ద స్టోరీటెల్లింగ్ ఏనిమల్

Reading Time: 3 minutes

147

మేమంతా ఆత్మీయంగా శేఖర్ గారు అంటూ పిలుచుకునే గోటేటి రాజశేఖరరావుగారు నాకు తెలిసినవాళ్ళల్లో గొప్ప భాషావేత్త. అంటే లింగ్విస్టు అని కాదు, ఒకప్పటి భర్తృహరి ( సుభాషితాల భర్తృహరికాదు, వాక్యపదీయం రాసిన భర్తృహరి), నిన్నటి విట్ గెన్ స్టీన్ ల లాగా భాషా తత్త్వవేత్త అన్నమాట.

ఆయన నాలుగైదు రోజులకిందట ఒక వాక్యం రాసారు.’కథనం చిత్తమును సంపాదిస్తుంది’ అని.

ఆ వాక్యం చాలా intriguing గా ఉండటమే కాకుండా, నన్ను నిద్రలోనూ, మెలకువలోనూ కూడా వెంటాడుతోంది.

మనం మామూలుగా ఏమనుకుంటామంటే, చిత్తం కథనాన్ని అల్లుతుంది అని. కాని కథనం చిత్తాన్ని అల్లుతుంది అంటే ఏమిటి? ఇది మన సమకాలీనుడైన మన మిత్రుడొకాయన రాసిన వాక్యమంటే నమ్మశక్యంగా లేదు. మన భ్రమల్నీ, బంధాల్నీ తాను కూడా మనతో పంచుకుంటూ, మనమధ్యనే తిరుగాడుతున్నా, మానసికంగా ఎంతో విముక్తి సముపార్జించినవాడుగానీ అట్లాంటి వాక్యం రాయలేడు కదా అనిపించింది.

ఇంతకీ చిత్తమంటే ఏమిటి? ‘చేతయతీతి చిత్తం’ అని అమరం. ఏది ఆలోచిస్తుందో అది చిత్తం. అంతేనా? భారతీయ దర్శనాల్లో చిత్తానికొక ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధులు దాన్ని మనసునుంచి, విజ్ఞానం నుంచీ, అహంకారం నుంచీ వేరుగా చూసారు. చిత్తవృత్తి నిరోధమే యోగమని పతంజలి అన్నాడు.

వృత్తి అంటే మనసులో కలిగే వికృతి. మనమొక పువ్వుని చూస్తే మనసులో ఒక పువ్వు ఆకృతి ఏర్పడుతుంది. అదే ముల్లుని చూస్తే ముల్లు ఆకృతి.

ఇలా బయటి దృశ్యం మన మనసులో కలిగించే వికృతిని యోగం అయిదురకాల వృత్తులుగా గుర్తించింది.అవి ప్రమాణం (ప్రత్యక్షం,అనుమానం, శబ్దాలద్వారా కలిగే ఇంద్రియజ్ఞానం), విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి. ఈ వృత్తులు మనసుని ఎప్పటికీ కల్లోలపరుస్తుంటాయి, సముద్రం మీదే రేగే అలల్లాగా, చిత్తభూమి వీటివల్ల విక్షిప్తమవుతూ ఉంటుంది. దీన్ని కొంతసేపేనా ఆపాలంటే ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టాలి,దాన్ని ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రత శాశ్వతంగా ఉండగలిగితే దాన్ని నిరోధమంటారు. ఏకాగ్రత ద్వారా నిరోధాన్నిసాధించడమే యోగం.

ఇదంతా బాగానే ఉంది. కాని ఈ చిత్తం కథనం వల్ల రూపొందుతుంది అంటే ఏమిటి?

మనం కథలు చెప్పుకుంటాం. బహుశా సృష్టిలో ఈ సామర్థ్యం మరే ప్రాణికీ లేదు. అందుకనే జొనాథన్ గాడ్షాల్ అనే రచయిత మనిషిని The Storytelling animal అన్నాడు. అతడేమంటాడంటే, ఒక పగటికల సగటున పధ్నాలుగు సెకండ్ల పాటు ఉంటుందని, రోజుకి మనం దాదాపు రెండువేల దాకా అట్లాంటి పగటికలలు కంటామనీ, అంటే, మనం మెలకువ గా ఉండే గంటల్లో దాదాపు సగం సమయం,మన జీవితకాలంలో దాదాపు మూడోవంతు అట్లా పగటికలలు కనడంలోనే గడుపుతామనీ. అంటే, మనం ఎప్పటికప్పుడు మనగురించి మనం అసంఖ్యాకమైన స్క్రీన్ ప్లేలు రాసుకుంటూ ఉంటామన్నమాట. మన జీవితాల్లో దుర్భరమైన, దయనీయమైన సంఘటనలు ఎదురవుతున్నప్పుడల్లా వాటిని శుభాంతాలుగా ఊహించుకునే కథలు చెప్పుకుంటూ ఉంటామన్నమాట.

ఇలా చెప్పుకోవడం మనం సంకల్పించి చేసుకునేది కాదు. అసలు మనిషి మెదడులోని అమరికలోనే ఈ పరిస్థితి ఉందని న్యూరో సైంటిస్టులు అంటున్నారు.

మానవుడి మెదడు కుడి ఎడమ భాగాలుగా విడివడి ఉంటుందని మనకు తెలుసు. అందులో ఎడమ భాగంలోని ‘ఇంటర్ ప్రెటర్ ’ మానవుడి అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీకథలుగా అల్లుతుందనీ, అనువదిస్తుందనీ ప్రసిద్ధన్యూరోశాస్త్రవేత్త మైఖేల్ గజానిగ అంటున్నాడు. మానవుడి గ్రహణసామర్థ్యాల్లోనూ, ప్రజ్ఞానసామర్థ్యంలోనూ కథలుచెప్పేవిద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని విజ్ఞానశాస్త్రం చాలాకాలం కిందటే గుర్తించింది. మన జ్ఞాపకాల్ని ఒక కాలక్రమంలో గుర్తుపెట్టుకోవడంలోనూ, గుర్తుకుతెచ్చుకోవడంలోనూ మనిషి ఉపయోగించే సామర్థ్యం కథనసామర్థ్యమే. అంతేకాదు, ఆ జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకునేటప్పుడు మధ్యలోఉండే ఖాళీల్ని పూరించడానికి జరగని విషయాలుకూడా జరిగినట్టుగా తనకుతాను చెప్పుకునే నేర్పు కూడా మానవుడి మెదడుకి ఉంది. ఇట్లా లేనిదాన్నికల్పించగలిగేశక్తి బహుశా ఈ మొత్తం జీవజాలంలో మనిషికి మాత్రమే సొంతం. ఈ సామర్థ్యం వల్లనే మనిషి మానవుడుగా మారుతున్నాడు.

తనకు సంభవించిన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ మళ్లా గుదిగుచ్చుకోవడంలో అక్కడక్కడా మధ్యలో ఉన్నఖాళీల్ని పూరించడానికి లేనిదాన్ని కూడా జరిగినట్టుగా మానవుడు ఎందుకు ఊహించుకుంటాడు? దానికి ప్రధానమైన కారణం, మానవుడికి యథార్థాల్నిశకలాలుగా తిరిగి గుర్తుకుతెచ్చుకోవడంకన్నా, ఆ యథార్థాలను సమగ్రంగా తిరిగి తనకైతాను చిత్రించుకోవడం ముఖ్యం. అటువంటి సమగ్రచిత్రణ మానవుడి మెదడును తృప్తిపరుస్తుంది. అట్లా చిత్రించుకునేటప్పుడు మానవుడిలో ఒక ఉద్దీపన కలుగుతుంది. మామూలుగా జరిగిన సంగతులు జరిగినట్టుగా లెక్కవేసుకోవడంలో మానవుడి మెదడులోని ‘బ్రోకా’ భాగమూ, ‘వెర్నిక్’ భాగమూ మాత్రమే సంచలిస్తాయి. దుకాణం ముందు రాసిఉన్న ధరలపట్టిక చూసినప్పుడు మానవుడి మెదడులో ఆ రెండుభాగాలు మాత్రమే సంచలించి ఊరుకుంటాయి. కాని ఆ జాబితాను తన దగ్గరున్న సొమ్ముతో పోల్చి చూసుకోగానే మానవుడి మెదడు ఊహించలేనంతగా ఉద్దీప్తమవుతుంది.

ఇట్లా ప్రజ్వలించడానికిగల కారణాల్నిపరిశోధిస్తున్నన్యూరోసైంటిస్టులుఇప్పుడు’న్యూరోఈస్తటిక్స్’ అనే కొత్త అధ్యయనాన్నిమొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో విశేషమైన కృషిచేస్తున్న వి.ఎస్. రామచంద్రన్ మన మెదడులో, ముఖ్యంగా, దృష్టికి సంబంధించిన భాగంలోని న్యూరాన్లను ఉద్దీపింపజేసే పది లక్షణాల్నిపేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైన ఒక లక్షణాన్ని ‘పీక్ షిఫ్ట్’ గా గుర్తిస్తున్నారు. 1950 ల్లో నికోటింబర్గన్ అనే శాస్త్రవేత్త సముద్రపక్షుల మీద కొన్ని ప్రయోగాలు చేశాడు. అందులో ఆ పక్షులు తమ కూనలకి ఆహారం తినిపించేటప్పుడు ఆ చిన్నికూనలు ఆ పక్షులముక్కుల్ని తాడిస్తుండటం చూసాడు. టింబర్గన్ ఆ పక్షుల ముక్కుల్ని పోలిన చిన్నచిన్నపుల్లలకి చివర ఎర్రటిచుక్కపెట్టి ఆ పక్షికూనలకు చూపించినప్పుడు అవి ఆ పుల్లల్నికూడా తాడించడం మొదలుపెట్టాయి. అప్పుడతడు ఆ పుల్లలమీద మూడు ఎర్రటిచుక్కలు చిత్రించి చూపించాడు. అశ్చర్యంగా, ఆ పిల్లలు మరింత ఉద్రేకంగా ఆ పుల్లల్నితాడించడం మొదలుపెట్టాయి. దాన్నిబట్టి ఆ శాస్త్రవేత్త రాబట్టిన ప్రతిపాదన ఏమిటంటే బయటప్రపంచంలో మనని ఉద్రేకించే విషయాలు వాటిని వక్రీకరించేకొద్దీ (డిస్టార్ట్) మనని మరింతగా ఉద్రేకిస్తాయనేది.

తన అనుభవాలకీ, జ్ఞాపకాలకీ ఒక సమగ్రత సంతరించుకునే క్రమంలో మనిషి వాటిని ఒక కథగా పునర్నిర్మించుకుంటున్నప్పుడు, అవసరమైతే వాటి వరుసక్రమాన్నీ, యథార్థాన్నీ కూడా వక్రీకరించి చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకునేటప్పుడు జరిగిన యథార్థాన్నిపక్కనపెట్టి జరగనిదాన్ని జరిగినట్టుగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడడు. ఆ వక్రీకరణలో అతడు చూసేది మొత్తం వాస్తవాన్నితిరిగి మెనూకార్డు లాగా గుర్తుచేసుకోవడం కాదు. అందుకు బదులు ఆ జరిగిన సంఘటనలో తనను ఉద్రేకించిన రంగునీ, రుచినీ, సువాసననీ మరింత పెద్దవిచేసి, వాటిని మరింతగా తలచుకోవడం ద్వారా తననుతాను ఉద్దీపింపచేసుకోవడం. ఆ ఉద్దీపనలో అతడి మెదడు ఉద్దీప్తమై తద్వారా సంతోషాన్నిఅనుభవిస్తుంది. తన మెదడు పొందే సంతోషాన్నిఅతడొకప్రాణిగా, తన సంపూర్ణఅస్తిత్వంతో స్వీకరించి, సంతోషిస్తాడు.

మానవుడి మెదడులోని కుడిభాగం విషయసేకరణకు సంబంధించింది కాగా, ఎడమభాగం ఆ విధంగా సేకరించినవిషయాల్నిబట్టి మానవుడికొక కథ అల్లిపెడుతుందని గమనించిన న్యూరోసైంటిస్టులు మరొకవిషయం కూడా గమనించారు. అదేమంటే, రకరకాల సందర్భాల్లో మానవుడిమెదడు దెబ్బతిన్నప్పుడు లేదా మెదడులోని రెండుభాగాల మధ్య పరస్పరసంకేతాలు తెగిపోయినప్పుడూ కుడిభాగంనుంచి సంకేతాలు అందినా అందకపోయినా ఎడమభాగం ఏదో ఒక విధంగా ఆ ఖాళీల్నితనకైతాను పూరించుకుని ఏదో ఒక విధంగా తన ముందున్న ప్రపంచాన్ని లేదా తాను లోనవుతున్నఅనుభవాల్నీఏదో ఒక విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే జొనాథన్ గాడ్షాల్ మనిషిని ‘ద స్టోరీటెల్లింగ్ ఏనిమల్’ అన్నాడు.

అయితే కథలు చెప్పేమనస్తత్వం పూర్తిగా పరిపూర్ణమైనది కాదు. మానవుడి మెదడులోని ఎడమభాగంలో కథలల్లేభాగాన్ని దాదాపు ఐదుదశాబ్దాలపాటు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, మనలోని ఈ చిన్నమానవుడు నిజంగానే ఎంతో విలువైనవాడే అయినప్పటికీ, చతురుడు, కట్టుకథలల్లేవాడు కూడానని మైఖేల్ గజనిగ భావించాడు. ఎందుకంటే మానవుడిలోని కథలల్లే మనస్తత్వం అనిశ్చయాన్నీ, యాదృచ్ఛికతనీ, కాకతాళీయతనీ భరించలేదు. దానికి ఏదో ఒక అర్థంకావాలి. అట్లా అర్థంచేప్పుకోవడానికి అది అలవాటు పడిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వివిధవిషయాల మధ్య సార్థకమైన అమరిక కనిపించకపోతే అది దాన్ని తనంతటతనుగా ప్రపంచం మీద ఆరోపించడాని కివెనుకాడదు. క్లుప్తంగా చెప్పాలంటే, కథలు చెప్పేమనస్సు ఎంత వీలయితే అంత నిజమైన కథలు చెప్తుంది. అట్లా చెప్పలేనప్పుడు అబద్ధాలు కూడా చెప్తుంది.

అంటే ఏమిటన్నమాట? మనిషి తన వ్యక్తిత్వాన్ని తన కథనంతో నిర్మించుకుంటున్నాడు. ఆ కథనం ఒట్టి కథగా కాక అత్యంత విశ్వసనీయ కథనం గా ఉందని కూడా తనని తాను నమ్మించుకుంటున్నాడు.

ఇదంతా శేఖర్ గారు ఒక్క వాక్యంలో సూత్రప్రాయంగా తేల్చేసారు: ‘కథనం వల్ల చిత్తం రూపొందుతుంది’ అని.

14-10-2016

Leave a Reply

%d bloggers like this: