వైశాఖ పూర్ణిమ. పోయిన సంవత్సరం ఈ రోజు థేరీగాథల గురించి తలుచుకున్నాను. ఈ రోజు థేరగాథల గురించి తలుచుకోవాలనిపించింది.
థేరగాథ బౌద్ధ భిక్షువుల కవితలు. సుత్తపిటకంలో ఖుద్దకనికాయంలో ఎనిమిదసంపుటంలో గ్రంథస్థం చెయ్యబడ్డ 264 కవితలు. బహుశా, భారతీయసాహిత్యంలో తొలి కవితాసంకలనాల్లో ఒకటి అని కూడా చెప్పవచ్చు. బుద్ధుడి జీవితకాలంలో ఆయన సన్నిధిలోనే చెప్పిన కవితలు మొదలుకుని ఆయన నిర్వాణం తరువాత సుమారు రెండువందల ఏళ్ళ దాకా కూడా చెప్పిన కవితల సమాహారమిది. ఈ సంకలనంలో మొత్తం 1289 గాథలు 21 అధ్యాయాలుగా సంకలితమయ్యాయి.
బుద్ధుడి బోధనలని అనుసరించి ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించుకోవాలనుకున్నవాళ్ళకీ, ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నవాళ్ళకీ థేరగాథలూ, థేరీగాథలూ కూడా గొప్ప స్ఫూర్తిని అందిస్తూ వచ్చాయని మనకి తెలుస్తూ ఉంది.
సుత్తపిటకంలో దీర్ఘ, మధ్యమ,సంయుక్త, అంగుత్తర,ఖుద్దకనికాయాలుగా భద్రపరిచిన బుద్ధ భగవానుడి సందేశాలు, ప్రవచనాలూ నేరుగా లభ్యమవుతున్నా కూడా, బౌద్ధులు తమ స్ఫూర్తికోసం ఈ కవితలవైపు కూడా ఎందుకు చూసారన్నది ఆసక్తి కలిగించే ప్రశ్న.
అంగుత్తరనికాయంలో ఒకింత ఉద్వేగభరితమైన ప్రవచనంలో (అనాగత భయాని సుత్త, 5:79) బుద్దుడు రాబోయే కాలంలో తాను ప్రవచించిన ధర్మానికి సంభవించగల అయిదు రకాల ప్రమాదాల్లో కవిత్వం కూడా ఒకటన్నాడు. ఆయనిట్లా అన్నాడు:
‘రాబోయే రోజుల్లో దేహంలో, శీలంలో, మనసులో, వివేకంలో పూర్తిగా పరిణతి చెందని భిక్షువులు తలెత్తినప్పుడు, వారు, దేహంలో, శీలంలో, మనసులో, వివేకంలో పూర్తిగా పరిణతి చెంది ఉండరు కాబట్టి, వారు తథాగతుడి మాటల పైన శ్రద్ధ పెట్టరు… అందుకు బదులు, వారు శబ్దగాంభీర్యంకలిగిన, అక్షరసౌందర్యం కలిగిన కవుల కవితల్నీ, బయటవాళ్ళు రాసిన పుస్తకాల్నీ, శిష్యులు చెప్పిన మాటల్నీ వల్లె వెయ్యడం మొదలుపెడతారు. వాటినే ఆలిస్తారు, వాటిమీదనే మనసుపెడతారు. వాటినే తెలుసుకోదగ్గవాటిగా, కంఠస్థపట్టదగ్గవాటిగా పరిగణిస్తారు…’
అయితే నిజమైన కవులెవరో, ఎవరి కావ్యాలు పఠించదగ్గవో బుద్ధుడికి స్పష్టంగా తెలుసనే దానికి అంగుత్తరనికాయంలోనే (సుచరిత వగ్గ, 230) గొప్ప సాక్ష్యముంది. ఒకరోజు శ్రావస్తిలో చేసిన ప్రసంగంలో బుద్ధుడు కవులు నాలుగురకాలని చెప్పాడు. వారు చింతకవులు,సుతకవులు, అట్ఠకవులు, పతిభాన కవులు. ఈ నాలుగురకాల కవుల్నీ ఇప్పటి భాషలో గుర్తుపట్టాలంటే, చింతకవులు ధ్యానకవులు.సుతకవులంటే విన్నదాన్నిబట్టీ, చదివినదాన్ని బట్టీ రాసేవాళ్ళు, స్పష్టమైన దృక్పథం ఉండి కవిత్వం రాయాలనుకునే ఆధునిక ఇంటలెక్చువల్ కవులన్నమాట. అట్ఠకవులంటే సామాజిక స్పృహతో కవిత్వం చెప్పేవాళ్ళంతా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వస్త్వాశ్రయ కవులన్నమాట. ఇక పతిభాన కవులంటే తమ ప్రతిభావిశేషం వల్ల కవిత్వం చెప్పే సృజనాత్మక కవులని అర్థం.
ఇంతకీ ప్రతిభ అంటే ఏమిటి? బుద్ధుడినుంచి, విశ్వనాథదాకా (కవి ప్రతిభలోన ఉండును కావ్యగతశతాంశముల యందు తొంబదియైన పాళ్ళు) ప్రతి ఒక్క లాక్షణికుడూ, అలంకారవేత్తా ఈ పదం వాడకుండా ఉండలేకపోవడమే కాక, ఒకరు చెప్పిన అర్థం మరొకరు చెప్పలేదు. కాబట్టి మనం వాచ్యార్థాన్ని బట్టి ఆ పదమేమిటో స్థూలంగా ఒక అవగాహనకు రావలసి ఉంటుంది. ప్రతిభ అంటే ప్రతిఫలించే కాంతి. ఆ కాంతి బయటిదికావచ్చు, లేదా లోపల కలిగే ఉత్తేజం కావచ్చు. అది నిర్మలమైన మనసులో, వాక్కులో ప్రతిఫలించడమే కవిత. అట్లా ఎవరిలో ప్రతిఫలిస్తే అతడు ప్రతిభావంతుడు అని చెప్పుకోవలసి ఉంటుంది.
పతిభాన కవుల్నే బుద్ధుడి నిజమైన కవులుగా భావించాడని స్పష్టమవుతూనే ఉంది. అంతే కాదు,ఆయన అటువంటి ఒక కవిని ఉదాహరణగా కూడా చెప్పాడు. బుద్ధుడి ప్రశంసకు నోచుకున్న ఆ అరుదైన ప్రతిభావంతుడు ఎవరు?
వంగీశుడు. కొందరతణ్ణి వాగీశుడని కూడా పిలుస్తారు. అతడు చెప్పిన 15 కవితలు థేరగాథలో చివరి అధ్యాయంలో పొందుపర్చబడ్డాయి. అతడు వంగదేశం నుంచి వచ్చినందువల్ల వంగీశుడు. కాని భగవానుడి ప్రశంసకు నోచుకున్నందువల్ల వాగీశుడు. అతడి కవితలు ఏ సందర్భంలో చెప్పాడో ఆ సన్నివేశ వివరణ సంయుత్తనికాయంలో వంగీస సంయుత్తంలో ఉంది. ఆ సుత్తాన్ని తెలుగులో చదవాలనుకునేవాళ్ళు అన్నపరెడ్డి బుద్ధఘోషుడి అనువాదం ‘బుద్ధుని సంయుక్త సంభాషణలు-1(1)’ (2016) లో (పే.183-195)చదవవచ్చు.
వంగీశుడి కవితల ఇంగ్లీషు అనువాదం, పరిచయం ఇక్కడ లింకులో చూడవచ్చు.
బుద్ధుడి ఎదట వంగీశుడి కవితలు చెప్పిన దృశ్యం సంయుత్తనికాయంలో చాలా గ్రాఫికల్ గా కనిపిస్తుంది. ఒకరోజు బుద్ధుడు శావత్తిలో అనాథపిండికుడి జేతవనంలో పన్నెండువందల మంది భిక్కులతో బసచేసి వాళ్ళని ఉత్సాహపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఉండగా, అక్కడ కూచున్న వంగీశుడికి గొప్ప ఉత్తేజం కలిగింది. అతడు లేచి తన ఉత్తరీయాన్ని భుజం మీదకి లాక్కుంటూ అప్పటికప్పుడే ఒక కవిత చెప్పాడు. ఆ కవిత విని బుద్ధుడు ఆశ్చర్యపోయాడు.
‘ఈ కవిత ఇప్పటికిప్పుడే చెప్పావా లేక ముందే కూర్చుకుని పెట్టుకున్నావా?’ అని అడిగాడాయన.
‘లేదు, ఇవి నాకు ఇప్పటికిప్పుడు తట్టాయి ‘అన్నాడు వంగీశుడు.
‘అయితే మరికొన్ని గాథలు నీకు ఇప్పటికిప్పుడు తడితే వాటిని కూడా చెప్పకూడదా’ అని అడిగాడు బుద్ధుడు.
అప్పుడు మళ్ళా వంగీశుడు మరొక కవిత చెప్పాడు.
థేరగాథలో 21 వ అధ్యాయంలో, ఎనిమిదవ, తొమ్మిదవ కవితలవి. ఈ సందర్భాన్ని బట్టి బుద్ధుడు ఆశుకవిత్వాన్ని మెచ్చుకున్నాడని అనుకోలేం. ఆయన్ని ముగ్ధుణ్ణి చేసింది, ఆ కవికి అప్పటికప్పుడు కలిగిన ఉత్తేజం, ఆ ఉత్తేజాన్ని అతడు అప్పటికప్పుడు ప్రకటించడం. ఇందులో బుద్ధుడు దేన్ని ప్రతిభగా భావిస్తున్నాడని ప్రశ్నిస్తే, spontaneity నీ, spontaneous overflow నీ అని చెప్పుకోవలసి ఉంటుంది.
థేరగాథల్లోంచి కొన్ని గాథలు ఎంపికచేసి థానిస్సారో భిక్కు అనే ఆయన Poems of Elders (2015) పేరిట ఒక అనువాదం తీసుకొచ్చాడు. థేరగాథల అలంకారశాస్త్రాన్ని వివరిస్తూ ఆయన రాసిన విలువైన ముందుమాట కూడా ఉంది అందులో. థేరగాథలవల్లనే భారతీయ సాహిత్యంలో శాంతం ఒక రసంగా స్థిరపడిందంటాడు ఆయన.
బుద్ధుడి కోరికమేరకు వంగీశుడు చెప్పిన కవితకి నా తెలుగుసేత:
ప్రజ్యోతకారుడు
మారుడి మార్గపథం దాటినవాడివి,
మనసనే ఎడారిని మట్టిచేసినవాడు
చూడండి, బంధాలెట్లా తుంచుతున్నాడో,
మననెట్లా బయటకు లాగుతున్నాడో
ఈ వరదనుంచి తప్పించడానికి
మనకెన్నిమార్గాలు చూపించాడో
ఒకసారి ఆ దారిపట్టుకున్నవాళ్ళు
అచంచలంగా నిలబడిపోగలరు.
ప్రజ్యోతకారుడు, జీవితావస్థలన్నీ
దాటి చొచ్చుకుపోయినవాడు
తాను చూసాడు, చూసినదాన్ని
నలుగురితో పంచుకున్నాడు.
సత్యమంత చక్కగా తెలిసి
వస్తుంటే ఇక ప్రమాదమెక్కడుంది?
చెయ్యవలసిందల్లా ఆ శాసనం
పాటించడం, ఆయన్ని ఆరాధించడం.
10-5-2017