బాలబంధు

Reading Time: 3 minutes

123

మొన్న ఇంటికి వచ్చేటప్పటికి దేవినేని మధుసూదనరావుగారినుంచి ఒక పార్సెలు వచ్చిఉంది. విప్పి చూద్దును కదా, బి.వి.నరసింహారావుగారి సమగ్రరచనలు మూడు సంపుటాలు! నా ఆశ్చర్యానికీ, ఆనందానికీ అంతులేదు.

మధుసూదనరావుగారిది విజయవాడ దగ్గర తెన్నేరు. ఆయన గొప్ప భావుకుడు, విద్యావేత్త, రైతు, ప్రయోగశీలి, సాహిత్యారాధకుడు. ఒకసారి వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడ ప్రతీదీ విశేషమే, ప్రతి ఒక్కటీ ఆశ్చర్యకారకమే. ఆ ఇల్లు, ఆ ఇంటివాస్తు ఎలా ఉందంటే, ఆ ఇంట్లో దీపాలతో పనిలేదు, సూర్యకాంతిచాలు. ఆ ఇంటిచుట్టూ తోట, వరిచేలు, ఆ ఇంటిపెరడు ఒక చుట్టు చుట్టేటప్పటికే ఒక వనమూలికాక్షేత్రంలో తిరిగినట్టనిపించింది. ఆయన గ్రంథాలయం గురించి ఎంతచెప్పినా చాలదు. ఆయనా, వారి శ్రీమతి జయశ్రీగారూ ఆ రోజు మాకిచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరవలేను.

ఆయన్నుంచి ఏది వచ్చినా అపురూపమే. అట్లాంటిది ఆ కానుక బి.వి. గారి రచనల సంపుటాలయితే చెప్పేదేముంది?

నేను నోచుకున్న అదృష్టాల్లో బి.వి.నరసింహారావుగారిని చూడటం కూడా ఒకటి. నా చిన్నప్పుడు ఆయన మా తాడికొండ పాఠశాలకు వచ్చారు. అప్పటికి ఆయనకు బహుశా అరవయ్యేళ్ళు దాటి ఉంటాయి. కాని ఆయన మా పిల్లముందు తానొక పిల్లవాడిగా ఆడాడు, పాడాడు.

సెలయేటి దరినొక్క చెంగల్వబాట
బాటవెంటనె పోతె పూవుల్లతోట.

అని పాడిందీ,

అవ్వా అవ్వా ఎందుకు నడ్డి?
అది నా బతికిన దానికి వడ్డి.

అని అభినయించిందీ,

నీ చేసిన బొమ్మలు కారు
నీ కడుపున కలిగిన వారు
మాట్లాడక కూచుండుటకు
మరి కదలక పడిఉండుటకు.

అని జిబ్రాన్ ని గుర్తు చేసిందీ

నాలుగు దశాబ్దాల తరువాత కూడా నా కళ్ళముందు కదుల్తున్నాయి.ఆయనకు నాకెంతో ప్రేమగా కానుక చేసిన ‘దిరిసెన పూలు’, ‘ఆవూ, హరిశ్చంద్ర’ నేనెంతో కాలం దాచుకున్నాను.

ఇప్పుడు ఆయన శతజయంతి సందర్భంగా మొత్తం రచనలు మూడు సంపుటాలుగా తెచ్చారు. మొదటి సంపుటంలొ జీవనరేఖలు, వ్యాసాలు, ఆయన గురించి మిత్రులు రాసిన వ్యాసాలు, చలంగారు అరుణాచలం నుంచి 52-79 మధ్యకాలంలో ఆయనకి రాసిన ఉత్తరాలు, ఆ పుస్తకానికి సంజీవదేవ్ రాసిన ముందుమాట ఉన్నాయి. రెండవసంపుటంలో కథలు, గేయాలు, గేయనాటికలు ఉన్నాయి. మూడవసంపుటంలో బాలవాజ్మయం మీద ఆయన రాసిన వ్యాసాలు, ఇతర రచనలు ఉన్నాయి.

ఈ రచనల్లో చాలావరకు నాకు కొత్తే. అందుకని పుస్తకాలు రాగానే ముందు ఆయన తన జీవితం గురించి రాసుకున్న జీవనరేఖలు చదివాను. ఆ పుస్తకం ఆయన చెప్పుకున్నట్టు రేఖామాత్ర స్థూలచిత్రణే అయినప్పటికీ, అందులో ఆయన మూర్తి స్ఫుటంగా చిత్రణకొచ్చింది. ఆదిభట్లనారాయణదాసు, గిడుగు రామ్మూర్తి, విశ్వనాథసత్యనారాయణ, పుట్టపర్తివంటివారు తమ ఆశీస్సులు వర్షించిన ఆ మనిషి, ఎవరి నాట్యప్రదర్శన చూడటానికి ఎన్.టి.రామారావు వంటి జనం మధ్య నెట్టుకుంటూ ముందుకుపోవడానికి ఉబలాటపడ్డాడో, ఎవరి రసావిష్కరణ నాగయ్య, నాగేశ్వరరావువంటివారిని కూడా విభ్రాంతపరిచిందో, ఆ కళాకారుడు, నర్తకుడు, గాయకుడు తన గురించి రాసుకున్న వాక్యాలు చదవడంలో గొప్ప ఆసక్తి ఉంది, ఆహ్లాదం ఉంది. చలం, సంజీవదేవ్, నార్లచిరంజీవి, కృష్ణశాస్త్రి వంటి మహనీయసారస్వతమూర్తులకి అత్యంత ఆత్మీయుడిగా జీవించిన ఆ మనిషి తలపోతల్లో జీవనానందప్రవాహం ఉంది.

ఆయన తన గురించి ఇట్లా రాసుకున్నారు:

‘నా జీవితం చాల మలుపులు తిరిగింది. ఆ మలుపులన్నీ నాకు ఎంతో మేలు కూర్చాయి. నా పరిణామమంతా క్రమగతంగానే సాగింది ఒడుదుడుకులు లేకుండా. నాకు లభించిన వాతావరణం మిక్కిలి విలువైనది. నా జన్మ లక్షణాలు ఆ వాతావరణంలో బాగా ఒదినాయి. వికసించాయి.’

‘నేను మాటనేర్చాను. పాట నేర్చాను. ఆటనేర్చాను. ఈ మూడంచుల ఆయుధంతో ముందుకు సాగాను. అందరి మన్ననకు ఆస్పదుడైనాను…’

‘నేను మూడు తరాల్ని చూశాను-నా తరం, నా వెనకటి తరం, నా తర్వాతి తరం. తరాల అంతరాలనూ చూశాను. చూసి కలగుండు పడలేదు, సరసం సర్దుబాటుతనంతో నేను కమ్మగా ప్రశాంతంగా కాలం గడపగలుగుతున్నాను…’

‘నేను చేయగలిగినవన్నీ చేసాను. చేయనివాటి జోలికిపోయి చేతులు కాల్చుకోలేదు. నిరాశకు లోను కాలేదు. మహామహులు నన్ను ప్రశంసించి ఉక్కిరిబిక్కిరి చేసారు. నా అర్హతకు మించి నన్ను పైకి ఎత్తివేశారు. ఏమనగలను? తీయతేనియ బరువు మోయలేదీ బ్రతుకు అని అనడం వినా.’

‘నాది స్నిగ్ధమైన మాతృ హృదయం. అదే నాకు జన్మతః లభించిన ప్రత్యేక గుణం. స్త్రీ పాత్ర ధరించి నటించి నర్తించడం వల్ల అది మరీ పదవనువారింది. ఆర్ద్రమయింది. అందుకే నేను బాలసాహిత్యం చేపట్టి అకలుషిత బాలదేవుళ్ళ అర్చనకు జీవితాన్ని అంకితం చేసాను..’

తన జీవనరేఖా చిత్రణలో ఆయన చలంగారి గురించీ, సంజీవదేవ్ గురించీ, నార్ల చిరంజీవి గురించీ రాసిన ప్రతి వాక్యం ఎంతో విలువైనది. అలాగే వారు కూడా ఆయన గురించి ఎంత అద్భుతంగా రాసారని!

7-9-56 న రాసిన ఉత్తరంలో చలంగారు ఇలా రాసారు:

‘..మీకూ నాకూ కూడా ఇదే మొదటి మగజన్మ. మనం పూర్వజన్మలలో చరిత్రలో కవిత్వంలో కళలో రొమాన్సులో ప్రసిద్ధి కెక్కిన స్త్రీలం. మరీ మీరు పురుషుల రక్తం తాగారట. అ గుణం నాకు స్పష్టంగా కనపడుతుంది మీ డాన్స్ లో. ఆ స్త్రీ నేవళం మన శరీరాన్ని ఇంకా వొదలలేదు. మన హృదయాల్నీ మనసుల్నీ కూడా.’

సంజీవదేవ్ రాసిన వాక్యాలు చూడండి:

‘బి.వి గారు మంచి అతిథులు. వారు దిగిన ఇల్లు దివారాత్రాలు భావాలతో, రాగాలతో, తాళాలతో సందడి సందడి అయిపోతుంది. అందులోని ఆనందపు విలువ వారు వెళ్ళిపోయిన తరువాత గాని పూర్తిగా తెలియదు. కారణం వారు వెళ్ళిపోయిన రోజు ఆ ఇంటిలో ఏదో పెద్ద కొరత కనిపించుతూంటుంది. బి.విలో కవి వున్నాడు. నాట్యకారుడున్నాడు. నాయకుడున్నాడు. చిత్రకారుడున్నాడు. కాని వీరందరినీ మించి ఆయనలో మధురమానవుడున్నాడు. అందువల్ల ఆయనలోని మధురమానవునికి సౌరభం మరింత ఎక్కువైనది.’

బి.వి బాలబంధుగానూ, బాలసాహిత్యనిర్మాతగానూ ప్రసిద్ధిచెందినా తొలిరోజుల్లో ఆయన సృజనవికాసం నాట్యంలోనూ, గానంలోనూ ఎక్కువ సంభవించింది. అటువంటి కళాశీలి బాలగేయకారుడిగా ఎందుకు మారాడు? ఇందుకు కొనకళ్ళ వెంకట రత్నం గారు రాసిన ఈ వాక్యాలు నాకెంతో అద్భుతంగా అనిపించాయి. కొనకళ్ళ ఇలా అంటున్నాడు:

‘బి.విలో ఉన్న రసవాహిని ఒక వేపు దారి మూతపడినా మరొకవేపు కట్టలు తెంచుకున్నది. సాహిత్యంలో ఇన్ని శాఖలుండగా బాలసాహిత్యక్షేత్రంలో ఈయన ఎందుకు అడుగుపెట్టడం సంభవించింది? అన్నది విచారణీయం. ముగ్ధాంగనగా, ప్రౌఢనాయికగా నటించిన ఏనాటి అనుభూతులో క్రమక్రమేణా మాతృభావనగా పరిణతి పొందినవేమో అనిపిస్తుంది. బి.విలో మాతృత్వ భావన పతాకస్థాయిలో శిశుత్వానికి సన్నిహితంగా రూపొందడంలో ఆశ్చర్యం లేదు.’

బి.వి జీవనరేఖలు చదవడం నాకు పొద్దుటిపూట నారింజరంగు సంజకాంతిని చూసినంత జీవప్రదాయకంగా అనిపించింది. ఇస్మాయిల్ టాగోర్ ని సదా బాలకుడన్నాడు. నేను ఇస్మాయిల్ ని సదా బాలకుడన్నాను. ఇస్మాయిల్ బి.వి ని కూడా యావజ్జీవబాలకుడన్నాడు. నేను కూడా నా బాల్యాన్ని ఒదులుకోడానికి ఇష్టపడలేను కాబట్టే కొనకళ్ళ బి.వి గురించి రాసిన ఈ వాక్యాలు చదివి నేనెంతో పులకించిపోయాను:

‘ఈనాడు నాట్య ప్రదర్శనలు విరమించుకున్నారు బి.వి. ‘ఎందుకు విరమించుకున్నట్టు’ అని చాలామంది ప్రశ్నించారు. నేనూ ప్రశ్నించాను. దానికి ఆయన సమాధానం ‘యౌవనంలోంచి కౌమారంలోకి కాలుపెట్టడం ఇష్టంలేక బాల్యంలోకి పరుగులు తీసాను’ అని.

12-9-2013

Leave a Reply

%d bloggers like this: