మట్టిగూడు

289

ఒకప్పుడు, అంటే, మనిషి చరిత్రలో చరిత్ర యుగం అంటూ ఒకటి మొదలు కావడానికి పూర్వం మనిషికీ, ప్రకృతికీ మధ్య రక్తసంబంధం ఉండేది. ప్రకృతి అంటే చెట్టు చేమలూ, నదీనదాలూ మాత్రమే కాదు, దృశ్య, అదృశ్య చరాచర ప్రపంచమంతా కూడా. శిశువు తల్లికడుపులో ఉమ్మనీటిగదిలో ఉన్నప్పుడు అతడికీ, అతడి తల్లిదేహానికీ మధ్య ఉండే బంధం లాంటిదే మనిషికీ, మనిషి చుట్టూ ఉన్న విశ్వానికీ ఉండేది.

ఆ కాలం నుంచి ఆ మనిషి చాలా చాలా దూరం వచ్చేసాడు. ఇప్పుడు మనిషికి తన దేహమే సమస్తప్రపంచమూనూ. తాను బతికితే చాలు, తక్కిన ప్రపంచమేమైతేనేం అనుకుంటున్నాడు. కానీ, అట్లా జీవించగలగడం సాధ్యమేనా? అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, అభివృద్ధి చెందిన దేశాలకీ, బీదదేశాలకీ కూడా ఒకటే ఆకాశం. అంతరిక్షానికి చిల్లుపడితే, భూతాపోగ్రత సముద్రపు తుపాన్లుగా మారితే అమెరికాలో, ముంబైలో, చైనాలో, జపాన్ లో ప్రతి ఒక్కచోటా ఇళ్ళు కూలిపోతాయి, నగరాలు మునిగిపోతాయి. ఇప్పుడు పారిశ్రామిక నగరాల కార్బన్ డయాక్సైడ్ కి ప్రపంచమంతా కూడా ముక్కుమూసుకోవలసి వస్తోంది. ఆమెజాన్ అడవుల్ని నరుక్కుంటూనో, తగలెట్టుకుంటూనో పోవడంవల్ల, అరుదైన భూచర, జలచర, వనచర, ఖేచరాలు అంతరిస్తున్నందువల్లా, నీ ఇంట్లోనూ, నా ఇంట్లోనూ కూడా పిల్లల శ్వాస మందగిస్తున్నది, మనం తినే అన్నం రక్తంగా మారకుండా పోతున్నది.

ఇట్లాంటి ఆలోచనలు కలగటాన్ని ఇప్పుడు ‘పర్యావరణ స్పృహ’ అంటున్నారు. కాని పర్యావరణం అనే మాటని ఎందుకనో మనం ఒక పరిమితార్థంలో మాత్రమే తీసుకోవడం నేర్చుకున్నాం. మన ఆర్థిక రాజకీయ సమస్యలూ, సామాజిక స్పృహ, ఈ వారం మనం చూడాలనుకుంటున్న సినిమా, ఈ నెలాఖరున కొనాలనుకుంటున్న కొత్త గృహోపకరణమూ-ఇట్లాంటి సుదీర్ఘమైన జాబితాలో పర్యావరణం ఎక్కడో చివర్లో వచ్చే అంశం. అది కూడా పన్నెండేళ్ళకు ఒకసారి ముహూర్తం ప్రకారం పుష్కరమొచ్చినా, ఋతుపవనాలు సకాలానికి రాక, నదిలో నీళ్ళు పారనప్పుడు మాత్రమే మనని బాధించే సమస్య.

కాని సత్యశ్రీనివాస్ లాంటి వాళ్ళకి అది దైనందిన సమస్య. అనుక్షణ వేదన. అతడి దృష్టిలో పర్యావరణమూ, మానవహక్కులూ వేరువేరు కావు. సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ ఒకదానికొకటి సంబంధించనవి కావు. పందొమ్మిదో శతాబ్ది పరిభాషలోనే మార్క్స్ ని అర్థం చేసుకున్నవాళ్ళింకా class struggle గురించే మాట్లాడుతూండగా, అతడికి మాత్రం స్పష్టంగా తెలుసు, 21 వ శతాబ్దంలో అది resource struggle రూపం ధరించిందని.

‘మట్టిగూడు: పర్యావరణ కవిత్వ నేత్రం’ (నవచేతన, 2017) పేరిట వెలువడ్డ సత్యశ్రీనివాస్ వ్యాసాలూ, కవిత్వ పరిచయాలూ మనల్ని తీవ్ర అశాంతికి లోను చేస్తాయి. ఇంత urgent సమస్యని మనముందు పెట్టుకుని మనం తక్కినవాటి గురించి మాట్లాడుతూ కాలం వృథాచేస్తున్నామని స్ఫురణకి రావడమే ఆ అశాంతికి కారణం.

పోయిన ఆదివారం ఆ పుస్తకపరిచయ సభ జరిగింది. కవి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఆ సభలో ‘కబీర్ సమ్మానితులు’ శివారెడ్డి పుస్తకం ఆవిష్కరించేరు. ప్రసిద్ధ రంగస్థల దర్శకులు భిక్షు, నవచేతన జనరల్ మేనేజర్ మధుకర్ లతో పాటు నేను కూడా పుస్తకం గురించి మాట్లాడేను. ఆ ప్రసంగాలు ఇప్పుడు యూ-ట్యూబ్ కి ఎక్కించారు.

ఆరోజు మాట్లాడింది మళ్ళా తిరిగి రాయాలని లేదు. అంతకన్నా కూడా ఆ పుస్తకంలోంచి కొన్ని వాక్యాలు ఇక్కడ ఎత్తిరాయాలని ఉంది. మిమ్మల్ని ఊరించడం కోసం, ఉద్రేకించడం కోసం:

1
సమస్యలున్నాయని పక్షులు పాటలు పాడవు, పాటలున్నాయని పాడతాయి అన్నది చైనీస్ సామెత.

2
బాహ్యపర్యావరణాన్ని మార్చినప్పుడు అది మన భాషావరణాన్ని మారుస్తుంది, అప్పుడు భాష గురించి విచారించినా ప్రయోజనం లేదు.

3
కవిత్వభాష ప్రాతినిధ్యం కాదు, నకలు కాదు, ఆకారాల్ని విడదీసి చూపకూడదు. వాటిని కవిత్వ రూపంలోనే ఆస్వాదించాలి అని క్రీస్తు అనంతరం 2వ శతాబ్దంలోని ప్రాకృత కవులన్నారు.

4
చికొమెండిస్ అన్నాడు: మొదట్లో నేను రబ్బర్ చెట్లను కాపాడటానికి పోరాడుతున్నాననుకున్నాను. తర్వాత ఆమెజాన్ సతత హరిత అడవుల్ని కాపాడటానికి పోరాడుతున్నాననుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమయింది నేను మానవాళికై పోరాడుతున్నానని.

5
పర్యావరణ కవిత్వానికి మరొక కీలక గుణం ‘నెరేటివ్ కాపిటల్’, అర్థాన్ని, సంఘటనల్ని వ్యక్తిగత అనుభవాల దృక్కోణం నుండి పరిశీలించడం.

6
పర్యావరణ కవిత్వంలో మరో విశిష్ట లక్షణం ప్రకృతి ప్రతీకల్ని ఒక ఉన్మాదరూపంలో విశదం చేయదు. దానికుండే గుణాన్ని సూటిగానే చెపుతుంది. అప్పుడు ప్రకృతి ఒక ఉన్మాదంగా కాకుండా సామాజిక-రాజకీయ వ్యవస్థ ఒక ఉన్మాదంగా ప్రస్ఫుటం అవుతుంది.

7
డ్యాం ల నిర్మాణం ఒక మెగా పెర్ స్పెక్టివ్ ని తీసుకువచ్చింది. మైక్రో నుండి మాక్రో దృక్పథం. ఈ దృక్పథలో స్మాల్ సొసైటీలు కొట్టుకుపోతాయి. అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి ఒక త్రుటిలో మాయమవుతుంది. ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇది కల్చరల్ ఎరోషన్. ప్రకృతిలో భూమికోత లాంటిది.

8
నది ఇప్పుడు మన నేలలో ఉన్న టియర్ గ్లాండ్. అది డ్రై అయిపోతోంది. పర్యావరణ కవిత్వం ఆ డ్రైనెస్ కి కొద్దిగా చెమ్మనిచ్చే మంచుకమ్మిన ఉదయం.

9
పర్యావరణ కవిత్వం కేవలం నినాద కవిత్వం కాదు… ఇది ఇకో నామిక్స్.

10
కవి ఒక ఆబ్స్ట్రాక్ట్ స్పేస్ ని సృష్టించి దానిని పాఠకుడితో పంచుకుంటాడు. ఈ స్పేస్ లోకి పాఠకుడు తన స్పేస్ ని తీసుకువస్తాడు.

11
ఇప్పుడు మనం అనుసరిస్తున్న అభివృద్ధిలో సంఘటనల మెటామార్ఫిజం ఎటువైపు వెళుతుందో చెప్పలేం. కారణం ప్యూపా సీతాకోకచిలుకే అవ్వాలని గారెంటిలేదు. ఏమైనా అవ్వచ్చు. ఏమీ కాకనూ పోవచ్చు.

12
పొయెట్రి అనే పదానికి మూలం ‘పోయెసిస్’ అంటే చేయడం అని అర్థం. ఇది ఆధునిక పోయెట్రికి మూలం. ఇది క్రియ. ఒక మార్పుని చేస్తూ ప్రపంచాన్ని కొనసాగించే చర్య…కవిత్వ తత్త్వం అంటే పదార్థాన్నీ, కాలాని అనుసంధానం చేసే చర్య. ఇది మనిషి, స్పేస్, టైం, మ్యాటర్ మధ్యన ప్రయాణం.
11-11-2017

Leave a Reply

%d bloggers like this: