పొద్దున్నే గూగుల్ తియ్యగానే బేగం అఖ్తర్ డూడుల్ కనిపించింది. ఎప్పుడెప్పుడో, ఎక్కడెక్కడో ఎన్ని ప్రయాణాల్లోనో నాతో ప్రయాణించిన ఆ గానం గుర్తొచ్చింది. ముఖ్యంగా, ఆ కొండదారుల్లో, సాయంకాలపు మాఘమాసపు గాలి చిరువెచ్చగా తాకుతున్నవేళ, ‘ఉల్టీ హో గయీఁ సబ్ తద్బీరేఁ’ అంటో ఆలపించిన మీర్ గజల్. శరాన్ని బయటకు లాగవచ్చుగాని, గాయం మిగిల్చిన మరక అట్లానే ఉండిపోతుంది. అట్లాంటి ప్రేమగాయపు మరకలాంటి ఈ గీతం.
తలపులన్నీ తల్లకిందులు
మీర్ తకీ మీర్ (1723-1810)
తలపులన్నీ తల్లకిందులు,
మందుమాకులు మరపజాలవు.
కడకు నాకథ హృదయరుగ్మత
పూర్తిచేసెనుగా.
రోదనమ్ముల గడిచె యవనము,
వయసువాలగ కనులు మూసితి.
కల్లనిదురను తెల్లవారగ
కునుకుపట్టెనుగా.
నిస్సహాయుల మంచు నేరక
మమ్మెంచిచూపుదురేలనో ?
నచ్చినట్లే నడుచు మీరే
నెపములెంచిరిగా!
మత్త విచలిత మనుజ కూటమి
చిత్తమంకితమయ్యె నీకే,
శీర్ణవిదీర్ణహృదయులెందరొ
మోకరిల్లిరిగా.
ఎన్నడేనియు ఎంత మత్తున
మాటతూలిన మనిషికానే,
వెంబడించితి, నీకు అడుగుల
మడుగులొత్తితినే.
ఎవరి తీర్థము, ఎవరి క్షేత్రము
ఎవరికోసము పుణ్యవస్త్రము?
ప్రణయవీథినపౌరులెపుడో
శిరమువంచిరిగా.
చూడు పూజారిపుడు గుళ్ళో,
నిన్నరాతిరి మద్యశాలన
తాగిమత్తిలి, పంచెచొక్కా
పంచిపెట్టెనుగా.
తెలుపునలుపుల బతుకు మాకై
దఖలు పరిచెను రాత్రి రోదన,
తెల్లవారిన దినమునెట్లో
రాత్రిచెయ్యడమే.
వెండికాంతుల రెండుచేతులు
అందుకుని చేజార్చుకుంటిని
ఆమె మాటలు నమ్మినందుకు
మోసపోయితిగా.
భీతహరిణము పట్టుచిక్కుట
కష్టసాధ్యము లోకమందున,
ఎవరు నీలో మరులు గొల్పిన
మాయమంత్రమెగా.
ఇప్పుడెందుకు మీరుమతము?
వదిలిపెట్టెను తనదుమతమును.
నుదుట తిలకము, మందిరమ్మున
తిష్టవేసెనుగా.
7-10-2017