ఆ మధ్య సికింద్రాబాదు వై.ఎం.సి.ఏ దగ్గర పుస్తకాలు కేజీల్లెక్కన అమ్ముతున్నారంటే వెళ్ళాను. ప్రపంచ ప్రాచీన నగరాలమీద రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు వేసిన సిరీస్ లో ‘క్యోటో’ మీద ఒక పుస్తకం దొరికింది.
చూడగానే బషొ హైకూ గుర్తొచ్చింది.
‘క్యోటో లో ఉన్నప్పుడు కూడా
కోకిల పాట వినగానే
క్యోటో కోసం బెంగపెట్టుకుంటాను’
ఎట్లాంటి కవితా వాక్యం!
ఆ వాక్యం ఒకప్పుడు నాతో ఈ వాక్యం రాయించింది;
‘కోకిలను మా ఊళ్ళో విన్నా
నాకు మా ఊరే గుర్తొస్తుంది.’
క్యోటో క్రీ.శ 794 నుంచి 1869 దాకా దాదాపు వెయ్యేళ్ళ పాటు జపాన్ చక్రవర్తుల రాజధాని. అక్కణ్ణుంచి రాజధాని టోక్యోకి వెళ్ళిపోయాక కూడా అది జపనీయ సాహిత్య, సౌందర్య, సాంస్కృతిక రాజధానిగా కొనసాగుతూనే ఉంది.
వెయ్యేళ్ళకు పైగా విలాసవంతమైన ఒక కులీనవర్గం జీవితాన్ని ఎంత సున్నితంగా జీవించవచ్చో అంత సున్నితంగానూ అక్కడ జీవించింది. ఆ సౌకుమార్యం, ఆ సున్నితత్వం పురుషులూ, యోద్ధలూ నిర్మించింది కాదు. దాని వెనక కోమలమైన హృదయాల అపురూపమైన తీరికదనముంది.
వెయ్యేళ్ళ కిందట రాజాస్థానాల్లో ఉన్న కవులూ, పండితులూ చీనా భాషలోనూ, కన్ ఫ్యూషియస్ సంకలనం చేసిన గ్రంథాల్లోనూ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా అంతఃపురాల్లో మురసకి షికిబు ‘గెంజి గాథ ”, శై షోనగొన్ ‘పిల్లో బుక్ ‘ లతో క్యోటో ఆత్మని ఆవిష్కరించారు.
అవన్నీ గుర్తొచ్చి ఆ పుస్తకం తీసుకున్నాను. అందులో ‘సాహిత్యంలో క్యోటో’ అని ఒక ప్రత్యేక విభాగమే ఉంది. శై షొనగొన్ నుంచి యుకియొ మిషిమ దాకా కొందరు జపనీయ రచయితల రచనలనుంచి ఏరిన భాగాలతో పాటు విదేశీ సందర్శకులు, చరిత్రకారులు, మానవశాస్త్రజ్ఞుల రచనలనుంచి కూడా కొన్ని భాగాలున్నాయి. కాని వాటన్నిటిలోనూ నన్ను కట్టిపడేసింది నికొస్ కజంట్జకిస్ తన చీనా, జపాన్ పర్యటన (1963) సందర్భంగా రాసిన వ్యాసం.
నికొస్ కజంట్జకిస్ ఆధునిక గ్రీకు సాహిత్యంలో సర్వోన్నతుడైన కవి, రచయిత, తత్త్వవేత్త. హోమర్ రాసిన ‘ఒడెస్సీ’ కి కొనసాగింపుగా ‘ఒడెస్సీ-ఎ మోడర్న్ సీక్వెల్’ అనే పేరిట 33,333 పంక్తుల ఆధునిక ఇతిహాసం రాసాడు. కాని నవలాకారుడిగా ఆయనకెక్కువ ప్రసిద్ధి దొరికింది. అందులో ‘జోర్బా, ద గ్రీక్’ తనకిష్టమైన పుస్తకాల్లో ఒకటని ఓషోనే పేర్కొన్నాడు. ‘ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్’ నవలగానూ, సినిమాగానూ కూడా సంచలనం రేకెత్తించింది. వాటన్నిటికన్నా, ‘ద గాడ్స్ పాపర్’ పేరిట సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ మీద రాసిన నవల మరింత ఉజ్జ్వలమైన గ్రంథం.
అట్లాంటి వాడు క్యోటో మీద ఏమి రాసిఉంటాడా అని ఆసక్తితో చదివాను. ప్రతి ఒక్క వాక్యం దగ్గరా ఆగిపోతూ, వెనక్కి వెళ్తూ, చదివాను. ఆ వ్యాసం మొత్తం మీకోసం తెలుగుచేసేద్దామా అనిపించింది. కానీ, కనీసం కొన్ని వాక్యాలేనా మీకు వినిపించకుండా ఉండలేకపోతున్నాను:
‘..రాత్రి వేళ ఈ నగరవీథుల్లో తిరుగుతూ నీకెంతో ఇష్టమైన మనిషిని చీకట్లో చూస్తున్నట్టుగా నేనా నగరాన్ని చూసాను. ప్రతి నగరానికీ ఒక లైంగిక ప్రకృతి ఉంటుంది, అది స్త్రీ ప్రకృతిగానీ, పురుష ప్రకృతిగానీ. ఈ నగరానిది స్త్రీ ప్రకృతి. దాని ప్రేమ, దాని దుస్సాహసాలు, దాని పుకార్లు, దాని సుఖలాలసత్వం, దాని విలాసాలు ప్రతి ఒక్కటీ నెమరేసుకున్నాను- అవన్నీ ప్రతి ఒక్కటీ నాకెంతో పవిత్రంగానూ, ఎంతో అవసరమైనవిగానూ తోచాయి. ఒక స్త్రీగా తాను నెరవేర్చవలసిన ధర్మాలన్నీ ఈ నగరం నెరవేర్చిందనిపించింది. విధివిలాసాన్ని నెరవేరుస్తున్న ధోరణిలో ఈ నగరం మనుషులు ముందుకుపోవడానికి ఒక స్త్రీలాగా దోహదపడుతూ వచ్చింది. ప్రేమిస్తూ, సుఖపెడుతూ, కాలాన్నీ, వనరుల్నీ కరిగించివేస్తూ- జీవితానికి ఏదైనా అవసరమనిపించినప్పుడు, ఆ అవసరం పొందగల తన యథార్థ ఔన్నత్యానికి చేరుకుంటూ-‘
‘..ఈ వీథుల్లో ఇట్లా దిమ్మరుతూ ఈ ప్రాచీన పాపమయ నగర సారాంశాన్నీ, దాని ధ్యేయాన్నీ గుర్తుపట్ట్గలిగాను, అందుకు సంతోషంగా ఉంది. జపనీయ ఆత్మ రూపొందే క్రమం పరిపూర్ణం చెందడానికి అవసరమైన స్త్రీకణాన్ని ఈ నగరం సమకూర్చింది. రేప్పొద్దున్న తెల్లవారాక, మేమిద్దరం మేల్కొన్నాక, పొద్దుటి సూర్యకాంతిలో, ఆమె నా ముందు తనను తాను విప్పిపరుచుకున్నప్పుడు నేనామెనెందుకు ప్రేమించాలో తెలుసుకుంటాను. ఆమె పాపాలన్నీ మర్చిపోతాను, ఒక స్త్రీ నిన్ను అమితంగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వామె పాపాల్ని ఎట్లా సంతోషంగా మర్చిపోతావో అట్లా..’
‘..ఈ దుబారా, మనం మామూలుగా విలాసమనీ, అతిశయమనీ, ఆడంబరమనీ అంటామే అట్లాంటి ఈ దుర్వ్యయం నిజంగా ఎంత ధన్యం! ఒక విలాసాన్ని అవసరంగా భావించడమే నాగరికత అనిపిస్తుంది నాకు. నీలోని పశువుని జయించడానికి కేవలం తినడం, తాగడం, నిద్రామైథునాలు చాలకపోవడమన్నమాట. తిండికోసం తపించినట్టే, ఒక అనవసర విలాసం కోసం కూడా ఎప్పుడు తప్పించడం మొదలవుతుందో అప్పుడే ఆ ‘రెక్కల్లేని ద్విపాద పక్షి’ మనిషిగా రూపొందడం మొదలుపెడతాడు. మనుషుల గుంపుల విధ్వంసం నుంచి ఈ ప్రపంచం ఏది మిగుల్చుకుందో, ఈ ప్రపంచంలో ఇంకా చెప్పుకోదగ్గది ఏది మిగిలిఉందో- ఒక వర్ణచిత్రం, రాతిమీద చెక్కిన పువ్వు, ఒక లలితగీతం, నేలబారు మనుషులు అందుకోలేని గొప్ప భావం- ప్రతి ఒక్కటీ ఒక విలాసం కిందనే లెక్క. విలాసం అత్యున్నతమానవుడి అత్యంత ప్రాథమిక అవసరం. హృదయం పొంగిపొర్లిపోవడమది, అట్లా పొంగిపొర్లిపోయేదే నిజమైన హృదయం…’
ఇంకా చాలా వాక్యాలున్నాయిగాని, వాటిని అనువదించే ఓపిక లేదు, చివరి వాక్యాలకి వచ్చేస్తాను. తన వ్యాసాన్ని ఆయనిట్లా ముగించాడు:
‘..తన చుట్టూ ఉన్నప్రపంచం ఎదట తనని మోహరించి ప్రకృతి మీద తన అహంకారాన్ని ఆరోపించి ప్రాకృతిక శక్తుల్ని తన ప్రయోజనం కోసం లొంగదీసుకోవడంలోనే శ్వేతజాతీయుడు గొప్ప సంతోషం పొందుతాడు. కాని ప్రపంచ మధ్యంలో నిలబడి దాని హృదయస్పందనంతో తన హృదయాన్ని మేళవించడంలోనే ప్రాచ్యమానవుడు నిరవధిక సంతోషానికి లోనవుతాడు. జపనీయ చిత్రలేఖనాన్ని చూస్తూ ఈ రెండు జాతుల మధ్య ఉన్న ఈ లోతైన వైరుద్యాన్ని కనుగొని నేను ఆనందిస్తూన్నాను. జపాన్ చిత్రాల్లో ప్రధాన ఇతివృత్తం, కీలకాంశం ఆ చిత్రాల్లో చిత్రించబడ్డ మనిషి కాదు, అతడి చుట్టూ కనవచ్చే అవిరళ ఆకాశం, ఆ దిగంతరేఖ, ఆ చెట్టుతో, నీళ్ళతో, మేఘంతో అతడి ఆత్మకి దొరికే ఒక రహస్య స్పర్శ. ఆ చిత్రాల్లో ప్రధాన ఇతివృత్తమిదే: సౌభ్రాతృత్వం, ప్రకృతితో మమేకం కావడం, ఇంకా చెప్పాలంటే, మనిషి తన ఇంటికి తాను చేరుకోవడం..’
కేజీల్లెక్కన అమ్మే పుస్తకాల విక్రయకేంద్రంలో నాకొక టన్ను ఆనందం దొరికిందని వేరే చెప్పాలా!
4-8-2015