బరంపురంలో

Reading Time: 3 minutes

281

రష్యాకి సంబంధించినంతవరకూ, 20 వ శతాబ్దం 1914 తో మొదలయ్యిందని అన్నా అక్మతోవా రాసింది. ఆంధ్ర దేశంలో ఇరవయ్యవ శతాబ్దం 1910 లో అడుగుపెట్టిందనీ, అది కూడా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలో చిట్టచివరి ప్రాంతమైన బరంపురంలో అని మనం చెప్పుకోవచ్చు. 1909 లో బరంపురంలో స్థాపించబడ్డ ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజం వారు 1910 లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసారు. ఆ ఏడాది కనబడ్డ తోకచుక్కను చూసి ‘తలతు నేనిది సంఘసంస్కరణ ప్రయాణ పతాకగాన్’ అని గురజాడ అన్నాడు. ‘తోకచుక్క’ అని పేరు పెట్టి, తర్వాత ‘ముత్యాసరాలు’ గా పిలిచిన ఆ కవితలోనే

యెల్లలోకములొక్క ఇల్లై
వర్ణభేదములెల్ల కల్లై
వేలనెరుగని ప్రేమబంధము
వేడుకలు కురియ

మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును
అంత స్వర్గసుఖంబులన్నవి
అవని విలసిల్లున్

అని కూడా అన్నాడు.

ఆ ఏడాదే శ్రీ శ్రీ పుట్టాడు. అది గొప్ప చారిత్రిక సంవత్సరమని అతడు పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాడు. మరోప్రపంచాన్ని కలగన్నప్పుడు ఆ జాడలు అతడి బరంపురం జ్ఞాపకాల్లో ఉన్నాయని కూడా అతడు మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాడు.

సాహిత్యంలోనూ, సామాజిక పరివర్తనలోనూ మాత్రమే కాదు, రాజకీయంగా కూడా గంజాం జిల్లాకి ప్రపంచచరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈస్టిండియా కంపెనీ పరిపాలనని 1757 నుంచి 1857 దాకా భారతదేశంలో ప్రతిమూలా ఎవరో ఒకరు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. కాని గంజాం జిల్లా గిరిజనులు ప్రతిఘటించినప్పుడు మాత్రమే కంపెనీ కళ్ళు తెరిచింది. అది రెండు సమూహాల మధ్య సంఘర్షణ కాదనీ, రెండు పాలనాదృక్పథాల మధ్య సంఘర్షణ అనీ లార్డ్ రస్సెల్ కంపెనీకి హితవు చెప్పాకనే, 1839 లో గంజాం విశాఖపట్నం జిల్లాల చట్టం వచ్చింది. అప్పణ్ణుంచీ ఇప్పటిదాకా కూడా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక న్యాయం వర్తించాలనే ఏర్పాటుకి ఆ చట్టమే కారణం.

అట్లాంటి బరంపురం చూడాలన్న నా కోరిక ఇప్పటిది కాదు.

‘బరంపురంలో మనం ఇంకా
నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!’

అని శ్రీ శ్రీ కొంపెల్ల జనార్దన రావు ను తలుచుకున్నప్పుడు, ‘బరంపురంలో మహోపన్యాసమును కావించితిని’ అని చిలకమర్తి స్వీయ చరిత్రలో రాసుకున్నప్పుడు, గిడుగు, తాపీధర్మారావు, పురిపండాల జీవితవిశేషాలు చదివినప్పుడు, తెలుగువాళ్ళ సామాజిక తీర్థయాత్రాస్థలాల్లో బరంపురం కూడా ఒకటని తీర్మానించేసుకున్నాను.

నా చిన్నప్పుడు, 1975 లోనో, 76 లోనో కాకినాడలో అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు జరిగాయి. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. జగన్నాథరావుగారు ఆ సభల్లో నాతో ఒక కవిత చదివించారు. వేదిక మీంచి కిందకు రాగానే ఆయన నన్ను వుప్పల లక్ష్మణరావుగారి దగ్గరకు తీసుకువెళ్ళి నమస్కారం పెట్టించారు. డా.లక్ష్మణ రావుగారిని నేను చూడటం మొదటిసారీ,చివరిసారీ కూడా అదే. ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నారు. పక్కన బరంపురానికి చెందిన డెలిగేట్లు ఇద్దరు నిలబడి ఉన్నారు. ఆయన వికాసం అనే సంస్థ పేరు చెప్పి, అక్కడికి నన్ను తీసుకురమ్మని జగన్నాథ రావుగారితో చెప్పారు. వికాసం ప్రచురించినదో మరేదో పుస్తకం కూడా ఆయన సంతకం చేసి నా చేతుల్లో పెట్టారు.

ఆ అహ్వానానికి దాదాపు నలభయ్యేళ్ళ తరువాత బదులు పలకగలిగాను. ఇప్పుడు డా.వుప్పల లక్ష్మణ రావుగారి 119 వ జయంతి సందర్భంగా వికాసం ఆహ్వానం మీద ఆదివారం బరంపురంలో ఆయన స్మారకోపన్యాసం చెయ్యగలిగాను.

రోజంతా బరంపురం వీథుల్లో తిరుగుతూ, అక్కడి తెలుగు మిత్రులతో గడుపుతూ బరంపురంలో ఉన్నానని నాకు నేను చెప్పుకుంటూనే ఉన్నాను. మిత్రుడు మండపాక కామేశ్వర రాజు నన్ను దిగుమర్తివారి వీథిలో ఒకప్పుడు డా.లక్ష్మణ రావు గారు నివసించిన ఇంటికి తీసుకువెళ్ళి చూపించారు. లక్ష్మణరావుగారు తమనెట్లా ప్రభావితం చేసిందీ, 1971 లో బరంపురం వచ్చేసిన తరువాత, 1985 లో ఈ లోకాన్ని వీడిపోయినదాకా, ఆయన జీవించిన సాహిత్యైక జీవితం గురించీ, నిరాడంబరమైన జీవనశైలి గురించీ, స్వార్థత్యాగం గురించీ చెప్తూనే ఉన్నారు.

ఆ తరువాత, ఇమ్మిడిశెట్టి రమేష్ అనే సాహిత్యమిత్రుడి ఇంట్లో ఇష్టాగోష్టి. అప్పటికి శివారెడ్డిగారు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ డా.సహదేవ రావు అనే బరంపురం పండితుణ్ణి బరంపురం చరిత్ర చెప్పమని అడిగాను. ఆయన పందొమ్మిదో శతాబ్దం నుంచీ తెలుగు సామాజిక క్షేత్రంలో బరంపురం ఎట్లాంటి పాత్ర పోషించిందీ, ఆ తరువాత, వేగుజుక్క గ్రంథమాల, అభినవాంధ్రపండిత సభ (తరువాత రోజుల్లో నవ్యసాహిత్య పరిషత్తు) మొదలైన విశేషాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పారు. ముఖ్యంగా పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి గురించి. ఆయన శాస్త్రి గారి పైన డాక్టరల్ పరిశోధన కూడా చేసి ఉండటంతో చాలా విశేషాలే చెప్పుకొచ్చారు.

అక్కడి కవిమిత్రులు కొత్తగా అనిపించలేదు. ఫేస్ బుక్ నన్నూ, వాళ్ళనీ ఎప్పుడో దగ్గరి బంధువులుగా మార్చేసింది. రమేష్ నా రచనలన్నీ చదివి ఉండటమే కాకుండా, ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ పుస్తకం మీద నా సంతకం పెట్టమని అడిగినప్పుడు, నేను బరంపురం చూడాలని అనుకోవడమే కాదు,బరంపురం కూడా నన్ను చూడాలనుకుంటోందని అర్థమయింది.

సాయంకాలం ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజం వారి సమావేశ మందిరం కిటకిటలాడుతోంది. మహామహులు, తెలుగు సాహిత్య దిగ్దంతులు అడుగుపెట్టిన ఆ మందిరంలో నేను కూడా అడుగుపెట్టానన్న తలపే నా వంట్లో విద్యుత్ పుట్టించింది. డా.లక్ష్మణ రావుగారిని తలచుకుంటూ అక్కడ మాట్లాడటం నా జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవం అని చెప్పాను. లక్ష్మణరావుగారు రచయిత, అనువాదకుడు, ఆత్మచరిత్రకారుడు నిజమే కాని,అన్నిటికన్నా ముందు మహామానవుడు. శతాబ్దమంత సుదీర్ఘం, సుసంపన్నం అయిన జీవితం ఆయనది. జగదీశ్ చంద్ర బోస్ దగ్గర వృక్ష శాస్త్ర పరిశోధన చేసినవాడు, మహాత్మాగాంధీ చెంతన సబర్మతిలో ఆశ్రమవాసం చేసినవాడు, వి.వి.గిరి తో కలిసి కార్మిక పోరాటాల్ని నిర్మించినవాడు, దీర్ఘకాలం రష్యాలో ఉండి మహత్తర సోవియెట్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినవాడు,అన్నిటికన్నా ముఖ్యంగా, సొంత ఆస్తి సమకూర్చుకోని నిజమైన కమ్యూనిస్టు. రష్యానుంచి తిరిగి వచ్చిన తరువాత తనకి అందే కొద్దిపాటి పెన్షను రూబుళ్ళనీ పార్టీకే విరాళంగా ఇచ్చేసినవాడు. చిన్న గదిలో ఉంటూ, యువతీయువకుల్ని సాహిత్యదీక్షాపరుల్ని చేసినవాడు. మనం రామకృష్ణ పరమహంస, శారదాదేవి ల అనుబంధం గురించి చెప్పుకుంటాం. కాని లక్ష్మణరావు, మెల్లీ షోలింగరు దంపతులు అనుబంధం కూడా అటువంటిదే అని మర్చిపోతుంటాం. కమ్యూనిస్టులు ఎంతసేపూ సొంత ఆస్తి ఉండగూడదంటారు కాని,అన్నిటికన్నా ముందు పోవలసింది, property కాదు, possessiveness అని చలంగారు చెప్తూ వచ్చినదానికి లక్ష్మణరావుగారి కన్నా మించిన ఉదాహరణని తెలుగువాళ్ళల్లో చూపడం కష్టం.

ఆ సాయంకాలం ప్రముఖకవి, బరంపురం అనగానే తెలుగుసాహిత్య ప్రపంచానికి అందరికన్నాముందు గుర్తొచ్చే విజయచంద్ర కవితాసంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది.’ ఊదారంగు కలలు’ అనే ఆ సంపుటిని శివారెడ్డిగారు ఆవిష్కరించారు. ఇది విజయచంద్ర రాసిన కవిత్వం తొమ్మిదవ సంపుటి. గత నాలుగు దశాబ్దాలుగా విజయచంద్ర చేసిన కవిత్వ ప్రయాణాన్ని శివారెడ్డి ఎంతో ఉద్వేగభరితంగానూ, ఉదాహరణల్తోనూ వివరించేరు. ఆ తర్వాత కోల్ కత్తా నుంచి వచ్చిన ఎం.కేశవరావు, సర్వమంగళ అనే మిత్రులు ‘జాగృతి సమీక్ష’ అనే తమ పత్రికను నాతో ఆవిష్కరింపచేసారు.

ఆ రాత్రి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ఎక్కేదాకా మళ్ళా నలుగురైదుగురు మిత్రులు నాతోనే ఉన్నారు. అక్కడ గడిపినంతసేపూ, వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపూ ‘ఈ నా శరీరమందివతళించిన గాలి ఎంత పౌరాతన్యమేచికొనెనొ’ అనుకుంటూనే ఉన్నాను.

16-8-2017

Leave a Reply

%d bloggers like this: