దూర దుందుభి సంగీతం

Reading Time: 3 minutes

157

రంజాన్ పర్వదినాన ఇస్లామిక దేశాల ప్రాచీన కవిత్వంలో ప్రయాణిస్తూ గడిపేను.

ఇప్పుడు మధ్యాసియాగా వ్యవహరిస్తూన్న ఇరాక్, ఇరాన్, ఈజిప్టు, అరేబియా, జోర్డాన్, సిరియా, లెబనాన్, పాలస్తీనా, ఇస్రాయిల్, టర్కీ, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల కవిత్వం తెలుగులోకి వచ్చింది చాలా తక్కువ. మనకి బాగా తెలిసింది పారశీక సూఫీ కవిత్వమూ, ఇటీవలి కాలంలో పాలస్తీనా విమోచన కవిత్వమూ మాత్రమే. ఆధునిక కవుల్లో కూడా యెహుదా అమిహాయి, మహమ్మద్ దర్వేష్ వంటి అగ్రశ్రేణి కవుల కవిత్వం కూడా తెలుగులోకి వచ్చింది చాలా స్వల్పం.

నా మటుకు నాకు మధ్యాసియా ప్రాంతాల సుసంపన్న ప్రాచీన కవిత్వం గురించి మొదటిసారి Music of a Distant Drum (ప్రిన్స్ టన్ యూనివెర్సిటీ ప్రెస్, 2001) ద్వారానే తెలిసింది. అట్లానే ఆధునిక మధ్యాసియా సాహిత్యం గురించి రెజా అస్లాన్ సంకలనం చేసిన Tablet and Pen (డబ్ల్యు.డబ్ల్యు.నార్టన్ అండ్ కో, 2011) ద్వారా.

Music of a Distant Drum (దూర దుందుభి సంగీతం) లో ఆరబిక్, పర్షియన్, టర్కిష్, హీబ్రూ సంప్రదాయ సాహిత్యాలనుంచి ఎంపిక చేసిన కొన్ని అద్భుతమైన కవితల అనువాదాలున్నాయి. అనువాదకుడు బెర్నార్డ్ లెవిస్ ఆ పుస్తకానికి ఎంతో విలువైన, సమగ్రమైన ముందుమాట కూడా రాసాడు. ఒకప్పుడు యూరోప్ లో స్పెయిన్ నుండి ఆసియాలో ఇండోనీసియా దాకా విస్తరించిన ఇస్లామిక్ సంస్కృతి లో వివిధ ప్రాచీన భాషలు, సంస్కౄతులు ఎట్లా భాగమైపోయాయో, అరమాయిక్, పహ్లవీ లాంటి ప్రాచీన భాషలు అరబీకరణ చెంది కూడా ఆరబిక్ గా మారిపోకుండా తమని తాము ఎట్లా నిలబెట్టుకుంటూ ఉన్నాయో, హీబ్రూ ఒకవైపు యూదీయ-క్రైస్తవ సంస్కృతికి చెందిన భాషగా వికసిస్తూనే మరొకవైపు యూదీయ-ఇస్లామిక్ భాషగా కూడా ఎట్లా కొనసాగిందో, అయినా ఆ భాషలూ, సంస్కృతులూ అన్నీ కలిసి ఒక నవ్య మధ్యాసియా చరిత్రను ఎట్లా సృష్టించాయో అనువాదకుడు ఎంతో ఓర్పుగా, సవివరంగా వివరించేడు.

ఇప్పుడు మధ్యాసియా అంటే బాంబుల మోత మాత్రమే స్ఫురించే కాలంలో ఇటువంటి పుస్తకం చదవడం ఒక కనువిప్పు. పుస్తకం ముగించేటప్పటికి, ప్రాచీన ఈజిప్టు, గ్రీసు, చైనా, భారతదేశాలు సృష్టించిన సంస్కృతికీ, సాహిత్యానికీ ఏ విధంగానూ తీసిపోని ఉజ్జ్వల సాహిత్యాన్నీ, మానవీయ సంస్కృతినీ, దేవుడికీ, మానవుడికీ మధ్య అనుబంధాన్నీ ఆవిష్కరించిన ప్రాంతంగా, ప్రపంచ పటంలో ఒక విశిష్ఠ భూభాగంగా మధ్యాసియా మన కళ్ళ ముందు అవతరిస్తుంది.

మధ్యాసియా సంస్కృతిలో బహుశా పవిత్ర ఖొరాన్ తర్వాత రెండవ స్థానం కవిత్వానిదే అంటాడు సంపాదకుడు. ఆ సమాజంలో కవిత్వానికి ఎటువంటి స్థానం ఉందో తొమ్మిదో శతాబ్దికి చెందిన ఒక అరబ్ రచయిత మాటల్ని గుర్తు చేస్తాడు. ఇబన్ కుతబయా అనే ఆ రచయిత ఇలా అంటున్నాడు:

‘కవిత్వం అరబ్బుల విజ్ఞానఖని. వారి వివేకసర్వస్వం. చరిత్రచుట్ట. స్వర్ణయుగ నివేదిక, తమ వారసత్వాన్ని రక్షించే కోటబురుజు, తమ వైభవాన్ని పరిరక్షించే కందకం. వివాదాలు తలెత్తినప్పుడు నమ్మదగ్గ ఏకైక సాక్షి. వాదవిరమణ వేళ చూపించగల అంతిమ నిరూపణ. ఎవరైతే తమ పూర్వీకుల అత్యున్నత గుణగణాలనూ, గౌరవనీయ కృత్యాలనూ పద్యాలుగా మార్చలేరో వారెంత గొప్పవారు గానీ, ఎంత ప్రముఖులుగానీ, ఆ గొప్పదనమంతా కాలం తాకిడికి కొట్టుకుపోయేదే. ఎవరైతే తమ పూర్వీకుల జీవన ఔన్నత్యాన్ని ఛందోబద్ధం చేస్తారో, లయబద్ధంగా గానం చేస్తారో, అరుదైన ఒక్క వాక్యంలోనైనా వారిని శాశ్వతం చేస్తారో, వారి ఏ మాట ప్రజల నోళ్ళలో నానుడిగా మారిపోతుందో, స్థిరచింతనగా రూపుదిద్దుకుంటుందో, వారు తమ పూర్వీకుల్ని కాలం తాకిడి చెక్కుచెదరకుండా ప్రతిష్టించుకుంటారు, అన్ని రకాల వ్యతిరేకతల నుంచీ కాపాడుకుంటారు, శత్రువ్యూహాల్ని విచ్ఛేదనం చెయ్యగలుగుతారు, అసూయాపరుల్ని తలదించుకునేట్టు చేస్తారు.’

జోర్డాన్ నుంచి అజర్ బైజాన్ దాకా ఈ సంకలనంలో కనిపించే ప్రాచీన మధ్యాసియా కవులు మనిషి గర్వించదగ్గ ప్రతి ఒక్క ఇతివృత్తాన్నీ గానం చేసారు. దేవుడు, వీరుడు, సాఖీ, ప్రేయసి, పూర్వకవి, తండ్రి, తల్లి, పొరుగువాడు- మనిషి జీవించడానికి కారణమైన వాళ్ళూ, జీవిస్తున్న స్పృహని కలిగిస్తున్న ప్రతి అమూల్య క్షణం కూడా ఈ కవితల్లో కనవస్తాయి.

ఈ కవిత్వం చదివాక మధ్యాసియా ఎడారుల్లో,ఒయాసిస్సుల చెంత, ఖర్జూర వృక్షాల నీడల్లో, సార్థవాహ శిబిరాల మధ్య, యూఫ్రటీస్, టైగ్రిస్, జోర్డాన్ నదీపరివాహకప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు అనిపిస్తుంది. పుస్తకం మన దాహం తీర్చకపోగా, మరింత మధ్యాసియా సాహిత్యం కోసం మనం దప్పికపడేట్టు చేస్తుంది.

ఇందులో చోటు చేసుకున్న నాలుగు భాషల నుంచీ నాలుగు ఉదాహరణలు మీ కోసం:

ఆరబిక్

ఇబన్ అల్ అరాబి (1165-1240, స్పెయిన్)

సూర్యనేత్రం నా దృష్టిని పరిపాలిస్తే
ప్రేమ నా ఆత్మలో సుల్తానులాగా కూర్చుంది.
మోహం, తృష్ణ, వేదన, దుఃఖం-
అతడి సైన్యం నా హృదయంలో విడిదిచేసింది
నా హృదయం ఆ సైన్యానికి శిబిరం కాగానే
పేగులు రగిలిపోయేట్టు
బిగ్గరగా విలపించాను
ప్రేమ నా నిద్రను దూరంచేసింది
ప్రేమ నన్ను విహ్వలుణ్ణి చేసింది
ప్రేమ నేను భరించలేనంత బరువు మోపింది
ఇక నాకు దేహమంటూ మిగల్లేదు కాబట్టి
నా ఆత్మనే ప్రేమకి అర్పించేసాను.

పారశీకం

సాదీ (1213-1292, ఇరాక్)

దీపమూ, శలభమూ

నిద్రపట్టని ఒక రాత్రి, నాకు బాగా గుర్తు;
రెక్కలపురుగు మైనపు వత్తితో అంటోంది
‘నేను ప్రేమలో పడ్డాను, కాబట్టి దగ్ధం కావడం సహజం,
నువ్వెందుకిట్లా మండిపోతున్నావు?’

‘అయ్యో, పిచ్చిదానా’ అంది మైనపు వత్తి
‘నా ప్రేయసి మధువు నాకు దూరమైనప్పుడే
నా జీవితంలో మాధుర్యం తొలిగిపోయింది
అప్పణ్ణుంచీ, ఫర్హాద్ లాగా అగ్ని నన్ను కబళిస్తోంది.’

కొవ్వొత్తి మాట్లాడుతున్న ప్రతిమాటకీ
దుఃఖం వరదలాగా ఆ పేలచెంపలమీంచి
ప్రవహిస్తూనే ఉంది.

‘అభం శుభం తెలియనిదానివి నువ్వు, ప్రేమించడం నీకు చాత కాదు
నీకంత ఓపికా లేదు, మంట సెగ తాకిందో లేదో
రివ్వున పారిపోతావు, నేను చూడు
నిశ్చలంగా, సాంతం దగ్ధమయ్యేదాకా నిలబడతాను
నీ రెక్కలకు వేడితగిలితేనే ఎగిరిపోతావు
నేనిట్లా అపాదమస్తకం రగిలిపోతుంటాను
నా చుట్టు పరుచుకున్న వెలుగు చూడకు
నన్ను చూడు, నా హృదయాగ్ని, ఎడతెగని నా కన్నీరు చూడు ‘

ఈ సంభాషణలో సగం రాత్రి గడిచిందో లేదో
ఒక సుందరవదన ఆ కొవ్వొత్తిని ఆర్పేసింది.

అప్పుడు పొగ రేగుతుండగా ఆమె అంది కదా:

‘యువకుడా, ప్రేమ ముగిసేదిట్లానే,
తెలుసుకో, చల్లార్చితేనే అగ్ని శాంతిస్తుంది.’

టర్కిష్

బాకీ (1526-1600, ఓట్టోమాన్ టర్కీ)

నీ చెంపలు నిర్మల జలాలు
నీ చుబుకం ఒక నీటిబుడగ.

నీ కపోల సూర్యకాంతి
తాకుతోంది నా గుండెను
నీటిమీద వెన్నెలగీతలా.

నీ హస్తనైపుణ్యంతో
నా హృదయపుటలనిండా
రంగుల చిత్రాలు.

ఎర్రబడ్డ నా నేత్రాలు
దుఃఖం సిద్ధం చేసిన పానగోష్టిలో
రెండు పాన పాత్రలు.

ఆ చంద్రవదనకోసం మోహం
మొత్తం ప్రపంచాన్ని
సూర్యకాంతిలా చుట్టుముట్టింది

ఓ కవీ, ఏమి చెప్పను?
నీ ప్రేయసి పుట్టుమచ్చ
పరిశుద్ధమైన కస్తూరి.

హీబ్రూ

అబ్రహాం ఇబన్ ఎజ్రా (క్రీ.శ.1090-1167, స్పెయిన్)

ముస్లిములు ప్రేమగురించీ, మోహం గురించీ పాడతారు
క్రైస్తవులు యుద్ధం గురించీ, ప్రతీకారం గురించీ.
గ్రీకులు వివేకం గురించీ, ఉపకరణాల గురించీ పాడితే
హిందువులు నిగూఢకథలగురించీ, చిక్కుప్రశ్నల గురించీను.
ఇస్రాయేలీలు స్తుతించేది మాత్రం
ఈశ్వరుడి గురించీ, అతడి మహిమల గురించే.

7-7-2016

Leave a Reply

%d bloggers like this: