దివ్యానుభవం

297

ప్రతి ధనుర్మాసంలోనూ ఆండాళ్ ని తలుచుకోడం బహుశా నాకు జీవించినంతకాలం కొనసాగే భాగ్యమే. కానీ ఈ సారి ‘తిరుప్పావై’ కాదు, ‘నాచ్చియార్ తిరుమొళి’ గురించి నాలుగు మాటలు రాసుకోవాలనిపించింది.

‘నాచ్చియార్ తిరుమొళి’ అంటే ఒక స్త్రీమూర్తి చెప్పుకున్న చక్కటి మాటలు. వ్యాఖ్యాతలు శ్రీ సూక్తి అంటారు. నేను స్త్రీ సూక్తం అంటున్నాను. అది కేవలం ఒక మంచిమాట లేదా సుందరపదం మాత్రమే కాదు, అది ఆమె ఆత్మనివేదనం. తిరుప్పావై చదివిన ఎన్నో ఏళ్ళకి గానీ నాకు నాచ్చియార్ తిరుమొళి గురించి తెలిసిరాలేదు. మొదటిసారి చదివింది, పి.ఎస్.సుందరం ఇంగ్లీషు అనువాదం The Azhwars: For the Love of God (పెంగ్విన్, 1996) లో. ఆ కావ్యాన్ని చదివిన తర్వాత , ‘వెయ్యేనుగుల ఊరేగింపు’ పేరిట ఆండాళ్ ప్రేమకథ రాయకుండా ఉండలేకపోయాను.

కాని, ఇప్పుడు మళ్ళా సరికొత్త ఇంగ్లీషు అనువాదం Andal, The Autobiography of a Goddess (2015) చదువుతుంటే, ఆండాళ్ భావనా ప్రపంచం మళ్ళా కొత్తగా గోచరిస్తూ ఉంది. ఈ కొత్త పుస్తకంలోఒకటి కాదు, రెండు అనువాదాలున్నాయి. ప్రియ సరుక్కాయి ఛబ్రియ, రవి శంకర్ అనే ఇద్దరు యువకవులు ఎంతో శ్రద్ధతో, ప్రశంసనీయమైన అధ్యయనంతో వెలువరించిన పుస్తకం.

నాచ్చియార్ తిరుమొళిని ని ఈ అనువాదకులు ఒక దేవత ఆత్మకథగా చెప్పడం చాలా చాలా సముచితమైన వివరణ. దాదాపు వెయ్యేళ్ళ కిందటి ఆ స్త్రీమూర్తిని దేవతగా ఎందుకు భావించాలి? శ్రీవైష్ణవసంప్రదాయం ఆమెను దేవతగా కొలుస్తున్నందువల్లనా? అంతకన్నా కూడా ఆమె తన మానుషత్వాన్ని, స్త్రీత్వాన్ని ఉత్సవం చేసుకుని, తన మనోదేహవికాసాలు తనని సంతోషింపచేయడానికి బదులు తీవ్ర వ్యాకులత్వానికి గురిచేస్తే, ఆ వ్యాకులతలో, నిలువెల్లా మునిగి, తేలి, చివరకు తన వేదననుంచి బయట పడి తేలికపడి మళ్ళా తన జీవితాన్నొక ఖేలగా మార్చుకోగలిగినందువల్ల.

అంత మాత్రమే కాదు. ఒక కవి తన సంపూర్ణ ఆత్మనివేదనం చేసుకోడానికి ఎంత కవిత్వం చెప్పవలసి ఉంటుంది? పోతన పన్నెండు స్కంధాల భాగవతం రాసాడు. అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు గానం చేసాడు. త్యాగరాజు ఇరవై వేల కృతులు కూరిస్తే, సూర్ దాస్ ఏకంగా సూర్ సాగరాన్నే భువికి దింపాడు. ఆళ్వారుల్లోనే చూదామంటే, ‘నాలాయిర దివ్యప్రబంధం’లో నాలుగోవంతు నమ్మాళ్వారులదే. ఈ పురుష కవులు ఇంత విస్తారంగా నివేదించుకున్నా కూడా వాళ్ళ ఆత్మవిచారం పూర్తిగా వెల్లడించుకున్నారనలేం. కాని, ‘నాచ్చియార్ తిరుమొళి’ మొత్తం పధ్నాలుగు పాశురాల కావ్యం. ఒక్కొక్క పాశురంలో పది లేదా పదకొండు చొప్పున మొత్తం 143 పద్యాలు. కాని, అంత ప్రగాఢమైన, అంత భావోద్దీపకమైన, అంత ప్రోజ్వలమైన ఆత్మనివేదనం అంత సంగ్రహ కావ్యరూపంలో మరే సాహిత్యంలో కనరాదని చెప్పగలను. అంత సూక్ష్మంగా, అంత తీవ్రంగా, అంత గాఢంగా చెప్పగలిగిన మనిషిని దేవత అని కాక మరేమనాలి?

