నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు

Reading Time: 2 minutes

134

హైదరాబాదు బుక్ ఫెయిర్లో ఏ పుస్తకాలు కొనుక్కోవచ్చో ఒక లిస్టు చెప్పగలరా అని ఒక మిత్రురాలు నిన్న నాకో మెసేజి పెట్టారు.

బుక్ ఫెయిర్ మొదటిరోజే ఇంకా ప్రారంభోత్సవం జరక్కుండానే నేనా స్టాళ్ళన్నీ ఒక చుట్టు చుట్టేసాను. చాలాకాలంగా ఆ పబ్లిషర్లూ, ఆ బుక్ సెల్లర్లూ, చివరికి ఆ సెకండ్ బుక్ హాండ్ సెల్లర్లూ కూడా ఏ పుస్తకాలు అమ్ముతారో తెలిసినప్పటికీ, ప్రతి ప్రదర్శనా నాకు కొత్తగానే అనిపిస్తుంది. ప్రతి స్టాల్లోనూ కొత్తపుస్తకాలేమన్నా ఉంటాయా అని వెతుక్కోడానికి ఉత్సాహపడుతుంటాను.

ఈసారి బుక్ ఫెయిర్లో సెకండ్ హాండ్ పుస్తకాల రద్దీ తగ్గింది. తెలుగు పుస్తకాలు, కొత్త పుస్తకాలు వరదలాగా కనిపించాయి. కొందరు రచయితల పేర్లమీద కూడా స్టాళ్ళు కనబడ్డాయి, ఓల్గా ఇత్యాది. కొందరు రచయితలు ప్రచురణకర్తలుగా పెట్టిన స్టాళ్ళు, జె.వి.పబ్లికేషన్స్ లాంటివి కనిపించాయి. ఇదొక శుభపరిణామం.

జాతీయ అంతర్జాతీయ ప్రచురణకర్తలు విరివిగా పాల్గొంటేనే ఆ ప్రదర్శనకి క్వాలిటీ ఉన్నట్టు. ఈసారి హార్పర్ కాలిన్స్ స్టాలొకటి కనిపించింది. అందులో రూమీ కవిత్వం నాలుగైదు పుస్తకాలు కూడా కనిపించాయి. నేనెప్పుడూ వెతుక్కునే స్టాళ్ళు మున్షీరాం మనోహర్ లాల్, మోతీలాల్ బనారసీ దాస్, కాస్మో పబ్లికేషన్స్, పబ్లికేషన్స్ డివిజన్, నేషనల్ బుక్ ట్రస్ట్ కూడా కనిపించాయి. కవిత్వం, నవల, సినిమా రంగాల్లొ ఎక్కడా దొరకని విశేషమైన పుస్తకాలు తీసుకొచ్చే అనల్ప పబ్లికేషన్స్ స్టాల్లో చాలాసేపే గడిపాను.

కాని, చాలా స్టాళ్ళలో, చాలా మంచి పుస్తకాలు,వాటిని వెతుక్కుంటూ వచ్చే చదువరులకోసం రోజుల తరబడి వేచి ఉంటూనే ఉన్నాయి. నాకేవైనా పుస్తకాలు సూచించండి అని ఆ మిత్రురాలు అడిగినప్పుడు నాకు ఆ పుస్తకాలే కళ్ళ ముందు కనిపించాయి.

మిత్రులారా, మీ దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నా,అత్యద్భుతమైన పుస్తకాలు దొరికే చోటు నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు. అక్కడ కురతలైన్ హైదర్ రాసిన ‘అగ్నిధార’ దొరుకుతుంది. కురతలైన్ అగ్రశ్రేణి ఉర్దూ రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త. భారతీయ చరిత్రలో వివిధ ఘట్టాల్లో భారతీయ స్త్రీ పురుషులెట్లా వివిధ సన్నివేశాల్లో వివిధ నామరూపాల్తో తిరిగి తిరిగి అవే జీవనసమస్యల్ని ఎదుర్కుంటున్నారో ఆమె ఆ నవల్లో అద్భుతంగా చిత్రించింది. నేను చాలా చిన్నప్పుడు చదివిన నవల. కానీ నా మనసుమీద చెరగని ముద్ర వేసిన నవల అది.

ఆ పుస్తకం కొన్నాక కూడా మీ వందరూపాయల్లో ఇంకా కొంత డబ్బు మిగుల్తుంది. పక్కనే ఉన్న మరొక నవల ‘స్మృతిరేఖలు’ కొనండి. అది ప్రసిద్ధ హిందీ రచయిత భగవతీ చరణ్ వర్మ రచన. భగవతీ చరణ్ వర్మ తన ‘చిత్రలేఖ’ నవలతో యావత్ భారతదేశాన్నీ ఆకట్టుకున్నాడు. కాని స్మృతిరేఖలు సమకాలిక భారతదేశానికి చెందిన కథ. ఉత్తరప్రదేశ్ లోని ఒక బ్యురోక్రేట్ కథానాయకుడిగా రెండుమూడు తరాల చుట్టూ అల్లిన కథ. ఆ పక్కనే అమృత్ లాల్ నాగర్ ‘సముద్రము-నీటి చుక్క’ ఉంటుంది. నాగర్ ఆ నవల్లో లక్నో కేంద్రంగా కథ చెప్తాడు. అట్లా ఒక నగరం కేంద్రంగా తెలుగులో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ నవలనే రాలేదు.

మరొక వందరూపాయలు ఖర్చుపెట్టాలనుకుంటే, అక్కడే మరిన్ని మహత్తరమైన రచనలు కనిపిస్తాయి. ‘కన్నడిగుల ఆస్తి’ మాస్తి వెంకటేశ అయ్యంగార్ ‘చిక్కవీర రాజేంద్ర’, గుజరాతీ నవలాకారుడు పన్నాలాల్ పటేల్ రాసిన ‘జీవితం ఒక నాటకం’, తొలిమళయాళీ నవల చందుమీనన్ రాసిన ‘ఇందులేఖ’, ఇంకా ఎన్నెన్నో.

నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాలు చూసాక పీకాక్ క్లాసిక్స్ వారి ప్రచురణలు చూడండి. ప్రపంచ సాహిత్యంలో మేలు రచనలని చెప్పదగ్గ వాటెన్నిటినో తెలుగులో అందిస్తున్న ఏకైక ప్రచురణ సంస్థ. అక్కడ నేను అనువాదం చేసిన ‘ఇమ్మాన్యువల్ కాంట్: జీవితం-రచనలు’ కూడా మీకు కనిపిస్తుంది.

ఎమెస్కో తెలుగులో ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ. అక్కడ మీకు నచ్చే పుస్తకాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా అడ్లూరి రఘురామరాజు సంపాదకత్వంలో వెలువడుతున్న పుస్తక మాలిక ‘పొరుగునుంచి తెలుగులోకి’ ద్వారా వెలువడ్డ 30 పుస్తకాలు కనిపిస్తాయి. చాలామంది నన్ను నా పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతారు. ఆ పుస్తక మాలికలో నేను చేసిన అనువాదాలు బషొ ‘హైకూయాత్ర’, ‘హరిలాల్ గాంధి జీవితం’, ‘సత్యమొక్కటే-దర్శనాలు వేరు: గాంధీ-టాగోర్ లేఖలు’, ‘వేదార్థమీమాంస’, ‘గాంధీ వెళ్ళిపోయాడు-మనకు దిక్కెవరు’ కనిపిస్తాయి. చూడండి.

తక్కిన స్టాళ్ళలో కూడా అద్భుతమైన పుస్తకాలున్నాయి. వాటిని చూస్తున్నప్పుడు చింగిజ్ అయిత్ మాతొవ్ రాసిన ‘జమీల్యా’, ‘తల్లిభూదేవి’, ‘ తొలి ఉపాధాయుడు’, మాక్సిం గోర్కీ ‘నా బాల్యం’, ‘నా బాల్యసేవ’, ‘నా విశ్వవిద్యాలయాలు’, ‘సాహిత్యవ్యాసాలు’ కనబడితే తప్పకుండా కొనుక్కోండి. మీకన్నా ముందు మీ పిల్లల్తో చదివించండి.

16-12-2016

Leave a Reply

%d bloggers like this: