తెలుగువాళ్ళ సాహిత్యతీర్థక్షేత్రం

163

మూడు వారాల కిందట అనంతపురం వెళ్ళినప్పుడు కదిరి ప్రాంతంలో ఒక గిరిజనతండాను వెతుక్కుంటూ వెళ్తుండగా, ఎవరో ‘ఇక్కడే కటారు పల్లె, వేమన సమాధి చూసారా?’ అనడిగారు.

కటారుపల్లె గురించి ఎప్పుడో విన్నదీ, చదివినదీ ఒక్కసారిగా మరపుమూత తెరుచుకుని బయటకి వచ్చింది.

వేమన తిరుగాడిన చోటుకి అంతదగ్గరలో ఉన్నానని తెలియగానే క్షణం పాటు చెప్పలేని వివశత్వం కూడా కలిగింది.

ఆ పొద్దున్నే తొమ్మిదిగంటలవేళ, మా కారు కటారుపల్లె వైపు తిరిగింది. కాని ఆ ఊరి మొదట్లో గాని, ఆ సమాధికి దారితీసే మలుపులో కాని ఎట్లాంటి బోర్డూలేదు. ఆ మాటకొస్తే కదిరిదేవాలయం గోడమీద తప్ప మరెక్కడా అక్కడ దగ్గలోనే కటారు పల్లె ఉందన్న సూచన ఏదీ నాకెక్కడా కనబడలేదు.

మాఘమాసపు వేపచెట్ల నడుమ, అప్పుడే నీళ్ళుపోసుకుంటున్నట్టున్న రావిచెట్ల మధ్య నేను మొదటిసారి ప్రయాణిస్తున్నబాటలో కటారుపల్లె లో అడుగుపెట్టాను. ఆ ఊరు మరీ పెద్ద ఊరేమీ కాదు. పచ్చటి చెట్ల మధ్య నీడలు చిక్కగా అల్లుకున్న ఇరుకుబాటన ఊరిమధ్యకు చేరుకోగానే, ఆ ఊళ్ళోవాళ్ళు మేమెందుకొచ్చామో తెలిసినట్టే, వేమన సమాధి వైపే దారి చూపిస్తూ ఉన్నారు.

ఆ ఊరిప్పుడే ఇట్లా ఉంటే, పందొమ్మిదో శతాబ్దంలో కాంప్ బెల్ వర్ణించినట్టు ఉండటంలో ఆశ్చర్యం లేదు.

వేమనగురించి, బ్రౌన్ కన్నా కూడా ఎక్కువ అవగాహనతో, ప్రపంచానికి పరిచయం చేసిన విలియం హొవార్డ్ కాంప్ బెల్(1859-1910) కడపజిల్లాలో మిషనరీగా పనిచేసినప్పుడు, మొదటిసారి కటారుపల్లె లో అడుగుపెట్టినప్పుడు, తనకి కనిపించిన దృశ్యాన్నిట్లా వివరించాడు:

‘కటారపల్లె వేమన పుట్టిన ఊరైయుండును. ఈ గ్రామము కడపమండలమునకు సహజమైన అసమప్రదేశము కలిగి నైరృతి దిశలో మైసూరు భూరిపీఠభూమివైపు వాలుమొగము పెట్టియున్నది..ఆ ఏటిగట్టున, ఊరి చెరువు కట్ట కింద కానుగు చెట్లు మొలిచి వున్నవి. ముదురుపచ్చ చాయతో నునుపెక్కిన ఆకులసందున,అంచులలో నేరేడు వన్నె కలిగిన తెల్లటిపువుగుత్తులు వేలాడుచున్న ఆ చెట్లు దట్టమైన ఆకుతో ఏప్రిల్, మే నెలల మిడి ఎండలలో కూడా చలువలు వెదజల్లుచుండును. ..వసంత గ్రీష్మ ఋతువులలో ఆ పొలమంతా ఎర్రబీటినేలగా కనిపించినా వానపడగానే తెంపులేని మసృణ మృదుల శాద్వల సాగరమువలె పచ్చనై, చల్లనై కనులపండువై చూపట్టును..’ (మరుపూరు కోదండరామిరెడ్డి అనువాదం, వేమన, 2005, పే.310)

సుమారు రెండువందలేళ్ళకిందట ఆ ఊళ్ళో అడుగుపెట్టిన విదేశీయుడి హృదయంలో ఆ గ్రామసీమ ఎంత భావుకత రేకెత్తించిందో, నాలో కూడా అటువంటి చల్లటి ప్రశాంత భావాన్ని రేకెత్తించింది.

మేము కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడొక పెద్ద మెమోరియల్ హాల్, మరీ ఇటీవలి కట్టడమొకటి, కనిపించింది. దిగి లోపలకి వెళ్ళి చూద్దుము కదా, నా ఆశ్చర్యానికి అంతులేదు. అక్కడ ప్రాంగణంలో ఎన్ని శతాబ్దాలుగానో వేమన సమాధిగా పిలవబడుతున్న చిన్న సమాధిమందిరమొకటి ఉంది. కాని ఆ సమాధిమందిరం చుట్టూ నాలుగువైపులా ఒక స్మృతిప్రాంగణం, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ వారు నిర్మించింది ఉంది. ఆ ప్రాంగణంలో నాలుగువైపులా గోడలమీద సుమారు 120 వేమన పద్యాలు చెక్కి వున్నాయి. ఆ ప్రాంగణంలోనే టూరిజం వారు కట్టించిన రెస్టారెంటు, కాటేజిలు కూడా ఉన్నాయనీ, కాని పర్యాటకులు లేకపోవడంతో వాటిని మూసేసారనీ అక్కడున్నవాళ్ళు చెప్పారు.

కాని ఆ ప్రాంగణం,పద్యాలు తాపడం చేసిన ఆ గోడలు, ఆ పద్యాల్లోని సారళ్యాన్నీ, విరాళాన్నీ, స్ఫురింప చేస్తున్నట్టుగా ఆ గచ్చుమీద ధారాళంగా పరుచుకున్న ఉదయ సూర్యకాంతీ నన్ను విభ్రాంతికి గురిచేసాయి.

ఇట్లాంటి ఒక మందిరమిక్కడ నిర్మించారని తెలుగువారికి ఎంతమందికి తెలుసు? జర్మనీకి ఒక గొథే, ఇంగ్లీషుకి ఒక షేక్స్పియర్, మరాఠీలకి ఒక జ్ఞానేశ్వరుడు, తమిళులకి ఒక తిరువళ్ళువర్, బెంగాలీలకి ఒక టాగోర్ ఎట్లానో తెలుగువాళ్ళకి ఒక వేమన అట్లా కదా. కాని ఫ్రాంక్ ఫర్ట్, స్ట్రాట్ ఫర్డ్ అట్ ఏవన్, అలండి, తిరునాయనార్ కురిచ్చి, జొరసంకొ ల్లాగా తెలుగువాళ్ళ సాహిత్యతీర్థక్షేత్రమేది?

ఒక్క సాహిత్యకారులకు మాత్రమేనా? సమూల సామాజిక పరివర్తన ను కోరుకునేవాళ్ళకి వేమన తిరుగాడిన స్థలంకన్నా ముఖ్యమైన స్ఫూరికేంద్రం మరేమి ఉండగలదు? కులనిర్మూలన జరగాలనీ, ‘మతములన్నియు మాసిపోయి జ్ఞానమొక్కటి నిలిచి వెలగాలనీ’ కోరుకునేవాళ్ళకి వేమనకన్నా మించిన మార్గదర్శి ఎవరుంటారు?

కాని,ఆ ప్రాంగణంలో గోడలప్పుడే మాసిపోయి మసకబారుతున్నాయి. ఆ గోడలమీద పిచ్చిగీతలు ప్రత్యక్షమవుతున్నాయి. కింద గచ్చు అక్కడక్కడా పేంకు లేస్తున్నది.

ఈ ప్రాంగణం నిజానికి ఒక ప్రపంచ స్థాయి సాహిత్య సభ, తాత్త్విక చింతనాశిబిరాలు జరగవలసిన ప్రాంగణం. సమాజం మరింత శుభ్రపడాలని కోరుకునేవాళ్ళు ఇక్కణ్ణుంచి ఊరేగింపుగా తమ సామాజిక ఉద్యమాలు మొదలుపెట్టవలసిన ప్రాంగణం. తెలుగునేల మీద కవిత్వం చెప్తున్న ప్రతి ఒక్క కవీ జీవితకాలంలో ఒక్కసారేనా సందర్శించవలసిన దీక్షాభూమి.

బహుశా, ఈ సమాధి వేమన సమాధికాదనే ఒక అభిప్రాయం వల్ల ఈ సమాధినెవ్వరూ సందర్శించడం లేదా? ఇది వేమన సమాధికాదనీ, అతడి పేరు పెట్టుకుని చలామణి అయిన తుంగపుల్లారెడ్డిదనీ, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు తన ‘వేమన’ (2010) గ్రంథంలో నిరూపించడానికి ప్రయత్నించారు. కాని ఆ వాదంతో సంబంధం లేకుండానే, ప్రజలు మాత్రం ఇప్పటికీ దీన్ని వేమన సమాధిగానే భావిస్తున్నారని బిరుదురాజు రామరాజుగారు తన ‘ఆంధ్రయోగులు’ (మొదటిభాగం, పే.21) లో రాసారు.

కాని రాళ్ళపల్లివారే మరొకమాట కూడా రాసారు: ‘ఐన మన వేమన్నకు కటార్లపల్లెతో సంబంధమే లేదా? ఉన్నదని సందేహింపవలసి యున్నది’ (పే.35) అని చెప్తూ ‘ఈ ప్రదేశమందతడు కొన్నాళ్ళు నిలిచి తన మహత్త్వమును ప్రకటించి’ ఉండి ఉంటాడనీ, ఆంధ్రదేశమంతయు అతడు సంచరించి ఉన్నప్పటికీ,’తక్కిన స్థలాలకంటే, ఇక్కడ కొన్నాళ్ళెక్కువగా నిలిచి’ ఉంటాడనీ ఆయన ఊహించారు.

అక్కడ సమాధి మందిరం ఒక సూఫీ యోగి సమాధిమందిరంలాగా ఉంది. పారంపరికంగా ఆ సమాధికి సేవలు చేస్తున్న ఒక రెడ్డి మహిళ మమ్మల్ని ఆ సమాధి తాకనిచ్చింది. పీర్లసమాధులదగ్గర ఆశీర్వదించినట్టే అక్కడ కూడా నెమలీకల గుత్తితో మా తలమీద ఒక దీవెన వీవెన పరిచింది.

ఆ సమాధి వేమనదో కాదో తేల్చడం కష్టం. కాని ఆ స్థలంలో, ఆ గ్రామంలో, ఆ నేలమీద వేమన నడయాడాడన్నది నిశ్చయం. రాళ్ళపల్లి వారూ మరికొందరూ నమ్ముతున్నట్టుగా వేమన పామూరుదగ్గర గుహలో అదృశ్యమై పోయాడన్న దానికన్నా, నాకెందుకో, ఇక్కడే ఈ కటారుపల్లె ప్రజలమధ్యనే, తనువు చాలించి ఉంటాడనిపిస్తున్నది.

నేనూహించినట్టుగా తెలుగువాళ్ళు దీన్నొక స్ఫూర్తికేంద్రంగా తీసుకోకపోవచ్చు. కులనిర్మూలన జరగాలని కోరుకునేవాళ్ళంతా ఒక కొత్తకులంగా మారిపోవచ్చు. ఈ స్మారకమందిరం కొద్దికాలానికే శిథిలం కావచ్చు. కాని, ఎప్పుడేనా, ఎవరేనా ఒక కాంప్ బెల్ లాంటివాడు, కాంప్ బెల్ రాసింది చదివిన ఒక రాళ్ళపల్లి వంటివాడు, రాళ్ళపల్లిని చదివిన నాబోటివాడు ఈ దారమ్మట పోతున్నప్పుడు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు, సరళమైన, నిర్మలమైన, ధారాళమైన జీవితానుభూతికి లోనవుతారనడంలో అనుమానం లేదు.

19-3-2016

Leave a Reply

%d bloggers like this: