దివ్యమధుర చేష్ట

Reading Time: 3 minutes

168

ఈ మధ్య కాకినాడ వెళ్ళినప్పుడు అక్క దగ్గర ‘ఉదయిని’ పత్రిక పాతసంచికలు చూసాను. భీమవరానికి చెందిన చెరుకువాడ వెంకటరామయ్య అనే ఒక మహనీయుడు ఇచ్చాడట ఆ పుస్తకాలు. 1935-36 లో కొంపెల్ల జనార్దన రావు తెచ్చిన పత్రికలు. ఏడు పత్రికల్లో చివరి నాలుగూ అవి. మొదటిసారి చూడటం వాటిని.(వాటి గురించి మరోసారి.)

వాటిని తిరగేస్తూనే నాలుగవ సంచికలో ‘కుందమాల’ నాటకంలో సీత పైన విశ్వనాథ సత్యనారాయణగారి వ్యాసం కనబడింది. ఆ వ్యాసం విశ్వనాథ వారి పుస్తకాల్లో ఎక్కడా చూసినట్టు గుర్తులేదు నాకు. ఆ రాత్రే రైల్లో చదివేసాను ఆ వ్యాసం.

కుందమాల నాటకం నేను చదవకపోలేదు. ఎన్నో ఏళ్ళ కిందట. తెలుగు అనువాదం. కానీ, కుందమాల అనే కాదు,ఏ సంస్కృతనాటకమైనా తెలుగులో చదవడం చదివినట్టేకాదని నాకు మరోసారి రూఢి అయింది.

ఆ నాటకానికి సంస్కృతమూలంతో పాటు ఇంగ్లీషు అనువాదం (1937), బులుసు వెంకటేశ్వర్లు గారి తెలుగు అనువాదం (1947) రెండూ నెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మరోమారు ఆ తెలుగు అనువాదం చదివాను. నేనింతకు ముందు చదివింది కూడా బులుసు వెంకటేశ్వర్లుగారి అనువాదమే అని అర్థమయింది. దీర్ఘకాలంగా ఎవరూ చూసి ఉండని ఆ నాటకాన్ని 1923 లో మానవల్లి రామకృష్ణ కవి ప్రాచీన తాళపత్రాల్లోంచి పైకెత్తి పరిష్కరించి ప్రకటించేక మొదటి ఇంగ్లీషు అనువాదం 1932 లో వచ్చింది. ఆ ఏడాదే వడ్డాది సుబ్బరాయకవి తెలుగు అనువాదం కూడా వచ్చింది. ఆ తర్వాత పది పదిహేనేళ్ళుకాకుండానే ఆ నాటకం తెలుగులోకి నాలుగుసార్లు అనువాదం కావడం నిజంగా అభినందించదగ్గ విషయం. బులుసువారు భావుకుడు కాకపోయినప్పటికీ, కావ్యసౌకుమార్యాన్ని కాపాడగల సున్నితమైన భాష ఆయనకు లేకపోయినప్పటికీ, విశ్వనాథ ప్రసరించిన వెలుతురులో, ఈ సారి ఆ నాటకాన్ని నేను తెలుగులో చాలామేరకు ఆనందించగలిగాను.

కాని, కవిత్వాన్ని పండితులు బోధించకూడదు, భావుకులు బోధించాలని మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు ఎందుకు అంటూండేవారో మరోసారి తెలిసివచ్చింది. పువ్వులాంటి సున్నితహృదయులతో కలిసి చదువుకోవలసిన నాటకమది.

కుందమాల రాసిన దిజ్ఞాగుడి గురించి ఇప్పటికీ విశ్వసనీయమైన వివరాలేమీ సేకరించలేకపోయారు. అతడు తన నాటకంలో పేర్కొన్న అరారాలపురం ఎక్కడుందో తేల్చుకోలేకపోయారు. ఇప్పటిదాకా నిశ్చయంగా చెప్పగలిగిందల్లా అతడు కాళిదాసుకి సమకాలీనుడనీ, కాళిదాసుకే ఈర్ష్య కలిగించగల ప్రతిభావంతుడనీ మాత్రమే. దిజ్ఞాగుడనే ఒక ప్రసిద్ధ బౌద్ధ తార్కికుడున్నాడుగానీ, ఒక బౌద్ధుడు రామకథని నాటకంగా ఎందుకు రాసాడు, అందులోనూ గణేశస్తుతితో ఎందుకు మొదలుపెడతాడన్నదానికి సరైన సమాధానం లేదు. అయితే, కాళిదాసుమీద అశ్వఘోషుడు చూపించిన ప్రభావంలాంటిదే, భవభూతిమీదా, ముఖ్యంగా ఉత్తరరామచరిత్ర నాటకం మీదా దిజ్ఞాగుడు చూపించాడని పండితులు అంగీకరిస్తున్నారు.

సంస్కృతనాటకర్తలకి రామకథ ప్రధాన ఇతివృత్తం. కాళిదాసు రామకథని నాటకంగా రాయకపోయినా రఘువంశ మహాకావ్యం రాసాడు. ఇక భాసుడు, మురారి, భవభూతి వంటి వారి రామాయణనాటకాలు ప్రసిద్ధాలే. ఆ కోవలోనే దిజ్ఞాగుడు కూడా వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో సీతాపరిత్యాగాన్ని తీసుకుని నాటకంగా మలిచాడు. కాని సాంప్రదాయిక కావ్యమర్యాదని అనుసరించి ఆ నాటకాన్ని ప్రమోదంతో ముగించాడు. రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు సీతని గంగానది ఒడ్డున అడవిలో ఒంటరిగా విడిచిపెట్టడంతో మొదలైన నాటకం, వాల్మీకి సమక్షంలో సీతారాములు తిరిగి కలుసుకోవడంతో నాటకం ముగుస్తుంది. ఆరు అంకాల నాటకంలో మొదటి, చివరి అంకాలు మాత్రమే కథ. సీతని రాముడు విడిచిపెట్టడంలోగాని, వాళ్ళు తిరిగి కలుసుకోవడంగాని నాటకకర్త దృష్టిలో కథకి ఆద్యంతాలు మాత్రమే. అతడి హృదయమంతా రెండవ అంకం నుంచి అయిదవ అంకందాకా సున్నితంగానూ, తీవ్రంగానూ స్పందిస్తూండటం మనకి స్పష్టంగా వినబడుతుంది.

ఆ నాటకాన్ని అతడు సీతచుట్టూ, ఆమె మానుషత్వం చుట్టూ అల్లాడని ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంది. ఈ తెలివిడికి విశ్వనాథ వ్యాసం చదవడం ఎంతవరకూ కారణమో, లేక నా జీవితంలో వయసుతో సంక్రమించే మానవసంబంధాల పరిజ్ఞానం ఎంతవరకూ కారణమో చెప్పలేను. కాని, ఆ నాటకం (ఆ బలహీనమైన తెలుగు అనువాదం) పూర్తి చేసిన తరువాత కూడా ఇంకా నన్నా మల్లెపూల మెత్తని తావి ఆవరించే ఉంది.

కుందమాల అంటే మల్లెపూల మాల అని అర్థం. కుందం అంటే భూమిని పెకలించుకుని వచ్చేదని వ్యుత్పత్తి. సీత కూడా భూమిని పెకలించుకు పుట్టిందే. నాటకంలో ఆమె తనకు సుఖప్రసవమైతే రోజూ ఒక మల్లెమాల అల్లి గంగానదికి సమర్పిస్తానని మొక్కుకుంటుంది. నాటకంలో తరువాతి అంకాల్లో వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన రాముడికి సీతకన్నా ముందు ఆ మల్లెమాలనే కనిపిస్తుంది.

భూమిని పెకలించుకు వచ్చిన సీత రామాయణ నాటకాల్లో దేవతామూర్తిగా మారిపోవడం కనిపిస్తుంది. కాని దిజ్ఞాగుడి విశిష్టత ఎక్కడుందంటే అతడు ఆమెని అంటిపెట్టుకున్న ఆ మట్టివాసన చెదిరిపోకుండా చూసుకున్నాడు. అతడు చిత్రించిన సీత ఒక మనిషి. నిస్సహాయ, నిర్దోషి సరే, ప్రేమ, ఇష్టం, ఉద్వేగం, ఉక్రోషం అన్నీ కలగలిసిన నిండు మనిషి. ఆ నాటకం పొడుగునా మనమొక నిజమైన స్త్రీని చూస్తున్న హృదయావేగానికి లోనవుతాం. ఆ ఆవేగాన్ని తట్టుకోలేకనే విశ్వనాథ అంత వ్యాసం రాసాడు.

ఆయన తన వ్యాసంలో ఎత్తిచూపిన సన్నివేశాలు, సంభాషణలు నన్ను నిశ్చేష్టుణ్ణి చేసినమాట నిజమేగాని, నాటకం పూర్తిగా చదివాక, విశ్వనాథ వ్యాసం లో చూపినదానికన్నా ఆ సీత మరింత సుస్పష్టంగానూ, సువిదితంగానూ నా కళ్ళముందు కనిపించింది.

అయినప్పటికీ, ఆయన ఎత్తి చూపిన ఉదాహరణలే రెండు మూడు ప్రస్తావిస్తాను.

ఆశ్రమంలో సీతకు, వేదవతి అనే ఒక తాపసికి మధ్య జరిగిన సంభాషణ:

వే: అట్లా నీమీద ఆపేక్షగాని, దయగాని లేని వాడికోసం నువ్వెందుకు కృష్ణపక్ష చంద్రరేఖలాగా రోజురోజుకీ చిక్కిపోతున్నావు?
సీత: అతడు దయలేనివాడా?
వే:లేకపోతే నిన్నెందుకు వదిలిపెడతాడు?
సీత: నన్నతడు వదిలిపెట్టాడా?
వే:లోకం ఆమాటేకదా అంటోంది.
సీత: శరీరంచేత వదిలిపెట్టాడు. కాని హృదయంలో కాదు.
వే: బయటివాళ్ళ హృదయమెటువంటిదో నీకు తెలుస్తుందా?
సీత: అతడు నాకు బయటివాడా?

ఇద్దరు ప్రేమికులు సామాజికకారణాల వల్ల దూరమయినప్పటికీ, వాళ్ళ మధ్య ప్రేమ పదిలంగా ఉన్నప్పుడు, ఉందని వారిద్దరికీ నెమ్మదిగా తెలిసివస్తున్నప్పుడు, వాళ్ళెట్లాంటి మాధుర్యవిషాదాలకి లోనవుతారో మూడు, నాలుగు అంకాల్లో అడుగడుగునా కనిపిస్తుంది. ఆ మాధుర్యాన్ని కవి సీత హృదయంతో అనుభూతి చెంది మనకి నివేదిస్తున్నాడని అర్థమవుతుంది.

ఉదాహరణకి, ఆశ్రమంలో దిగుడుబావి దగ్గర రాముడు అలసినిద్రిస్తున్నప్పుడు, సీత అతడికి తెలియకుండా, అతడి పైన తన ఉత్తరీయం కప్పుతుంది. రాముడికి మెలకువ వచ్చాక ఆ ఉత్తరీయం సీతదని గ్రహిస్తాడు. ఆ ఉత్తరీయాన్ని వదలలేక తన ఉత్తరీయాన్ని అక్కడ విడిచిపెడతాడు. అతడక్కడనుంచి వెళ్ళిపోయాక సీత ఆ ఉత్తరీయాన్ని తన చుట్టూ కప్పుకుంటూ ఆ వస్త్రానికి ఏ పూలవాసనా లేకపోవడం చూసి తాను లేకపోయినా రాముడు మరొక స్త్రీని చేరదీయలేదని గొప్ప పారవశ్యానికి లోనవుతుంది. ఆ సన్నివేశం గురించి విశ్వనాథ ఇట్లా రాస్తున్నాడు:

‘ఒక విచిత్ర సంవిధానము చేత సీతారాముల యుత్తరీయములకు వినిమయము జరిగినది. రాముని యుత్తరీయము పుష్పవాసనలేనిదై యుంట జూచి సంతోషించి ‘సర్వధా సత్యసంధా రాఘవాః’ అని యొక అమాయికపుటానంద మనుభవించుచున్నది సీత. రాముని చిత్తవృత్తి యంత సర్వంకషముగా నిరిగిన యామె కిది కొత్త విషయము కాదుకదా. ఇట్లుద్వేగిని యగుట యేల? వ్యక్తికి విషయజ్ఞానము వేరు, అనుభవము వేరు.’

ఇక అన్నిటికన్నా మధురమైనది, లవకుశులు రామాయణగీతగానానికి రాముడిదగ్గరికి వెళ్ళబోతున్నప్పటి దృశ్యం. అది కూడా విశ్వనాథ మాటల్లో:

‘కుశలవులిద్దరిలో కుశుడు కొంచెము గడుసు. రామచంద్రుని కడకు వారిరువురు రామాయణము పాడుటకు పోవువేళ సీత కాకపక్ష గ్రహణ సంజ్ఞచేత లవుని పర్ణశాలలోనికి తీసుకుపోయి తాపసజనులమధ్య అతనిని కౌగలించుకుని శిరసు మూర్కొని సీత్కార లక్షిత స్మిత మధురముగా నెమ్మది నెమ్మదిగా తన చెవినుండి కర్ణపత్రమును లాగుకొనుచు తన ముఖముతో లవుని ముఖము కప్పి ‘నాయనా , మీకు స్వాభావికమైన గర్వము వదిలి మహారాజునకు నమస్కరించుడు. ఆయనను కుశలమడుగు ‘డని చెప్పెను. ఈ దివ్యమధుర చేష్ట లోకాతిశాయిరమణీయముగ ఉన్నది.’

నాటకం చదవడం పూర్తిచేసిన తరువాత కూడా, ఇప్పటికీ, తన కుమారుడిముఖాన్ని తన ముఖంతో కప్పి, తన చెవికమ్మ సుతారంగా లాక్కుంటూ, మీరాయనకి నమస్కరించండి అని చెప్తున్న ఆ ప్రేమమూర్తినే నా కళ్ళముందు కదలాడుతున్నది. ప్రేమకథలు రాయాలంటే అట్లాంటి హృదయంతో కదా రాయాలి!

16-2-2017

2 Replies to “దివ్యమధుర చేష్ట”

Leave a Reply

%d bloggers like this: