ఒకప్పుడు ఆర్. ఎస్.సుదర్శనం గారు తెలుగులో కవితాత్మకమైన నవల రావాలని రాసారు. కావ్యంలాగా ఉందన్నకారణం వల్లనే ఆయన ఏకవీర ను ఎంతో ప్రస్తుతించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా ప్రభావితం చేసాయి. ఆ స్ఫూర్తితో నేను కూడా రెండు మూడు నవలలట్లా రాసానుగాని, అవి ప్రచురణకు పోలేదు. అది వేరే సంగతి.
కానీ తెలుగు సాహిత్యం మీద వాస్తవికతావాదం మోపిన బరువు వల్ల సంభవించిన పెద్ద నష్టం, ఆదర్శవాదప్రధానంగా చెప్పుకోదగ్గ రచనలేవీ రాకపోవడం. ఇప్పుడెవరేనా 15-25 ఏళ్ళ యువతీయువకులు తెలుగులో చదవడానికి నవలలేమైనా ఉన్నాయా అని అడిగితే, వాళ్ళకు సూచించడానికి నాకే నవలా కనిపించదు. అప్పుడప్పుడే జీవితంలోకి తలెత్తి చూస్తున్న ఆ చిన్నారి హృదయాలకు ఒక నిర్మల ఆదర్శాన్నో, స్వప్నాన్నో, ఆశయాన్నో చూపించదగినట్టుగా ఉండే తెలుగు నవల ఏదన్నా ఉందా? ఉంటే చెప్పండి. కాని నా మటుకు నాకు ‘అమ్మ’, ‘ఆరణ్యక’, జమీల్యా’, ‘మట్టిమనుషులు’ వంటి నవలలు తప్ప తెలుగు నవలలేవీ స్ఫురించవు.
మీరనవచ్చు. ‘అసమర్థుని జీవయాత్ర’ అని. ఆ నవల గొప్ప నవల కావొచ్చేమోగాని, 16-17 ఏళ్ళ యువకుడు చదవవలసిన నవల కాదు. నా పదహారవ ఏట, ఒక మిట్టమధ్యాహ్నం వేళ, గుంటూరు బస్టాడ్ లో ఆ నవల కొనుక్కుని ఆ బస్ ప్రయాణం పూర్తయ్యేలోగా పూర్తి చేసేసాను. కాని ఆ నవల కు బదులు, ఆ లేతవయసులో ఒక ‘అమృతసంతానం’ నా చేతుల్లోకి వచ్చి ఉంటే ఎంతబావుండేది!
నా హైస్కూలు రోజుల్లో నేనట్లాంటి ఒక నవల చదివాను. ప్రసిద్ధ మరాఠీ రచయిత, జ్ఞానపీఠ సమ్మానితుడు వ్యంకటేశ మాడ్గూళ్కర్ రాసిన ‘బన్ గర్ వాడి’. ఆ నవల నా రక్తంలోకీ ఇంకిపోయింది. నా తదనంతర జీవితంలో నేను గ్రామీణ, గిరిజనాభివృద్ధి రంగాల్ని నా కార్యక్షేత్రంగా ఎంచుకోవడానికి ఆ నవలనే నూటికి నూరుశాతం కారణమని నమ్ముతాను.
‘చివరకు మిగిలేది ‘, ‘మైదానం’, వేయిపడగలు’ ప్రభవించిన సాహిత్యం ఎంతో గొప్పది, సందేహం లేదు. కాని అప్పుడప్పుడే కౌమరావస్థనుంచి నవయవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతీయువకులు చదవడానికి పుస్తకాలు సూచించమంటే ఒక ‘గోరా’, ఒక ‘పథేర్ పాంచాలి’ మాత్రమే సూచించాలనిపిస్తుంది నాకు.
ఇప్పుడు థియోడర్ స్టార్మ్ రాసిన The Lake of the Bees (హెస్పెరస్, 2003) చదవగానే మళ్ళా ఈ ఆలోచనలే నన్ను ముప్పిరిగొన్నాయి. తెలుగు నవలాసాహిత్యం ఏది కోల్పోయిందో మరొక్కసారి స్ఫురించి చాలా దిగులు కమ్మింది.
స్టార్మ్ (1817-1888) పందొమ్మిదో శతాబ్ది జర్మన్ రచయితల్లో అగ్రశ్రేణి రచయిత, కవి. జర్మన్ వచనసాహిత్యంలో poetic realism (కవితాత్మక వాస్తవికత)అనే తరహా సాహిత్యం సృష్టించాడు. యాభైకి పైగా రాసిన ఆయన నవలికల్లోంచి The Lake of the Bees (తేనెటీగల కొలను, 1850), A Quiet Musician (నిశ్శబ్ద సంగీతకారుడు, 1875) అనే రెండు నవలికల అనువాదాలు.
ఆ నవలికల్ని స్టార్మ్ హంసతూలికతో రాసాడనిపించింది. కేవలం శైలి మాత్రమే కవితాత్మకం కాదు, ఆ కథనం, ఆ కథనం వెనక స్పందిస్తున్న హృదయం కూడా కుసుమకోమలాలే.
ఏవీ ఇట్లాంటి రచనలు తెలుగులో? కవిత్వం కాదు, నేను కోరుకుంటున్నది రొమాంటిసిజం కూడా కాదు. కాని చలంగారే ఒక ఉత్తరంలో రాసినట్టుగా గొప్ప సాహిత్యం నేలమీంచి ఒక్కడుగు పైకి లేవాలి, లేకపొతే అది మరీ నేలబారుగా ఉండిపోతుంది.
పదహారేళ్ళ నవయవ్వనంలో అకారణంగా ప్రేమలో పడ్డ యువతి హృదయాన్నో, అట్లాంటి ప్రేమకోసం ఏమి చెయ్యడానికైనా సిద్ధపడే యువకుడి నిస్వార్థాన్నో చిత్రించే నవల ఏదన్నా ఉందా తెలుగులో? కొత్తగా ఉద్యోగం దొరికిన ఒక స్త్రీ, ఒక దళితుడు, పోస్ట్ గ్రాడుయేషన్ కోసం ఒక యూనివెర్సిటీలో చేరిన గిరిజన యువకుడు, ఆ మాటకొస్తే ఏ పల్లెటూరి యువకుడైనా సరే, అతడి ఆశావహ స్వప్నాల గురించిన నవల ఏదన్నా ఉందా తెలుగులో? (కొడవటిగంటి ‘చదువు’ అనవద్దు, అది నా దృష్టిలో నవల కానే కాదు).
స్టార్మ్ ని చదివాక పదేపదే ఆలోచిస్తే తెలుగులో నాలుగైదు నవలలు కనిపించకపోలేదు. చలంగారి ‘మార్తా’, అడివి బాపిరాజు ‘తుపాను’, తెన్నేటిసూరి ‘చెంఘిజ్ ఖాన్’, డా.కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’, మధురాంతకం మహేంద్ర ‘స్వర్ణసీమకు స్వాగతం’- ఇంకా ఏవన్నా ఉన్నాయా?
కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టిన ఒక సమూహం లేదా ఒక సహకార సంఘం, కలిసికట్టుగా జీవిస్తున్న ఒక సమష్టి కుటుంబం, లేదా ఒక సమష్టికుటుంబం నుంచి విడిపోయి, జీవితం మొదలుపెట్టిన ఒక చిన్నకుటుంబం, లేదా ఒక రైతాంగ పోరాటం సాధించిన తొలివిజయం, ఒక పీడిత పక్షపాతి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలుపొందిన వైనం, కొత్తగా ఒక ప్రాథమిక పాఠశాలలో చేరిన ఉపాధ్యాయుడు ఆ పాఠశాలని సంతోష చంద్రశాలగా మార్చాలని తపించడం, ఒక బసివినో, జోగినినో చదువుకుని తనకి నచ్చినవాణ్ణి పెళ్ళిచేసుకున్న వైనం-ఏదన్నా గానీ, జీవితం పట్ల ఒకింత ప్రేమ, మానవసంబంధాల పట్ల ఒకింత మమకారం, రేపటి గురించి ఎదురుచూడగల ఒకింత ఉత్సాహం వీటిని రేకెత్తించగల నవలలేమన్నా తెలుగులో ఉంటే చెప్పరా, చదవాలని ఉంది.
11-2-2016