క్వ స్విదాసామ్ కతమా పురాణీ యయా విధానా విదధుతృభూణామ్
శుభమ్ యచ్ఛుభ్రా ఉషశ్చరంతి న వి జ్ఞాయంతే సదృశీరజుర్యాః
(ఆ పురాతన ఉషస్సులు, ఋభువుల కాలం నాటి ఆ ఉషస్సులు నేడెక్కడున్నాయి? శుభమైనవీ, శుభ్రమైనవీ, ఒక్కలాంటివీ, క్షీణతలేనివీ అయిన ఉషస్సుల్ని ఇవీ అని విడదీసి తెలుసుకోలేం కదా).
ఋగ్వేదం నాలుగవ మండలంలో వామదేవ గౌతముడు (4:51:6) తన ముందు ఆవిష్కారమవుతున్న ఉషోదయాన్ని చూసి వేసుకున్న ఈ ప్రశ్న యుగయుగాల ఉషోదయాలముందు తరతరాలుగా మానవుడు వేసుకుంటూ వస్తున్న ప్రశ్ననే.
ప్రతి ప్రత్యూషవేళా వెలుగుని తీసుకొచ్చే ఉషస్సు యుగయుగాలుగా ఒక్కటే, కాని ఏ ఉషోదయమూ మరొక ఉషోదయం లాంటిది కాదు. నిన్న లాగా నేడు లేదు. నేటిలాగా రేపు ఉండదు. కానీ అనంతాలూ, అసంఖ్యాకాలూ అయిన ఉషస్సులో ఏ ఒక్కదాన్నీ నిన్నటి ఉష అని గానీ, రేపటి ఉష అని గానీ విడదీసి చూసుకోలేం కూడా.
అదే క్షణాన మరొక ప్రశ్న మానవుడి ముందు తలెత్తేది, నిన్నటి ఉష గురించి నిన్నటి కవులు గానం చేసిన ఉషలాంటిదాన్నే నేను దర్శిస్తున్నానా? ఈ ప్రభాతం ముందు నా అనుభవం నిన్నటి ప్రభాతం ముందు నా పూర్వకవి అనుభవం లాంటిదేనా?
ఋగ్వేదంలో రెండవ, తొమ్మిదవ మండలాల్లో తప్ప తక్కిన ఎనిమిది మండలాల్లోనూ ఉషో సూక్తాలు ఉన్నాయి. పూర్తిగాగానీ లేదా ఒకటి రెండు మంత్రాలు గానీ ఉషని కీర్తిస్తున్నవి 27 సూక్తాల దాకా ఉన్నాయి. ఉషోదేవిని దర్శిస్తూ ఈ ఋషులందరూ చెప్పిన కవిత్వంలో ఉషాసౌందర్యవర్ణనతో పాటు ఆమె ప్రపంచాన్ని చైతన్యవంతురాల్ని చేస్తుందనే ఎరుకతోపాటు, మానవుల్ని వివిధ క్రియలవైపు నడిపిస్తుందనే ఆశతో పాటు ఈ ఉష పూర్వకాలంలో ఉన్నది, నేడు ఉన్నది, ఆగామికాలంలో కూడా కొనసాగబోతున్నదనే మెలకువ కూడా స్పష్టంగా ఉన్నది.
అందుకనే ఋగ్వేద ఋషి ఉషని దాదాపుగా బహువచనంగానే సంబోధిస్తూ వచ్చాడు. ఒక్క వామదేవ గౌతముడు మటుకే పై సూక్తంలో ఉష అంటో ఒకటిగా సంబోధిస్తో కవిత మొదలుపెట్టాడు. కాని, నాలుగవ మంత్రానికి వచ్చేటప్పటికి ఆ ఉషను ఉషలుగా సంబోధిస్తూ, ఆరవమంత్రానికి, అంటే పైన పేర్కొన్న మంత్రానికి వచ్చేటప్పటికి, అసంఖ్యాకాలైన ఉషల్లో ఇది నిన్నటిదీ,ఇది రేపటిదీ అని వేరుచేసి తెలుసుకోలేమనే ఎరుక ప్రకటించకుండా ఉండలేకపోతాడు.
ఆ సూక్తంలో ఆరవమంత్రం నుంచి ఎనిమిదవ మంత్రానికి వచ్చేటప్పటికి ‘తా ఆ చరన్తి సమనా పురస్తాత్సమానతః సమనా పప్రథానాః’ అంటాడు. అంటే ఉషలు ఒకేరూపంలో ప్రాగ్దిశనుంచి సమానవిఖ్యాతంగా ఉదయిస్తూనే ఉన్నాయంటాడు.
ఈ అద్భుత మానవీయ, దివ్య దర్శనాన్ని కుత్స ఆంగీరసుడిట్లా (1:113) గానం చేస్తున్నాడు:
పరాయతీ నామన్వేతి పాథ ఆయతీనామ్ ప్రథమా శశ్వతీనానామ్
వ్యుచ్ఛన్తీ జీవముదీరయత్న్యుషా మృతం కం చన బోధయన్తీ (1:113:8)
(గతించిన ఎన్నో ఉషస్సుల దారిలో, రేపు రానున్న మరెన్నో ఉషల దారిలోనే చీకట్లను చీలుస్తూ నేడు ఉష ప్రవేశించింది. ఆమె జీవులందరినీ మేల్కొల్పుతున్నది, మృతులైనవారిని కూడా జాగృతపరుస్తున్నది.)
కియాత్యా యత్సమయా భవాతి యా వ్యుషుర్యాశ్చ నూనమ్ వ్యుచ్ఛాన్
అను పూర్వాః కృపతే వావశానా ప్రతీధ్యానా జోషమన్యాభిరేతి. (1:113:10)
(ఇప్పుడు ప్రభవించిన ఉషస్సు ఎంత సేపు నిలుస్తుంది? ఇలా ఎంతకాలం పాటు ఉషస్సులు ఉదయిస్తూనే ఉంటాయి? పూర్వం గతించిన వారి దారిన, రేపు రానున్నవారితోవన మనకు వెలుగును ప్రసాదించడానికి ఈ ఉషస్సు అడుగుపెడుతున్నది.)
ఈయుష్టే యే పూర్వతరామపశ్యన్వ్యుచ్ఛన్తీముషసమ్ మర్త్యాసః
అస్మాభిరూ ను ప్రతిచక్ష్యాభూదో తే యన్తి యే అపరీషు పశ్యన్. (1:113:11)
(దీప్తమానమైన ఈ ఉషస్సుని నిన్న చూసినవారు గతించినారు. ఆమె నేడు మనకి కనిపిస్తున్నది. రేపు రానున్నవారు ఆమెనిట్లే రానున్నకాలంలో దర్శించగలరు.)
శశ్వత్పురోషా వ్యువాస దేవ్యథో అధ్యేదమం వ్యావో మఘోనీ
అర్థో వ్యుచ్ఛాదుత్తరామ్ అను ధ్యూనజరామృతా చరతి స్వధాభిః (1:113:13)
(దివ్య ఉష పూర్వకాలాల్లో కూడా ఉదయిస్తూనే ఉంది. నేడు కూడా ఉదయిస్తున్నది. రేపు రానున్న రోజుల్లో కూడా వెలుగులు విరజిమ్ముతుంది. ఆమెకి వార్థక్యం లేదు. మృతిలేదు. తన దీప్తితో తాను సర్వధా ప్రకాశిస్తూనే సాగిపోతుంది.)
ఉష నిత్యం, అనంతం. ఆమెను దర్శిస్తున్న మానవుడు నిత్యుడు, శాశ్వతుడు. నిన్నటి ఉషను దర్శించిన మానవుడు నేడు లేడు, రేపటి ఉషను దర్శించే మానవుడెవరో మనమెరుగం. కాని, నిన్నటి ఉషనీ, నేటి ఉషనీ ఎట్లా వేరుచేయలేమో, నిన్నటి మానవుడినుంచి రేపటి మానవుణ్ణి కూడా వేరుచేసి చూపలేం. ఉష బహువచనం మాత్రమే కాదు, ఏకవచనం కూడా. మానవుడు కూడా బహువచనం మాత్రమే కాదు, ఏకవచనం కూడా. నేను ఉండను, కాని మనిషి కొనసాగుతాడు.
బైరాగి చెప్పినట్లుగా:
‘రక్తాలక్తక రంజిత చరణ స్ఫురదుషస్సుషమ తనదే ప్రథమోదయమని భావిస్తుంది.
గగనామర వల్లరి నొసట శోణ సూన తిలకంలా తరుణారుణ రవిబింబం జ్వలిస్తుంది.’
1-1-2018