‘తిరుప్పావై’ లో ఆండాల్ చిన్నపిల్ల. తోటిపిల్లలతో ఆటలాడుకునే పిల్ల. ఆ గీతమాలికలో ఆ పిల్లలంతా కలిసి శ్రీకృష్ణుణ్ణి కోరుకున్నది కలిసి విందారగించాలనీ, మంగళవాద్యమొకటి మనసారా మోగించాలనీ మటుకే. తిరుప్పావై ఒక శుభాకాంక్ష. తనకీ, తన స్నేహబృందానికీ, తన గ్రామానికీ, తన దేశానికీ. ఆ శుభాకాంక్ష లోకానికి శుభాకాంక్షగా మారడంలో ఆశ్చర్యమేముంది?

కాని ‘నాచ్చియార్ తిరుమొళి’ ఒక స్త్రీ ఆత్మకథ. ఒక చిన్నారి బాలికగా మొదలై, ఒక యువతిగా వికసించి, తన దేహం, తన మనసు ఒక స్వామిని, ఒక నాథుణ్ణి కోరుకోడం అనుభవంలోకి వచ్చి, అతడికీ తనకీ పరిణమయమయిందని కల గని, కానీ, ఆ కల్యాణం వాస్తవానుభవం కాక, పట్టలేని దుఃఖంలో, శోకంలో పర్యవసించిన, ఒక భావుకురాలి ప్రణయప్రయాణగాథ. అందులో అన్ని ఋతువులూ ఉన్నాయి, ఉల్లాసం ఉంది, ఉత్సాహం ఉంది, నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, వేడుక ఉంది, వేదన ఉంది. ఇదంతా మొత్తం 143 పద్యాల్లో.

ఆ కావ్యానికొక క్రమం ఉంది. తిరుప్పావై మార్గశిర, పుష్యమాసాల్లో నడిచే కవిత. తిరుప్పావై ముగిసినవేళ నాచ్చియార్ తిరుమొళి మొదలవుతుంది. పుష్యమాఘమాసాల్లో కామదేవుణ్ణి ప్రార్థించడంతో కవిత మొదలవుతుంది. ఆ మొదటి పదికాన్ని ప్రస్తావన అనవచ్చు. రెండవ పదికంలో ఆమె చిన్నబాలిక. స్నేహితురాళ్ళతో కలిసి ఇసుకగుళ్ళు కట్టుకునే పెంబి. ఆ ఇసుకగూళ్ళు కృష్ణుడు భగ్నం చేయడం,ఆమె అతణ్ణి వారించడం తో రెండవ పదికం ముగుస్తుంది. మూడవ పదికానికి ఆమె కౌమారదశలో అడుగుపెట్టింది. గోపికావస్త్రాపహరణ కథని గానం చెయ్యడంద్వారా ఆమె తనని ఒక గోపికగా సంభావించుకుంటుంది. కృష్ణుడు గోపికలకి వస్త్రాలిచ్చి మాయమయ్యాక, అతడి పట్ల ప్రేమలో పడటం, అతణ్ణికలుసుకోగలనో లేదో అని శకునాలు చూడటం నాలుగవ పదికం. ఇక ఆ కృష్ణుడిదగ్గరకి ఒక కోకిలని దూతగా పంపడం అయిదవ గీతం. కృష్ణుడితో తనకి కల్యాణమయినట్టు కలగనడం ఆరవగీతం. (‘వారణమాయురమ్’ అనే ఈ ప్రసిద్ధ గీతాన్ని వెయ్యేళ్ళుగా పెళ్ళిపందిళ్ళలో గానం చేస్తూనే ఉన్నారు.) ఇక ఆ తర్వాత కృష్ణుడి శంఖంతో, శ్రావణమేఘాలతో, ఆరుద్రపురుగులు కమ్ముకున్న వానాకాలపు పూలతో, పక్షులతో, తుమ్మెదలతో, సరసులతో, చివరికి సిగ్గు విడిచి తన తల్లితో, బంధువులతో, తన గ్రామస్థులతో మొరపెట్టుకోవడం పన్నెండవ పదికందాకా నడుస్తుంది.

తనని కృష్ణుడిదగ్గరకు చేర్చలేకపోతే తాను బతకలేనని చెప్పడం, ఆ విరహవిహ్వలత్వంలో భరించలేక, ఆ గోవర్ధనుడు కనిపిస్తే తన నిష్ఫల వక్షోజద్వయాన్ని సమూలంగా పెళ్ళగించి అతడి రొమ్ముమీద విసిరికొడితే తప్ప తనకి శాంతికలగదని చెప్పడం పదమూడవ పదికం. ఇక్కడికొచ్చేటప్పటికి ఈ ప్రేమకవిత అసాధారణ స్వరాన్ని సంతరించుకుంది. స్తనాల్ని పెరికి విసిరివెయ్యడమనే ఈ ఊహ వెనక, సంగంకాలం నాటి కావ్యం ‘శిలప్పదికారం’ లోని కణ్ణగి ఉంది. కాని, కణ్ణగిది ఆగ్రహం. ఇది ఆగ్రహం కాదు, ప్రేమోద్రిక్తతలోని నిస్త్రాణ. మీరాబాయి, లల్ల, రబియా, ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, సిల్వియా ప్లాత్-ప్రపంచంలోని మరే కవయిత్రి కూడా తన ప్రేమోద్రిక్తతలో ఇంత పతాకావస్థకు చేరుకున్న క్షణం లేదు. తన మానుషప్రేమని, తన femininity ని ఇంత నిస్సంకోచంగా, ఇంత బాహాటంగా, ఇంత బిగ్గరగా వెల్లడించుకున్న ఉదాహరణ, చివరికి, ‘శాఫో’ లో కూడా మనకి కనిపించదు.

కాని కావ్యం ఇక్కడ ముగిసిపోలేదు. ఆశ్చర్యంగా, పధ్నాలుగవ పదికం అంటే చివరి పదికంలో మళ్ళా ఆండాళ్ చిన్నపిల్లగా మారిపోతుంది. తిరుప్పావై రోజులకన్నా చిన్నపిల్లగా. ఉల్లాసభరితురాలిగా మారిపోతుంది. పదమూడవ పదికంలో వేడినిట్టూర్పులు చిమ్మిన ఆ మోహోద్రిక్త వనిత ఎక్కడ? ఈ పసిపాప ఎక్కడ? మధ్యలో ఎమి జరిగింది?

నాచ్చియార్ తిరుమొళి సంగం కవిత్వం పాదులో వికసించిన కవిత్వం. కాని సంగంకవిత్వానికి అలంకారశాస్త్రంగా చెప్పదగ్గ ‘తొల్కాప్పియం’ విధించిన నియమాలను ఉల్లంఘిస్తూ చెప్పిన కవిత. ఉదాహరణకి, స్త్రీపురుషుల మధ్య వికసించగల ఏడు రకాల ప్రేమావస్థల్లో, తొల్కాప్పియం రెండు రకాల అవస్థల్ని కావ్యవస్తువులుగా తీసుకోడాన్ని నిషేధించింది. అందులో పెరుంతిణై, అంటే, పొసగని ప్రేమ ఒకటి. ఒకవైపే ప్రేమ ఉండి రెండోవైపు ప్రతిస్పందన లేని ప్రేమ అన్నమాట. నాచ్చియార్ తిరుమొళిలో పదమూడో పదికందాకా ఉన్నది పెరుంతిణై. అంటే ఏకపక్ష ప్రేమ. కాని చివరిగీతానికి వచ్చేటప్పటికి, ఏదో సంభవించింది. ఆ తుపాను సమసిపోయింది. ఆ అగ్ని చల్లారి, ఆ నల్లటిరాత్రులు గడిచి తెల్లవారినంత సంతోషప్రదంగా, మంగళాంతంగా ఆ కావ్యం ముగుస్తుంది. అది మామూలు మానవ అనుభవానికి సాధ్యమయ్యే శాంతికాదు, గొప్పసమాధానమేదో దొరికిన దివ్యానుభవం అని మనకు గ్రహింపుకొస్తుంది.

29-12-2017

Leave a Reply

%d bloggers like this: