానిది, ప్రస్తుత నిష్టుర వాస్తవానిది, దుర్భర జీవితానుభవానిదని బైరాగి చెప్పకపోతే నేనింకా ఆ దంత హర్మ్యంలోనే ఉండిపోయి ఉండేవాణ్ణి.

2

ఈ కరందీకర్ నన్ను వదలడం లేదు.

ఆయన తన కవితలకు ఇంగ్లీషులోకి చేసుకున్న అనువాదాల్లోంచి కొన్నింటిని సాహిత్య అకాదెమీ The Sacred Heresy (1998) ప్రచురించించింది. చాలాకాలంగా నా దగ్గరే ఉన్న ఆ పుస్తకం బయటకి తీసాను. మరొక ఆధునిక మరాఠీ కవి, జ్ఞానేశ్వర్ నీ, తుకారాం నీ ఇంగ్లిషులోకి అనువదించి ప్రపంచానికి మరింత సన్నిహితం చేసిన దిలీప్ చిత్రే నే ఈ కవితల్ని కూడా ఎంపిక చేసాడు. ఆ పుస్తకానికొక విపులమైన పీఠిక కూడా రాసాడు. అందులో కరందీకర్ జీవితం గురించీ, కవిగా ఆయన ప్రస్థానం గురించీ, ఆయన మీద పడిన పూర్వకవి ప్రభావాలూ,భారతీయ, పాశ్చాత్య ప్రభావాల గురించీ విపులంగా వివరించేడు.

ఒక ఇంటర్వ్యూలో కరందీకర్ తన కవిత్వం ‘ఆధునిక కళా, ఆధునిక సైన్సుల ద్వారా తన సంప్రదాయాన్ని కనుగొని,దానితో సమాధానపడ్డ ఒక భారతీయుడి కవిత్వం’ గా చెప్పుకున్నాడట. తన ‘కావ్యకళలో, వస్తువులో, రూపంలో, సంవేదనల్లో భారతీయమైనవీ, విజాతీయమైనవీ కూడా పరస్పరం పెనవైచుకున్నాయి’ అని కూడా అన్నాడట.

భారతీయ భాషా కవుల్లో తాను మాతృ భాషలో రాసిన కవిత్వాన్ని తానే ఇంగ్లీషులోకి అనువదించుకోగలిగిన సాహసమూ, సామర్థ్యమూ ఉన్న కవులు చాలా తక్కువ మంది. ఎవరో ఒక టాగోర్, రామానుజన్, వేళ్ళ మీద లెక్కపెట్టగల కొద్దిమంది ఆధునిక కవులు మాత్రమే.

ఒక భారతీయ కవితను ఇంగ్లీషులోకి అనువదించడమంటే, కేవలం ఇంగ్లీషు చేస్తే సరిపోదు. ఆ కవిత ఇంగ్లీషు మాతృ భాష గా ఉండే native speakers కి ఎట్లా వినిపిస్తుందో తెలుసుకోగలగాలి. తన భాషలోని సంగీతాన్ని ఇంగ్లీషులోకి తేవడం అసాధ్యం. అలాగని ఇంగ్లీషు ఛందస్సుల్లోకి తీసుకుపోవడమూ పరిష్కారం కాదు. ఆ సమస్యని అర్థం చేసుకున్నాడు కాబట్టే, టాగోర్ బెంగాలీ గీతాల్ని ఇంగ్లీషులో వచనకవితలుగా అనుసృజించుకుని ప్రపంచాన్ని సమ్మోహితం చెయ్యగలిగాడు. ఆ రహస్యం పట్టుబడనందువల్లనే శ్రీశ్రీ తన కవితల్ని ఇంగ్లీషులోకి అనువదించుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు.

ఆ నేపథ్యంలో చూసినప్పుడు కరందీకర్ తన ప్రయత్నంలో సఫలమయ్యాడనే చెప్పవచ్చు. బహుశా, అందుకు కారణం, ఆ అనువాదాల వెనక ఎ.కె.రామానుజన్ సాహచర్యం బలంగా పనిచేసి ఉండవచ్చు.

The Sacred Heresy (పవిత్ర నాస్తికత్వం) లో 56 కవితలున్నాయి. ఇవి 1975 నుంచి 1996 మధ్యకాలంలో కరందీకర్ వెలువరించిన మూడు సంపుటాలనుంచి ఎంపిక చేసిన కవితలు. వీటిలో కొన్ని అముద్రిత అనువాదాలు కూడా ఉన్నాయి.

కరందీకర్ ని మరాఠీలో చదవలేని నాబోటి వాళ్ళకి ఈ ఇంగ్లీషు అనువాదాలు ఆయన గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. కవితలన్నీ ఒక సారి చదవగానే, దిలీప్ చిత్రే చెప్పినట్టుగా, అన్నిటికన్నా ముందు కరందీకర్ ప్రయోగశీలత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయ, పాశ్చాత్య సభ్యతల్లోని సురూప, విరూప ప్రభావాల్ని తనకై తాను సమన్వయించుకోవడానికి పడిన తపన కనిపిస్తుంది. వేదసూక్తాల్నీ, బోదిలేర్నీ ఒక్క పరిష్వంగంలోనే గట్టిగా హత్తుకోవాలన్న తృష్ణ కనిపిస్తుంది. జీవితకాలం పాటు కవిత్వాన్ని నమ్ముకున్న ఒక సత్యసంధత కనిపిస్తుంది.

ఆయన వాగ్వ్యవహారాన్నీ, చింతనావ్యవహారాన్నీ పట్టివ్వగల కొన్ని కవితలు మీ కోసం:

ఏదో చీకటి

నీ కడవ పెదాలు
నీళ్ళని తాకినప్పుడు
చిక్కటి వసంతంలో
ఏదో చీకటి వేదన

నీ రవికెచిత్తడి
అతడి వక్షాన్ని
తేమగా తాకినప్పుడు
గాల్లో ఏదో చీకటి వేదన

నువ్వా మధ్యాహ్నం మరీమరీ
ఉతుక్కుంటున్న నీ చీరలో
ఆ బండకి తెలుస్తున్నది
ఏదో దోషం

శాపం

నీ నేత్రాలు గుర్తుకు రాగానే
నా కళ్ళనిండా కన్నీళ్ళు
ఊరికే పొంగిపొర్లుతాయి
నీ కేశరాశిచుట్టూ
ప్రభాతకిరణాల మిణుగుర్లు.

రోజులిట్లానే గడిచిపోతాయి
రాత్రులు తొట్రుపడేదీ ఇట్లానే
కాని నా వీథిగుమ్మం రాటలిప్పటికీ
కూలిపోలేదు

ఆ గుమ్మమూ కూలిపోలేదు
బహుశా అన్నిటికన్నా
భరించలేని శాపమిదేననుకుంటాను
పాపినై ఉండికూడా
పాపం చెయ్యలేకపోవడం.

ఇంతా చేసి ఇదేనా

నువ్వు చెప్పవలసిందంతా ఇంతే అయితే
ఎందుకంత బెరుగ్గా మొదలుపెట్టావు.
తీరాచేసి, సగం దూరం వెళ్ళిపోయాక,
ప్రియతమా, మళ్ళా ఎందుకు వెనుదిరిగావు?

నువ్వు చెప్పవలసిందంతా ఇంతే అయితే
ఎందుకు చిరునవ్వుతో మొదలుపెట్టావు
ఒక స్వప్నాన్ని కౌగిలింతలో చిదిమేసి
మళ్ళా దాన్నెందుకు ఆటపట్టిస్తావు?

నువ్వు చెప్పవలసిందంతా ఇంతే అయితే
ఉత్తుత్తి కేకలతో ఎందుకు విలపిస్తావు
మళ్ళా ఏదో తెలియని వాంఛలో కొట్టుకుపోతూ
నా బాహువులనెందుకు కవ్విస్తావు?

నువ్వు చెప్పవలసిందంతా ఇంతే అయితే
నన్ను కుట్టి కోరికనెందుకు నిద్రలేపుతావు
తీరాచేసి, తలస్నానంతో తడిసి వదులైన
కబరీభరంతో దావాగ్నిలో ఎందుకు దూకేస్తావు?

ఒక విరూపిక

చికాగో యూనివెర్సిటీ ప్రాంగణంలో
యంత్రాల్లాంటి కొన్ని శిల్పాలు చూసేను
స్థిరచక్రాలు, చక్రాల్లో చక్రాలు
వక్రరేఖలు, వక్రరేఖల్లో చక్రాలు, చక్రాల్లో వక్రరేఖలు
మరిన్ని చక్రాలు, మరిన్ని వక్రాలు
శూన్యపు తిత్తులు, నిరాకరణపు గొట్టాలు
ఇంతలో హట్టాత్తుగా తట్టింది నాకు
అవన్నీ వాటిలో అవి
తమతో తాము మాట్లాడుకోవాలని
ఎంతగా తపిస్తున్నాయోనని.

తుకారాం ని చూడటానికి షేక్స్పియరే వచ్చాడు

తుకారాముణ్ణి చూడటానికి షేక్స్పియరే వచ్చాడు
వాళ్ళిద్దరూ ఒక దుకాణంలో కలుసుకున్నారు.

కలుసుకుంటూనే ప్రేమగా కావిలించుకున్నారు
హృదయంనుంచి హృదయానికి ప్రతీదీ పంచుకున్నారు
తుకా అన్నాడు: ‘మిత్రమా, విల్, గొప్పగా రాసావు
ప్రాపంచికజీవితం ఏదీ వదలకుండా చిత్రించేవు,’
‘లేదు లేదు’ షేక్స్పియర్ అన్నాడు, ‘అదొక్కటీ తప్ప
నువ్వు చూసావే, ఇటుకమీద నిలబడ్డవాణ్ణి, అది వదిలేసాను.’
తుకా అన్నాడు ‘నాయనా, నువ్వది వదిలెయ్యడమే మంచిదైంది
అది నా కుటుంబాన్నే ముక్కలు చేసింది, విఠలుడు
చాలా సూక్ష్మం, అతడి మాయలొకపట్టాన అంతుబట్టవు
నేనింత రాసానా, అయినా నా పలక ఖాళీగానే ఉండిపోయింది.’
‘అలా ఎందుకనుకుంటావు?’ అన్నాడు షేక్స్పియర్, ‘నువ్వు
పాడినందుకే కదా అగోచరుడు ఈ నేలమీద కనబడ్డాడు.’
‘లేదు మిత్రమా’, తుకా చెప్పుకొచ్చాడు: ‘ఈ శబ్దకేళి
నిరర్థకం, అంతా ముగిసేక, ఎవరిదారిన
వారు పోక తప్పదు, వేరు వేరు దారుల్లో వేరు వేరు ముళ్ళు.
ఆ ముళ్ళదారిలోనే మళ్ళా అతణ్ణి కలుసుకుంటాం,
…విను, విను, అదిగో, గుడిగంట మోగుతోంది, ఇంట్లో
గయ్యాళి నా కోసం కాచుకుంది..’

ఇద్దరూ ఎవరిదారుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు
ఆ రహస్యమేమిటో ఆకాశానికి అంతుచిక్కనే లేదు,

2-7-2016 & 4-7-2016

Leave a Reply

%d bloggers like this: