దేవుడా నేనేమి చేసేది

294

బాబా బుల్లేషా కవిత్వం చదువుతూ ఉండగా,ఈ కవిత దగ్గరకు రాగానే హృదయం కంపించడం మొదలయ్యింది. ఇంగ్లీషు లోనే ఈ వాక్యాలు నా చెవిలో ఎవరో తుత్తార ఊదినట్టుగా నన్ను నా నిద్రలోంచి ఒక్కసారిగా గుంజి బయటకు లాగేసాయి.

The Beloved is about to leave my neighbourhood;
O Lord, what shall I do?

తన ఇంటికి కూడా కాదట, తన ప్రియతముడు తన పొరుగింటికి వచ్చాడు. పొరుగింటికి అని కూడా అనలేం. తన చుట్టుపక్కల ఎక్కడో విడిదిచేసాడాయన. ఎన్నేళ్ళుగా ఉన్నాడో తెలియదు, ఎన్నాళ్ళో తెలియదు, లేదా పొద్దున్నే వచ్చి మళ్ళా సాయంకాలం వెళ్ళిపోతున్నాడో లేక గడియసేపట్లోనే తరలిపోతున్నాడో.

కాని ఆ కవిత, ఆ గీతం, ఆ పంజాబీలో కాఫీ- పదేపదే కంపిస్తో, తొట్రుపాటుతో, గుండెమీద చేతులు పెట్టుకుని లేదా కొంగు నోటికి అడ్డుపెట్టుకుని ఈ కంచె దగ్గరనుంచి ఆ గుమ్మందాకా,ఆ వీథిగుమ్మందగ్గరనుంచి ఈ పెరటితలుపు దాకా ఊరికినే కాలునిలవకుండా, కన్నార్పకుండా పరుగుపెడుతున్న ఒక యువతి అనుతాపాన్నంతా నా కళ్ళముందు చూపించింది. అప్పుడే విచ్చుకున్న మల్లె నుంచి ఒక్కసారిగా పరిమళం చుట్టూతా వ్యాపించినట్టు ఆ గీతంలోని ప్రేమసంచలనం నా హృదయంలోకి చొరబడి నా గుండెచుట్టూ ఆవిరిలాగా కమ్ముకుంది.

ఇంగ్లీషులోనే ఇట్లా ఉందే పంజాబీలో ఎట్లా ఉండివుండవచ్చునో చూద్దామనుకున్నాను.

అదృష్టవశాత్తూ, నా దగ్గర పంజాబీ గీతగుచ్ఛం కూడా ఉంది. డా.హర్ భజన్ సింగ్ సంకలనం చేసి ప్రతి గీతానికీ మూలంతో పాటు హిందీ paraphrase చేసిన సంపుటి. అందులో డా.సింగ్ ఈ గీతాన్ని పొందుపరచకుండా ఎట్లా ఉంటాడు! ఏ సహృదయుణ్ణి ఈ గీతం సమ్మోహపరచదు కనుక!

కాని పంజాబీలో ఈ గీతం మరింత పొందిగ్గా పారిజాత పుష్పంలాగా ఉంది.

ఉఠ్ చల్లే గుఆంఢోఁ యార్
రబ్బా హుణ్ కీ కరియే

ఆ గీతాన్ని ఒక త్యాగరాయకృతిలాంటి తెలుగులోకి తెలుగు చెయ్యాలి, కాని అశక్తుణ్ణి, ఇట్లా అనువదిస్తున్నాను, చూడండి:

అతడు నా పొరుగింటిముంగిలినుంచి బయల్దేరబోతున్నాడు
దేవుడా, నేనేమి చేసేది?

అతడు లేచినిలబడ్డాడు, ఇంక వెళ్ళిపోనున్నాడు
అతడి సహచరులు కూడా తయ్యారు,
దేవుడా, నేనేమి చేసేది?
అతడి వెళ్ళిపోనున్నాడని అన్నివైపులా చర్చనడుస్తోంది
నాలుగుదిక్కులా ఒకటే పుకారు,
దేవుడా, నేనేమి చేసేది?
నా గుండెలోంచి నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి
ఆ సొగసు చూడక నాకు శాంతిలేదు,
దేవుడా, నేనేమి చేసేది?
ఓ బుల్లా, అతణ్ణించి దూరమయ్యాక
నేను ఆ ఒడ్డునా లేను, ఈ ఒడ్డునా లేను
దేవుడా, నేనేమి చేసేది?

అతడు నా చుట్టుపక్కలనుంచి తరలిపోనున్నాడు
దేవుడా నేనేమి చేసేది?

ఆ ప్రియతముడు పక్కింటికి వచ్చాడు, తన ఇంటికి కాదు. అతడు వెళ్ళిపోడానికి లేచాడు, ఇక ఈ క్షణమో, మరుక్షణమో అడుగు ముందుకేస్తాడు.అతడి సహచరులు కూడా అతడితో పాటే లేచి నిల్చున్నారు. అతడు వెళ్ళిపోనున్నాడని అంతా చెప్పుకుంటున్నారు. తమ ఊరికి, తమ వీథికి, తమ ప్రాంగణానికి వచ్చిన ప్రియమానవుడు కొద్దిసేపు గడిపి తిరిగి వెళ్ళిపోడానికి లేచి నిల్చున్నప్పుడు, ఆ పరిసరాలంతటా ఎంత ఉత్తాప తుములధ్వని అల్లుకుంటుందో ఊహించలేమా? అతడు శ్రావస్తిలో జేతవనానికి వచ్చిన బుద్ధుడో, బెథనీలో మార్తా ఇంటికొచ్చిన యేసునో, కలకత్తా వచ్చి తిరిగి మళ్ళా దక్షిణేశ్వర వెళ్ళడానికి బండి ఎక్కడానికి సిద్ధపడుతున్న పరమహంసనో కానక్కరలేదు. నీ ఇంటికి వచ్చి నీతో, నీ పిల్లల్తో కొద్దిసేపు గడిపి మళ్ళా వెళ్ళిపోడానికి బయటికి అడుగులేస్తున్న, నీ స్నేహితుడో, నీ స్నేహితురాలో, నీ గురువో, ఒక గాయకుడో, ఒక క్రీడాకారుడో ఎవరో ఒకరు కావచ్చు, ఎవరేనా కావచ్చు.

ఎవరు ఇక వెళ్ళబోతున్నారనగా, ‘అతడు వెళ్ళిపోనున్నాడు, దేవుడా, నేనేమి చేసేది?’ అని నీకు అనిపిస్తుందో, అతడు లేదా ఆమె.

ఉన్నారా అట్లాంటివాళ్ళు?

దేవుడా, ఒక్కరూ కనబడరే.

కవిత చదవగానే నా గుండెని అదిమిపట్టుకుని, ఒక్కసారి వెనుదిరిగి చూసాను. ఒక్క క్షణం, నా గుండెని అట్లా కంపింపచేసిన మనిషి ఎవరేనా, గడచిన మాసం రోజుల్లో నాకు తారసపడ్డారా? అతడు నా పక్కింటికి కాదు, నేరుగా నా ఇంటికేవచ్చిన మనిషి, అతడు వెళ్ళిపోతాడనగానే, నా మనసంతా బేజారైపోయిన కాలం ఒక్క గడియేనా ఉందా? గత మాసం, గడచిన ఆరునెలలు, గడచిన ఏడాది? గడచిన పదేళ్ళు?

మళ్ళీ శోధించుకున్నాను, ఈ సమావేశం ఎక్కడ అయిపోతుందో, ఈ చర్చ ఎక్కడ ముగిసిపోతుందో, ఈ కలయిక ఎక్కడ తెగిపోతుందో, ఈ మనిషి ఎక్కడ వెళ్ళిపోతుందో, ఈ ఊరు, ఈ కొండ, ఈ నది, ఈ అడవి ఎక్కడ దూరమయిపోతుందో అనే ఆవేగంతో, ఉత్తాపంతో, బెంగతో నా గుండె బొంగురుపోయిన ఒక్క రోజేనా ఉందా?

ఈ వెన్నెల రాత్రి, ఈ గోదావరి ఒడ్డు, ఈ చాపరాయి,ఈ నాటకం రిహార్సలు, ప్రపంచాన్ని సమూలంగా మార్చేసే ఈ ప్రణాళిక- ‘ఎటులైన ఇచటనే ఆగిపోనా’ అనిపించిన ఒక్క సందర్భమేనా ఉందా? గత ముప్పై రోజుల్లో? నలభై రోజుల్లో? మూడువందల రోజుల్లో? మూడువేల దివారాత్రాల్లో?

ఏవీ ఆ పుస్తకాలు, ఆ గానం, ఆకాశమంతా అల్లుకున్న ఆ సంధ్యారుణరాగం, ఆ జాజిపూల పందిరి, ఆ సంత, ఆ పంచదార చిలక, ఆ యక్షగానం, ఆ సంక్రాంతిపండగ?

దేవుడా, నేనింత బీదవాణ్ణయిపోయానేమిటి?

29-11-2017

%d bloggers like this: