పన్నువసూలు చేసే పాండురంగడు

282

తాంగ్ వంశ కాలపు చైనా కవిత్వంలా, పారశీక సూఫీ కవిత్వంలా, జపాన్ హైకూ, బ్రిటిష్ రొమాంటిక్ కవిత్వం, ఫ్రెంచి సింబలిస్టు కవిత్వం, ఆఫ్రికన్ నెగ్రిట్యూడ్ కవిత్వాల్లా భారతీయ కవిత్వంగా చెప్పగల అద్వితీయ కవితాధోరణి ఏది?

అది భారతీయ భక్తి కవిత్వమనే చెప్పవలసి ఉంటుంది.

బౌద్ధ థేరీగాథలు మొదలుకుని నాయన్మారులు, ఆళ్వార్లు, కన్నడ వచన కవులు, మరాఠీ సంత కవులు, హిందీ నిర్గుణ, సగుణ భక్తి కవులు, సింధ్ సూఫీకవులు, బెంగాలీ వైష్ణవ, శాక్త భక్తికవులు, తెలుగు పదకవులదాకా అదొక అవిచ్ఛిన్న పరంపర. రసస్రోతస్విని.

మిస్టిక్కులు ప్రతి మతంలోనూ ఉన్నారు. క్రిష్టియన్ మిస్టిక్కుల్లో కూడా కవిత్వం చెప్పినవాళ్ళున్నారు. జెన్ బౌద్ధ సాధువులు స్వయంగా కవులైనవాళ్ళున్నారు. కాని, సూఫీలుగా ప్రసిద్ధిచెందిన మహ్మదీయ మిస్టిక్కులూ, భారతీయ భక్తి కవులూ అద్వితీయులు. ప్రపంచ సాహిత్యంలో అంత చలిత మానవ హృదయంతో కవిత్వం చెప్పినవాళ్ళు మరొకరు కనిపించరు.

భక్తి కవులే లేకపోతే భారతదేశం ఊపిరాడనంత మతమౌఢ్యంలో కూరుకుపోయి ఉండేది. భక్తి కవులే లేకపోతే దేవుడు ఒక విగ్రహంగా, ఒక చిహ్నంగా, ఒక పతాకంగా, ఒక క్రతువుగా మాత్రమే మిగిలిపోయి ఉండేవాడు. భక్తి కవుల వల్ల మాత్రమే భారతీయ భావోద్వేగాలు సంగీతమయంగా, సంతోషమయంగా, సహజీవనయోగ్యంగా వ్యక్తీకరణకు నోచుకోగలిగేయి.

భక్తికవిత్వంకన్నా ప్రభావశీల ప్రేమకవిత్వాన్ని ఊహించడం కష్టం. భారతీయ భావుకుల దృష్టిలో అసలు భక్తికీ, ప్రేమకీ మధ్య తేడా లేదు. ‘సా తస్మిన్ పరమప్రేమ స్వరూపా చ’ అంటుంది నారద భక్తి సూత్రం. ఆధునిక యుగంలో రొమాంటిక్ కవిత్వం ప్రభావంతో రాసిన ప్రేమ కవిత్వం వెనక భక్తికవిత్వ వాసనలే బలంగా ఉన్నాయని మళ్ళీ చెప్పనక్కర్లేదు. కాని ప్రేమ కవిత్వం, ఎంత గాఢమైన కవిత్వమయినా కూడా, భక్తి కవిత్వం ముందు తేలిపోతుంది. ఎందుకంటే, ఏ కవికూడా అత్యంత సుందరమైన మానవముఖాన్ని ఇంతదాకా సంభావించలేకపోయాడు. మానవభావోద్వేగాల్ని భగవంతుడి రూపంలో మేల్కొల్పగల sublime ఇప్పటిదాకా మనిషి రూపంలో మనకి తారసపడనే లేదు. భగవంతుడితో సంబంధం లేకుండా, భగవంతుడికోసం కాకుండా, మనిషిని మనిషిగా ప్రేమించగల ఒక కాలం కోసం , కవిత్వం కోసం బహుశా అందరికన్నా ఎక్కువగా, అందరికన్నా ముందు నేనే ఎదురుచూస్తూండవచ్చు. కాని, ఇప్పటికీ, ఈ దేశంలో మనిషి ప్రకటించగల తీవ్రప్రేమోద్వేగానికి భగవంతుడే ఆలంబనగా నిలబడుతున్నాడు.

‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా’ అని త్యాగరాజు భావించి ఉండవచ్చు కాని సంగీతం లేకుండా భక్తి కవిత్వం లేదు. సంస్కృతం సహా భారతీయ భాషల సంగీతసంపదనంతా భక్తి కవులు కొల్లగొట్టుకున్నారు. ఆ సంగీతం లేకుండా కేవలం భావమ్మీద ఆధారపడి ఆ కవిత్వాన్ని మనం ఆస్వాదించడం కష్టం. అయినా కూడా భారతీయ భక్తి కవిత్వాన్ని ఎందరో కవులు, పండితులు, ఉపాసకులు ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి అనువదించకుండా ఉండలేకపోయారు.

ఆ అనువాదకుల జాబితా చాలా పెద్దది. అందులో మీరా బెన్ కోసం ప్రేమతో అనువదించిన మహాత్మాగాంధీ, కబీరును మొదటిసారి ఇంగ్లీషులోకి అనువదించినటాగోర్, భర్తృహరిని అనువదించిన అరవిందులు కూడా ఉన్నారు. కాని గత యాభై ఏళ్ళల్లో భారతీయ భక్తి కవిత్వం ఇంగ్లీషులోకి అనువాదం కావడం ఉద్యమం లాగా నడుస్తోంది. ఎ.కె.రామానుజన్ కన్నడ వచన కవుల్ని Speaking of Siva (1973) పేరిట, నమ్మాళ్వారుని Hymns for the Drowning (1993) పేరిట అనువదించాక, భక్తి కవుల్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడానికి ఒక మార్గం దొరికింది.

రామానుజన్, ప్రధానంగా అమెరికన్ పాఠకుల్ని దృష్టిలో పెట్టుకుని, అమెరికన్ వచన కవుల పద్ధతిలో, విలియం కార్లోస్ విలియమ్స్ తరహాలో చేసిన అనువాదాలు ప్రపంచవ్యాప్తంగా భావుకుల దృష్టిని ఆకర్షించేయి. ఆ దారిలో మరెన్నో అనువాదాలు ముందుకొచ్చాయి. దిలీప్ చిత్రే Says Tuka (1991), ధీరేన్ భట్టాచార్య Lovesongs of Vidyapati (1970), బార్బారా స్టోలర్ మిల్లర్ The Gita Govinda of Jayadeva: Love Song of the Dark Lord (1977), లిండా హెస్,సుఖదేవ్ సింగ్ లు అనువదించిన Bijak of Kabir (1986) భారతీయ భక్తికవిత్వం పట్ల ప్రపంచంలో కొత్త తృష్ణని జాగృతం చేసాయి.

21 వ శతాబ్దం మొదలయ్యాక ప్రాచీన భక్తికవులు ఈ అశాంత ప్రపంచానికి మరింత చేరువ కావడం మొదలుపెట్టారు. వినయ ధార్వాడ్ కర్ The Weaver’s Song: Kabir (2003), ఖుస్వంత సింగ్ Songs of the Gurus: From Nanak to Govinda singh (2008), హెచ్.ఎస్.శివప్రకాశ I Keep Vigil of Rudra: The Vacanas (2010), ఇందిర విశ్వనాథ పీటర్సన్ The Hymns of the Tamil Saints (2007), అరవింద్ కృష్ణ మెహ్రోత్రా Songs of Kabir (2011), రంజిత్ హొస్కొటె Lalla: The Poems of Lal Ded (2011) వంటివి ఈ మధ్యకాలంలో వచ్చిన చెప్పుకోదగ్గ అనువాదాలు.

ప్రసిద్ధి చెందిన ఈ అనువాదాల నుంచీ,ఇంకా మరికొన్ని అనువాదాల నుంచీ, కొన్ని అముద్రిత అనువాదాల నుంచి ఎంపికచేసిన ఒక విశిష్ట సంకలనాన్ని Eating God: A Book of Bhakti Poetry (పెంగ్విన్,2014) పేరిట అరుంధతీ సుబ్రహ్మణ్యం వెలువరించారు. ఇంగ్లీషులో వచ్చిన, వస్తున్న భారతీయ భక్తి కవుల అనువాదాల్ని స్థాళీపులాకంగా చూడాలనుకునేవాళ్ళకి ఈ పుస్తకం గొప్ప అవకాశం. మనకి అయిదు రకాల భక్తిభేదాలు, నవవిధ భక్తి మార్గాలు తెలుసు. ఇందులో సంకలనకర్త 32 అవస్థల్లో భక్తి కవిత్వాన్ని గుదిగుచ్చింది. ‘ఆరాటం’, విన్నపం’, ‘ఆశ్చర్యం’, ‘స్తుతి’, ‘భయం’, సంశయం’ లాంటి శీర్షికల కింద ఆమె చేసిన సంకలనం కొత్తగానూ, ఆ పద్దతిలో భక్తి కవుల్ని మరోసారి చదువుకోవడం భావస్పోరకంగానూ ఉంది.

తన సంకలనానికి ఆమె విపులమైన పరిచయవ్యాసంతో పాటు తన ఎంపిక గురించిన చిన్న వివరణ కూడా పొందుపరిచింది. ఆ పరిచయవ్యాసంలో రామానుజన్ రాసిన ఈ వాక్యాల్ని కూడా ఆమె మనకి గుర్తుచేసింది.

‘భక్తుడు భగవంతుణ్ణి వట్టి నామంతోనో, వ్రతంతోనో మాత్రమే పూజించడంతో తృప్తి చెందడు. అతడికి దేవుణ్ణి పూర్తిగా స్వంతం చేసుకోవాలని ఉంటుంది. దేవుడు కూడా తనని స్వంతం చేసుకోవాలని ఉంటుంది. అతడికి ఆడాలని, పాడాలని, కవిత చెప్పాలని, చిత్రించాలని, ప్రతిష్టించాలని, శిల్పంగా చెక్కాలని, వీలైనన్ని మార్గాల్లో భగవంతుణ్ణి తన హృదిలో నిలుపుకోవాలని ఆరాటంగా ఉంటుంది ‘అని.

ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడు తనని తినెయ్యాలనీ, తనకి భగవంతుణ్ణి తినెయ్యాలనీ ఉంటుందన్నమాట.

మూడు అనువాదాలు, మీ కోసం:

దేహమే దేవాలయం

(అల్లమ ప్రభు: అనువాదం: ఎ.కె.రామానుజన్)

ఈ దేహం మొత్తం
ఒక దేవాలయం కాగా
మరొక దేవళంతో
పనేమిటి?

రెండూ కోరుకునే
వాళ్ళెవరూ లేరు.

గుహేశ్వరా,
నువ్వు రాయివైతే
మరినేనేమిటట?

మృత్యువు దారిన మృత్యువు పోతుంది

( రైదాసు:అనువాదం: జాన్ స్ట్రాటన్ హాలీ, మార్క్ జుర్గెన్సన్ మెయెర్)

నాకు తోలు సాపుచెయ్యడం, కలిపి కుట్టడం చాతకాదు
అయినా ఎందుకో మనుషులు నా దగ్గరకొస్తారు చెప్పులు కుట్టమంటూ.
నా దగ్గర రంధ్రాలు పొడవడానికి సూది లేదు
దారం కత్తిరించడానికి సాధనమూ లేదు.
కలిపికుట్టుకోవడమెట్లానో, ముళ్ళు పేనుకోడమెట్లానో తక్కినవాళ్ళకి తెలుసు
ముడేసుకోడమెట్లానో నాకు తెలీదు, కాబట్టి నాకే బంధాలూ లేవు
రాం రాం అనుకోవడమొక్కటే రైదాసుకి తెలిసింది
ఇక మృత్యువు దారిన మృత్యువు పోతుంది.

గయ్యాళి భార్యకి సలహా

(తుకారామ: అనువాదం: దిలీప్ చిత్రే)

పన్నువసూలు చేసే పాండురంగడు
మనకి రావలసిందేదో లెక్కలు గట్టిచెప్తాడు.

మనకి ఉన్నదాంట్లో
డెబ్బై శాతం పన్ను కట్టాలంటాడు
ఇప్పటికి మనం చెల్లించింది పదిశాతం కూడా కాదు.

మన నట్టింట్లో మంచం మీద కూచుని
మన వస్తువులన్నీ లెక్కపెడతాడు
గాదెలు, బిందెలు, గొడ్డూగోదా, ప్రతి ఒకటీ.

నేను బేరమాడటం మొదలుపెడతాను, ఉలకడు పలకడు,
‘నువ్వు కట్టాల్సిందంతా కట్టెయ్యి, ఇంకేదన్నా
మిగిలితే అది నీది’ అంటాడు.

నేనేం చేసేది భార్యారత్నమా అనడుగుతాడు తుకా,
అప్పు చెల్లించకుండా ఎక్కడ దాక్కోవాలో తెలీడం లేదు.

13-9-2017

Leave a Reply

%d bloggers like this: