చైనాను చూపించే కథలు

Reading Time: 3 minutes

153

ఇప్పుడు ప్రపంచమంతా ప్రయాణాలమీదా, యాత్రలమీదా గొప్ప ఆసక్తి చూపిస్తోంది. మనం ఇంగ్లీషులో వాడే travel, tourism, pilgrimage అనే పదాలన్నిటికీ వేరు వేరు అర్థాలున్నాయి. యాత్ర వేరు, తీర్థ యాత్ర వేరు. ఆ రెండింటికన్నా సంచార యాత్ర మరింత వేరు. ఒక చోటకి కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడి భూగోళం మనల్ని చప్పున ఆకర్షిస్తుంది. అక్కడి చెట్లు, గాలి, నదులు, కాంతి లేదా కాంతి లేకపోవడం, ప్రతి ఒక్కటీ. మనం అడుగుపెట్టిన కొత్త చోట, అంతా కొత్తగానే ఉంటుంది కాబట్టి,అక్కడ మనకు పరిచితమయిందేదైనా ఉందేమోనని చూస్తాం. మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు, మనకింకా అక్కడ తెలియకుండా ఉన్నదేమన్నా ఉన్నదేమోనని వెతుక్కుంటాం.

కొత్త స్థలంలో, కొత్త దేశంలో ప్రకృతి ఎట్లా ఉంది, మనుషులెట్లా జీవిస్తున్నారు అని చూడటంలో గొప్ప ఆసక్తి ఉంది, అధ్యయనం ఉంది. అక్కడ చూడదగ్గ ప్రదేశాలేమన్నా ఉన్నాయా అని ఆరా తీస్తాం. వాటి ప్రత్యేకత గురించి తెలిసిన వాళ్ళని అడుగుతాం, తెలుసుకుంటాం. సాధారణంగా ట్రావెల్ గైడ్లు చేసే పని ఇదే.

ఒక మనిషి ఒక కొత్త స్థలంలో అడుగుపెట్టినప్పుడు అన్నిటికన్నా ముందు ఏమి చూసాడు, అతడికెట్లాంటి అనుభవాలెదురయ్యాయని తెలుసుకోవడం తక్కినవారికి కూడా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఆ ఆసక్తిలోంచే యాత్రావర్ణనలూ, యాత్రా చరిత్రలూ పుట్టుకొచ్చాయి. కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో కొండల మధ్య ఉన్న పెచ్చెరువు చెంచుగూడెంలో నేను మొదటిసారి అడుగుపెట్టినప్పుడు, నాకు అన్నిటికన్నా ముందు కలిగిన స్పందన, నాకన్నా నూరేళ్ళ ముందు ఏనుగుల వీరాస్వామయ్య ఆ గూడేన్ని చూసేడన్నదే.

కాని ఒక ప్రదేశంలో లాండ్ స్కేప్ తో పాటు, అక్కడి జనజీవన సంస్కృతితో పాటు ఆ ప్రదేశానికొక ఆత్మ కూడా ఉంటుంది. ఇక్కడ ఆత్మ అంటే, అక్కడి ప్రకృతీ, సంస్కృతీ కలిసి ఆ ప్రదేశానికి సంతరించిపెట్టే ఒక అద్వితీయ సూక్ష్మ సంస్కారం. అది మనకి ట్రావెల్ గైడ్లలో దొరికేది కాదు, ఎందుకంటే, అవి బాహ్య ప్రకృతి కి సంబంధించిన వివరాలే ఇస్తాయి కాబట్టి. అది యాత్రా చరిత్రల్లో కూడా దొరకదు. ఎందుకంటే, యాత్రావర్ణనల్లో కూడా దాదాపుగా బాహ్య ప్రకృతీ, దృశ్యసంస్కృతీ మాత్రమే చిత్రణకి వస్తాయి కాబట్టి. మరి, ఒక ప్రదేశాన్ని పట్టిచ్చే ఆత్మ మనకెక్కడ గోచరిస్తుంది?

దాన్ని మనకి అక్కడి సాహిత్యమే అందిస్తుంది.

ఈ విషయం మనకి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదుగానీ, ట్రావెల్ గైడ్లతో, ట్రావెలోగ్ ల తో పోల్చి చూసినప్పుడు ఏదో కొత్తగా స్ఫురిస్తున్నట్టే ఉంటుంది. ఒక చోటు గురించి సాహిత్యం మాత్రమే చెప్పగలిగేది ఏదో ఒకటి ఉంటుందనీ, అది గూగుల్ మాప్స్ లో దొరకదనీ ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకోవలసి ఉంటుంది. నా మిత్రురాలు ఒకామె మొదటిసారి వియన్నా వెళ్ళి వచ్చిన ఫొటోలు చూపించినప్పుడు, అందులో భవనాలు ఉన్నాయి, మూజియం లు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి, కాని స్తెఫాన్ జ్వెయిగ్ రాసిన The World of Yesterday లో కనిపించే వియన్నా, జరొస్లావ్ సీఫర్ట్ కవిత్వంలో కనిపించే వియన్నా లేదు. ఆ వియన్నా ఎటువంటిదో నేనామెకి వివరించలేను, అది తెలియాలంటే ఆమె ఆ రచయితల్ని చదివి ఉండాలి.

నేను సెయింట్ పీటర్స్ బర్గ్ ని ఎన్నడూ చూసి ఉండకపోయినా, గొగోల్, డాస్టవిస్కీ ల వల్ల ఆ నగరం నాకు రాజమండ్రి ఎంత సుపరిచితమో అంత సుపరిచితం. జాయిస్ ని చదివినవాళ్ళు మాత్రమే నిజమైన డబ్లిన్ ని చూడగలుగుతారు. నేనిప్పటిదాకా న్యూయార్క్ మహానగరాన్ని చూడలేదుగానీ, ఎప్పుడైనా అక్కడ అడుగుపెడితే, ఓ హెన్రీ చిత్రించిన న్యూయార్క్ కోసమే వెతుక్కుంటాను. తాను చూస్తున్న న్యూయార్క్ అగోచరమని ఓ హెన్రీకి కూడా తెలుసు. లేకపోతే, The Making of A Newyorker రాసి ఉండేవాడు కాదు.

సరిగ్గా ఈ నమ్మకంతోటే, Whereabouts Press వాళ్ళు A Traveler’s Literary Companion పేరిట వివిధ దేశాల సాహిత్యసంకలనాలు వెలువరిస్తూ ఉన్నారు. అందులో China, A Traveler’s Literary Companion (2008) కూడా ఒకటి.

ఓహియో విశ్వవిద్యాలయంలో చైనీయ సాహిత్యం బోధించే కిర్క్.ఎ.డెంటన్ అనే అధ్యాపకుడు ఆధునిక చైనా ఆత్మని పట్టిచ్చే పది కథలు, రెండు నవలా భాగాలు సంకలనం చెయ్యడమే కాక, విలువైన ముందుమాట కూడా రాసాడు. ఈశాన్యచైనా లోనీ హిలాంగ్ జియాంగ్ మొదలుకుని నైరుతి ప్రాంతంలో టిబెట్ సరిహద్దుల్లోని పశ్చిన సిచువాన్ దాకా చైనా ప్రధానభూభాగంలోని ఎనిమిది ప్రాంతాలతో పాటు, హాం కాంగ్, తైపై ల్ని కూడా ప్రతిబింబించే రచనల్ని అతడు సంకలనం చేసాడు. వాటన్నిటిలోనూ లూసన్ రాసిన ‘స్వగ్రామం’ (1921) కథ అన్నిటికన్నా మొదటిది. హెనాన్ ప్రాంతానికి చెందిన యాన్ లియాంకె రాసిన రచన అన్నిటికన్నా ఇటీవలిది, 2003 నాటిది.

దాదాపు ఒక శతాబ్ద కాలంలో, చైనా ఆధునికయుగంలో అడుగుపెట్టి, రాజకీయంగా, రాచరికం నుంచి జాతీయవాదం మీదుగా కమ్యూనిజం వైపూ, ఆర్థికంగా ఫ్యూడలిజం నుంచి స్టేట్ కాపిటలిజం మీదుగా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వైపూ నడుస్తున్న కాలానికి చెందిన సాహిత్యం. కాని, ఆ కథలు చదువుతున్నప్పుడు, అత్యంత విశాలమైన, సుదృఢమైన కమ్యూనిస్టు వ్యవస్థ గానీ లేదా ప్రజల స్వేచ్ఛని అణచిపెడుతున్నదని ఆరోపణలకు గురవుతున్న నియంతృత్వం గానీ మనకు కనిపించవు. అంతకన్నా కూడా, ఒక మామూలు సమాజంలో, చిన్ని చిన్ని ఆశలు, నిరాశలు, త్యాగాలు, మోహాలు, మోసాలతో కూడుకుని ఉండే జీవితమే, ప్రపంచంలో తక్కిన ప్రతి చోటా ఉండే జీవితమే అక్కడ కూడా దర్శనమిస్తుంది. కానీ ఆ సాధారణ సుఖదుఃఖాలకు ఆ ప్రజలు లోను కావడంలో, ఆ దేశానిదే అయిన అద్వితీయ లక్షణమేదో ఉంది. ఆ కథలు దాన్నే పట్టుకున్నాయి, చిత్రించడానికి ప్రయత్నించేయి.

తన ముందుమాట మొదలుపెడుతూనే సంకలనకర్త ఇట్లా రాసేడు:

“ఆధునిక కాలానికి చెందిన చైనా రచయితలు, ఇటీవలి రోజులదాకా, దాదాపుగా గ్రామీణ ప్రాంతాలనుంచో లేదా లోతట్టు ప్రాంతానికి చెందిన చిన్న చిన్న పట్టణాలనుంచో వచ్చినవాళ్ళే. వాళ్ళకి వాళ్ళ స్వగ్రామాలతో, వారి స్వంత ప్రాంతాలతో ఉన్న సంబంధం క్లిష్టంగానూ, సమస్యాత్మకంగానూ ఉండింది. ఒకవైపు, బాజిన్ రాసిన నవల ‘కుటుంబం’ (1931) లో కథానాయకుడిలాగా, వాళ్ళు తమ గ్రామీణ గృహాల్నీ, కుటుంబాల్నీ, సంప్రదాయాల్నీ వదిలిపెట్టి ఆధునిక నగరజీవితాన్ని కావిలించుకోవడంలో గొప్ప ఉత్సాహాన్ని అనుభవించేరు. మరొకవైపు లూసన్ రాసిన ‘మద్యశాల మేడపైన’ (1924) కథలో లాగా, మళ్ళా మళ్ళా గృహోన్ముఖులవుతూనే ఉన్నారు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం నుంచీ కూడా చైనా రచయితలూ, మేధావులూ ఆధునిక మహానగరాలూ, తమ స్వగ్రామాలూ, రెండింటిపట్లా ఆకర్షితులవుతూనే వున్నారు, విముఖులవుతూనే ఉన్నారు. ఈ రెండు స్థలాలపట్లా (అవి ప్రతిబింబిస్తున్న సంస్కృతులపట్లా) ముందు వెనకలకు ఊగిసలాడటం ఆధునిక చైనా సాహిత్యాన్ని నిర్వచిస్తున్న ఒక ముఖ్యలక్షణంగా చెప్పవచ్చు.”

చైనీయ సాహిత్యం లో ప్రతిబింబిస్తున్న చైనీయ జీవితంలోని ఈ అద్వితీయత ఆధునిక సాహిత్యానికే పరిమితం కాదనీ, ఇది చైనీయ సాహిత్యంలో అనుస్యూతంగా కొనసాగుతున్న సంప్రదాయమే ననీ, ప్రాచీన చైనా సాహిత్యం చదివినవారెవరికైనా బోధపడుతుంది. ప్రాచీన చీనా కవిత్వమంతా స్వగ్రామం కోసం, స్వజనంకోసం పెట్టుకున్న బెంగలోంచే వికసించింది. అప్పుడు కూడా గ్రామీణ యువకులకి నగరంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే జీవితాశయంగా ఉండింది. ఒకసారి ఉద్యోగం వచ్చి దూరప్రాంతానికి వెళ్ళి పనిచేయవలసి వచ్చినప్పుడు, తమ ఊరినీ, తమవాళ్ళనీ తలుచుకోవడమే కవిత్వంగా పరిణమించింది.

ఈ సంకలనం చదివిన తరువాత, తెలుగు జీవితాన్ని ప్రతిబింబించే కథలు ఏవై వుండవచ్చు, అసలు ఆధునిక తెలుగు జీవితపు అద్వితీయ లక్షణమేమై ఉండవచ్చునని ఆలోచించడం మొదలుపెట్టాను.

ఆలోచించండి, మనమట్లాంటి కథాసంకలనం ఒకటి తేవాలనుకుంటే, ఏ కథల్ని ఏరి కూర్చితే బాగుంటుంది? మీ ప్రాంతాల్ని ఏ కథలు బాగా పట్టుకున్నాయనీ, ప్రతిబింబిస్తున్నాయనీ మీకనిపిస్తోంది? ఒక్కొక్కప్పుడు ఒకే ప్రాంతాన్ని ఒకటి కన్నా ఎక్కువ కథలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయని మీకనిపిస్తే, అందులో ఒకటిమటుకే ఎంపిక చెయ్యమంటే, మీరేది ఎంచుకుంటారు?

ఉదాహరణకి, విజయనగరం జీవితాన్ని చిత్రించే కథలు ఎన్నో ఉన్నాయి, గురజాడ నుంచి గౌరునాయుడు దాకా. కాని, ఇప్పుడు విజయనగరం ఆత్మని ప్రతిబింబించే కథ ఎంచమంటే, నేను ‘మీపేరేమిటి’ కథను ఎంచను. అది ఒక స్థానిక ఐతిహ్యమే అయినా, తాత్వికంగా అది మొత్తం భారతదేశాన్ని ప్రతిబింబించే కథ. కానీ చాసో ‘రథ యాత్ర ‘ చూడండి. అది విజయనగరం వాసి మాత్రమే రాయగల విజయనగరం కథ.

మరి మీరే కథలు ఎంపిక చేస్తారు?

1-9-2016

Leave a Reply

%d bloggers like this: