బాధలన్నీ పాతగాథలై

Reading Time: 2 minutes

139

ఈసారి పుస్తక ప్రదర్శనలో కవిత్వం చాలానే కొన్నాను, ముఖ్యంగా, భారతీయ భక్తి కవిత్వమూ, ఆధునిక అమెరికన్ కవిత్వమూను. అదంతా ముందు ముందు.

కానీ ఒక పుస్తకం, Appreciating Poetry (ప్రెంటిస్ హాల్, 2000) గురించి ఇప్పుడే చెప్పాలి. ఒక సెకండ్ హాండ్ పుస్తకాల స్టాల్లో, పుస్తకాల దేవత పిలిచి మరీ చూపించింది. ప్రపంచం నలుమూలలనుండీ పోగు చేసిన అద్భుతమైన కవితలు.

కవితలు ఎందుకు చదవాలి? అవేవీ మన కోసం బాధ్యత పడవు. వాటివల్ల మన దైనందిన జీవితం ఇసుమంత కూడా మారదు. చిన్న చిన్న ఇబ్బందుల నుంచి పెద్ద పెద్ద కష్టాలదాకా, కవిత్వం, మనగురించి ఏమీ పూచీ పడదు.

కాని కవిత్వం చదవాలి.

ఎందుకంటే, పరుగుపరుగున రైల్వేస్టేషన్ చేరుకుని ఊపిరి ఎగబీలుస్తూ కంపార్ట్ మెంట్లో చొరబడి, మన సీటు ఎక్కడుందో వెతుక్కుని సూట్ కేసో, బాగో పైకో, కిందకో నెట్టేసి, అప్పుడు, సరిగ్గా అప్పుడే ఒక్కక్షణం మనం గాఢంగా ఊపిరి పీలుస్తాం చూడండి, అట్లాంటి క్షణమే కవిత్వం. చాలా ఆకలిమీద ఉన్నప్పుడు, మనముందు వడ్డించిన వేడి వేడి అన్నంలో మనం కలుపుకునే మొదటిముద్ద, తెల్లవారగానే, ఇంకా ఏ పనీ మొదలుపెట్టకుండా, మన చేతుల్లో పొగలు కక్కుతున్న కాఫీలో మనం సేవించే మొదటిగుక్క.

ఆ ఒక్క క్షణంలో జీవితకాలం మొత్తం మన చేతుల్లో చిక్కినట్టు ఉంటుంది. ఇంగ్లీషులో to comprehend అంటామే, అదన్నమాట. ఇదిగో, ప్రాచీన జపనీయ కవి ఫుజివర నొ కియొసుకె రాసిన ఈ టంకా చదివినప్పటిలాగా:

నేనింకా చాలాకాలం బతకాలి
ఎంతకాలమంటే
ఇదిగో, ఈ క్లేశకాలం కోసం
బెంగపెట్టుకునేదాకా, ఈ రోజులు
గుర్తొస్తే తీయగా మూలిగేదాకా.

ఈ నాలుగైదు వాక్యాలు చదవగానే కమ్మరికొలిమిలో తోలుతిత్తుల్ని ఒక్కసారి అదిమినట్టు, నా ఊపిరితిత్తులు ఒక్కసారి ఖాళీ అయిపోయాయి. నా చుట్టూ గతించిన రోజులు ఒక్కసారి భగ్గున జ్వలించాయి.

మనిషి గురించీ, మనిషి మనసు గురించీ ఆ ప్రాచీన కవి ఎంత బాగా పసిగట్టాడు!

ఒకప్పుడు ప్రేమలోనో, పట్టలేని బెంగతోనో రోజు గడుస్తుందా అని కలవరపడ్డ కాలం, ఇప్పుడా రోజులే కదా ఎంతో ప్రీతిపాత్రాలుగా పదే పదే స్మరణ కొచ్చేది. ‘బాధలన్నీ పాతగాథలైపోయెనే’ అని కవి పాడింది ఈ మెలకువ గురించే కదా.

అబ్బా, మనం ఎంతకాలం బతకాలంటే, ‘నిన్నకాలం, మొన్నకాలం, రేపు కూడా రావాలి ‘ అనేటంత కాలమన్నమాట.

ప్రాచీన జపనీయ కవి అయినా, ఆధునిక చైనీయ కవి అయినా, ఆ క్షణాన్ని పట్టుకున్నవాడే కవి, ఆ మెలకువ పొటమరిస్తేనే కవిత. గూ చెన్ (1959-) రాసిన ఈ కవిత చూడండి:

నువ్వు
ఒక క్షణం నాకేసి చూస్తావు
ఒక క్షణం మేఘం కేసి చూస్తావు

నాకనిపిస్తుంది
నాకేసి చూసినప్పుడు నాకెంతో దూరంలో ఉన్నావని
మేఘం కేసి చూసినప్పుడు నాకెంతో దగ్గరయ్యావని.

ఈ కవిత గురించి ఒక్కమాట ఎక్కువ రాసినా కూడా ఆ కుసుమపేశలమైన epiphany చెదిరిపోతుందనిపిస్తోంది.

జీవితాన్ని మహామధురంగా తోపింపచేసేటందుకే కాదు, మహాభ్రాంతిమయ క్షణాలనుంచి బయటపడవేసేటందుకు కూడా కవిత్వం కావాలి. డరోతీ పార్కర్ (1893-1967) రాసిన ఈ కవితలాగా:

నిలువెల్లా కంపిస్తూ, దీర్ఘనిశ్వాసం వదుల్తూ
నువ్వతడిదానివేనని ఒట్టుపెట్టిమరీ చెప్పుకునేవేళ
అతడేమో, తన ప్రేమ శాశ్వతమని, అజరామరమని
నొక్కివక్కాణించేవేళ, బాలా, చూసుకో, మీలో
ఎవరో ఒకరు అబద్ధమాడుతున్నారు.

కానీ కవిత్వం రోజంతా ఉండదు, మొదటిముద్దులాగ, మొదటిసుద్దులాగా, మరుక్షణమే దానిమీద దుమ్ము పడిపోతుంది. మళ్ళా మరికొన్నాళ్ళో, మరికొన్నేళ్ళో, జీవించేక, మరొకరెవరో మన హృదయం తలుపు తట్టేదాకా.

అందరికన్నా ముందు కవులకి గుర్తుండాలి ఈ సంగతి, కార్ల్ క్రోలో (1915-) అనే జర్మన్ కవి రాసినట్టుగా:

ఎవరో కిటికీలోంచి
కాంతి పారబోస్తున్నారు,
గాలిగులాబీలు
విచ్చుకుంటున్నాయి.
వీథిలో ఆడుకుంటున్న పిల్లలు
తలెత్తిచూస్తారు.
పావురాలు ఆ తీపిదనాన్ని
పొడిచిచూసుకుంటాయి.
ఆ వెలుగులో
యువతులు మరింత అందంగా
పురుషులు మరింత ఉదాత్తంగా
కనిపిస్తారు.
కాని తక్కినవాళ్ళు
ఈ మాటచెప్పేలోపలే
ఎవరో ఆ కిటికీ మళ్ళా
మూసేస్తారు.

23-12-2016

 

Leave a Reply

%d bloggers like this: