వియోగ బాధ, విరహజ్వాల

Reading Time: 3 minutes

155

ఆ మధ్య ఒంగోలునుంచి సికింద్రాబాదు వస్తూ, రైల్లో, నా ట్రావెల్ బాగు పోగొట్టుకున్నాను. దానికోసం రైల్వే పోలీసుల్ని చాలానే బతిమిలాడాను. కారణం, ఆ సంచీలో, షైక్ అబూ సయ్యద్ ఇబన్ అబిల్ ఖేయర్ కవితాసంకలనం Nobody, Son of Nobody (2001) ఉంది. దాన్ని అమెరికా నుంచి నా కోసం రావెల మనోహర్ గారు పంపించారు. ఆ పుస్తకం మొదటి పేజీ కూడా తెరవకుండానే పోగొట్టుకున్నానన్న బాధ నన్ను వేధిస్తూనే ఉంది.

ప్రస్తావ వశాన ఆ పుస్తకం గురించి ఎవరితోనో చెప్తూ ఉండగా, ఓ మిత్రురాలు విని, ఆ పుస్తకం పేరేమిటని అడిగింది. నాలుగురోజుల కిందట మరొక కొత్త ప్రతి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టింది.

సూఫీ కవులతో అనుభవాలిట్లానే ఉంటాయి.

అబూ సయ్యద్ అబిల్ ఖేయర్ పేరు నేను మొదటిసారి విన్నది 2009 లో. సూఫీ సంప్రదాయానికి చెందిన ఒక అపురూపమైన కవితాసంకలనం Love’s Alchemy (2006) లో ఆయన కవితలు మొదటిసారి చూసాను. అప్పట్లో నవ్య వారపత్రికలో నా కాలం లో ఆయన రాసిన ఒక కవిత గురించి రాసాను కూడా.

Nobody, Son of Nobody ఆయన పారశీక సంపుటం నుంచి ఇంగ్లీషులోకి అనువదించీన 195 కవితల సంపుటి. అనువాదకుడు వ్రజె అబ్రమియాన్ అబిల్ ఖేయర్ జీవితం పైనా, అతడి చుట్టూ ఉన్న కథలపైన ఒక చక్కటి ముందుమాట కూడా పొందుపరిచాడు.

ఈ సారి,మరొక రైల్లో ప్రయాణంలో, ఆ పుస్తకంఒక్క అక్షరం కూడా వదలకుండా పూర్తిగా చదువుకున్నాను. అది మొదటి పఠనం. బహుశా, రానున్న జీవితంలో మరెన్ని సార్లు ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంటానో.

10 వ శతాబ్దానికి చెందిన అబిల్ ఖేయర్ రూమీ కన్నా రెండు శతాబ్దాల ముందు వాడు. తొలినాటి సూఫీ కవుల్లో ప్రసిద్ధుడు, కాని బయటి ప్రపంచానికి అంతగా తెలిసినవాడు కాడు. కాని ఆ కవిత్వం, పరిపూర్ణమైన సూఫీ హృదయోద్వేగంతో కూడుకున్నదే.

ఆ కవిత్వం చదువుతుంటే ఆ పుస్తకం నుంచి సన్నని నులితీగలు మనల్ని పెనవైచుకుంటాయి. అయితే, ఆయన చుట్టూ అల్లుకున్న కథలు మనల్ని మరింతగట్టిగా చుట్టుకుంటాయి.

ఆయన గురించిన కొన్ని anecdotes, ఆ సంపుటినుంచి కొన్ని కవితలు మీ కోసం:

anecdotes

1
షిరాజ్ కి చెందిన బాబా కుహీ గా అందరూ ప్రేమగా పిలుచుకునే షేక్ బూ అబ్దుల్లా బకూ ఎవరితోటో ఇలా చెప్పడం విన్నాం: ‘షేక్ అబిల్ ఖేయర్ ని చూసి ఉండకపోతే, ఒక సూఫీ ఎలా ఉంటాడో ఎప్పటికీ నాకు తెలిసిఉండేది కాదు.’

2
గురువు (అబిల్ ఖేయర్) ఇలా అనేవారు: ‘సూఫీతత్త్వమంటే ఈశ్వరుడి మాటలు నేరుగా వినగలగడం.’. ఆయనింకా ఇలా అన్నారు: ‘నీ బుర్రలో ఉన్నదంతా పక్కన పెట్టు, నీ చేతుల్లో ఉన్నదంతా ఇచ్చెయ్యి, నీకేది సంప్రాప్తం కానుందో దాన్నుంచి పక్కకు తప్పుకోకు.’

3
ఒకరోజు గురువు సన్నిధిలో ఎవరో ఒక షేర్ వినిపించారు. దానీ అర్థం ఇలా ఉంది:

‘ నాకో కవితలో ఒదిగిపోవాలని ఉంది, నువ్వా కవిత చదివేటప్పుడు నీ పెదాల్ని నేను ముద్దిడగలుగుతాను కదా.’

ఆ కవిత ఎవరు రాసారని అడిగారు గురువు. ఫలానా కవి అని పేరు చెప్పగానే ఆయన వెంటనే ఆ మహనీయుడి సమాధి దగ్గరకి పోయి సాష్టాంగపడ్డారు.

4
ఒకరోజు గురువు తన శిష్యులతో నిశాపూర్ బజారులో పోతున్నారు. కొంతమంది యువకులు ఒక మనిషిని తమ భుజాల మీద మోసుకుపోతూ ఆయనకి ఎదురయ్యారు. ‘ఎవరతను, ఎందుకట్లా మోసుకుపోతున్నా’రని అడిగారు గురువు. ‘అతడు జూదగాళ్ళకి రాజు ‘ అన్నారు వాళ్ళు. అతడు జూదగాళ్ళకి రాజెట్లా అయ్యాడని గురువు మళ్ళా వాళ్ళనడిగారు.

వాళ్ళ భుజాల మీద కూచున్న ఆ అ యువకుడు ఆయనతో ‘ నేను నాకున్నదంతా భయం లేకుండా ఒడ్డేశాను. ఉన్నదంతా పోగొట్టుకున్నదాకా జూదమాడుతూనే ఉన్నాను. అందుకనే వీళ్ళు నన్ను తమకి రాజంటున్నారు’ అన్నాడు.

ఆ మాటలు వింటూనే గురువు సంతోషం పట్టలేకపోయారు. శిష్యులవైపు తిరిగి ‘చూడండి, మీరు కూడా మీకున్నదంతా పోగొట్టుకుని మహరాజులు గా మారండి’ అన్నారు.

5
ఆయనెప్పుడూ అనేవారు: ‘ఈశ్వరుడి గురించి కాకపోతే ఏ మాటలైనా వృథా. ఇక ఈశ్వరుడి మాటలెట్లానూ బిగ్గరగా మాట్లాడుకునేవి కానేకావు.’

6.
గురువు ఈ లోకం నుంచి సెలవు తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు ఆయన తన చుట్టూ ఉన్నవాళ్ళతో ఇట్లా అన్నారు: ‘నా ప్రియతముడు నాకిట్లా చెప్పాడు. ‘నిన్నిక్కణ్ణుంచి తీసుకువెళ్ళిపోతాను. ఇకమీదట నిన్ను చూడవచ్చేవాళ్ళకి నీ బదులు నేనే దర్శనమిస్తాను అని.’

గురువు ఇంకా ఇలా అన్నారు: ‘ఎవరిలో ప్రేమ విధేయత కొరవడుతుందో, వారితో ఈశ్వరుడే నేరుగా మాట్లాడతాడు ‘ అని.

ఎవరట్లాంటి వాళ్ళు అని అడిగారు వాళ్ళు.

‘ఈ మాటల్ని ఎవరు పదే పదే తలుచుకుంటారో వాళ్ళంతానూ’ అన్నారు గురువు.

కవితలు

1
బళ్ళో చదువుకోడానికి పలకా, పుస్తకముంటాయి,
నిజమైన ప్రేమికులకోసం సంతోషం కాచుకుంటుంది,
కాని విశ్వాసులు కలుసుకున్నప్పుడు మాత్రం
ఆకొన్నవారందరికీ నిజాయితీ భిక్షగా దొరుకుతుంది.

2
పొద్దున్నే నిద్ర లే, మన కథ మొదలయ్యేదప్పుడే,
నడిరాత్రి, తలుపులన్నీ వేసేసాక
అప్పుడు, ప్రేమికుల ద్వారం తెరుచుకుంటుంది
ప్రియతముడి ఇంటి చుట్టూ ప్రేమికులంతా గుమికూడతారు
ప్రజ్వలిత దేహాల్తో గూడు చేరుకునే గువ్వల్లా.

3
ఆయన్నడిగాను
‘నేత్రాలెందుకు?’
‘నీ ప్రియతముడు నీ కోసం దిగివచ్చే బాటని చూస్తూండటానికి.’
‘వేదనాభరితమైన ఈ మనసెందుకు?’
‘అదే లేకపోతే, నీ ప్రేమమధుర జ్ఞాపకాలు ఎక్కడ దాచుకుంటావు?’
‘మరి ఈ హృదయమెందుకు?’
‘ఏముంది అందులో?’
‘వియోగ బాధ, విరహజ్వాల ‘
‘జాగ్రత్తగా చూసుకో దాన్ని,
ఈ సమస్త సృష్టిలోనూ మరెక్కడా దొరికేది కాదది ‘

4
ఈ ప్రపంచమొక రహదారి,
స్వర్గం, రహదారి సత్రం
ప్రియతముణ్ణి కలుసుకోవాలంటే
రెండూ వదిలిపెట్టక తప్పదు.

5
నా నొప్పి గురించి చెప్పుకుందామని ఒక వైద్యుణ్ణి కలిసాను.
‘నీ బాధ నలుగురికీ చెప్పుకునేది కాదు,
గోప్యంగా ఉంచు’ అన్నాడతడు.
కొంతైనా ఉపశమిస్తుందని కషాయమిమ్మన్నాను
‘నీ నెత్తురూ, కన్నీళ్ళే కషాయం’ అన్నాడు.
‘పోనీ పథ్యం పాటించడానికి వేటిని దూరం పెట్టాలో చెప్పు’ అనడిగాను.
‘ఈ లోకమూ, పరలోకమూ’ అన్నాడతడు.

30-7-2016

Leave a Reply

%d bloggers like this: