అందరికీ హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు.
ఉగాది వస్తోందనగానే కొన్నేళ్ళుగా మిత్రుడు రమేష్ కైరంకొండ నన్నొక బైట్ ఇమ్మని అడుగుతూంటాడు. తెలుగు సాహిత్యంలో వసంతాన్ని కవులెట్లా వర్ణించేరో చెప్పమంటాడు. ఒకప్పుడు ఆ ప్రశ్న కవితాప్రసాద్ ని అడగమనేవాణ్ణి.
ఈరోజు వసంతం ముంగిట్లోకి వచ్చి వాలినవేళ, కిటికీలోంచి పసుపుపూల ప్రభాతం పలకరిస్తున్నవేళ కొన్ని పద్యాలు మదిలో మెదులుతున్నాయి. వాటినిట్లా మీతో పంచుకోవాలని.
వసంతాన్ని చిత్రకారుడైతే రంగుల్లో చిత్రిస్తాడు. కాని నన్నయ వసంతాన్ని తుమ్మెదల ఝుంకారంతో చిత్రించాడు. నన్నయ గురించి ఎప్పుడు ప్రసంగించినా మా మాష్టారు ఈ రెండు పద్యాల్తోనూ తన ప్రసంగం ముగించేవారు. ఈ పద్యాలు లయగ్రాహి అనే వృత్తంలో రాసినవి. ఈ వృత్తం గురించి జె.కె.మోహనరావుగారి వంటి పెద్దలు చెప్పాలి. కాని ఈ పద్యాలు వినగానే మనని తుమ్మెదల ఝుంకారం ముసురుకుంటుంది.
1
కమ్మని లతాంతములకుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీతనినదమ్ములెసగెం చూ
తమ్ములసత్కిసలయమ్ముల సుగంధిముకుళమ్ములనునానుచును ముదమ్మొనరవాచా
లమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచువిన్చె ననిశమ్ముసుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములను చంపక చయమ్ములును గింశుక వనమ్ములును నొప్పెన్
(ఆది:5:138)
2
చందనతమాలలతలందు అగరుద్రుమములందు కదళీవనములందు లవలీ
మాకందతరుషండములయందు అనిమీలదరవిందసరసీవనములందు వనరాజి
సందళిత పుష్పమకరందరసముందగులుచుందనుపు సౌరభమునొంది జనచిత్తా
నందముగ ప్రోషితులడెందములలందురగమందమలయానిలమమందగతివీచెన్
(ఆది: 5:139)
నన్నెచోడుడు నన్నయ తరువాత కవి. తొలి దేశి కవి. కొండలమీంచి, అడవులమీంచి వసంతావతరణ ఎట్లా ఉంటుందో ఇలా చెప్పాలంటే ఆ కవికి నిజంగానే కాలం తెలిసి ఉండాలి, దేశం చూసి ఉండాలి.
3
పొన్నలు పూచె పొన్నలొగి పూవకముందర పూచె గోగులా
పొన్నలు కొండగోగులును పూవకముందర పూచె బూరువుల్
పొన్నలు కొండగోగులును బూరువులున్నొగి పూవకుండగా
మున్న వనంబునంగలయ మోదుగులొప్పుగ పూచె నామనిన్ (కు:4:91)
తెలుగుకవిత్వంలో నిజమైన వసంతం పెద్దనతోటే ప్రవేశించింది. అంతకుముందు పిల్లలమర్రి పినవీరభద్రుడు, శ్రీనాథుడు శృంగార శాకుంతలం, శృంగార నైషధం ల ద్వారా తెలిమంచుతెరలు తొలగించగానే వసంతుడు పెద్దన కవిత్వంద్వారా తెలుగుసాహిత్యవీథిలో ఊరేగాడు. వసంతమంటే ఏమిటి? చిగురించడమే కదా. అంతదాకా ఎండిపోయిన పత్రవృంతాల్లో కొత్త చిగురు ఎట్లా తలెత్తిందో పెద్దన చెప్పిన ఈ పద్యం ప్రపంచసాహిత్యంలోనే ఒక అపూరూపమైన పద్యం అనిపిస్తుంది నాకు. ఇందులో భాష కొత్తది, ఆ భావన కొత్తది, ఆ రంగులు కొత్తవి.
4
సొనతేరి పొటమరించి నెరె వాసినయట్టి
ఆకురాలపుగండ్లయందు తొరగి
అతి బాలకీరచ్ఛదాంకురాకృతి పొల్చి
కరవీరకోరకగతి క్రమమున
అరుణంపు మొగ్గలై అరవిచ్చి పికిలి ఈ
కలదండలట్లు గుంపులయి పిదప
రేఖలేర్పడగ వర్ధిలి వెడల్పయి రెమ్మ
పసరు వారుచు నిక్క పసరు కప్పు
పూట పూటకు నెక్క కప్పునకు తగిన
మెరుగు నానాటికిని మీద గిరి కొనంగ
సోగయై ఆకువాలంగ చొంపమగుచు
చిగురు తళుకొత్తె తరులతాశ్రేణులందు (మ:6:27)
(చెట్టుకొమ్మలమీంచి ఆకులు రాలిన గండ్లలో అంతదాకా స్రవిస్తున్న లేతరసం తేటపడి అక్కడ ముందు పొటమరించి, చిన్ని గుడ్డునుంచి బయటపడుతున్న చిన్ని చిలుకరెక్కల్లాగా రూపుదిద్దుకుంటూ, ఆ పైన ఎర్రగన్నేరు మొగ్గల్లాగా అరవిచ్చి, పికిలిపిట్టల ఈకలదండలాగా ఈనెలు తీరుతూ, చిన్నకొమ్మ పసరువారుతూ పూటపూటకీ చిక్కటిఛాయ ఎక్కుతుండగా, ఆ నీడకు తగ్గ మెరుపు కూడా సంతరించుకుంటూ రోజురోజుకీ మరింత పొడవై వేలాడుతూ చెట్ల కొమ్మల గుబుర్లమధ్యలో చిగురు తలెత్తిమెరిసింది.)
పెద్దనదే మరొక పద్యం, మా మాష్టారి నోట మొదటిసారి విన్నప్పుడు మిత్రులమంతా సున్నితమైన అశాంతికి లోనైనప్పుడు గోదావరి గాలి మమ్మల్ని సేదదీర్చిన క్షణాలు నేనెప్పటికీ మరవలేను.
5
చలిగాలి బొండుమల్లెల పరాగము రేచి
నిబిడంబు సేసె వెన్నెలరసంబు
వెన్నెల రసముబ్బి వెడలించె దీర్ఘికా
మందసౌగంధిక మధునదంబు
మధునదంబెగబోసె మాకందమాలికా
క్రీడానుషంగి భృంగీరవంబు
భృంగీరవంబహంకృతి తీగెసాగించె
ప్రోషితభర్తృకా రోదనముల
విపిన వీథుల వీతెంచె కుపితమదన
సమదభుజ నత సుమ ధనుష్టాంకృతములు
సరస మధుపాన నిధువనోత్సవ విలీన
యువతి యువకోటి కోరికల్ చివురులొత్త.(మ.6:29)
(చలిగాలికి బొండుమల్లెల పరాగం రేగి వెన్నెలరసాన్ని చిక్కబరిచింది. వెన్నెల రసం ముంచెత్తడంతో దిగుడుబావుల్లో ఎర్రకలువల మకరందం పొంగిపొర్లింది. ఆ తేనెసోనకి తియ్యమామిడి గుబుర్లలో ముసురుకున్న తుమ్మెదల ఝుంకారం మరింత దట్టమైంది. ఆ సంగీతం వినగానే దూరదేశం వెళ్ళిన తమ భర్తలు గుర్తొచ్చి స్త్రీలు కంటతడి పెట్టుకున్నారు. ఇష్టమయినవాళ్ళ ఎడబాటు వల్ల కలిగే దుఃఖం మీద మన్మథుడు తన పూలబాణాలు పదునుపెట్టుకున్నాడు. మధుపానంతోనూ, ప్రేమోత్సవంలోనూ మత్తెక్కిన యువతీయువకుల కోరికలు కుపితమన్మథుడి ధనుష్టంకారం వల్ల కొత్త చిగుర్లు తొడిగాయి.)
29-3-2017
Painting: Abanindranath Tagore