నువ్వింకా ప్రజలకి బాకీ పడి ఉన్నావు

293

ఖలీల్ జిబ్రాన్ గురించి రాయవలసి వచ్చి మరోసారి ఆయన రచనలు చదువుదామని చూసాను. ఆయన రచనల సమగ్ర సంకలనం నా దగ్గర ఉంది గాని, కొత్తగా మరేమన్నాపుస్తకాలు వచ్చాయా అని చూస్తే, బలరాం అగర్వాల్ అనే ఆయన సంకలనం చేసిన Kahlil Jibran, The Prophet and His Prophetic, Philosophic and Spiritual Essays (2014) అనే పుస్తకం కనిపించింది. అందులో సంపాదకుడు ద ప్రొఫెట్ తో పాటు జిబ్రాన్ ఇతర రచనలనుంచి కూడా కొన్ని వాక్యాలు ఏరి పెట్టాడు. వాటిలో చాలా వాక్యాలు సూటిగానూ, ఎంతో వివేకంతోనూ నన్ను ఆకట్టుకున్నాయి. వాటిల్లోంచి, ఇవిగో, ఈ కొన్ని వాక్యాలు మీకు కూడా వినిపించాలనిపించింది.

1
ప్రజల్లో నువ్వు పెట్టుకునే నమ్మకానికీ, వాళ్ళ పట్ల నీకున్న సందేహాలకీ, నీ పట్ల నీకున్న నమ్మకానికీ, సందేహాలకీ చాలా దగ్గర సంబంధముంది.

2
విద్య మీలో విత్తనాలు చల్లదు, చల్లిన విత్తనాలు అంకురించేలా చేస్తుంది.

3
నరకభయమే నరకం. స్వర్గాన్ని కోరుకోవడమే స్వర్గం.

4
వాళ్ళంటారు, ‘ఒక బానిస నిద్రపోతూ కనిపిస్తే అతణ్ణి లేపకు, ఏమో, బహుశా అతడు స్వాతంత్ర్యాన్ని కలగంటూ ఉండవచ్చు’ అని. నేనంటాను: ‘ఎవరైనా ఒక బానిస నిద్రపోతూ కనిపిస్తే అతణ్ణి తక్షణమే నిద్రలేపండి, అతడితో స్వాతంత్ర్యం గురించి సంభాషించండి’ అని.

5
ఎవరి జీవితంలోనైనా కానుకలు పెరిగేకొద్దీ స్నేహితులు తగ్గిపోతారు.

6
భగవంతుడు సత్యసౌధానికి చాలా ద్వారాలు పెట్టాడు, విశ్వాసి ఏ తలుపు తట్టినా ప్రవేశం దొరకాలని.

7
ప్రచండ ఝుంఝూమారుతాలు వీచే ఒక పర్వతాగ్రం మీద కూచున్నట్టు నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను. అట్లాంటి చోటు నిజంగా ఉందా? ఉంటే ఒకనాటికి అక్కడకి పోయి, ఆ పర్వతాగ్రాన నా హృదయాన్ని కవితలుగానూ, బొమ్మలుగానూ మార్చుకుంటాను.

8
పరిపాలించబడేవాళ్ళ ఆసక్తి ఎంతసేపూ పాలకులమీదనే.

9
జ్ఞానమంటే రెక్కలుండే జీవితం.

10
మనిషి వైభవోపేతమైన జీవితం ఊరేగింపులాగా సాగిపోయినప్పుడు బాటకిరుపక్కలా రేగే బంగారుధూళిలోంచే భాషలూ, మతాలూ, ప్రభుత్వాలూ రూపుదిద్దుకుంటాయి.

11
నిన్నటి నీ జమాఖర్చు ఒకసారి లెక్క చూసుకుంటే, నువ్వింకా ప్రజలకీ, జీవితానికీ బాకీ పడివున్నావనే అర్థమవుతుంది.

12
జీవితం మనకి ప్రసాదించిన అపురూపమైన కానుకలు సౌందర్యమూ, సత్యమూనూ. మొదటిది ప్రేమించే హృదయంలో కనిపిస్తే, రెండోది శ్రామికుడి హస్తంలో కనిపిస్తుంది.

13
సాహిత్యంలో నేనిష్టపడేవి మూడు: విప్లవశీలత, పరిపూర్ణత, నైరూప్యత. సాహిత్యంలో నేను ఏవగించుకునేవి మూడు: అనుకరణ, వక్రీకరణ, సంక్లిష్టత.

14
ప్రేమ అంటే? వణికిపోయే సంతోషం.

15
వాళ్ళంటారు, మనిషి తనని తాను అర్థం చేసుకుంటే ప్రజల్ని ప్రేమించగలుగుతాడని. నేనంటాను, అతడు ప్రజల్ని ప్రేమిస్తే, తన గురించి తాను ఎంతో కొంత తెలుసుకోగలుగుతాడని.

16
న్యాయబద్ధంగా నడుచుకునేవాడు ప్రజలహృదయాల్ని గెలుస్తాడు. దయాపూర్వకంగా నడుచుకునేవాడు ఈశ్వరహృదయాన్నే గెలుచుకుంటాడు.

17
మనిషి పొలందున్నకపోతేనో, భవనాలకు పునాది వెయ్యకపోతేనో లేక వస్త్రాలు నెయ్యకపోతేనో దేశానికి అరిష్టం దాపురించదు. అతడు తన వృత్తిని రాజకీయంగా ఎప్పుడు మారుస్తాడో అప్పుడుమటుకే దేశానికి ఉపద్రవం సంభవిస్తుంది.

18
ఓ, నా ఆత్మని రంగుల్లో స్నానమాడనివ్వండి. నాకు సూర్యాస్తమయాన్ని మింగెయ్యాలని ఉంది, ఇంద్రచాపాన్ని తాగెయ్యాలని ఉంది.

19
ప్రోత్సహిస్తే తప్ప ఒక ఉదాత్త కార్యం చెయ్యనివాడు ప్రోత్సహిస్తే ఎప్పటికీ చెయ్యడు.

20
మనుషులు ప్లేగు వ్యాధిగురించి భయంతో వణికిపోతూ మాట్లాడతారు, కాని నెపోలియన్ గురించీ అలెగ్జాండర్ గురించీ పారవశ్యంతో మాట్లాడతారు.

21
అలంకరించుకోవడంటే నువ్వు అనాకారిగా ఉన్నావని ఒప్పుకున్నట్టు.

22
మనం వాక్స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం కోరుకుంటాం, కాని మాట్లాడటానికీ, ప్రచురించడానికీ నిజంగా పనికొచ్చేదేదీ మన దగ్గర లేదు.

23
కన్నీళ్ళు పెట్టుకోలేని వివేకం నుంచి, మనసారా నవ్వుకోలేని తత్త్వశాస్త్రంనుంచి, శిశువుముందు తలవంచలేని గర్వం నుంచి నన్ను బయటపడెయ్యి.

24
ఎవరి కవిత విన్నాక అతడి ఉత్తమ కావ్యం ఇంకా రావలసిఉందనే భావన నీకు కలిగిస్తాడో అతడే నిజమైన కవి.

25
కవికీ పండితుడికీ మధ్య ఒక పచ్చికబయలు ఉంది. పండితుడు దాన్ని దాటాడా వివేకి అవుతాడు. కవి దాటాడా, ప్రవక్త అవుతాడు.

26-11-2017

One Reply to “నువ్వింకా ప్రజలకి బాకీ పడి ఉన్నావు”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s