ప్రేమ ఇతివృత్తంగా బైరాగి రాసిన కొన్ని కవితల్ని ఏరి కూర్చి ప్రొ.పి. ఆదేశ్వరరావుగారు వెలువరించిన ‘ప్రేమ కవితలు’ ఈ ఏడాది నాకు దొరికిన గొప్ప కానుక.
తను ఈ సంకలనం ఎందుకు చేయవలసివచ్చిందో చెప్తూ ఆదేశ్వరరావుగారు ఇట్లా రాసారు:
‘..ఒకరోజు సాయంత్రం..నేనూ బైరాగిగారూ మౌంట్ రోడ్ మీదుగా నడుస్తున్నాం. .తన కవిత్వాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడని బైరాగి గారు అప్పుడు యాదృచ్ఛికంగా -ఆదేశ్వర రావ్,నాకు తెలిసిన భాషలలో ప్రేమ కవిత్వాన్ని ఎంతగానో చదివాను. కాని షేక్ స్పియర్ సానెట్స్ లో ఉన్న ప్రేమ లోతులు, ప్రేమ వైవిధ్యం నాకెక్కడా కనిపించలేదురా! షేక్ స్పియర్ ప్రేమ కవితల తరువాత నా ప్రేమ కవితలు నిలుస్తాయి రా! అని చెప్పి యథావిథంగా మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. నేను వారు చెప్పిన మాటలు విన్నానే గాని ఏ భాషలో మీరు ప్రేమ కవితలు రాసారు అని అడగలేదు. 1978 లో వారు స్వర్గస్తులయ్యేవరకు కూడా నేను తెలుసుకోలేదు. హిందీ కవితాసంకలనం ‘పలాయన్’ లో గొప్ప ప్రేమగీతాలు, కవితలు ఉన్నాయి. వారు పరమపదించిన తరువాత 1981 లో ప్రచురితమైన ఆగమగీతిలో గొప్ప ప్రేమ కవితలు అనేక రూపాల్లో సాక్షాత్కరించాయి. బహుశా ఆ కవితల్ని దృష్టిలో పెట్టుకుని బైరాగిగారు అలా అని ఉంటారని భావిస్తున్నాను. ‘
తన సంకలనంలో ఆదేశ్వరరావుగారు మొత్తం 25 కవితలు పొందుపరిచారు. అందులో బైరాగి హిందీ కవితలకు తాను చేసిన అనువాదాలు 11, బైరాగి తెలుగు కవితలకు తన ఇంగ్లీషు అనువాదాలు 5, బైరాగి తెలుగు కవితలు 9 ఉన్నాయి.
ఆ కవితల్లో హిందీ కవితలకు తెలుగు అనువాదాలు చాలా కొత్తగానూ, స్వయంగా బైరాగినే తెలుగులో రాసుకున్నట్టుగానూ ఉన్నాయి.
ఆ ప్రేమకవితలన్నిటినీ ఒక్కచోట అట్లా చూసినప్పుడూ, షేక్ స్పియర్ సానెట్స్ ని బైరాగి గొప్ప ప్రేమ కవిత్వంగా భావించాడని విన్నప్పుడూ నాలో చాలా ఆలోచనలే చెలరేగాయి.
మొదటిది, నా దృష్టిలో సానెట్స్ ఉజ్వల ప్రేమ కవిత్వం కాదు. నిజానికి కవిగా షేక్ స్పియర్ ప్రతిభ ని చూడవలసింది నాటకాల్లో తప్ప కవితల్లో కానేకాదు. ఆదినుంచీ వివాదాస్పదంగా ఉన్న సానెట్ల పట్ల ఇంగ్లీషు రసజ్ఞలోకం ప్రతిస్పందన కూడా సంశయాస్పదంగానే ఉంది. సానెట్లలో షేక్ స్పియర్ తనను తాను పట్టిచ్చే తాళం చెవి పొందుపరచాడని వర్డ్స్ వర్త్ అంటే, ‘అయితే ఆ షేక్ స్పియర్ చాలా తక్కువ రకం షేక్ స్పియర్ అయిఉండాల’ న్నాడు బ్రౌనింగ్. సానెట్లలో షేక్ స్పియర్ సాహిత్యవ్యాయామం చేసాడని కొందరు భావిస్తే, అక్కడతడు తన హృదయాన్ని విప్పిపరచాడని కొందరన్నారు. కాని మానవహృదయ విలాపం షేక్ స్పియర్ నాటకాల్లో కనిపించినట్టుగా నాకు సానెట్లలో కనిపించలేదు.
ఎన్నో ఏళ్ళ కిందట, ఒకసారి సుదర్శనంగారు కింగ్ లియర్ నాటకం గురించి మాట్లాడుతూ, నాటకాంతంలో ఆ తండ్రి కూతురి గురించి తలుచుకుంటూ మాట్లాడిన ఈ మాటలు తలుచుకున్నారు:
‘ ..Her voice was ever soft,
Gentle and low…’
ఇంతకన్నా ప్రేమైక విలాపం సానెట్లలో కనిపిస్తుందనుకోను.
అట్లానే ఈ వాక్యాలు ( King Lear, V.iii.II.8-19):
No, no, no no! Come, let’s away to prison
We two alone will sing like birds i’ the cage.
When thou dost ask me blessing, I ‘ll kneel down
And ask of thee forgiveness: So we’ll live,
And pray, and sing, and tell old tales,and laugh
At gilded butterflies, and hear poor rogues
Talk of court news, and we’ ll talk with them too,
Who loses and who wins, who’s in, who’s out;
And take upon’s the mystery of things,
As if we were God’s spies,and we’ll wear out,
In a wall’d prison, packs and sets of great ones
That ebb and flow by the moon’
ఇటువంటి భావోద్వేగం, ఉద్రిక్తనిర్మలత్వం సానెట్లలో ఎక్కడా కనిపించదు.
ఇందుకు కారణమేమిటో టెడ్ హ్యూస్ కొంత విశ్వసనీయంగా వివరించే ప్రయత్నం చేసాడు. తన A Choice of Shakespeare’s Verse ( ఫేబర్ అండ్ ఫేబర్, 1971) లో ఆయన చెప్పేదేమంటే, కవిత్వం సందర్భం నుంచి తన శక్తిని గ్రహిస్తుందనీ, నాటకాల్లో మాటలు సందర్భంవల్ల కవిత్వంగా మారుతుండగా, సానెట్లలో అటువంటి సందర్భశక్తి ఏదీ లేనందువల్ల, అవి చాలావరకూ వట్టి మాటలు గానే మిగిలిపోయాయంటాడు.
కథాసందర్భం రసాస్వాదనకు గొప్ప బలానిస్తుందికాబట్టి ‘రఘువంశం’ కవిత్వం కావడంలో ఆశ్చర్యం లేదుగానీ, ఎటువంటి కథాసందర్భం లేని ముక్తకాలు కవిత్వం కావడంలో గొప్ప విశేషముందని పుట్టపర్తి నారాయణాచార్యులు ఒకచోట రాసారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సందర్భబలం లేకపోగానే వెలవెలబోయిన సానెట్ల కన్నా, కథాసందర్భమేదీ వెంటలేని బైరాగి కవితలు సానెట్లకన్నా ఎన్నో రెట్లు శక్తివంతంగా వినిపిస్తున్నాయని చెప్పడం కోసమే.
ఈ వాక్యాలు చూడండి:
‘ఏమనగా నేను నిను తలవగానే
చలిప్రొద్దుల వలిమసకలు తొలగిపోయి
తొలి వలపుల ఆమనిగా
సుషమోషాయోషితవై, రశ్మికుసుమభూషితవై
మదంతరంతరావ ప్రతిధ్వనిగా
ద్విగుణిత యువదీధితితో మతిలో అవతరిస్తావు
కాలపు పొర కరిగిపోయి ఎప్పటిలా స్ఫురిస్తావు’
ఈ వాక్యాలు:
‘సర్గ ప్రత్యూషం నుండి ప్రళయావశేషం వరకు
మనం మనుతాం, మన పయనానికి ఇక ఒక రేవు లేదు
ఏమనగా వెలుగులోన గాలిలోన
నీలాల లాలిలోన కలిసిపోయిన మనమిక లేము..
రేయి లేదిక ముందువెనకల ఒకేకాంతి
హేమరశ్మి తరంగాలలో నీవే నా తరణివి..’
ఈ వాక్యాలు స్త్రీపురుష ప్రేమకు అతీతమైన మానవహృదయైక్యాన్ని సూచిస్తున్నవి కాదా. ఇంతకన్నా మరింత సరళమైన మాటల్లో చెప్పిన ఈ వాక్యాలు చూడండి:
‘నీ దేహంలోన నీవు, నా దేహంలో నేను
ఇది నాలుగుస్తంభాల దాగుడుమూత..
అస్థికాండచ్ఛిద్రాల్లోన
రుధిరమురళీ నాళాల్లోన దాగిన గానం కొరకు
ప్రాణంలోని ప్రాణం కొరకు
వెదుకవలదా?అసలది ఏదైనా కలదా?
అది ఏదీ లేదనుకో-
…
అన్నీ వమ్మే కాదా?
అన్నీ వమ్మే కడకది పిడికెడు దుమ్మే కాదా
ఇది తలచిన నా ఎముకలు నీ కౌగిలిలో కూడా
కడపటి చలిలో గడగడ వణుకుతాయి
తల్లి కడుపులో దాగే పిల్లనిలా నా చేతులు
నిన్నింకా దగ్గరగా వెతుకుతాయి.’
ఆధునిక తెలుగు కవిత్వం మొత్తం గాలించినా ఇటువంటి వాక్యాలు మరొక కవి ఎవరూ చెప్పి ఉండలేదు, ‘ప్రేమ పెన్నిధి, ఇంటను నేర్పరీ కళ’ అన్న గురజాడ తర్వాత.
బహుశా పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన ‘ కథ ఒకటి ఈ స్ఫూర్తికి సమీపంగా రాగల రచన.
ఆశ్చర్యంగా పద్మరాజుగారు కూడా సానెట్ సమ్మోహితుడే. ‘కవిత్వము-వైచిత్రి’ అనే తన వ్యాసంలో ( పద్మరాజు రచనలు-4, విశాలాంధ్ర, 2011) ఆయన ఆధునిక తెలుగు కవిత్వాన్ని విమర్శించడానికి సానెట్లను ప్రాతిపదికగా పెట్టుకున్నాడు.
కాని ఆయన ఉదాహరించిన సానెట్ పంక్తులు మళ్ళీ చదివాను.
ఉహు.
బైరాగి రాసిన ఈ వాక్యాలాంటి వాక్యాలు కావవి:
‘కొంచెం దుమ్ము, కొంచెం ఉమ్ము, నెత్తురులూ, కన్నీరూ
ప్రేమగాని, కవితగాని ఏముంటుంది అంతకన్నా?’
పద్మరాజూ, బైరాగి కూడా రెండవ ప్రపంచ యుద్ధానంతర రచయితలు. వారి వెనక ఒక యుగాంత సందర్భం ఉంది. షేక్ స్పియర్ రచనా కాలంలో తలెత్తిన యుగోదయం పూర్తిగా పొద్దువాటారిన వేళ ఈ రచయితలు ఉద్భవించారు.
షేక్ స్పియర్ ఏ యుగోదయ కాలంలో రచనలు చేసాడో టెడ్ హ్యూస్ ఎంతో ఆసక్తికరంగా వివరిస్తాడు. అది యూరోప్ లో సాంస్కృతిక పునరుజ్జీవన కాలం. ప్రాచీన, మధ్యయుగ విశ్వాసాలు అంతరించి, విస్తృత, మానవీయ ప్రపంచం మేల్కొంటున్న వేళ అది. మతం వెనకపట్టి సైన్సు బలం పుంజుకుంటున్న తరుణం. అంతరిస్తున్న ఆ ప్రాచీన యుగ విశ్వాసాలు, భయాలు ఈర్ష్యామోహమదోన్మత్తులైన పాత్రలుగా, భయకంపితగాథలుగా షేక్ స్పియర్ లో తమ విరాడ్రూపం చూపించాయి. ఆ విహ్వల, ఉన్మత్త, కరాళ హావభావాల వెనక దుర్బల, దీన, పసి మానవహృదయాన్ని వినడానికి షేక్ స్పియర్ ప్రయత్నించాడు.
రినైజాన్సు యూరోప్ మూడువందల ఏళ్ళు కాకుండానే తాను నరహంతక భూమిగా మారడమే కాక, ప్రపంచాన్నే వథ్యశిలగా మార్చిన నేపథ్యంలోంచి బైరాగి కవిత్వం చెప్పాడు. మానవ చరిత్రలో గొప్ప ఆశలు రేకెత్తించి, అత్యంత దారుణంగా విఫలమైన (గ్లానిలో అవసానమొందినదా అహంకృత సింహనాదం) యుగానికి అటువైపు బొకాషియో, షేక్ స్పియర్, మాంటేన్లు ఉంటే ఇటువైపు బైరాగి, పద్మరాజులు నిలబడ్డారు.
బైరాగి ప్రేమకవితలు ఒకబ్బాయి ఒక అమ్మాయి మీద రాసినవి కాదు.
చివరికి మిగిలేది పిడికెడు దుమ్మే నని తెలిసినప్పుడు, తెలిసినప్పుడు కూడా, ఆ కడపటి చీకటిలో ఒక మనిషి తోటిమనిషికి మరింత దగ్గరగా జరగడం కోసం పలికిన మాటలు, ప్రాణప్రదాతలు.
‘పిలువు నీ గళమంగళ ధ్వని
లాజరస్ మృతతంద్ర విడివస్తాడు నీకై శాశ్వత కాంతిసీమకు.”
4-10-2015