కబీరు-12

141

చాలా రోజుల తర్వాత మళ్ళా కబీరుని తెరిచాను. ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. అటువంటి స్పష్టత ఒకటుందని తెలియడమే ఒకింత ఊరట ఈ జీవితానికి:

మరణించేది నేను కాదు

మరణించేది నేను కాదు, మరణించేది జగత్తు,
నాకైతే జీవితాన్ని నిలబెట్టేవాడొకడు దొరికాడు.

శాక్తుడు మరణిస్తాడు, సాధువులు జీవిస్తారు
కడుపారా రామరసాయన పానం చేస్తారు.
హరి మరణిస్తే కదా నేను మరణించేది,
హరికి మరణంలేకపోతే నాకెక్కడ మరణం?

మనసుని మనసులో కలిపేసాడు కబీరు
మరణం దాటి, సుఖసాగరం చేరుకున్నాడు.

(కబీరు గ్రంథావళి, హమ్ న మరై, 43)

ప్రభూ, ఉన్నది నువ్వే

ప్రభూ, ఉన్నది నువ్వే, నేను కానే కాదు
పండితులు చదివి చదివి మర్చిపోయారు

ఎంతసేపు ‘నేను’, ‘నేను’, ‘నేనం’ టానో
అంతసేపు నిన్ను పసిగట్టలేకున్నాను

నరనాథా, నేను జీవించి లేను, అలాగని
మృతుణ్ణి కూడా కానంటున్నాడు కబీరు

(కబీరు గ్రంథావళి, ఇబ్ తూ హసీ ప్రభూ, 65)

13-12-2016

Leave a Reply

%d bloggers like this: