మనమెందుకు గుర్తుపెట్టుకుంటాం?

132

స్వెత్లానా పుస్తకం చాలాకాలం కిందటే తెలుగులోకి వచ్చిందని తెలిసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో, కాని ఆ పుస్తకం అప్పుడు చదవలేకపోయానే, ఎంత సిగ్గుగా ఉందో. ఆ పుస్తకమెట్లానూ తెలుగులోకి వచ్చింది కాబట్టి, Voices from Chernobyl నుండి ఒక వాజ్మూలాన్నిట్లా తెలుగు చేసాను. ఎస్. ప్యొతోర్ అనే మానసిక వైద్య నిపుణిడి మాటల్ని స్వెత్లానా మనకిట్లా అందిస్తోంది:

మనమెందుకు గుర్తుపెట్టుకుంటాం?

నువ్వు దీని గురించి రాయాలనుకుంటున్నావా? దీనిగురించి? కాని నాకేం జరిగిందో, ఏ అనుభవాలు తటస్థించాయో అవెవరికీ తెలియకూడదనుకుంటున్నాను. కాని మరోవేపు నా గురించి మొత్తం చెప్పేసుకోవాలనీ, అంతా పంచుకోవాలనీ ఉంది, మరోవేపేమో, అట్లా చెప్పుకోవడమంటే నన్ను నేను బయటపెట్టేసుకోవడం లాగా అనిపిస్తూంది, అందుకని ఏమీ చెప్పాలనీ లేదు.

అప్పుడు టాల్ స్టాయిలో ఎట్లా ఉండిందీ నీకు గుర్తుందా? పియెర్రి బెజుకోవ్ యుద్ధాన్ని చూసి ఎంతగా చలించిపోయాడంటే, ఇక తర్వాత అతడూ ప్రపంచమూ కూడా మొత్తం మారిపోయాయనే అనుకుంటున్నాడు. కొంతకాలం గడిచేక, అతడు: ‘నేను మునుపటిలానే బండివాడి మీద అరుస్తున్నాను కదా, ఇంతకుముందులాగానే చికాకుపడుతున్నాను కదా’ అని తనకి తాను సర్దిచెప్పుకుంటున్నాడు. మరి అట్లాంటప్పుడు మనుషులెందుకు గుర్తుపెట్టుకోవాలి? వాళ్ళ జ్ఞాపకశక్తి ఎందుకింకా క్షీణించకుండా ఉంది? అంటే మన జ్ఞాపకాల్ని బట్టి మనం సత్యమేమిటో నిగ్గుతేల్చుకోవచ్చనుకుంటున్నామా? లేదా నిజాయితీగా ఉండాలన్న ప్రయత్నమా? లేదా జరిగిందంతా మర్చిపోయి తమని తాము బయటపడేసుకోగలరా? లేదా జరిగిపోయిన ఒక మహాసంఘటనలో తాము కూడా ఏదో ఒక మేరకు భాగమని అనుకుంటున్నారా? లేదా తమని తాము మర్చిపోడానికి గతాన్ని పట్టుకు వేలాడుతున్నరా? ఇదంతా ఏమైనా కానీ, ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి, జ్ఞాపకాలు చాలా పెళుసైనవి, పొగలగా ఇట్టే ఆవిరైపోతాయి, వాటినిబట్టి విషయాలు మనకి పూర్తిగా తెలుస్తాయని చెప్పలేం. మాహా అయితే వాటినిబట్టి మనుషులు తమ గురించి తామెంతో కొంత ఊహాగానం చేసుకోగలరంతే. జ్ఞాపకాల్ని బట్టి జ్ఞానం కలుగుతుందని కూడా చెప్పలేం. అవి కేవలం సున్నితమైన కొన్ని భావోద్వేగాలు మాత్రమే.

నా భావోద్వేగాలు..నేను అతికష్టమ్మీద నా జ్ఞాపకాల పొరల్ని తవ్వి చూసుకున్నాను.

నా జీవితంలో, నా బాల్యంలో, అత్యంత భీతావహమైన విషయం యుద్ధం.

నా చిన్నప్పుడు మేం కుర్రాళ్ళం అమ్మానాన్నా ఆటాడుకోవడం నాకిప్పటికీ గుర్తే. మేం మా గుడ్డలు తీసేసి ఒకళ్ళమీద ఒకళ్ళం పడుకునేవాళ్ళం. యుద్ధం తర్వాత పుట్టిన తొలిశిశువులం, యుద్ధం జరుగుతున్నంతకాలం, అందరూ పిల్లలనేమాటే మర్చిపోయారు. యుద్ధమైపోగానే మేమ మళ్ళా జీవితం తలెత్తాలని ఆశగా ఎదురుచూసాం. అందుకోసం అమ్మా నాన్నా ఆటాడుకునేవాళ్ళం, అట్లా ఆడుకుంటూ ఉంటే, జీవితం మళ్ళా ప్రాణం పోసుకుంటుందేమోనని ఒక ఆశ. ఇంతాచేస్తే ఎనిమిది పదేళ్ళ వయసు పిల్లలం.

నేనొకసారి ఒకామె తనని తాను చంపుకోడం చూసాను. ఏటిఒడ్డున పొదలమాటున. ఆమె ఒక బండరాయితో తన తలమోదుకుంటూండటం చూసాను. మా ఊరిని ఆక్రమించిన సైన్యానికి చెందిన సైనికుడొకడు ఆమెని గర్భవతిని చేసాడు. వాణ్ణి మా ఊరంతా అసహ్యించుకునేది. ..అట్లానే, నా చిన్నప్పుడు, పిల్లి పిల్లల్ని పెట్టడం కూడా చూసాను. ఆవు ఈనుతూంటే, లేగదూడని మా అమ్మ బయటకి లాగుతుండే దృశ్యం కూడా. మా పందుల్లో ఆడపందీ, మగపందీ ఒకదానిమీద మరొకటి పొర్లే దృశ్యాలూ నాకు గుర్తే. నాకు గుర్తు-ఇప్పటికీ గుర్తే- వాళ్ళు మా నాన్న కళేబరాన్ని మోసుకొచ్చిన దృశ్యం. అప్పుడాయన వంటిమీద స్వెట్టరుంది. దాన్ని మా అమ్మే తన చేతుల్తో అల్లింది. మా నాన్నని మెషిన్ గన్ తో కాల్చేసారు. ఆ స్వెట్టర్లోంచి నెత్తుటిముద్దలు బయటకి వేలాడుతున్న దృశ్యం. మా ఇంట్లో ఉండే ఒకేఒక్క మంచం మీద ఆయన్ని పడుకోబెట్టారు. అది తప్ప ఆయన్ని పడుకోబెట్టడానికి మరోచోటేమీ లేదు. ఆ తర్వాత ఆయన్ని మా ఇంటిముందే పూడ్చిపెట్టారు. మట్టి. మట్టి అంటే పత్తి కాదుకదా. బీట్ రూట్ దుంపల చేలో పాతిపెట్టారు. చుట్టూ ఎటుచూసినా యుద్ధం చప్పుళ్ళే. వీథులన్నీ చచ్చిపోయిన మనుషులతోనూ, గుర్రాల పీనుగుల్తోనూ నిండిపోయుండేవి.

ఈ జ్ఞాపకాలు నావరకూ నాకెంతో వ్యక్తిగతమైనవి. నేను వాటినెప్పుడూ ఎవరిముందూ బాహాటంగా చెప్పుకోలేదు.

అప్పట్లో నాకు చావు గురించిన ఆలోచనలకీ, బతుకు గురించిన ఆలోచనలకీ మధ్య పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. ఆవు లేగదూడని ఈనుతూంటే ఎట్లా అనిపించేదో, పిల్లి పిల్లల్ని పెడుతూండటం చూసినప్పుడేమనిపించేదో, ఆ పొదలమాటున ఆ ఆడమనిషి బండరాయితో తన తలని మోదుకుంటూడటం చూసినప్పుడూ అలానే అనిపించింది. ఎంచాతనో తెలీదుగానీ, అవి రెండూ-అంటే చావూ,బతుకూ కూడా-ఒకే విషయంలాగా అనిపించేది.

పందిని కోస్తున్నప్పుడు మా ఇల్లంతా ఎట్లాంటి వాసన అల్లుకునేదో నా చినంప్పటినుంచీ నాకు గుర్తే. చూడు, నువ్వు నన్నిట్లా కదిపేవో లేదో, నేనెట్లా జారిపోతున్నానో, నా భయానకమైన స్మృతిసముద్రంలోకి. ఆ భీతావహకాలంలోకి. అందులోకి ఎగిరిపోతున్నాను. మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఆడవాళ్ళు స్నానాలగదుల్లోకి పోయినప్పుడు మేం కూడా వాళ్ళ వెంటపోయేవాళ్ళం. అక్కడవాళ్ళు జారిపోతున్న తమ పొత్తికడుపుల్ని జారిపోకుండా గట్టిగా గుడ్డల్తో పట్టీ కట్టుకోవడం నాకు గుర్తే. (వాళ్ళట్లా వాటిని జారిపోకుండా కట్టుకుంటున్నారని మాకు అప్పుడే అర్థమయ్యేది కూడా). అదంతా నేను చూసాను. తట్టుకోలేని కాయకష్టం వల్ల అవి జారిపోయేవి. అప్పట్లో మగవాళ్ళెవ్వరూ ఊళ్ళల్లో ఉండేవారు కాదు. వాళ్ళంతా యుద్ధభూమిలోనే ఉండేవారు. ఊళ్ళో గుర్రాలు కూడా ఉండేవి కావు. పనంతా ఆడవాళ్ళే చేసుకోవలసి వచ్చేది. వాళ్ళే పశువుల్లాగా పొలాలు దున్నుకోవలసి వచ్చేది., ఆ కొల్కోజ్ పొలాలు. నాకు కొద్దిగా వయసు వచ్చాక, ఒకామెతో కొంత సన్నిహితంగా ఉండేవాణ్ణి, కాబట్టి ఇదంతా నాకు తెలుసు, అప్పట్లో నా చిన్న్నప్పుడు ఆ స్నానపుశాలల్లో చూసిందంతా.

నేనిదంతా మర్చిపోవాలనుకున్నాను. ప్రతి ఒక్కటీ మర్చిపోవాలనుకున్నాను. మర్చిపోగలిగాను కూడా. జరగవలసిన పెనువిపత్తు ఏదో ఎలానూ జరిగిపోయిందనుకున్నాను. యుద్ధం. యుద్ధం ముగిసిపోయింది కాబట్టి, ఇంక నేను క్షేమంగా ఉన్నాననుకున్నాను, ఉంటాననుకున్నాను.

అదిగో, అప్పుడు నేను చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళవలసివచ్చింది. ఇప్పటికి చాలాసార్లే వెళ్ళవలసివచ్చింది. నేనెంత చాతకానివాణ్ణో నాకొక్కసారిగా తెలిసివచ్చింది. నేను ముక్కలయిపోతున్నాను. నా గతం నన్నింకెంతమాత్రం కాచుకోలేకపోతున్నది. నా దగ్గరిప్పుడెలాంటి సమాధానాలూ లేవు. ఒకప్పుడుండేవి, కాని ఇప్పుడవి ఎంతమాత్రం పనికిరావడం లేదు. నన్నిప్పుడు ధ్వంసం చేస్తున్నది, భవిష్యత్తు, గతం కాదు.

9-10-2015

Leave a Reply

%d bloggers like this: